4 రోజులు తిండి, నిద్ర లేకుండా వీడియో గేమ్స్ ఆడిన విద్యార్థి ఏమయ్యాడో చూడండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వీడియో గేమ్‌లకు అలవాటు పడిన ఓ టీనేజ్ విద్యార్థి వింత ప్రవర్తనతో చెన్నైలోని కిల్పాక్కం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేరడం చర్చనీయాంశమైంది.
రాణిపేట ప్రాంతానికి చెందిన ఆ విద్యార్థి 4 రోజులుగా వరుసగా వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయితే అతని ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి భయాందోళనకు గురైంది. దీంతో బాలుడిని ఆసుపత్రిలో చేర్పించింది.
అయితే, ఆ విద్యార్థిని అంబులెన్స్‌లో చెన్నైకి తరలిస్తుండగా అతని చేతులు, కాళ్లు కట్టి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విద్యార్థి పరిస్థితిని సామాజిక మాధ్యమాలు, టీవీల్లో చూసిన చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
పిల్లలు రోజూ వీడియో గేమ్ ఆడితే డిప్రెషన్‌లోకి వెళతారా? పిల్లల్ని ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడేయ్యాలి? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.
అయితే, ఈ విద్యార్థి ఒక్క రోజులో వ్యాధి బారిన పడలేదని, నిరంతరం ఆడటం వల్లే ఇలా జరిగిందని బీబీసీతో వైద్యులు చెప్పారు.
“ఈ విద్యార్థి చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడు, సరైన గైడెన్స్ లభించలేదు. భర్త మరణం, కుటుంబ పేదరికం కారణంగా తల్లి పనికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ విద్యార్థికి చిన్నప్పటి నుంచి వీడియో గేమ్‌లే ప్రపంచం. అయితే, గతవారం రోజులుగా తిండి, నిద్ర లేదు. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు’’ అని వైద్యులు తెలిపారు.
చికిత్సలో భాగంగా విద్యార్థికి నిద్రమాత్రలు ఇచ్చినట్లు వైద్యులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటరితనంతో వీడియో గేమ్స్ బాట
''అతని అన్నయ్య పనిచేయడానిక విదేశాలకు వెళ్లాడు. ఇంతలో ఆ అబ్బాయి వర్చువల్ వీడియో గేమ్‌లు ఆడటం మొదలుపెట్టి వాటికి అడిక్ట్ అయ్యాడు’’ అని అన్నారు డాక్టర్.
వర్చువల్ గేమ్ ప్రపంచంలో విజయాలు, వైఫల్యాలు బాలుడిని సంతోష పెట్టేవని అంటున్నారు వైద్యులు. ఇదే క్రమంలో దాదాపు 4 రోజుల పాటు గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. తిండి, నిద్ర సరిగా లేదు.
దీంతో బాలుడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంట్లోని వస్తువులను విసిరేయడం ప్రారంభించాడు.
''బాలుడిని శాంతపరచడానికి స్లీపింగ్ డోస్ ఇచ్చి, ఆపై కౌన్సెలింగ్ ప్రారంభించాం. చాలాసేపు బతిమిలాడిన తర్వాత చికిత్స కోసం ఒప్పుకున్నాడు'' అని వైద్యులు తెలిపారు.
విద్యార్థి వీడియో గేమ్‌లో తనను శక్తిమంతమైన వ్యక్తిగా ఊహించుకునేవాడు, అదే విధంగా వాస్తవ ప్రపంచంలోనూ ప్రవర్తించడం ప్రారంభించాడు.
ఇది మానసిక వికలాంగుల దశ అని, అలాంటి వారికి వెంటనే చికిత్స చేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ ఫోన్లలో ఆటలకు పిల్లలే కాకుండా పెద్దలు కూడా అడిక్ట్ అవుతున్నారని కిల్పాక్ ప్రభుత్వ మానసిక వైద్యశాల వైద్యులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి భద్రత, గైడెన్స్, ప్రేమ లేదా ఆశించిన సంతోషకరమైన సందర్భాలను పొందలేనప్పుడు వారు తమకు సులభంగా అందుబాటులో ఉండే ఏదైనా మార్గాన్ని ఆశ్రయిస్తారని వారంటున్నారు.
''మరో పిల్లవాడిది ఇలాంటి కేసే. అతను వీడియో గేమ్‌లు ఆడుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు. దీంతో తక్కువ గ్రేడ్‌లు వచ్చాయి. అనంతరం తల్లిదండ్రులు గేమ్ ఆడనివ్వలేదు. వచ్చే పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తేనే గేమ్ సెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ బాలుడికి తర్వాతి పరీక్షలో ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి. తన వర్చువల్ ప్రపంచాన్ని తల్లిదండ్రులు నాశనం చేశారనే అభిప్రాయం ఆ బాలుడిలో కలిగింది'' అని వైద్యులు చెప్పారు.
''అందుకే, పిల్లలు గేమ్స్ ఆడే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని, గేమ్‌లు ఆడటం ఒక్కసారే ఆపవద్దని మేం తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నాం. తల్లిదండ్రులు కూడా మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి పిల్లలతో సమయం గడపాలి. రెండు నెలల్లో ఆ విద్యార్థి డిప్రెషన్ నుంచి బయటడతారు'' అని తెలిపారు వైద్యులు.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో గేమ్ వ్యసనాన్ని ఎలా గుర్తించాలి?
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే వ్యసనాన్ని 'గేమింగ్ డిజార్డర్'గా నిర్వచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఒక వ్యక్తి వీడియో గేమ్‌లకు బానిసయ్యాడని సూచించే లక్షణాలను నిపుణులు నిర్వచించారు.
