చైనా షిన్‌జియాంగ్‌లో నరకం సృష్టించింది... ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గంటర్
- హోదా, బీబీసీ న్యూస్
వీగర్ ముస్లింలు, ఇతర ముస్లిం మైనారిటీలు నివసించే షిన్‌జియాంగ్ రాష్ట్రంలో చైనా మానవాళిపై నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.
వీగర్లు, కజఖ్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని.. వారిపై నిత్యం నిఘా పెడుతోందని, తీవ్రమైన హింసకు గురిచేస్తోందని.. ఐరాస జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో కోరింది.
మానవమాత్రుల ఊహకందని స్థాయిలో చైనా అధికారులు షిన్‌జియాంగ్‌లో నరకాన్ని సృష్టిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నస్ కలామర్డ్ ఆరోపించారు.
''నిర్బంధ శిబిరాల్లో పెద్దసంఖ్యలో వీగర్లు, ఇతర ముస్లిం మైనారిటీలను దారుణ హింసకు గురిచేస్తున్నారు.. వారితో అవమానకరంగా వ్యవహరిస్తున్నారు.. బలవంతంగా వారిపై తమ ఆలోచనలు, సిద్ధాంతాలను రుద్దుతున్నారు.. మానవాళిని ఇది ఎంతగానో కలవరపెడుతుంది'' అని ఆగ్నస్ అన్నారు.
ఇంత జరుగుతున్నా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
''గుటెరస్ ఈ పరిస్థితిని కనీసం ఖండించలేదు. షిన్‌జియాంగ్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ దర్యాప్తునకూ ఆదేశించలేదు'' అని ఆగ్నస్ 'బీబీసీ'తో అన్నారు.
''ఐరాస వ్యవస్థాపక విలువలను కాపాడాల్సిన బాధ్యత గుటెరస్‌పై ఉంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నప్పుడు ఐరాస మౌనం వహించరాదు'' అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో చైనాలో నిర్బంధానికి గురైన 55 మందితో సంభాషించిన వివరాల ఆధారంగా రూపొందించిన 160 పేజీల నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.. వీగర్లు, ఇతర ముస్లిం మైనారిటీలపై చైనా అమానుష నేరాలకు పాల్పుడుతోందనడానికి ఆధారాలున్నాయని చెప్పింది.
నిర్బంధం, భౌతిక స్వేచ్ఛను తీవ్రంగా హరించడం వంటి తీవ్ర నేరాలకు చైనా పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా ఏప్రిల్ నెలలో ఇలాంటి నివేదికే ఇచ్చింది. షిన్‌జియాంగ్‌లో జరుగుతున్న అమానుష నేరాలకు చైనా ప్రభుత్వానిదే బాధ్యతని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆ నివేదికలో పేర్కొంది.
షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో టర్కీ మూలాలున్న ప్రజలపై చైనా మానవ హననానికి పాల్పడిందని కొన్ని పాశ్చాత్య దేశాలు, అక్కడి హక్కుల సంస్థలు కూడా గతంలో ఆరోపించాయి.
''చైనా మానవ హననానికి పాల్పడిందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలను మేం ఇవ్వడం లేదు'' అని ఆమ్నెస్టీ నివేదిక రూపొందించిన జొనాథన్ లోబ్ గురువారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.
అయితే, చైనా ఎప్పటిలాగే వీటన్నిటినీ ఖండించింది. తామేమీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడలేదని చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
షిన్‌జియాంగ్ రాష్ట్రంలో చైనా 2017 నుంచి 10 లక్షల మందికిపైగా వీగర్లను నిర్బంధించిందని.. లక్షల మందిని జైళ్లలో పెట్టిందని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు.
అక్కడి జైళ్లు, నిర్బంధ శిబిరాలలో మానసిక, శారీరక హింస తీవ్రంగా ఉందంటూ ఎన్నో నివేదికలు వచ్చాయి ఇప్పటికే.
బలవంతంగా సంతాన నిరోధక ఆపరేషన్లు చేస్తున్నారని.. గర్భిణులకు అబార్షన్లు చేస్తున్నారని.. షిన్‌జియాంగ్‌లోని ముస్లిం పురుషులను ఇతర చోట్లకు తరలించడం ద్వారా అక్కడ జననాల రేటు తగ్గేలా చేస్తున్నారని... మత బోధకులను లక్ష్యంగా చేసుకుని వారి మతాచారాలకు ఆటంకాలు కలిగిస్తున్నారని చైనాపై ఆరోపణలున్నాయి.
ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో ఇవన్నీ చేయడం సహేతుకం కాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రకాలుగా హింసిస్తున్నారంటే...
వీగర్లను ఎన్ని రకాలుగా హింసకు గురిచేస్తున్నారో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో వివరించింది.
దారుణంగా కొట్టడం, విద్యుత్ షాక్ ఇవ్వడం, స్ట్రెస్ పొజిషన్స్(గోడకుర్చీలు, మెడలో బరువులు కట్టడం వంటి శిక్షలు) వంటివే కాకుండా టైగర్ చైర్‌లో రోజుల తరబడి బంధించడం(శరీరంలో ఏ భాగం కదపడానికి వీల్లేకుండా కుర్చీలో కట్టేయడం) వంటి దారుణ హింసకు గురిచేస్తున్నారని ఆమ్నెస్టీ తన నివేదికలో వెల్లడించింది.
నిద్రపోనివ్వకుండా చేయడం, గోడలకు వేలాడదీసి వదిలేయడం, మైనస్ డిగ్రీల చలిలో ఉంచేయడం, ఏకాంతంగా బంధించడం వంటి హింసాపద్ధతులు అవలంబిస్తున్నారని ఆ నివేదికలో రాశారు.
చైనా చేస్తున్నది మారణహోమమేనంటున్న అమెరికా, బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్ తదితర దేశాలు
చైనా మారణహోమానికి పాల్పడుతోందని అమెరికా ఇప్పటికే ఆరోపించింది.
చైనా మారణహోమం సాగిస్తోందని ప్రకటిస్తూ బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్, లిథువేనియా దేశాల పార్లమెంటులలో తీర్మానాలు కూడా చేశారు.
వీగర్లపై జరుగుతున్న దారుణాలను ఖండిస్తూ యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్, కెనడాలు మార్చి నెలలో చైనా అధికారులపై ఆంక్షలు విధించాయి కూడా.
అయితే, అందుకు ప్రతిగా చైనా ఆయా దేశాలకు చెందిన చట్టసభల సభ్యులు, అధ్యయనకర్తలపై ఆంక్షలు విధించింది.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) నిబంధనలకు సమ్మతిస్తూ చైనా సంతకం చేయకపోవడంతో పాటు ఐసీసీ కేసులను వీటో చేసే అధికారమూ కలిగి ఉండడంతో అంతర్జాతీయ న్యాయ సంస్థలు చైనాను విచారించడమనేది క్లిష్టమైన వ్యవహారమే.
ఇవి కూడా చదవండి:
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైర
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- హైదరాబాద్-విజయవాడ: విమాన ఛార్జీలకు సమానంగా ప్రైవేటు బస్సు టిక్కెట్లు...రవాణా శాఖ ఏం చేస్తోంది
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఈ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని కాపాడ గలిగే నాయకుడెవరు.. భారత్‌కు ఆ అవకాశం ఉందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








