ఈ పుట్టగొడుగులు ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయా? పరిశోధకులు ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కథనం ఆధారం
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
లయన్స్ మేన్, టర్కీ టెయిల్, చాగా, రెయిషి, ఆయ్‌స్టర్..
ఈ పుట్టగొడుగుల నుంచి సేకరించిన సారంతో తయారయ్యే సప్లిమెంట్స్, పౌడర్‌లతో అన్ని అనారోగ్యాలను నయం చేయొచ్చన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది.
‘ఔషధ గుణాలున్న పుట్టగొడుగులు’గా పిలుస్తున్న ఈ మష్రూమ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన సారాన్ని వేలసంవత్సరాలుగా సంప్రదాయ చైనా ఔషధ తయారీల్లో వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో పుట్టగొడుగుల వినియోగాన్ని ఒక ట్రెండ్‌గా చూస్తున్నారు.
ఆందోళన, డిప్రెషన్‌లను నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి, అభిజ్ఞా శక్తుల వృద్ధి, శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడం, బీపీని తగ్గించడంతోపాటు క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు ఇవి సహకరిస్తున్నాయని నమ్ముతున్నారు.
ఔషధ గుణాలు లేదా పోషక విలువలున్న పుట్టగొడుగుల పరిశ్రమ బిలియన్ డాలర్ల మార్కెట్‌గా అవతరించింది .
మార్కెట్ రీసెర్చ్ సంస్థ అలీడ్ గణాంకాల ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఉండగా, 2030 నాటికి 19.3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
పాశ్చాత్య దేశాల్లోని హెల్త్ ఫుడ్ స్టోర్స్‌లో 17 రకాల ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల సప్లిమెంట్స్, పౌడర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తరువాతి కాలంలో, ఈ మార్కెట్ మరింత పెరుగుతుందే కానీ, తగ్గదని నిపుణులు అంటున్నారు.
అయితే, ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల వలన అనారోగ్యం నయం అవుతుందన్న మాటల్లో ఎంత నిజం ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
ఔషధ గుణాలున్నాయా?
"ప్రస్తుతం ఆ పుట్టగొడుగులు హాట్ కమొడిటీ" అన్నారు లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన పోషకాహార పరిశోధకురాలు డా. ఎమిలీ లీమింగ్.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "ఆ ఉత్పత్తుల లేబుల్‌లపై పేర్కొన్న వివరాల ప్రకారం..ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించడమేకాక, మెదడుకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ‘సూపర్ బ్రెయిన్’కు సహకరించే ఉత్పత్తులుగా వీటిని ప్రచారం చేస్తున్నారు" అన్నారామె.
ఆమె మాట్లాడుతూ "ఈ సమయంలో, ఇలాంటి ప్రకటనలు అతిశయోక్తిగా అనిపిస్తోంది. వీటి వినియోగం మానవులకు ఉపకరిస్తుందనడానికి ఎలాంటి రుజువులూ లేవు లేదా ఉన్న ఆధారాలూ పరిమితంగానే ఉన్నాయి" అన్నారు డా. ఎమిలీ.
శిలీంధ్రాలు, వాటి వినియోగంతో కలిగే ప్రభావాలపై చాలా ఏళ్ల పాటు అధ్యయనాలు జరిగాయి. అయితే కణజీవులు లేదా ఎలుకలపై జరిగిన పరిశోధనల ఫలితాలను అన్నిసార్లు మానవులకు కూడా అన్వయించకూడదని నిపుణులు అంటున్నారు.
"ఔషధగుణాలున్న పుట్టగొడుగుల ప్రభావాలకు మద్దతు ఇచ్చే అనేక అధ్యయనాలు చైనాలో జరిగాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటే, ప్రయోగాలు చేసిన ఎలుకలు, వాటి కోసం తీసుకున్న నమూనాలు..ఇవన్ని అక్కడి పరిస్థితులు, సంస్కృతికి తగ్గవి" అని ఓహియోలోని మియామి యూనివర్సిటీకి చెందిన మైకోలాజికల్ బయాలజీ నిపుణులు, ప్రొఫెసర్ నికోలస్ మనీ అన్నారు.
“ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులు మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు” ప్రొఫెసర్ మనీ.
2016లో ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల ప్రభావాలపై ప్రొఫెసర్ మనీ తన సమీక్షను ప్రచురించారు.
‘అసలు ఈ పుట్టగుడుగులు ఔషధ గుణాలున్నవేనా?’ అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఈ సమీక్ష నిర్వహించారు.
"నిర్దేశిత మందులపై అధ్యయనాలు, లభించిన ఆధారాలను విశ్లేషించిన దాని ప్రకారం చూసినప్పుడు ఈ పుట్టగొడుగులు ఔషధ గుణాలున్నవి కావని నేను నిర్ధారణకు వచ్చాను" అని చెప్పారు.
"సాధారణ మందుల వినియోగంతో కలిగే ప్రయోజనాలను, ఈ ఔషధ గుణాలున్న పుట్టగొడుగులతో పోల్చి చూడటంలో కొన్ని సవాళ్లున్నాయి" అన్నారు.
నిపుణులు చెప్పే సమస్యేంటంటే, చాలాదేశాల్లో ఎక్కువ శాతం వీటిని ఆహారంలోనే వినియోగిస్తున్నారు కానీ, ఔషధాలుగా వినియోగించే విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయి.
"ఈ సవాళ్ల కారణంగా, స్పష్టత లోపించింది. ఫలితంగా, ఈ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సంస్థలు ఏం చెప్తున్నాయన్న విషయంపైనే మనం పూర్తిగా ఆధారపడాలి" అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2300 జాతులకు పైగా..
