పిల్లలు సరిగా పెరగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

ఫొటో సోర్స్, Getty Images
మీ పిల్లలతో ఎప్పుడైనా విసిగిపోయినట్టు అనిపించిందా? అని చిన్నపిల్లల తల్లిదండ్రులను అడిగితే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది.
ఇంట్లో ఎంత చక్కటి, ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ ఏదో ఒకరోజు పిల్లల అల్లరి, గొడవ మితిమీరినప్పడు తల్లిదండ్రులు విసుగుచెందడమనేది కచ్చితంగా జరుగుతుంది.
ఇదంతా సర్వసాధారణం అనిపించినా, అది మీ వ్యక్తిత్వ లక్షణాన్ని తెలియజేస్తుంది. అది మీ ఇంటి జీవితంపై ప్రభావం చూపుతుంది.
2018లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, 20 నుంచి 30 శాతం మంది అత్యంత సున్నితమైన వ్యక్తులు(హైలీ సెన్సిటివ్ పర్సన్స్ - హెచ్‌ఎస్‌పీ)గా తేలింది.
వాసన చూడడంలో, లేదా చూపు, లేదా వినికిడి విషయంలో మీలో సున్నితత్వం ఉండొచ్చు. అలాంటి వారు కళ్లు జిగేల్‌మనిపించే రంగుల విషయంలో, లేదా పెద్దపెద్ద శబ్దాల వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఎంత సున్నితమైనవారు?
వివిధ యూనివర్సిటీలకు చెందిన సైంటిస్టులు కలిసి సున్నితత్వాన్ని కొలిచేందుకు ఉచిత ఆన్‌లైన్ టెస్టును అభివృద్ధి చేశారు. అత్యంత సున్నితంగా ఉండడం వ్యాధి కాదని, అది వారి వ్యక్తిత్వంలో భాగమని వారు గుర్తించారు.
సులువైన భాషలో చెప్పాలంటే, మీ చుట్టూ జరిగే వాటికి మీరు ఎలా స్పందిస్తారనే దానిపై మీ సున్నితత్వం ఆధారపడి ఉంటుంది.
మామూలు వ్యక్తులకు ఇది చాలా సాధారణమే. కానీ, అత్యంత సున్నితంగా ఉండడం చిన్నపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్.
ఈ విషయంపై దిల్లీకి చెందిన సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ షేక్ అబ్దుల్ బషీర్ బీబీసీ ప్రతినిధి ఫాతిమా ఫర్హీన్‌తో మాట్లాడారు. లక్షణానికి, రుగ్మతకి మధ్య తేడా ఉందని, అన్ని లక్షణాలు రుగ్మతలు కావని ఆయన అన్నారు.
''మీకున్న కొన్ని అలవాట్లు మీ జీవితంపై ప్రభావం చూపుతున్నప్పుడు అది రుగ్మతగా మారే అవకాశం ఉంది'' అని ఆయన అన్నారు.
''అత్యంత సున్నితమైన తల్లిదండ్రులు ఇబ్బందికర వాతావరణంలో ఉంటే అది వారి పిల్లల పెంపకంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది'' అని ఆన్‌లైన్ టెస్టును అభివృద్ధి చేసిన వారిలో ఒకరైన క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ సైకాలజిస్టు మైకేల్ ప్లూయిస్ తెలిపారు.
పిల్లల పెంపకంలో తొలి దశ అత్యంత సున్నితమైన తల్లిదండ్రులకు చాలా ఒత్తిడిని కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే, పిల్లలకు తొమ్మిది నెలలు దాటిన తర్వాత పెంపకం మెరుగుపడుతుంది.
అత్యంత సున్నితంగా ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు ఈ పరిశోధనతో వెల్లడైంది.

ఫొటో సోర్స్, PRASHANTI ASWANI
ఇండియాలో ఇప్పటి వరకూ జరగలేదు..
అత్యంత సున్నితంగా ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను త్వరగా అర్థం చేసుకోగలరని, వెంటనే స్పందించడంతో పాటు పిల్లల అవసరాలు తీర్చడంలో ముందుంటారని మైకేల్ ప్లూయిస్ అభిప్రాయపడ్డారు.
ఇండియాలో ఇప్పుడిప్పుడే దీని గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, దేశంలో ఎంత మంది ఇలా సున్నితంగా ఉన్నారో తెలిపేందుకు అధికారిక డేటా అందుబాటులో లేదు.
అలాంటి పరిశోధన ఇప్పటివరకూ ఇండియాలో జరగలేదని డాక్టర్ అబ్దుల్ బషీర్ అన్నారు. అలాంటి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలోనే ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులను అత్యంత సున్నితమైన వారిగా, లేదా సున్నితంగా లేనివారిగా విభజించలేమని పేరెంటింగ్ కోచ్ రిద్ధి దేవ్రా అన్నారు. అది ఎక్కువ శాతం మన చుట్టూ ఉన్న వాతావరణం, లేదా మన మూడ్‌పై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.
సున్నితంగా ఉండడం చెడ్డ విషయమేమీ కాదని, అయితే ఏదైనా మరీ అతిగా ఉంటే అనర్థమేనని ఆమె అన్నారు.
