పిల్లలు తిట్టినా, కొట్టినా తల్లిదండ్రులు ఎందుకు వారితోనే ఉంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదర్శ్ రాథోడ్
- హోదా, బీబీసీ హిందీ ప్రతినిధి
''ఇంట్లో అందరిపై చేయి చేసుకుంటాడు. ఒకసారి వాళ్లమ్మని చాలా దారుణంగా కొట్టాడు. ఆమె చెయ్యి కూడా విరిగింది. నేను ఆపేందుకు ప్రయత్నిస్తే, నన్ను కర్రతో తలపై కొట్టాడు.''
తన చిన్నకొడుకు మద్యం తాగొచ్చి కొడుతుంటాడని షిమ్లాకి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ధరమ్‌వీర్ (పేరు మార్చాం) చెప్పారు.
''మొదట్లో బాగానే ఉండేవాడు. కాలేజీకి వెళ్లడం మొదలైన తర్వాత మారిపోయాడు. మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు తాగొచ్చావని అడిగితే నానా రభస చేసేవాడు. ఒకసారి వాళ్లమ్మని డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో బలంగా తోసేశాడు. ఆమె కిందపడిపోయింది. ఆ విషయం నాకు తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాను'' అని ధరమ్‌వీర్ చెప్పారు.
కానీ, రెండు రోజుల తర్వాత ఇంటికి రమ్మన్నారు ధరమ్‌వీర్. ఆ రెండురోజులూ ధరమ్‌వీర్ కొడుకు బంధువుల ఇంట్లో ఉన్నారు.
''చేతిలో డబ్బులు కూడా లేవు, ఎక్కడికి వెళ్తాడులే అనుకున్నా. కొద్దినెలలు బాగానే ఉంది. ఆ తర్వాతి నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. తాగొచ్చి మమ్మల్ని కొట్టేవాడు. పరువు పోతుందని మేం బయటికి చెప్పుకోలేదు. చదువు పూర్తి చేయలేదు. ఉద్యోగం లేదు.'' అని ఆయన చెప్పారు.
''వాడిపై మంచి అభిప్రాయం లేకపోవడంతో ఇప్పటికీ పెళ్లి కాలేదు. 45 ఏళ్లు వచ్చినా నా పెన్షన్ డబ్బుల మీదే ఆధారపడ్డాడు. వాడి ప్రవర్తనతో విసిగిపోయి నా పెద్ద కొడుకు, కోడలు వేరుకాపురం ఉంటున్నారు.
ఇప్పుడు మాకు కూడా వయసు పైబడింది. మా తర్వాత వాడి పరిస్థితేంటో అర్థం కావడం లేదు.'' అన్నారు ధరమ్‌వీర్.
ఇలా పిల్లల వేధింపులు, దోపిడీ, వారి వల్ల పడుతున్న ఒత్తిడి నుంచి బయటపడాలని ధరమ్‌వీర్ లాంటి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇలాంటి దారుణమైన బంధాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని వాళ్లకు తెలుసు. కానీ, అందులో నుంచి బయటికి రావాలని అనుకుంటున్నా అలా చేయలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విడదీయరాని బంధం
తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని కష్టసుఖాల్లోనూ విడదీయరాని ప్రేమానుబంధంగా భావిస్తారు. కానీ, కొంతమంది తల్లిదండ్రులకు ఈ బంధాన్ని కొనసాగించడం కష్టంగా అనిపించొచ్చు.
ఆ బంధాన్ని తెంచుకోవాలని అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి ఎదురవుతుంది.
తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడడం మానేయడం ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడడం మానేస్తున్నారు. అయితే, అలాంటి సందర్భాలు చాలా అరుదని పరిశోధనలో తేలింది.
పిల్లల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్న తల్లిదండ్రుల్లో, కేవలం 5 శాతం మంది మాత్రమే అలా చేస్తున్నారని బ్రిటిష్ సోషల్ ఆర్గనైజేషన్ 'స్టాండ్ ఎలోన్' సంస్థ 2015లో నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.
