ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాయల్ భుయాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫుడ్ ప్యాకెట్స్ కొనేముందు వాటిపై ముద్రించిన లేబుల్స్ చదివేందుకు మీరు ఎంత సమయం కేటాయిస్తారు?
మీరు తినే చిప్స్ ప్యాకెట్‌లో ఎంత కొవ్వు, ఎన్ని కార్బొహైడ్రేట్లు ఉన్నాయో మీకు తెలుసా?
బహుశా ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండకపోవచ్చు.
మార్కెట్‌లో పూర్తిగా ప్రాసెస్ చేసిన, పాక్షికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లు చాలా ఉంటాయి.
అలాంటప్పుడు, వాటిలో ఏది మంచిదనేది ఎంచుకోవడం అంత సులభం కాదు.

ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ నివేదిక ప్రకారం.. దేశంలోని పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుతున్న మొత్తం కేలరీల్లో, సగటున 10 శాతం పాక్షికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల నుంచే లభిస్తోంది.
పట్టణ ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లో ఇది 30 శాతం వరకూ ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. 2021లో భారత్‌లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల రిటైల్ మార్కెట్ విలువ రూ.2,535 బిలియన్లు(సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) .

అదే సమయంలో, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ డేటాబేస్ ప్రకారం, భారత్‌లో పాక్షికంగా ప్రాసెస్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ విక్రయాల్లో చిన్న చిన్న కిరాణా దుకాణాలు ముందంజలో ఉన్నాయి.
సాల్టీ స్నాక్స్ (ఉప్పుగా ఉండే తినుబండారాలు) విక్రయాల్లో కిరాణా వ్యాపారులదే ప్రధాన వాటా అని 2021 గణాంకాలు చెబుతున్నాయి.
గత రెండు దశాబ్దాల్లో దేశంలో ఊబకాయం, బీపీ, షుగర్, వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రదీప్ అగర్వాల్ అన్నారు.
అందుకు కారణం ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్ అని, దీనికి నగరాలు, గ్రామీణ ప్రాంతాలనీ తేడా లేదని, అన్ని చోట్లా పరిస్థితి ఇలాగే ఉందని ఆయన అన్నారు.
“గత కొన్నేళ్లుగా ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది. ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్ కొన్నేళ్లుగా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ ఆహారం తక్షణ శక్తిని ఇస్తుంది కానీ, అందులో ఎలాంటి పోషకాలూ ఉండవు. వీటిలో షుగర్, ఉప్పు ఉంటుంది. ఇలాంటి ఆహారం నుంచి శరీరానికి ఎలాంటి కేలరీలు అందవు.''

ఫొటో సోర్స్, Getty Images
లేబుల్స్ చదవడం ఎందుకంత ముఖ్యం?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) 2011 మార్గదర్శకాల ప్రకారం, దేశంలో విక్రయించే ప్రతి ఫుడ్ ప్యాకెట్(ప్రీ - ప్యాక్‌డ్ ప్రాసెస్డ్ ఫుడ్)పై దానికి సంబంధించిన పూర్తి పోషకాహార సమాచారం ముద్రించి ఉండాలి.
ప్యాకెట్లపై ముద్రించిన ఈ సమాచారం వాటిని కొనాలో వద్దో వినియోగదారులకు తెలియజేస్తుందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ భావిస్తోంది.
నిజానికి, ఇది చాలా ప్రధానం. ఎందుకంటే, ప్యాకేజ్డ్ ఫుడ్‌లో చక్కెర, ఉప్పు, కొవ్వులు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉంటున్నాయని, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అలాంటి విధానాలను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలున్నాయి.
అసలు విషయం ఏంటంటే, ఆహారం గురించిన పూర్తి సమాచారం ప్యాకెట్ వెనకవైపు ముద్రిస్తున్నప్పుడు, మళ్లీ ముందు వైపు ముద్రించాల్సిన అవసరమేముందనేదే ఇక్కడ ప్రశ్న.
