పిల్లల పెంపకం: పశ్చిమ దేశాల పద్ధతులు చూసి మిగతా ప్రపంచం ఎందుకు భయపడుతోంది?

పిల్లల్ని ఎత్తుకోవడంలో కూడా ఒక్కో సంస్కృతిలో ఒక్కో విధానం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీపు మీద బిడ్డతో ఓ మహిళ
    • రచయిత, కెల్లీ ఓక్స్
    • హోదా, బీబీసీ ఫీచర్స్

''వాడు తన గదిలో నిద్రపోతున్నాడా?'' పసి బిడ్డల విషయంలో పశ్చిమ దేశాలకు చెందిన తల్లిదండ్రులకు తరచూ ఎదురయ్యే ప్రశ్నఇది. మొదటి కొన్ని నెలలకే ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తుంటాయి.

కానీ, పిల్లల నుంచి వేరుగా పడుకోవడం మిగతా ప్రపంచానికి కొత్త పద్ధతి. దీనికి చాలా సంస్కృతులలో స్థానం లేదు. ఒకే గదిలో, ఒకే మంచం మీద తల్లిదండ్రులు, పిల్లలు కలిసి పడుకోవడం చాలా సాధారణమైన విషయం.

మిగతా సంస్కృతులకు భిన్నంగా పిల్లల విషయంలో పాశ్చాత్యులు చేసే పని ఇదొక్కటే కాదు. నిద్ర పుచ్చడం, ఆటలాడించడంలాంటి చాలా సాధారణ విషయాలు కూడా వెస్ట్రన్ కల్చర్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి.

అమెరికా, బ్రిటన్‌లకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మొదటి ఆరునెలల పాటు తమతోపాటు పడుకోవడానికి అనుమతి ఇస్తారు. కానీ, ప్రపంచంలోని ఇతర సంస్కృతులలో పిల్లలు ఎక్కువ సేపు తల్లిదండ్రులతో కలిసి ఉంటారు.

బెడ్‌రూమ్ మాత్రమే కాకుండా, కనీసం ఒక పేరెంట్‌తో ఒకే మంచం మీద పడుకునే పిల్లల గురించి 2016లో జరిగిన ఒక అధ్యయనం, ఆసియా దేశాలలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉందని తేల్చింది.

ఉదాహరణకు భారతదేశం, ఇండోనేషియాలో 70% పైగా, శ్రీలంక, వియత్నాంలలో 80% శాతానికి పైగా పిల్లలు తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి దగ్గర పడుకుంటారు.

ఆఫ్రికన్ దేశాలలో ఒకే మంచం మీద తల్లి లేదా తండ్రితో నిద్రించే పిల్లల సంఖ్య విషయంలో అధ్యయనాలు అస్పష్టంగా ఉన్నాయి. కానీ, ఈ అలవాటు ప్రపంచవ్యాప్తంగా ఉందన్నది మాత్రం నిజం.

బెంగళూరుకు చెందిన డాక్టర్, పేరెంటింగ్ కన్సల్టెంట్ డెబ్మితా దత్తా ఈ అంశం గురించి మాట్లాడారు. ''పాశ్చాత్య ప్రభావాలు కొంత ఉన్నప్పటికీ, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పడుకోవడం ఇక్కడ ఒక బలమైన సంప్రదాయం'' అని అన్నారు.

పిల్లలకు సొంత గదులు ఏర్పాటు చేసిన కుటుంబాలలో కూడా ఈ అలవాటు ఉన్నట్లు దత్తా వెల్లడించారు.

''నలుగురు ఉన్నకుటుంబంలో కూడా మూడు బెడ్ రూములు ఉన్న ఇళ్లు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు చెరొక గది ఉంటాయి. కానీ పిల్లలిద్దరూ తల్లిదండ్రుల మంచం మీదే కనిపిస్తారు'' అన్నారామె.

పిల్లల్లో స్వతంత్ర వ్యక్తిత్వం కోసం పాశ్చాత్య దేశాల్లో వారిని నెలల వయసు నుంచే వేరుగా ఉంచడం మొదలు పెడతారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడుస్తున్న చిన్నారి

"ఇది సర్వసాధారణం"

పిల్లల్లో నిద్రలో లేచి నడిచే అలవాటు సమస్య నుంచి బయట పడటానికి బెడ్ షేరింగ్ ఒక మార్గం అని దత్తా అంటారు. ఆమె సొంత కుమార్తె కూడా ఆమె మంచం పక్కనే మరో మంచంలో పడుకుంటారు.

