డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?

ఫొటో సోర్స్, FACEBOOK
ఆన్‌లైన్ క్రికెట్ యాప్ డ్రీమ్ 11లో కోటిన్నర రూపాయలు బహుమతిగా గెలుచుకొన్న మహారాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ సోమ్‌నాథ్ జేండే సస్పెండ్ అయ్యారు.
ఆయన పింప్రి చించ్వాడ్‌లో ఎస్సైగా ఉన్నారు.
పోలీసు శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమ్‌నాథ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
ఒక పోలీస్ అయ్యుండి బెట్టింగ్‌లో పాల్గొంటున్నారంటూ పింప్రి చించ్వాడ్‌కి చెందిన బీజేపీ కార్యకర్త ఒకరు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి కూడా అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌కి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్‌కు పాల్పడిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమ్‌నాథ్‌పై విచారణ అనంతరం ఆయనపై చర్యలు తీసుకున్నారు.
అన్యాయం జరుగుతోందంటున్న సోమ్‌నాథ్
ఎస్సై సోమ్‌నాథ్ జేండే బీబీసీతో మాట్లాడుతూ, '' చాలా మంది ఈ ఆట ఆడతారు. అదొక ఆట మాత్రమే. గంటల తరబడి ఆడతారు. అది జూదక్రీడ కాదు. అయినా నాపై విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్నట్లు నాకెవరూ చెప్పలేదు. ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. అధికారులకు సమాధానం ఇచ్చాను. అయినా నాకు అన్యాయం జరుగుతోంది'' అన్నారు.
''శాఖాపరమైన విచారణ అనంతరం సోమ్‌నాథ్ జేండే సస్పెండ్ అయ్యారు'' అని అసిస్టెంట్ కమిషనర్ సతీష్ మానె చెప్పారు.
''పింప్రి చించ్వాడ్ పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు సోమ్‌నాథ్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆన్‌లైన్ క్రికెట్ యాప్ డ్రీమ్ 11లో ఆడారు. ఆ యాప్‌లో డబ్బులు గెలుచుకున్న తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలో పోలీస్ యూనిఫాం ధరించి ఉండడం వల్ల సోమ్‌నాథ్ జేండే తాత్కాలికంగా సర్వీస్ నుంచి సస్పెండ్ అయ్యారు'' అన్నారు.

పోలీసు శాఖకు చెడ్డ పేరు తెచ్చారన్న బీజేపీ నేత
బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా డ్రీమ్ 11 యాప్‌లో సోమ్‌నాథ్ బెట్టింగ్ పెట్టారని చెబుతున్నారు. అందులోనే ఆయన భారీగా డబ్బు గెలుచుకున్నారు. నెలన్నర రోజులుగా ఆయన డ్రీమ్ 11 యాప్‌లో గేమ్ ఆడుతున్నారు.
సోమ్‌నాథ్‌పై బీజేపీ ప్రతినిధి అమోల్ ఇటీవల ఫిర్యాదు చేశారు.
యువత ఇలాంటి జూదక్రీడలకు బలికాకుండా ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, ఈ పోలీసు వ్యవహారం దానిని ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
''పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సోమ్‌నాథ్ డ్యూటీలో ఉన్న సమయంలో విధినిర్వహణను పక్కనబెట్టి డ్రీమ్ 11 యాప్‌లో జూదమాడారు. దాని ద్వారా ఆయన డబ్బులు సంపాదించారు'' అని అమోల్ ఆరోపించారు.
''ఏదో ఘనకార్యం చేసినట్లుగా పోలీస్ యూనిఫాంలో ఉన్న సోమ్‌నాథ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది రాష్ట్ర పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చేలా ఉంది'' అని ఆయన అన్నారు.
సోమ్‌నాథ్ ఏమంటున్నారు?
ఈ వ్యవహారంపై ఎస్సై సోమ్‌నాథ్ కూడా స్పందించారు.
''నేను నెల రోజుల నుంచి డ్రీమ్ 11 యాప్‌లో డబ్బులు పెడుతున్నా. నా స్నేహితులు కూడా చాలా మంది ఆడుతున్నారు. బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌పై కూడా డబ్బులు పెట్టా. కోటిన్నర వచ్చాయి. చాలా సంతోషం కలిగింది.