నిజానికి, దేశంలో ఇంగ్లిష్ లేదా హిందీలో రాసిన సమాచారాన్ని చదవగలిగిన జనాభా తక్కువ.
ఈ కారణాల వల్ల ప్యాకెట్‌పై ముద్రించిన సమాచారం పూర్తిస్థాయిలో చేరడం లేదు. అందువల్ల చదవగలిగినా, చదవలేకపోయినా, ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పగలిగే ఒక వ్యవస్థ అసవరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ముందువైపు లేబులింగ్ ఏంటి?
వినియోగదారులు ఫ్యాకేజ్డ్ ఫుడ్‌లో ఉండే పోషకాల గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్ ముందు వైపు లేబుల్ ముద్రించాలన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది.
ఉదాహరణకు సిగరెట్ ప్యాకెట్‌ను గమనించండి. ప్యాకెట్ ముందు భాగంలో ముద్రించిన హెచ్చరిక వినియోగదారుడిని ఆలోచింపజేస్తుంది. ఆ తర్వాత కూడా కొనుగోలు చేయాలా? వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ''ప్యాకెట్ ముందుభాగంలో లేబుల్ ముద్రించాలి. అది బొమ్మల(గ్రాఫిక్) రూపంలో, వినియోగదారుడికి స్పష్టంగా కనిపించేలా, సులభంగా అర్థం అయ్యేలా ఉండాలి.'' ప్యాకెట్ వెనక ముద్రించే సమాచారంతో సరిపోలే విధంగా ముందువైపు సూచనలు కనిపించాలి.
ఇప్పుడున్న నిబంధనలను క్రమబద్దీకరించేలా ఫుడ్ ప్యాకెట్లపై కొత్త లేబులింగ్ సిస్టమ్‌ను ఎఫ్‌ఎస్ఎస్ఏఐ 2014లో ప్రతిపాదించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ వ్యవస్థను సిఫార్సు చేసింది.
ఈ విషయంపై కొన్నేళ్లుగా, వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే, ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమ దీనికి సుముఖంగా లేదు. తప్పనిసరిగా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని మరోవైపు ప్రజారోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ మోడల్ అంటే ఏంటి?
2022 సెప్టెంబర్‌లో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ''ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్'' (ముందువైపు లేబుల్ ముద్రణ) ముసాయిదాను సమర్పించింది.
ఈ ముసాయిదాలో ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ మోడల్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం, ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారానికి ఫైవ్ రేటింగ్ వస్తుంది. అందులో ఏదైనా తేడా ఉంటే దాని రేటింగ్ తగ్గుతుంది. ఇలా హాఫ్ స్టార్ (సగం స్టార్) వరకూ రేటింగ్స్ ఉంటాయి. అంతకంటే తక్కువ ఇవ్వడం కుదరదు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నిర్వహించిన ఓ అధ్యయనం ఆధారంగా ఈ ముసాయిదాను రూపొందించారు.
వినియోగదారుల హక్కుల కార్యకర్త, సిటిజన్ కన్జ్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.సరోజ మాట్లాడుతూ ''స్టార్ రేటింగ్‌లకు బదులుగా స్పష్టమైన హెచ్చరికలు ముద్రించాలని మేం డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు.
''ప్యాకెట్లపై లేబుల్స్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలి.'' వినియోగదారుడికి చదవడం వచ్చినా, ఇంగ్లిష్ లేదా హిందీలో మాట్లాడగలిగినా, ఆ లేబుల్స్ సులభంగా అర్థమయ్యేలా ఉండాలని భావిస్తున్నాం అని ఆమె అన్నారు.
''ఎఫ్ఎస్ఎస్ఏఐ సమావేశంలో ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్, స్టార్ రేటింగ్ గురించి చర్చ జరిగింది.