ఏడేళ్ల వయసు వచ్చే వరకు ఆమె అక్కడే నిద్రించింది. ''పాలు తాగడం మానేసిన తరువాత కూడా ఆమె మా గదిలో పడుకోవడానికి ఆసక్తి చూపించింది'' అన్నారు దత్తా.

పాశ్చాత్య సమాజాలలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను నిద్ర పుచ్చడం కాకుండా, ఒక గదిలో వారి మానాన వారిని వదిలేయాలని భావిస్తారు. దాని వల్ల తమకు విశ్రాంతి లభిస్తుందని వారు అనుకుంటారు.

పిల్లలను నిద్ర పుచ్చడానికి ఆస్ట్రేలియాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు కూడా ఉన్నాయి.

పిల్లల్లో స్వతంత్రంగా జీవించే వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించడం పాశ్చాత్య సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగానే వారిని విడిగా పడుకొబెట్టేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తారు.

పిల్లలను తమతో పడుకోబెట్టుకోవడం వల్ల, వారు తమ మీద ఆధారపడే మనస్తత్వాన్ని పెంచుకుంటారని వారు భావిస్తారు.

కానీ దత్తా మాత్రం ఇలాంటి సంస్కృతిలో లోపాలు ఉన్నాయంటారు. "మీరు వారికి కొంత ఆత్మవిశ్వాసం, స్వంతంత్రాన్ని ఇస్తే వారే సొంతంగా మీ నుంచి విడిపోతారు'' అని దత్తా అన్నారు. "వారు ఎప్పటికీ మీతో ఉండరు." అంటారామె.

రాత్రి పిల్లలను దూరం పెట్టినా, పగలు వారిని తమతో తిప్పుకోవడం వల్ల పిల్లలకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లి వీపు మీద జోలెలో చిన్నారి

తక్కువ నిద్ర

సంస్కృతి అనేది పిల్లలు ఎక్కడ నిద్రపోవాలో కాకుండా, ఎంత నిద్రపోవాలో కూడా నేర్పుతుంది. టోక్యోలోని ఉరయసు ఇచికవా మెడికల్ సెంటర్ సీఈవో జున్ కోహ్యామా, ఆయన సహచరులు చేసిన పరిశోధనలో జపాన్‌ పిల్లలు ఇతర ఆసియా దేశాల పిల్లల కంటే తక్కువ నిద్రపోతారని తేచారు.

ఈ తక్కువ నిద్ర పోవడం అనేది జపనీస్ పిల్లల్లో మూడో నెల నుంచే మొదలవుతుందని తేలింది. '' ఎక్కువ నిద్రపోవడం జపాన్‌లో సోమరితనానికి నిదర్శనం'' అన్నారు జున్ కోహ్యమా

పిల్లలు ఆలస్యంగా నిద్రపోవడం మిగిలిన ప్రపంచంకన్నా ఆసియా దేశాలలో కాస్త ఎక్కువని కోహ్యమా అభిప్రాయపడ్డారు. రాత్రిపూట పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని కోరుకునే తల్లిదండ్రులు దీనికి కొంత వరకు బాధ్యులని ఆయన అన్నారు.

బెడ్ షేరింగ్ జపాన్ సంస్కృతిలో ఒక భాగమని ఆయన అన్నారు. ''తల్లిదండ్రులు బిడ్డలను తమ శరీరంలో భాగమని భావిస్తారు'' అని ఆయన చెప్పారు.

చిన్నారితో బెడ్ షేర్ చేసుకునే వారికి దురలవాట్లు ఊబకాయం లాంటివి ఉండకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BABY SLEEP INFORMATION SOURCE WEBSITE/ KATHRYN O'D

ఫొటో క్యాప్షన్, చిన్నారికి పాలిస్తున్న తల్లి

బెడ్ షేరింగ్‌లో ప్రమాదాలు

బ్రిటన్‌లో లాగా పిల్లలతో రూమ్ షేర్ చేసుకోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంస్థ తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నప్పటికీ, సడన్‌ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS) ప్రమాదాన్ని తగ్గించడానికి, బెడ్ షేరింగ్ మాత్రం వద్దని అంటోంది.