''పేరెంటింగ్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి కేరింగ్ (శ్రద్ధ), రెండోది కంట్రోల్ (నియంత్రణ). పిల్లలపై మీరు అతి శ్రద్ధ చూపిస్తూ, ఎలాంటి హద్దులూ పెట్టకపోతే అది పిల్లలకు హానికరంగా మారుతుంది. మితిమీరిన ప్రేమ పిల్లలకు నష్టం చేస్తుంది'' అని ఆమె అన్నారు.
పర్మిసివ్ పేరెంటింగ్ మంచిది కాదని రిద్ధి అన్నారు. ''పర్మిసివ్ పేరెంటింగ్ అంటే పిల్లలకు కలిగే చిన్నచిన్న ఇబ్బందులను గుర్తించలేకపోవడం. అది పిల్లలకు చాలా నష్టం చేస్తుంది. ఎందుకంటే, పిల్లలు ఇంటి నుంచి బయటికెళ్లినప్పుడు కొత్త వాతావరణానికి అంత త్వరగా సర్దుకుపోలేరు'' అన్నారు రిద్ధి.
మొక్కలకు నీళ్లు, సూర్యరశ్మి ఎంత ముఖ్యమో, పిల్లలకు కేరింగ్, కంట్రోల్ కూడా అంతే ముఖ్యమని రిద్ధి దేవ్రా అన్నారు. మీ బిడ్డ ఎలక్ట్రిక్ బోర్డులో చేయి పెట్టబోతే దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, PRASHANTI ASWANI
పిల్లలు కూడా మరీ సున్నితం అయితే..?
తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా అతి సున్నితం అయితే ఏమవుతుంది?
చాలా మంది పిల్లలు సున్నితంగానే ఉంటారని రిద్ధి చెప్పారు. ఏ బిడ్డకైనా నమ్మకమైన విషయాలు నాలుగు ఉంటాయి.
''నాకు నచ్చినవన్నీ నాకు దక్కాలి. నేను ఏం చేసినా నన్నెవరూ ఆపకూడదు. నేను పోటీలో ఉంటే మొదటి స్థానం నాకే రావాలి. అందరి దగ్గర ఉన్న వాటి కంటే ఉత్తమమైనవి నా దగ్గర ఉండాలి'' అనుకుంటారు.
అలాగే, తల్లిదండ్రులు పిల్లలు కోరుకున్నవన్నీ ఇచ్చినా, లేదంటే అన్నీ ఇవ్వకపోయినా పిల్లలు సెన్సిటివ్‌గా తయారవుతారని రిద్ధి చెప్పారు.
తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో పిల్లలకు చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత.
అత్యంత సున్నిత వ్యక్తులు ఆర్చిడ్ (పూలల్లో ఒక జాతి) పూల లాంటి వారు. తక్కువ సున్నితత్వం ఉండే వ్యక్తులు డాండిలియన్ (అడవి జాతి) పూల వంటి వారు.
ఎందుకంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగ్గా లేకుంటే ఆర్చిడ్ పూలు పూయడం కష్టం. అలాగే, తక్కువ సున్నితత్వం ఉన్న వారు డాండిలియన్ పూవుల్లా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులువుగా ఇమడగలరు.
''పిల్లల కోసం ప్రపంచాన్ని మార్చలేం కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా పిల్లలను పెంచాలి. పిల్లలు బయటికెళ్లినప్పుడు ఇతరులతో ప్రేమపూర్వకంగా ఉండేలా పద్ధతులు నేర్పించాలి. అదే సమయంలో స్వీయరక్షణ కూడా తెలిసి ఉండాలి'' అని రిద్ధి అన్నారు.
మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో డాండిలియన్ లక్షణాలు, ఇతరులతో పరిచయాలు పెంపొందించుకోవడంలో ఆర్చిడ్ లక్షణాలు కలిగి ఉండాలని ఆమె అన్నారు.
తల్లిదండ్రులుగా మీ పిల్లలను అలా సిద్ధం చేయడం ముఖ్యం.
''పిల్లలతో ఎప్పుడూ కఠినంగా ఉంటే, వాళ్లు ఎదురుతిరిగే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు చెప్పిన ప్రతిదానికీ తల ఊపేలా తయారవుతారు. అది వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. పిల్లలు ఎదురుతిరిగేలా తయారవడం, లేదంటే మీరు చెప్పినదానికి మాత్రమే పరిమితమయ్యేలా ఉండడం అనేవి రెండూ వారికి మంచిది కాదు'' అని రిద్ధి చెప్పారు.
తల్లిదండ్రులు ఆర్చిడ్, డాండిలియన్ లక్షణాలు కలిగి ఉండాలని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏఐతో టీనేజ్ అమ్మాయిల నగ్న చిత్రాలను తయారుచేసి, సోషల్ మీడియాలో పెట్టారు.. షాక్ అయిన పట్టణ ప్రజలు
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు
- తల్లిదండ్రులు కన్నబిడ్డల మధ్య వివక్ష చూపిస్తారా?
- పిల్లలను కిడ్నాప్ చేసి కొట్టి చంపే సీరియల్ కిల్లర్స్ ఈ మహిళలు - ఎలా దొరికారంటే
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















