హైదరాబాద్-విజయవాడ: విమాన ఛార్జీలకు సమానంగా ప్రైవేటు బస్సు టిక్కెట్లు...రవాణా శాఖ ఏం చేస్తోంది

లాక్‌డౌన్ కాలంలో ప్రైవేటు బస్సు సర్వీసులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్ కాలంలో ప్రైవేటు బస్సు సర్వీసులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ప్రైవేటు బస్సులో ప్రయాణానికి విమాన ఛార్జీలు వసూలు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రైవేటు ఆపరేటర్లు స్లీపర్ బస్సుల పేరుతో ప్రయాణీకుల నుంచి విమాన ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

ఓ వైపు లాక్‌డౌన్ నిబంధనలు, మరోవైపు కరోనా ఆందోళన ఉండడంతో.. ప్రయాణీకులు ఎంత రేటు అయినా చెల్లించి ప్రయాణాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తోంది.

విజయవాడ-హైదరాబాద్ మధ్య స్పైస్ జెట్ విమాన ప్రయాణానికి మే నెల 30న టికెట్ ఖరీదు రూ.3324 ఉంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు నాని సాయికృష్ణ ట్రావెల్స్‌లో బస్సు టికెట్ ధర రూ.3000 గా ఉంది. అంటే దాదాపు విమాన సర్వీసుతో సమానంగా ఉంది.

‌వాస్తవానికి కొన్ని సర్వీసులు లాక్‌డౌన్ విధించిన సమయాల్లో తక్కువ ధరకు నడుపుతున్నాయి. అయితే, లాక్‌డౌన్ సడలింపు సమయాల్లో ధరలను పెంచుతున్నారు.

లాక్‌డౌన్ కావడంతో ఆర్టీసీ సర్వీసులు తక్కువగా తిరుగుతున్నాయి. దీంతో ప్రైవేటు సర్వీసులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్ కావడంతో ప్రయాణికులు ప్రైవేటు సర్వీసుల మీద ఆధారపడుతున్నారు.

ఎక్కువ మంది సడలింపు సమయాల్లో సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆ సమయంలో మాత్రం ఎక్కువ ధర వసూలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

పైగా అప్పటికప్పుడు వచ్చి టికెట్ కోసం ప్రయత్నిస్తే అదనంగా కూడా తీసుకుంటున్నారని ప్రయాణీకులు చెబుతున్నారు. బస్సు సర్వీసులను కూడా వాటికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారని వాపోతున్నారు.

ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా కుదించడంతో దాదాపుగా ప్రయాణీకులు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు నిర్ణయించిన ధరలకే టికెట్ తీసుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తున్నట్టు కనిపిస్తోంది.

టికెట్ ధరలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రవాణా శాఖలు దృష్టి పెట్టకపోవడం పట్ల పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రైవేటు బస్సు ప్రయాణం కన్నా విమానం ఛార్జీలే నయంగా ఉన్నాయి.
ఫొటో క్యాప్షన్, విజయవాడ-హైదరాబాద్ మధ్య విమానం, బస్సు సర్వీసు ఛార్జీల మధ్య పోలిక

ఒక్కసారిగా పెరిగిన ఛార్జీలు

విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఛార్జి రూ.366. అదే ఇంద్ర బస్సుకి రూ.472 ఛార్జీ వసూలు చేస్తారు. కానీ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడుపుతోంది. దాంతో అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.

ట్యాక్సీలకు కూడా కరోనా కాలంలో డిమాండ్ ఏర్పడడంతో ఛార్జీలు పెంచారు. ముఖ్యంగా సరిహద్దుల్లో పోలీసుల నుంచి ఆంక్షలు ఉండడంతో వాటిని మేనేజ్ చేస్తామనే పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

‘‘హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ ట్యాక్సీ ఎక్కాను. బోర్డర్ చెక్ పోస్టు ఛార్జ్ ఉంటుందంటూ మా దగ్గర రూ.2500 తీసుకున్నారు. మామూలుగా అయితే ఈ-పాస్ వంటివి అవసరం. ఇప్పుడు అవన్నీ వాళ్లే మేనేజ్ చేస్తున్నారు. దాంతో కొంత ఎక్కువయినా ఇచ్చేశాం. దిల్‌సుఖ్ నగర్ వరకూ అంత మొత్తం మాత్రం చాలా ఎక్కువే. అయినా అవసరాల రీత్యా తప్పలేదు.’’ అని హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