అది చాలా కష్టమైన, బాధతో కూడుకున్న నిర్ణయమని.. ఒంటరితనానికి, చికాకుకి దారితీసిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
''సంప్రదాయపరంగానూ, పరిశోధనల్లోనూ పిల్లలకు దూరంగా ఉండాలని భావించే తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం తక్కువ. ఎందుకంటే అది దాదాపు నిషిద్ధం. విమర్శలకు భయపడి తమ అనుభవాలను పంచుకోవడానికి వారు ఇష్టపడరు'' సైకాలజీ సీనియర్ లెక్చరర్ లైసీ బ్లేక్ చెప్పారు. ఆమె బ్రిస్టల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్‌లో సైకాలజీ విభాగంలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బేషరతుగా ప్రేమించడమే కారణమా?
సాధారణంగా పిల్లలకు పేరెంట్స్ దూరంగా ఉండాలనుకోవడానికి గల కారణాలు, పేరెంట్స్‌కి పిల్లలు దూరంగా ఉండాలనుకోవడానికి గల కారణాలు దాదాపుగా ఒకటే. కుటుంబ తగాదాలు, మత్తుపదార్థాలకు బానిసలవడం, భిన్నాభిప్రాయాలు, చెడు ప్రవర్తన లాంటివే కారణంగా ఉంటాయి. అయితే, పిల్లలు తెంచుకున్నంత తేలిగ్గా తల్లిదండ్రులు బంధాన్ని తెంచుకోలేరు.
పిల్లలను బేషరతుగా ప్రేమించాలని, బాగా చూసుకోవాలని తల్లిదండ్రులు అనుకోవడమే దానికి కారణమని లక్నోకు చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రాజేష్ పాండే చెప్పారు.
''తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. వాళ్లను పెంచుతారు. అది తమ బాధ్యతగా భావిస్తారు. కానీ, పిల్లల వైపు నుంచి చూస్తే అది వేరుగా ఉంటుంది. ఏదైతే తల్లిదండ్రుల నుంచి పొందారో అది తిరిగి ఇవ్వకపోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నంత ప్రేమగా వాళ్లు ఉండలేకపోవచ్చు'' అని ఆయన చెప్పారు.
''తల్లిదండ్రులు తమ భవిష్యత్తును బిడ్డలో చూసుకుంటారు. కానీ, పిల్లల దృష్టిలో వారి భవిష్యత్తు, వారి ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. కెరీర్, సంపాదన, సక్సెస్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వారి ప్రాధాన్యాల్లో ఉంటారు. కానీ, వారే మొదటి స్థానంలో ఉండాలని లేదు. కానీ, తల్లిదండ్రులకు మాత్రం పిల్లలే తొలి ప్రాధాన్యం.'' అన్నారాయన.
పిల్లలు తమను ఇబ్బందిపెట్టినా, బాధపెట్టినా తల్లిదండ్రులు వారిని వదలలేకపోవడానికి ఇదే కారణం.
కొడుకు దారుణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ధరమ్‌వీర్ దంపతులు అతనితో కలిసే ఉంటున్నారు. పెద్దకొడుకు దగ్గరకు వెళ్లిపోవాలని ఆయన చాలా సార్లు అనుకున్నారు. కానీ, చిన్నకొడుకు ఏమైపోతాడోనన్న ఆలోచనతో వదిలేసి వెళ్లలేకపోయారు.
''పిల్లలతో సంబంధం తెంచుకోవాలని అనుకున్న తల్లి కానీ, తండ్రిని కానీ నేను చూడలేదు. వేధింపులు, దోపిడీ ఆగాలని కోరుకుంటున్నారే కానీ పిల్లల నుంచి విడిపోవాలని పేరెంట్స్ కోరుకోవడం లేదు.'' అని జెన్నీఫర్ స్టోరే చెప్పారు. ఆమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కెంట్‌లో సైకాలజీ లెక్చరర్‌గా ఉన్నారు. ఆమె హింసాత్మక ప్రవర్తనపై అధ్యయనం చేశారు.
అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, పిల్లలు, వారి చుట్టూ ఉన్నవారు వాస్తవాలను అంగీకరించడం అంత సులువు కాదు.
''తల్లిదండ్రులుగా చాలా ఆశిస్తాం. దేవుడిలాగే మనల్ని బేషరతుగా ప్రేమించాలని కోరుకుంటాం. అయితే, అదే చాలా సమస్యలకు కారణమవుతోంది. మీరు ఆశించడం మొదలుపెడితే వారి ఎలాంటి ప్రవర్తననైనా భరించాల్సిందే. మానసిక వేధింపులు, డబ్బుల కోసం చేసే వేధింపులను కూడా'' అని లూసీ బ్లేక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేరుగా ఉండాలనుకోవడం పాపమా..
