వీరప్పన్: తెలుగు ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్ తలను నరికి కాలితో తన్నారా, అంతక్రూరంగా ఎందుకు చంపారు?

ఫొటో సోర్స్, TWITTER/SURENDER MEHRA IFS
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ కోసం...
నోట్: ఈ కథనంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
''శ్రీనివాస్ గుండెల్లో నుంచి రక్తం కారడం చూడాలనుకున్నా. ఏం జరుగుతుందో అతనికి అర్థమయ్యేలోపే తుపాకీతో కాల్చి చంపేశాను. అతని తల, మొండెం వేరుచేశాను. చేతులు నరికేశాను. ఎందుకంటే ఆ చేతులే నాపై మెషీన్ గన్ గురిపెట్టాలనుకున్నాయి.''
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పందిళ్లపల్లి శ్రీనివాస్ హత్య గురించి గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ అన్న మాటలివి.
వీరప్పన్‌కు శ్రీనివాస్ 1991లో చివరిసారి తారసపడ్డారు. అంతకు ఐదేళ్ల ముందు వారు తొలిసారి ఎదురు పడ్డారు. తన సోదరి మరణానికి కారణం ఆయనేనంటూ శ్రీనివాస్‌పై వీరప్పన్ పగ పెంచుకున్నారు.
లొంగిపోవడానికి సిద్ధమంటూ వీరప్పన్ పంపిన సందేశాన్ని శ్రీనివాస్ నమ్మారు. వీరప్పన్ వలలో చిక్కుకున్నారు.
విధి నిర్వహణలో అసమాన పోరాట పటిమ చూపిన శ్రీనివాస్‌ను భారత రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర వరించింది.

ఫొటో సోర్స్, Getty Images
వీరప్పన్‌పై నిఘా
1986లో కర్ణాటక రాజధాని బెంగళూరులో సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్స్) సమావేశాలు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు జె.జయవర్దనే ఆ సమావేశాలకు హాజరవడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ రోజుల్లో సమయంలో శ్రీలంకలో తమిళ తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ ఎదుగుతూ అక్కడి ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది.
సమావేశాల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. అలాంటి సమయంలో బెంగళూరులో ఓ బస్టాండ్ వద్ద అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. అతన్ని ''నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు ఎందుకు వచ్చావు? ఎక్కడ ఉంటున్నావు?'' అని అడిగారు పోలీసులు. ఈ ప్రశ్నలకు అనుమానాస్పద వ్యక్తి సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదు.
పైగా అతనికి కన్నడ భాష రాదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని చుట్టుముట్టి జయనగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో అతను వీరప్పన్ అని తేలింది.
కర్ణాటకలోని చామరాజనగర జిల్లా గోపీనాథం అనే గ్రామంలో వీరప్పన్ పుట్టారు. గంధపు చెట్లు, ఏనుగుల మందలు తిరిగే దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ గ్రామం ఉంది. ఆ తర్వాత అవే గంధపు చెట్లు, ఏనుగుల దంతాల వల్ల వీరప్పన్ అందరికీ గుర్తుండిపోయారు.
ఆ ఊరు తమిళనాడు సరిహద్దులో ఉండడంతో వీరప్పన్ గ్యాంగ్ నేరాలు చేసి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పారిపోయేవారు. దీంతో వారిని అరెస్టు చేయలేకపోయారు. చాలా కాలం తర్వాత పొరపాటును గ్రహించిన కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఉమ్మడిగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
1972లో వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టంతో ఏనుగుల వేట తగ్గిపోయింది. అదే సమయంలో వీరప్పన్ ప్రత్యర్థి కూడా ఆ వ్యాపారం నుంచి తప్పుకున్నారు. దీంతో వీరప్పన్‌కి అడ్డులేకుండా పోయింది.
వీరప్పన్ అరెస్టును అధికారికంగా చూపించలేదు. అలా చేస్తే చట్టం ప్రకారం, కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది.
వీరప్పన్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు చామరాజనగర ఫారెస్ట్ ఆఫీసర్‌గా పందిళ్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అప్పటికే వీరప్పన్ కేసుపై చాలా పరిశోధన చేశారు. వీరప్పన్ కార్యకలాపాలు, పరిచయాలపై ఆయనకు అవగాహన ఉంది.
అందువల్ల వీరప్పన్‌ను శ్రీనివాస్‌కు అప్పగించారు. వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ నెట్‌వర్క్, అతని వేట పద్ధతులు, కొనుగోలుదారుల గోడౌన్లపై దాడులు మొదలయ్యాయి. నెలరోజలు పాటు ఈ దాడులు కొనసాగాయి. అతని అరెస్టును మాత్రం అధికారికంగా చూపించలేదు.