ఒకే మంచం మీద పడుకోవడం వల్ల సడన్‌ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్‌ ఎస్ఐడీఎస్‌కు అవకాశం ఎక్కువని హెచ్చరిస్తోంది.

కానీ, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లో పీడియాట్రిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రష్మీదాస్ మాత్రం బెడ్ షేరింగ్ వల్ల ఎస్ఐడీఎస్ ప్రమాదం ఉంటుందని చెప్పలేమని అన్నారు. బెడ్ షేరింగ్ ప్రమాదాలపై సరైన పరిశోధన జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇలాంటి అంశాలపై పరిశోధనలు సహజంగా అధిక ఆదాయ దేశాలలో జరుగుతుంటాయి. అక్కడ బెడ్ షేరింగ్ కల్చర్ తక్కువ. కానీ, ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న తక్కువ ఆదాయ దేశాలలో అతి తక్కువ ఎస్ఐడీఎస్ మరణాలు నమోదయ్యాయని ఆమె అన్నారు.

''ఎస్ఐడీఎస్ మరణాలకు, సంస్కృతికి కూడా సంబంధం ఉంటుంది'' అని ప్రొఫెసర్ హెలెన్ బాల్ అన్నారు.

ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ లో నివసించే పాకిస్తానీ సంతతి మహిళలలో తల్లిపాలు పట్టించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే, వారిలో మద్యపానం, ధూమపానం అలవాటు తక్కువగా ఉండటం, పిల్లలను వేరే రూమ్‌లో పడుకోబెట్టడం వల్ల వారిలో ఎస్ఐడీఎస్ ఘటనలు చాలా తక్కువగా జరుగుతాయి.

బెడ్ షేరింగ్‌ను ప్రోత్సహించాలని తాను కోరుకుంటున్నానని, కానీ షేర్ చేసుకునే వ్యక్తులు ధూమపానం మద్యపానం చేయకూడదని, ఊబకాయం కూడా ఉండకూడదని రష్మీదాస్ అన్నారు.

జోలె కట్టని తల్లిదండ్రులు కూడా, పిల్లలను ఎత్తుకుని నడవడం ద్వారా వారి అల్లరిని, ఏడుపును మరిపించగలుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలను ఎలా ఎత్తుకోవాలి?

పిల్లలను ఎత్తుకోవడానికి వివిధ సంస్కృతుల్లో వివిధ మార్గాలున్నాయి. వీపుకు జోలె కట్టుకోవడం చాలా కాలంగా ఉంది. విక్టోరియా శకంలో ప్రామ్( పిల్లలను పడుకోబెట్టుకుని వెళ్లే చిన్న బండ్లు)లు కొత్త ట్రెండ్‌గా మారాయి.

రాత్రి పూట పిల్లలకు దూరంగా ఉండటం అనే లోపాన్ని, పగటి పూట పిల్లలను పనిలో, షాపింగ్‌లో తమ వెంట తిప్పుకోవడం ద్వారా తగ్గించ వచ్చని నిపుణులు చెబుతున్నారు.

జోలె కట్టని తల్లిదండ్రులు కూడా, పిల్లలను ఎత్తుకుని నడవడం ద్వారా వారి అల్లరిని, ఏడుపును మరిపించగలుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

''మనిషి ఒక చిన్నారిని ఎత్తుకున్నప్పుడు ఒక రకమైన లయబద్ధమైన కదలికకు శిశువును శాంతింపజేసే శక్తి ఉంది'' అని జపాన్‌లోని రైకెన్ సెంటర్ ఫర్ బ్రెయిన్ సైన్స్‌కు చెందిన కుమి కురోడా చెప్పారు.

మనం పిల్లలను ఎలా చూసుకుంటాం అనే విషయంలో వివిధ సంస్కృతుల మధ్య నిస్సందేహంగా తేడాలే కాకుండా, ఒకే సంస్కృతిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి.

పాశ్చాత్య దేశంలోని పిల్లలను తమ గదిలో పడుకోబెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇటలీలో జరిగిన ఒక పరిశోధనలో దీనిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు.

ఇక తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలా చూసుకుంటారనే దానిపై వ్యక్తిగత పరిస్థితులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ''ఒక్కో కుటుంబంలో ఒక్కో పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇందులో వైవిధ్యం కూడా బాగానే ఉంది'' అని కురోడా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)