ప్రైవేటు సర్వీసులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఫొటో సోర్స్, www.saikrishnatrals.com

ఫొటో క్యాప్షన్, సాయికృష్ణ ట్రావెల్స్ బస్

పోటా పోటీగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు

కరోనా కారణగా విధించిన ఆంక్షలను ఉభయ తెలుగు రాష్ట్రాలు జూన్ మధ్య వరకూ పొడిగించాయి. వాటిని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా ప్రయత్నిస్తున్నట్టు బస్సు ఛార్జీలు చెబుతున్నాయి.

సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ప్రైవేటు బస్సు ఛార్జీ సుమారు రూ.700 నుంచి వెయ్యి లోపు ఉండేది. ప్రస్తుతం దీన్ని వెయ్యి రూపాయల వరకూ పెంచేశారు. ఇక ఏసీ బస్సులు, స్లీపర్ బస్సుల్లో అయితే చెప్పనవసరం లేదు. రెండు, మూడు వేల పై మాటే.

బస్సుల్లో కరోనా జాగ్రత్తల కోసం అంటూ అదనంగా వసూలు చేస్తున్నారని విజయవాడకు చెందిన పి.రమణాచారి బీబీసీతో అన్నారు.

‘‘హైదరాబాద్‌ వెళ్లేందుకు అందుబాటులో ఉన్న బస్సు చూస్తే.. నాని సాయికృష్ణ ట్రావెల్స్ రూ.3వేలు, ఏవీఆర్ ట్రావెల్స్ రూ.2వేలు ఉంది. ఆశ్చర్యం వేసింది. రిటర్న్‌లో విమానం టికెట్ తీసుకున్నాను. అన్నీ కలిపి రూ.4వేలు అయ్యింది. కానీ బస్సు ప్రయాణానికి రూ.3వేలు ఖర్చు చేయాల్సి రావడం నేను ఎన్నడూ ఊహించలేదు. ఒక్కడిని కాబట్టి సరిపోయింది. కుటుంబమంతా వెళితే తడిసిమోపెడయ్యాదేమో.’’ అన్నారు రమణాచారి.

కోవిడ్ సౌకర్యాల పేరుతో ట్రావెల్ సర్వీసులు అదనంగా వసూలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, www.saikrishnatravels.com

ఫొటో క్యాప్షన్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

‘ప్రభుత్వాలకు తెలియకుండా జరగదు..’

ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల రవాణా శాఖ అధికారులకు, నేతలకు ఈ వ్యవహారం తెలియకుండా ఉండదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు ఎం.వేణుమాధవ్ అంటున్నారు.

రవాణా శాఖల సమన్వయ లోపం, అధికారుల్లో అవినీతి, అశ్రద్ధ వంటివి ఇంత విచ్చలవిడి వసూళ్లకు కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఈ దోపిడికి కారణం రవాణా శాఖ అధికారుల ఉదాసీనతే. ఈ స్థాయిలో ఛార్జీలున్నాయన్నది అందరికీ తెలిసినదే. అయినా పట్టించుకోరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూద్దామంటారు. నిజంగా ఫిర్యాదు చేసినా నామ మాత్రపు చర్యలతో సరిపెడతారు. దాని వెనుక పెద్ద లాబీయింగ్, భారీ అవినీతి ఉంటుంది. ’’అని ఆయన పేర్కొన్నారు.

‘ఈ సంగతి మాకు తెలియదు‘

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రైవేటు ఆపరేటర్ల అధిక వసూళ్లు తమ దృష్టిలో లేవని ఏపీ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కానీ ఆ శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు మాత్రం ఈ సమస్య తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.

"ప్రస్తుతం తక్కువ సర్వీసులే నడుస్తున్నాయి. ప్రయాణికులు కూడా చాలా తక్కువ మందే ఉంటున్నారు. దాంతో ఎక్కడైనా అలాంటి వసూళ్ల పర్వం సాగుతోందేమో. మా సిబ్బందితో మాట్లాడి సరిచేస్తాం." అని ఆయన బీబీసీతో అన్నారు.

అధికారులే తమకు సమాచారం లేదని చెబుతుంటే, ఇక ఆపరేటర్లని అదువు చేసేది ఎవరనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)