పోలీస్ కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డ్స్ బొడిపడ్గ వద్ద ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ గెస్ట్‌హౌస్ కేంద్రంగా వీరప్పన్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఒకరోజు పనిమీద శ్రీనివాస్ బయటకు వెళ్లారు. అదే అదనుగా సిబ్బంది ఏమరపాటుగా ఉన్న సమయంలో వీరప్పన్ అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు.
వీరప్పన్ అరెస్టు, తప్పించుకుపోవడం గురించి జర్నలిస్టు సునాధ్ రఘురామ్ 'వీరప్పన్: ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మ్యాన్' అనే పుస్తకం(పేజీ నంబర్ 35-36)లో రాశారు. వీరప్పన్ జీవితంపై ఆయన ఎంతో పరిశోధన చేశారు.
ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 1954 సెప్టెంబర్ 12న జన్మించినట్లు ఆయన జీవితంపై విడుదల చేసిన బ్రోచర్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
1976లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లైఫ్ సెన్సెస్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. 1979లో ఆయన ఇండియన్ పారెస్ట్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. చామరాజనగర అసిస్టెంట్ కన్జర్వేటర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిప్యూటీ కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందారు.
ఆయన గంధపు చెక్కల స్మగ్లర్ల పేర్లు, ఫొటోలు, వారి ఊరు, వయసు, వారు ఎలా స్మగ్లింగ్ చేస్తుంటారు, ఎవరెవరికి సరఫరా చేస్తుంటారు వంటి విషయాలన్నింటినీ సేకరించడం మొదలుపెట్టారు. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటైంది. దీంతో సమాచారం అందించడంలో వేగం పెరిగింది.
వీరప్పన్ సమాచారం కోసం అటవీ శాఖ అధికారులు, పోలీసులు కొన్నిసార్లు గ్రామస్తులను హింసించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. దాని ఫలితంగా వారు వీరప్పన్‌కి సానుభూతిపరులుగా మారారు.
ఇదిలా ఉంటే, ఎవరైనా పోలీసు శాఖకు, అటవీ శాఖకు సమాచారం అందిస్తున్నట్లు అనుమానం వస్తే వీరప్పన్ వాళ్ల తల, మొండెం వేరు చేసి గ్రామంలో వేలాడదీసేవారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారితే ఏం జరుగుతుందో చెప్పడానికి అలా చేసేవారు.
అటవీ ప్రాంతం, నదులు, వాగులు, అడవిలో జంతువులు, పక్షులు, మొక్కలు, మూలికల గురించి పోలీసుల కంటే వీరప్పన్‌కే ఎక్కువగా తెలుసు. అందువల్లే ఎస్‌టీఎఫ్ నుంచి అతను తప్పించుకోగలిగే వాడు. పైగా ఆ అడవులు చాలా దట్టంగా ఉండేవి. కొన్నిచోట్ల సూర్యకాంతి కూడా నేలపై పడేది కాదు. ఆ అడవుల్లో అప్పటి వరకు ఎవరూ అడుగు పెట్టలేదు.
1987లో శ్రీనివాస్ కాఫీ తోటలు ఎక్కువగా ఉండే చిక్కమగళూరుకి బదిలీ అయినట్లు రఘురామ్ తన పుస్తకంలో రాశారు. అయినా, వీరప్పన్‌పై ఆయన నిఘా కొనసాగుతూనే ఉండేది. బస్సులో చామరాజనగర్‌కి వచ్చి ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని సమాచారం తెలుసుకునేవాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
శ్రీనివాస్ వర్సెస్ వీరప్పన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ 'ఫారెస్ట్ మార్టిర్స్' (అటవీ అమరవీరులు) అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందులోని పేజీ నంబర్ 34లో శిక్షణ కోసం శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు రాశారు.
1990 ఏప్రిల్ తనను వెంబడిస్తున్న పోలీసులను ఢీకొట్టి వీరప్పన్ పారిపోయాడు. ఈ ఘటన తర్వాత కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉమ్మడిగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అందుకోసం శ్రీనివాస్‌ను ఎంపిక చేశాయి. ఆయన అమెరికా నుంచి తిరిగొచ్చి 1990లో ఎస్‌టీఎఫ్ బాధ్యతలు చేపట్టారు.
వీరప్పన్‌ను స్థానికులు పెద్దోళ్లను దోచుకుని పేదలకు పంచిపెట్టే రాబిన్‌హుడ్‌గా భావించేవారు. దాని ప్రభావంతో స్థానిక యువకులు వీరప్పన్ ముఠాలో చేరేవారు. వీరప్పన్ నమ్మకస్తులకు సమాచారం చేరవేయడం, వారి కదలికలను గోప్యంగా ఉంచడం, అవసరమైన సామగ్రిని అవసరమైన చోటుకు చేరవేయడం వంటి పనులు వారికి అప్పగించేవారు.