హాఫ్ స్టార్ (సగం స్టార్) నుంచి ఫైవ్ స్టార్ (ఐదు స్టార్లు) రేటింగ్ వరకూ. దీని ప్రకారం, ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తే అది ఆరోగ్యకరమైనదని, సగం స్టార్ రేటింగ్ వస్తే ఆరోగ్యకరమైనది కాదని అర్థం. ఇందులో సమస్య ఏంటంటే, ఈ విధానంలో హాఫ్ స్టార్ కంటే తక్కువ ఇవ్వడం కుదరదు. స్టార్ వచ్చిందంటే అందులో ఎంతోకొంత మంచి ఉన్నట్లుగా భావిస్తారు, కానీ అది నిజం కాదు'' అని సరోజ చెప్పారు.
ఈ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించే ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంది. అందుకోసం 2022 నవంబర్‌లో ఈ డ్రాఫ్ట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీనిపై విస్తృత చర్చ జరిగింది.
ప్రజారోగ్య నిపుణుల నుంచి పెద్దఎత్తుల విమర్శలు వచ్చాయి. ప్రజలను చైతన్యపరిచేలా ఐఎన్ఆర్(ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్) వ్యవస్థకు సవరణలు చేయాలని సూచించారు.
''వినియోగదారుడు ఒక ప్యాకెట్ కొనడానికి కనీసం 7 నుంచి 8 సెకన్లు పడుతుంది. ఈ 7,8 సెకన్లలో చదవగలిగేలా ఆ లేబుల్ రూపొందించాలి. ఈ ప్యాకెట్ మనం కొందామా? వద్దా? అనేది వినియోగదారుడికి తెలిసేలా ఆ లేబుల్ ఉండాలి.
ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి సులభంగా అర్థం కావడం, రెండోది చిహ్నాలతో కూడినదై ఉండడం. అలాగే, మన దేశ వైవిధ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకెట్ లేబులింగ్ ఉండాలి'' అని డాక్టర్ ప్రదీప్ అగర్వాల్ అన్నారు.
ముసాయిదాలో ఎన్నో నిబంధనలు, నిపుణుల కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ, స్పష్టంగా కనిపించే ఈ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ సిస్టమ్‌కు ఇంకా ఆమోద ముద్ర పడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే దేశాల్లో ఈ లేబులింగ్ సిస్టమ్ ఉంది?
లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఈ ఫ్రంట్ ప్యాక్ లేబుల్స్‌ను మూడు కేటగిరీగా విభజించవచ్చు.
అవి,
- నార్డిక్ కీ హోల్ లోగో అండ్ హెల్త్‌కేర్ చాయిస్ లోగో
- వార్నింగ్ లేబుల్స్
- స్పెక్ట్రమ్ లోగో
నార్డిక్ కీ హోల్ లోగో నార్తర్న్ యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉంది. సింగపూర్‌లో హెల్త్‌కేర్ చాయిస్ లోగో ఉంది. ఈ రెండు లోగోలు ఫ్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఆమోదయోగ్యమైనవి. అవి ఈ ఆహార పదార్థాలతో పెద్దగా ఇబ్బంది లేదన్న సందేశాన్నిస్తాయి.
అయితే, ఈ ప్యాకెట్లలోని ఆహారంలో పోషకాలు ఉన్నాయా? లేవా? అనేది వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా సమాచారం ఎక్కడా ఉండదు.
ఇక రెండోది ఎఫ్‌ఓపీఎల్, అంటే వార్నింగ్(హెచ్చరిక) లేబుల్స్. ఇది చిలీ, మెక్సికోలో అమల్లో ఉంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో పరిమితికి మించి వాడిన పదార్థాల గురించి తెలియజేస్తుంది. అలాగే, తరచూ వీటిని తినడం అంత మంచిది కాదని కూడా సూచించేలా ఈ లేబుల్ ఉంటుంది.
మూడోది స్పెక్ట్రమ్ లేబులింగ్. ఇందులో న్యూట్రిస్కోర్, ట్రాఫిక్ లైట్ సిగ్నల్ వంటి వార్నింగ్, హెల్త్ స్టార్ రేటింగ్స్ ఉంటాయి. న్యూట్రి స్కోర్ యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉండగా, పలురకాల ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ యూకేలో అమల్లో ఉన్నాయి. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో హెల్త్ స్టార్ రేటింగ్ లేబుల్స్ ముద్రిస్తారు.