- ఆ వ్యక్తి ఇతర పనుల కంటే వీడియో గేమ్‌లపైనే ఎక్కువ సమయం గడపడం.
- అతనికి వీడియో గేమ్ ఆడే అవకాశం లేనప్పుడు విచారంగా లేదా నిరాశగా ఉండటం.
- ఒంటరిగా ఉండటం/ అంతకుముందు ఆడిన క్రీడలు లేదా ఇతర కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం.
- ఇష్టమైన ఆహారం, వినోదాన్ని నిర్లక్ష్యం చేయడం
- చదువు లేదా పనిలో శ్రద్ధ లేకపోవడం లేదా తక్కువగా పాల్గొనడం
- చిరాకు, కోపం రావడం
- స్నేహితుల సర్కిల్ నుంచి విడిపోవడం.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో గేమ్ డెవలపర్స్ ఏమంటున్నారు?
ప్రపంచవ్యాప్తంగా రోజూ వందల కొత్త గేమ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి.
ఇదే క్రమంలో కంప్యూటర్, వర్చువల్ గేమ్ సెట్‌ల ధరలు మునుపటి కంటే మరింత తగ్గడంతో సులభంగా కొంటున్నారు.
ఈ గేమ్ సెట్లు ఆన్‌లైన్ మార్కెట్‌లలోనే కాకుండా చిన్న దుకాణాలలో సైతం అందుబాటులో ఉంటున్నాయి.
శ్రీకుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. ఆయనకు 20 ఏళ్లకు పైగా ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉంది.
గేమ్ మేకర్స్ ప్లేయర్‌ల భద్రతను ఎలా నిర్ధరిస్తారని బీబీసీ ఆయనను అడిగింది.
''చాలా వరకు ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి 18 ఏళ్ల వయస్సు పరిమితి ఉంటుంది. కాబట్టి, ప్లేయరే ఎన్ని గంటలు ఆడాలో నిర్ణయించుకోవాలి'' అని అంటున్నారు శ్రీకుమార్.
గేమ్ డెవలపర్లు ఎవరైనా తమ ప్రోడక్టులను ఎక్కువగా వాడాలని కోరుకుంటారు, కాబట్టి నిర్దిష్ట సమయంలో గేమ్ ఆపే సౌకర్యం కల్పించడం లేదని ఆయన వివరించారు.
అవసరమైతే అలారం సెట్ చేయడం, 'స్క్రీన్ టైమ్' (మొబైల్, ట్యాబ్, కంప్యూటర్ లాంటివి చూసే సమయం) ఆప్షన్ ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
గూగుల్, యాపిల్ సహా పలు ప్లేస్టోర్లు హింసతో కూడిన గేమ్‌లపై పరిమితులు విధించాయి.
అయితే ఏ గేమ్‌పై ఎన్ని గంటలు గడపాలనే దానిపై పరిమితులు లేవని శ్రీకుమార్ అంటున్నారు.
చాలా ఆటలు ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఆడొచ్చు. కొన్ని గేమ్‌లలో మొదటి కొన్ని రౌండ్‌లు ఆడటానికి ఉచితం.
ఇతర రౌండ్లు ఆడటానికి లేదా ఆటలో ఏవైనా ఆయుధాలు లేదా పరికరాలు కొనుగోలు చేయడానికి చెల్లింపులు అవసరం కావచ్చు.
"స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి తల్లిదండ్రులకు ఉన్న ఏకైక ఎంపిక ఇదే" అని శ్రీకుమార్ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం ఏం చెబుతోంది?
గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి ఏదైనా చట్టపరమైన వ్యవస్థ ఉందా అని తెలుసుకోవడానికి సైబర్ లిటిగేషన్‌లో నిపుణులైన న్యాయవాది కార్తికేయను బీబీసీ సంప్రదించింది.
''ఆన్‌లైన్ గేమ్‌లను తయారుచేసే చాలా కంపెనీలు విదేశాలకు చెందినవి. వారి కార్యాలయాలు ఎక్కడున్నాయో కూడా కచ్చితంగా తెలియదు. భారత చట్టం ప్రకారం ఏదైనా గేమ్‌ను నిషేధించినా, దాన్ని హ్యాక్ చేసి ఆడుతున్నారు'' అని కార్తికేయ అన్నారు.
''చట్టం ప్రకారం ప్రైజ్‌మనీ గేమ్‌లకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే, బహుమతిని గెలుచుకున్న వ్యక్తి చెల్లించాల్సిన పన్నుకు సంబంధించిన నియమాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఎవరైనా వీడియో గేమ్‌లకు బానిసలుగా మారకుండా నిరోధించే నిబంధనలు లేవు. గేమ్ ప్రారంభించేటప్పుడు, ఒక ఫాం ఇస్తారు. అందులో 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా ఆమోదం తెలిపితే, ఆట వల్ల కలిగే నష్టానికి ప్లేయర్‌దే బాధ్యత. పిల్లలు ఆడుతుండగా పర్యవేక్షించడం పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతే'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కేంద్రం సలహాలు
పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కేంద్ర విద్యా శాఖ ఇటీవల కొన్ని సలహాలు అందించింది.
కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత పిల్లలలో ఆన్‌లైన్ గేమ్‌లకు క్రేజ్ పెరిగిందని కేంద్రం గుర్తుచేసింది.
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తే వారిపై వెంటనే దృష్టి సారించాలని తెలిపింది.
డబ్బు ఖర్చు చేసే ఆటలపై తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
గేమ్ ఆడుతున్నప్పుడు డబ్బు మోసం జరిగినా, ప్లేయర్ వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనా వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ని సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
- ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