కనీస సౌకర్యాలు లేకపోవడం, పేదరికం కారణంగా యువకులు వీరప్పన్‌కు సహకరిస్తున్నారని, అందుకే అతని ముఠాలో చేరుతున్నట్లు శ్రీనివాస్ గుర్తించారని రఘురామ్ తన పుస్తకంలో రాశారు.
గ్రామస్తులకు ఉపాధి కల్పించేందుకు గ్రామస్థాయిలో సహకార సంఘాలను స్థాపించారు. తన పరిధిలోని గ్రామాల్లో నీటి వసతి, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచారు.
హింసను వదిలి అహింసా మార్గంలోకి రావాలని, ఆయుధాలు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. వీరప్పన్ స్వగ్రామంలో ఒక డిస్పెన్సరీని శ్రీనివాస్ ప్రారంభించారు.
రాజమండ్రిలో తన తాత దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద పాఠాల ఆధారంగా గ్రామస్తులకు జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి వ్యాధులకు వైద్యం అందించారు. సేవా కార్యక్రమాల తన సొంత డబ్బు, అవసరమైతే స్నేహితుల వద్ద తీసుకుని మరీ ఖర్చు చేశారు.
గర్భిణులు, రోగులను శ్రీనివాస్ తన జీపులో ఆస్పత్రికి తీసుకెళ్లేవారని గ్రామస్తులు నేటికీ చెబుతుంటారు. ఆ తర్వాత కాలంలో వీరప్పన్ ముఠాలోని 20 మంది లొంగిపోయారు. శ్రీనివాస్ కూడా వారితో కలిసి గోపీనాథం గ్రామంలోనే ఉండేవారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి, సోదరుడు అర్జునన్, సోదరి సహా వీరప్పన్ పాత మిత్రులు చాలా మంది అదే గ్రామంలో ఉండేవారు.
''ఆయనేం మంచివాడు కాదు. మంచివాడిగా నటించాడు. వీరప్పన్‌ను గ్రామస్తులు దేవుడిలా ఎందుకు చూస్తారో తెలుసుకోవడానికి మా ఊరికి వచ్చాడు. వీరప్పన్ చేసేవన్నీ నేను కూడా చేస్తే గ్రామస్తులు నన్ను నమ్ముతారా? లేక వీరప్పన్‌ను నమ్ముతారా? అని అనుకునేవాడు. అది నా భర్తను బాగా ఇబ్బంది పెట్టింది'' అని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వీరప్పన్ సోదరిని పనిలో పెట్టుకున్న శ్రీనివాస్
అక్కడ ఉన్న మరియమ్మ ఆలయాన్ని శ్రీనివాస్ పునర్నిర్మించారని, మూడు లక్షల రూపాయలు డిపాజిట్ కూడా చేశారని రఘురామ్ తన పుస్తకంలో రాశారు. ఇదే ఆ తర్వాత శ్రీనివాస్ మృతికి కారణమైంది.
శ్రీనివాస్ తన డిస్పెన్సరీలో మారియమ్మ అనే మహిళను నియమించుకున్నారు. ఆమె భర్త జైలులో ఉన్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. నీళ్లు కాగబెట్టడం, మందులు భద్రపరచడం వంటి పనులు మారియమ్మ చేసేవారు. ఆమె వీరప్పన్ సోదరి. ఆమెంటే వీరప్పన్‌కి చాలా ప్రేమ.
శ్రీనివాస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సర్వేయర్‌గా ఉన్నారు. వీరప్పన్‌ను లొంగిపోయేలా చేయగలనని ఆయన నమ్మకంగా ఉన్నారు. అందుకే అతని అనుచరులు అరెస్టులను అధికారికంగా చూపించలేదు.
ఒకానొక సమయంలో వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఎస్‌టీఎఫ్ అతని గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించింది. ఆ సమయంలో వీరప్పన్‌పై కాల్పులు జరపొద్దని టాస్క్‌ఫోర్స్‌కి సూచించడం శ్రీనివాస్‌పై పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. వాళ్లు పోలీసులు. ఆయనేమో అటవీ శాఖ అధికారి. అధికార పరిధి ప్రకారం వారు శ్రీనివాస్ మాట వినాల్సి వచ్చింది.
ఎస్‌టీఎఫ్‌లో టైగర్ అని పిలిచే అశోక్ కుమార్ ప్రకారం, '' సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో మారియమ్మతో కలిసి శ్రీనివాస్ జీపులో వెళ్లడం చూశారు. కానిస్టేబుల్ సూధన్ వారిద్దరి మధ్య సంబంధం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.''