అయితే, ఈ వివిధ రకాల లేబులింగ్ సిస్టమ్స్‌లో మెరుగైనది ఏదనే ప్రశ్నకు సమాధానమిస్తూ ''చిలీ, ఇజ్రాయెల్‌లో వార్నింగ్ లేబుల్స్ వాడతారు. షుగర్, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాల వినియోగాన్ని ప్రజలు క్రమంగా తగ్గిస్తున్నట్లు చాలా అధ్యయనాల్లో తేలింది. దానివల్ల ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల తయారీ విధానాలను మార్చాల్సి వచ్చింది'' సరోజ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మంచిదో, కాదో తెలుసుకోవడమెలా?
''బ్యాక్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబుల్ సిస్టమ్ వల్ల కూడా పెద్దగా ఒరిగేదేమీ లేదు'' అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీడియాట్రిక్ ఎండోక్రోనాలజిస్ట్, షుగర్ ది బిట్టర్ రచయిత అయిన ప్రముఖ అమెరికన్ డాక్టర్ రాబర్ట్ లుస్టింగ్ అభిప్రాయపడ్డారు.
''ప్యాకెట్ వెనక ఉన్న లేబుల్‌ను చాలా తక్కువ మంది మాత్రమే చదువుతారు'' అని అన్నారు.
''రెండోది ఏంటంటే, కంపెనీ వినియోగదారుడికి సరైన సమాచారం ఇవ్వదు. సామాన్యులకు అర్థం కాని పదాలను వాడుతుంది. దానిని అర్థంకాకుండా దాచేయడం అంటాం. అంటే, అందులో వాడిన పదార్థాల గురించి దాచేయడం'' అన్నారు డాక్టర్ రాబర్ట్.
''నిజానికి, ఆహార పదార్థాల తయారీ కోసం వినియోగించిన పదార్థాలతో సమస్య కాదు. వాళ్లు వాటితో ఏం చేశారనేదే ఇక్కడ సమస్య.''
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేబులింగ్ కూడా సమస్యేనని, అందులో ఎలాంటి పరిష్కారం లేదనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు.
అసలు ఫుడ్ ప్యాకెట్స్ కొనుగోలు చేసేప్పుడు ఏ అంశాలు గుర్తుంచుకోవాలి? అనే ప్రశ్నలకు డాక్టర్ రాబర్ట్ సమాధానమిచ్చారు.
మీరు ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనేముందు మూడు విషయాలను గుర్తుంచుకోవాలని అన్నారు.
ఆహార పదార్థాలు మీ జీర్ణాశయాన్ని సంరక్షించేలా ఉండాలి. అది, మీ కాలేయానికి రక్షణతో పాటు మెదడుకు బలాన్ని ఇస్తుంది.
జీర్ణాశయం లేదా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు మీరు తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
ఇంకా షుగర్, కాడ్మియం వల్ల కాలేయానికి హాని కలగకుండా చూసుకోవాలి. షుగర్ ఉండే పదార్థాలు కాలేయంపై ప్రభావం చూపుతాయి. ఈరోజుల్లో చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి.
మెదడుకు ఒమేగా 3 యాసిడ్స్ చాలా ముఖ్యం. అవి ఉండేలా చూసుకోవాలి.
''ఈ మూడింటిలో ఏ ఒక్కటీ లేని వస్తువుని అసలు కొనొద్దు.'' ఇది నా సలహా అని డాక్టర్ రాబర్ట్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- హిందూ టీమ్, ముస్లింల జట్టు.. ఇలా మతాల ఆధారంగా టీమ్‌లు ఏర్పడి క్రికెట్ ఆడిన రోజులున్నాయి.. చివరకు ఆ పోటీలు ఎలా ముగిశాయో తెలుసా
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ముక్తా సాల్వే: ‘తొలి దళిత రచయిత్రి’.. 14 ఏళ్ల వయసులోనే బ్రాహ్మణుల ఆధిపత్యానికి సవాల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