యవ్వనంలో తల్లిదండ్రులతో ఇబ్బందికర ప్రవర్తన గురించి అమండ హోల్ట్ '' అడాలసెంట్ టు పేరెంట్ అబ్యూజ్: కరెంట్ అండర్‌స్టాండింగ్ ఇన్ రీసెర్చ్, పాలసీ అండ్ ప్రాక్టీస్'' అనే పుస్తకం రాశారు.
''సాధారణంగా తల్లిదండ్రులు శక్తివంతులని భావిస్తారు. కానీ, పిల్లలు ఎదిగేకొద్దీ పరిస్థితులు మారిపోతాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను హింసించగలరని, ఆ సంబంధాన్ని తెంచుకునే వరకూ తీసుకెళ్లగలరనీ ఊహించరు. పిల్లల నుంచి విడిపోవడానికి తల్లిదండ్రులు వెనకాడడానికి ఇది కూడా ఒక కారణం'' అని ఆమె చెప్పారు.
''పిల్లలతో తల్లిదండ్రులకు రక్తసంబంధం, సామాజిక, చట్టపరమైన సంబంధం కూడా ఉంటుంది. మాట్లాడడం మానేసినప్పటికీ అవి అలానే కొనసాగుతాయి. వాటిని దూరం చేయడం చాలా కష్టం'' అని అమండ హోల్ట్ తెలిపారు.
'' బహుశా ఇండియాలో పిల్లల నుంచి దూరంగా ఉండాలనుకునే తల్లిదండ్రులు లక్ష మందికి ఒకరో, ఇద్దరో ఉంటారు. ఎందుకంటే అది సమాజం దృష్టిలో ఒక పాపం. మన సామాజిక పరిస్థితులు అందుకు సహకరించవు.'' అని సైకాలజిస్ట్ రాజేష్ పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సానుకూల వాతావరణం అవసరం
సాధారణంగా పిల్లల విజయం, ఓటమి తల్లిదండ్రులతో ముడిపడి ఉన్నప్పటికీ, పిల్లలతో సంబంధాలు తెంచుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అలాంటి పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. అప్పుడు వారు సిగ్గుపడడంతో పాటు తాము తప్పు చేశామని భావిస్తారు.
''దీని కారణంగా వారు ఒంటరితనానికి గురవుతారు. బంధువులు, స్నేహితులకు కూడా దూరంగా ఉంటారు. పిల్లల నుంచి విడిపోవడం వారి జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. దూరంగా ఉండాలనుకుంటున్న తల్లిదండ్రులను కొందరు మాత్రమే అర్థం చేసుకోగలరు. అది మరో రకమైన బాధ. తమ జీవితానికి అర్థం లేకుండా పోయిందని భావించొచ్చు. ఫలితంగా వారు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా సంబంధాలను తెంచుకోవచ్చు.'' అని లూసీ బ్లేక్ చెప్పారు.
పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటున్న తల్లిదండ్రులు తమ చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని, అలా చేయడం వల్ల ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరీముఖ్యంగా పండుగలు, పుట్టినరోజు వంటి సమయాల్లో అలా అనిపించకుండా ఉంటుందని అంటున్నారు.
విడివిడిగా జీవించే వ్యక్తులు ఎక్కువ భావోద్వేగానికి గురవుతున్నట్లు స్టాండ్ ఎలోన్ అధ్యయనంలోనూ వెల్లడైంది.
ఇవి కూడా చదవండి:
- నా గర్ల్‌ఫ్రెండ్‌కు అందమైన ఆడవాళ్లను చూస్తే కోపమొచ్చేస్తుంది.. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటే ఇదే
- లవ్ హోటల్స్: ప్రేమికులకు, కొత్త జంటలకు ఏకాంతం కోసం..
- ‘అమ్మాయిలను చూస్తే నాకెందుకు ఆకర్షణ కలగటం లేదు?’
- భారతదేశంలో రాజకీయ నాయకుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాహేతర సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఎందుకు?
- Live-in relationship: సహజీవనంలో ఉన్నవారికి జన్మించిన పిల్లలకూ పూర్వీకుల ఆస్తిపై హక్కు-సుప్రీం కోర్టు తీర్పుపై ఎవరేమన్నారు