అప్పటి వరకూ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వీరప్పన్‌పై చెప్పుకోదగ్గ విజయమేమీ సాధించలేదు. ఎస్‌టీఎఫ్ కమాండెంట్ గోపీనాథం గ్రామస్తులు కొందరిని అరెస్టు చేశారు. దీంతో ఇచ్చిన మాట తప్పినట్టైంది. శ్రీనివాస్‌పై గ్రామస్తుల ఆగ్రహానికి దారితీసింది.
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారు. అందుకు మారియమ్మ సహాయం చేసిందన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆమెపై శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ముత్తులక్ష్మి ఎక్కడ ఉందో చెప్పకపోతే బట్టలు ఊడదీసి, కరెంట్ షాక్ పెడతానని మారియమ్మను బెదిరించారు. దీంతో ఆమె భయపడిపోయింది' అని రఘురామ్ తన పుస్తకంలో రాశారు.
''వాడు కనిపిస్తే కాలిపోయే నూనె పోసి వాడిని చంపెయ్యి. లేకపోతే నువ్వు నా చెల్లెలివే కావని మారియమ్మకి వీరప్పన్ లేఖ రాశాడు'' అని ముత్తులక్ష్మి చెబుతున్నారు.
అప్పటి ఫారెస్ట్ ఆఫీసర్ బీకే సింగ్ వివరాల ప్రకారం, వీరప్పన్‌కు సంబంధించిన ఒక్క కేసును కూడా ఎస్టీఎఫ్ అధికారులు ఛేదించలేకపోయారు. మరోవైపు శ్రీనివాస్ ఏకంగా 22 మందిని లొంగిపోయేలా చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నమ్మకంగా తీసుకెళ్లి..
శ్రీనివాస్ తన వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి వీరప్పన్ సోదరుడు అర్జునన్‌ను జైలు నుంచి విడుదల చేయించారు. అయితే, మారియమ్మ చనిపోవడంతో వీరప్పన్ చాలా కోపంగా ఉన్నారు. అయితే, మారియమ్మ చనిపోయిన విషయం శ్రీనివాస్‌కు తెలియదు.
అప్పటికే ఎస్‌టీఎఫ్‌లో శ్రీనివాస్ పదవీకాలం పూర్తయింది. అయినప్పటికీ అర్జునన్ బయటికి వస్తే ఏదైనా సమాచారం దొరుకుతుందని ఆయన భావించారు. అందుకే ఉన్నతాధికారులను 15 రోజుల గడువు కోరారు.
కీర్తి చక్ర అవార్డు ఇచ్చినప్పుడు పేర్కొన్న సమాచారం ప్రకారం, ఒకరోజు శ్రీనివాస్ కాళీ ఆలయంలో పూజలు చేస్తున్నప్పుడు అర్జునన్ అక్కడికి వచ్చారు. వీరప్పన్ తన ఆయుధాలను అప్పగించాలని అనుకుంటున్నాడని చెప్పారు. అయితే, పోలీసులు ఉండకూడదనే షరతు విధించారు.
నవంబర్ 9వ తేదీ తెల్లవారుజామున అర్జునన్‌తో కలిసి శ్రీనివాస్ గోపీనాథం నుంచి బయలుదేరారు. శ్రీనివాస్ దగ్గర ఆయుధం కూడా లేదు.
దాదాపు ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాహనం ఆపాలని అర్జునన్ కోరారు. అక్కడే నీటి కుంట పక్కన ఉండమని చెప్పి వెళ్లారు. వీరప్పన్ అనుచరుడొకరు ఆయన్ను కాల్చి చంపారు.
వీరప్పన్ తన సోదరుడు అర్జునన్‌ను వాడుకుని తన చెల్లెలి మరణానికి శ్రీనివాస్‌పై ప్రతీకారం తీర్చుకున్నారని చెబుతారు.
ఆ తర్వాత శ్రీనివాస్ సగం శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతని తలను మొండెం నుంచి వేరుచేశారు. చేతులు రెండూ నరికేశారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కి, పోలీసులకు ఇదొక గుణపాఠంగా వీరప్పన్ భావించాడు. ముత్తులక్ష్మి శ్రీనివాస్ తలను తన్నినట్లు రఘురాం తన పుస్తకంలో రాశారు.
2004 అక్టోబర్ 18న తమిళనాడుకు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వీరప్పన్‌ను, అతని ముగ్గురు అనుచరులను హతమార్చింది.
వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు వేలాది మందిని నియమించడంతో పాటు, కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
వీరప్పన్‌ని చంపడం వల్ల రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతల గుట్టు ఎప్పటికీ బయటకు రాకుండా మిగిలిపోయిందని అంటారు.
ముత్తులక్ష్మి, బీకే సింగ్, అశోక్ కుమార్‌ల వ్యాఖ్యలు ''ది హంట్ ఫర్ వీరప్పన్'' అనే డాక్యుమెంటరీ సిరీస్ నుంచి తీసుకున్నవి.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'