వెంటనే నా భార్యకు ఫోన్ చేసి చెప్పా. ఆమె కూడా చాలా సంతోషించింది. ఇంటి రుణం తీర్చేసి, పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నా'' అని ఆయన అంటున్నారు.
విధి నిర్వహణలో ఉండగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం చట్టవిరుద్ధమని నిపుణులు చెబుతుండగా, తాను ఖాళీ సమయాల్లో ఆడానని సోమ్‌నాథ్ అంటున్నారు.
ఆయన డబ్బులు గెలుచుకున్న వార్త పుణె మిర్రర్‌లో ప్రచురితమైంది.
సోమ్‌నాథ్‌ను సంప్రదించేందుకు బీబీసీ మరాఠీ కూడా ప్రయత్నించింది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN
ఏంటీ డ్రీమ్ 11 కంపెనీ?
డ్రీమ్ 11 అనేది ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ.
భారత్‌కు చెందిన హర్ష్ జైన్, భవీష్ సేత్ 2008లో దీనిని ప్రారంభించారు. 2018 నాటికి డ్రీమ్ 11కి 40 లక్షల మంది యూజర్లు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డ్రీమ్ 11 కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
డ్రీమ్ 11 గేమింగ్ ప్లాట్‌ఫాంలో యూజర్లు క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, హాకీ, వాలీబాల్ ఆడుకోవచ్చు. నచ్చిన క్రీడాకారులతో వర్చువల్ టీమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
అందులో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే వారు విజయం సాధించినట్లుగా పరిగణిస్తారు. డ్రీమ్ 11లో ఉచితంగా ఆడుకోవచ్చు. లేదంటే డబ్బులు పందెంగా పెట్టుకుని ఆడే అవకాశం కూడా ఉంది.
ఇందులో ఆడేందుకు వినియోగదారుల వయసు కచ్చితంగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. డ్రీమ్ 11లో ఆట ఆడేందుకు కస్టమర్స్ తమ పాన్ కార్డుతో అకౌంట్ వెరిఫై చేయించాల్సి ఉంటుంది.
ఫాంటసీ గేమ్ అంటే ఏంటి?
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లలో ఆడే ఆటలను ఆన్‌లైన్ గేమింగ్‌గా వ్యవహరిస్తారు. ఇవి ప్రధానంగా మూడు రకాలు.
రియల్ మనీ గేమ్స్ : యూజర్లు డబ్బులు సంపాదించుకునేందుకు, పోగొట్టుకునేందుకు అవకాశం ఉన్న గేమ్స్ ఇవి. ఫాంటసీ లీగ్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ వంటి గేమ్స్ ఆడొచ్చు. రమ్మీ, పోకర్ వంటి పేకాట కూడా ఇందులో భాగమే.
మొబైల్ క్యాజువల్ గేమ్స్: స్మార్ట్‌ఫోన్లలో ఆడే క్యాండీ క్రష్, సబ్‌వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటివి.
ఈ-స్పోర్ట్స్: పబ్‌జీ, ఫిఫా, కౌంటర్‌స్ట్రైక్ వంటి గేమ్స్.
ఇలాంటి ఫాంటసీ గేమ్స్ భారత్‌లో 2001లో ప్రారంభమయ్యాయి. ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ 'ది సూపర్ సెలెక్టర్ ఫాంటసీ గేమ్'ను తీసుకొచ్చింది.
20 ఏళ్ల కిందట ఆన్‌లైన్‌పై అవగాహన, ఇంటర్నెట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చాలా పరిమితంగా ఉండేవి. ప్రస్తుతం దేశంలో ఫాంటసీ గేమ్స్ అందిస్తున్న కంపెనీలు 70 వరకూ ఉన్నాయి.
వేర్వేరు కంపెనీలు తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమ్స్‌లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే కోవకు చెందినవే.
యూజర్ పేరు, ఈమెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. యాప్‌లో నమోదు చేసుకునేందుకు నామమాత్రపు ఫీజు చెల్లించాలి.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN
గేమింగ్ యాప్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్, లేదంటే ఐపీఎల్ మ్యాచ్ ఆడుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు కావాల్సిన జట్టును ఎంపిక చేసుకోవచ్చు. రెండు టీమ్‌లలోని ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని ఒక జట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ ఇలా ఎవరినైనా ఎంచుకుని లీగ్ మ్యాచ్ ఆడొచ్చు. పరిచయం లేని వ్యక్తులతోనూ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది.