తాజా అంచనాల ప్రకారం, తినదగిన, ఔషధ గుణాలున్న పుట్టగొడుగులు ప్రపంచంలో 2300 జాతులకు చెందినవి ఉన్నాయి.
అయితే, ప్రొఫెసర్ మనీ వివరణ ప్రకారం, ‘థెరపెటిక్ స్టార్స్’(చికిత్సకు వినియోగించేవిగా ప్రాచూర్యం పొందిన) పుట్టగొడుగుల రకాలు డజనుకు పైనే ఉన్నాయి.
వాటిలో..
రెయిషీ (గానోడెర్మా లుసూడియం): ఇది ముదురు ఎరుపురంగులో ఉండే పాలీపైరస్ పుట్టగొడుగు.
షిటాకె (లెంటిన్యులా ఎడోడ్స్): ఘాటైన వాసనతో కూడిన గోధుమరంగులో ఉంటుంది.
టర్కీ టెయిల్ (కోరియోలస్ వెర్సికలర్): రంగురంగుల చారల ఫ్యాన్ ఆకృతిలో ఉంటుంది.
కార్డిసెప్స్ (ఒఫియోకార్డిసెప్స్ యూనిలేటరాలిస్): నిర్జీవ కీటకాలలో ప్రవేశించి, హోస్ట్ స్థానాన్ని భర్తీ చేసే ప్రసిద్ధ శిలీంధ్ర పరాన్నజీవి.
చాగా (ఇనోనోటస్ ఆబ్లిక్వస్): నిర్జీవ బిర్చ్ చెట్లపై సరైన ఆకృతిలేకుండా పెరిగే మరొక పరాన్న జీవి శిలీంధ్రం ఇది. కాలిన బొగ్గు రూపాన్ని కలిగి ఉంటుంది.
లయన్స్ మేన్ (హెరిసియం ఎరినాసియస్): ఇది తెల్లటి సింహపు జూలును పోలినట్లుగా పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
“ఎప్పటినుంచో ఈ పుట్టగొడుగులను అంతీద్రియ శక్తులున్న ఉత్పత్తులుగా చూస్తున్నారు. నిజానికి అవి సుందర జీవులు అన్నారు” నికోలస్ మనీ.
“ప్రస్తుతం పుట్టగొడుగులకు ప్రాచూర్యం పెరగడాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది” అన్నారు.
పుట్టగొడుగులు సహజ రీతిలో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పెరగగలిగే శిలీంధ్రాలు.
భూమి లోపల భాగం, చుట్టుపక్కల ఉండే మొక్కల నుంచి పోషకాలను గ్రహించి, వాటిని తమలో ఇముడ్చుకోగ శిలీంధ్రాలు.
ఆహార పదార్థాలుగా చూసినప్పుడు, పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బిలతోపాటు అమినో యాసిడ్‌లు, మినరల్స్, ఫైబర్‌లు సమృద్ధిగా లభిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని పోషకాలు ఉన్నప్పుడు పుట్టగొడుగులను ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చా? అన్న ప్రశ్నకు డా.ఎమిలీ సమాధానమిస్తూ “ఎక్కువ మంది పుట్టగొడుగులను అంతగా ఇష్టపడరని తెలిసిందే. కానీ, వాటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్‌తోపాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లుగా చెప్పే బీటా గ్లూకాన్స్ ఎక్కువ మొత్తంలో పుట్టగొడుగుల్లో లభిస్తాయి.
ఇలాంటి బీటా గ్లూకాన్స్‌ను అటుకుల వంటి పదార్థాల్లో కూడా మనం చూస్తుంటాం. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో సాయపడతాయి. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఉపయోగపడతాయి” అని చెప్పారు.
“అయితే, పుట్టగొడుగుల్లో లభించే బీటా గ్లూకాన్స్ మానవ శరీరంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరం” అని డా. ఎమిలీ అన్నారు.
“పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని కేవలం పుట్టగొడుగులపైనే ఆధారపడకుండా, ఇతర పోషకాహారాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగులకే ఎక్కువ ప్రాచూర్యం ఉన్నప్పటికీ, అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి”అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు వీటిదేనా?
ఓ వైపు మార్కెట్ బిలియన్ డాలర్ల మేర విస్తరించినప్పటికీ పుట్టగొడుగుల్లోని ఔషధ విలువలపై పాశ్చాత్య సైన్స్ పరిశోధనలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉంది. నిజానికి, అది పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.
"జన్యుశాస్త్రం, సాంకేతికతల్లో సాధిస్తున్న పురోగతి వల్ల శిలీంధ్రాల నుంచి జన్యుపరమైన సమాచారాన్ని సేకరించడం, వివిధ దశల్లో వాటిపై పరిశోధనలు చేయడం ద్వారా వాటితో మానవుల వ్యాధులను కూడా నయం చేయవచ్చన్న ఆశ మాత్రం పెరుగుతోంది" అని నికోలస్ అన్నారు.
నికోలస్ మాట్లాడుతూ "మానవ శరీరం పనితీరుపై శక్తివంతమైన ప్రభావం చూపే పలు సమ్మేళనాలు శిలీంధ్రాల్లో ఉండే అవకాశం లేకపోలేదు.
అయితే, పుట్టగొడుగుల్లో ఔషధ గుణాలపై లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది. నిజానికి పూర్తిస్థాయిలో అధ్యయనాలు, పరిశోధనలు జరగడం లేదు.
భవిష్యత్తులో ఔషధ విలువలున్న పుట్టగొడుగుల పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతానికైతే మనం ఇంకా ఆ దశకు చేరకోలేదు” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’.. డబ్బున్న వృద్ధురాలు, నిరాశ్రయుడి సహజీవనం
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