ఇందులో పబ్లిక్, ప్రైవేట్ పోటీలు ఉంటాయి. లక్షల మంది పోటీలో ఉండే పబ్లిక్ పోటీలో ఎవరితో తలపడుతున్నారో తెలియదు. అదే ప్రైవేట్ పోటీలో ఎవరో ఒకరిని ఎంచుకుని వారితో ఆడే అవకాశం ఉంటుంది.
మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి పాయింట్లు వస్తాయి. ఆటగాళ్లు సెంచరీ చేసినా, ఐదు వికెట్లు పడగొట్టినా, క్యాచ్ పట్టినా యూజర్‌కు ప్రత్యేక పాయింట్లు వస్తాయి. అలాగే, ప్రతి పరుగుకీ, ప్రతి వికెట్‌కీ నిర్దిష్టంగా పాయింట్లు ఉంటాయి.
మ్యాచ్‌లో వారు సాధించిన స్కోర్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. గెలిచిన వారి అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.
గెలిచిన సొమ్ముపై పన్నులుంటాయా?
ఫాంటసీ గేమ్‌ల నుంచి వచ్చిన సొమ్ముపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను లెక్కల ప్రకారం ఆన్‌లైన్ గేమ్స్ నుంచి వచ్చిన సొమ్మ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కం (ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం) కిందకు వస్తుంది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీ ప్రకారం ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఫాంటసీ లీగ్స్, లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, రేసులు, కార్డ్ గేమ్స్ (ఆన్‌లైన్ పేకాట) పన్ను పరిధిలోకి వస్తాయి.
ఫాంటసీ గేమ్ ఆడేందుకు కట్టిన ఫీజుతో పన్నుకు సంబంధం ఉండదు. గేమ్‌లో గెలుచుకున్న మొత్తంపై పన్ను విధింపు ఉంటుంది.
ఉదాహరణకు, వంద రూపాయలు గేమ్ రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించి ఆట ఆడినప్పుడు రూ.10 వేలు గెలిస్తే, ఆ పది వేలకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, MINT
బెట్టింగ్‌కూ, ఫాంటసీ గేమ్‌కూ తేడా ఉందా?
బెట్టింగ్‌కూ, ఫాంటసీ గేమ్‌కూ మధ్య స్పష్టమైన తేడా చూపించేవి ఆర్థిక లావాదేవీలు.
ఫాంటసీ గేమ్స్‌లో నగదు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కానీ బెట్టింగ్‌లో జరిగే లావాదేవీలకు లెక్కాపత్రాలుండవు. నగదు లావాదేవీలు అనధికారికంగా, అక్రమ పద్ధతుల్లో జరుగుతాయి.
ఫాంటసీ గేమ్స్‌లో చిన్నమొత్తాల లావాదేవీలు జరుగుతాయి. అదే బెట్టింగ్‌లో నగదు భారీ స్థాయిలో ఉంటుంది.
ఫాంటసీ గేమ్స్‌లో వచ్చే ఆదాయంపై కార్పొరేట్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్, టీడీఎస్, జీఎస్టీ వంటి పన్నులుంటాయి. బెట్టింగ్‌లో ఎక్కువ శాతం లావాదేవీలు ప్రభుత్వం, చట్టాల పరిధిలోకి రాకుండా అక్రమంగా జరుగుతాయి.
ఫాంటసీ గేమ్స్ ప్లేయర్లు మోసాల ఉచ్చులో పడకుండా ఓటీపీ, పాస్‌వర్డ్, ఈమెయిల్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. కానీ బెట్టింగ్‌లో పెట్టిన నగదుకు ఎలాంటి హామీ ఉండదు.
ఫాంటసీ గేమ్స్ చట్టబద్ధతపై దేశంలోని వివిధ కోర్టులు పలు సందర్భాల్లో వేర్వేరు తీర్పులు వెలువరించాయి. ఇటీవల డ్రీమ్ 11 ఫాంటసీ లీగ్‌ను పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు చట్టబద్ధం చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
బెట్టింగ్ భారత్‌లో నేరం. బెట్టింగ్‌కు పాల్పడితే శిక్ష విధించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














