కేరళ: అమ్మానాన్నలకు తెలియకుండా 11 ఏళ్లు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
కేరళలోని ఓ గ్రామంలో ఒక మహిళ దాదాపు 11 ఏళ్ల పాటు ఒక చిన్న గదిలో బందీగా ఉండి పోయారు. ఆమె ఆ గదిలో ఉంటున్న విషయం ఆ ఇంట్లో ఉంటున్న ఒకే ఒక వ్యక్తికి తెలుసు. కానీ, ఇటీవల ఈ విషయం బయటపడింది.
ఇంతకీ ఆ మహిళ ఏ జైలు శిక్షనో అనుభవించడం లేదు. ఎవరి బలవంతం మీదనో బందీగా మారి, టార్చర్‌కు గురి కాలేదు. మానసిక సమస్యలూ లేవు. మరి ఎందుకు ఆమె ఆ గదిలో బందీ అయ్యారు?
పీకల లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె, ఇంటిని వదిలి పెట్టి, ప్రేమికుడి ఇంట్లో రహస్య జీవితం గడిపారు. అలా ఒకటి కాదు, రెండు కాదు... 11 సంవత్సరాల పాటు అలా అజ్ఞాతంలో ఉండి పోయారు.
వినడానికి నమ్మశక్యంగా లేని ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, WWW.SR.INDIANRAILWAYS.GOV.IN
అసలేం జరిగింది?
ఇది 32 ఏళ్ల రెహమాన్, 28 ఏళ్ల సజితల కథ. పాలక్కాడ్ జిల్లా నెన్మరా పోలీసులు వీరి ఉదంతం మీడియాకు వెల్లడించారు.
''మేం వాళ్లిద్దరినీ ప్రశ్నించాం. ఇద్దరూ ఒకే విషయం చెప్పారు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అనుమానించాల్సింది ఏమీ కనిపించ లేదు'' అని నెన్మారా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ అన్నారు.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం రెండు రోజుల కిందటి వరకు ఎవరికీ తెలియ లేదు. రెహమాన్ సోదరుడు తన అన్నను వితునస్సేరి అనే గ్రామంలో చూశారు. అప్పటికి రెహమాన్ కనిపించకుండా పోయి మూడు నెలలైంది.
రెహమాన్‌ను గుర్తించిన అతని తమ్ముడు వెంటనే ఓ ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. తన అన్న కనిపించకుండా పోయినట్లు తన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అతను వితునస్సేరిలో ఉన్నారని వెల్లడించారు. రెహమాన్ సొంత ఊరికి వితునస్సేరి 8 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
రెహమాన్ సోదరుడు చెప్పిన విషయం అర్ధం చేసుకున్న ట్రాఫిక్ పోలీస్ అతనిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. అక్కడే రెహమాన్ తన కథనంతా వివరించారు.

ప్రేమ కథ
కేరళ అయిలూరులోని కారట్‌పరంబు ప్రాంతంలో ఉండే రెహమాన్, అదే ప్రాంతంలో నివసించే సజిత ప్రేమించుకున్నారు. 2010 ఫిబ్రవరి 2న సజిత రెహమాన్ ఇంటికి వచ్చారు. అప్పుడు రెహమాన్ తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
అప్పటి నుంచి ఆమె ఆ ఇంట్లో రెహమాన్ గదిలో ఏర్పాటు చేసిన మరో గదిలో పదకొండు సంవత్సరాలపాటు నివసించారు. రెహమాన్ గదిలో ఒక యువతి ఉంటున్న విషయం అతని తల్లిదండ్రులు కూడా గుర్తించ లేకపోయారు.
తమ కుమార్తె కనిపించడం లేదంటూ సజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రెహమాన్ కుటుంబంతో పాటు, అనేకమందిని పోలీసులు ప్రశ్నించారు. కానీ, ఆమె జాడ దొరక లేదు.
రెహమాన్ ఎలక్ట్రీషియన్‌గా, ప్లంబర్‌గా పని చేస్తున్నారు. అతని తల్లిదండ్రులు రోజుకూలి చేసుకుని జీవించే వారు. ప్రతిరోజూ వారు కూలికి వెళుతుండే వారు. రెహమాన్ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వెళ్లేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ గదిలో సజిత ఎలా ఉండగలిగారు?
''ప్రతిరోజూ అతను ప్లేట్‌లో అన్నం పెట్టుకుని, తన గదిలోకి వెళ్లి గొళ్లెం పెట్టుకునేవాడు. తన భోజనంలో సజితకు కూడా భాగం ఇచ్చేవాడు'' అని పోలీసులు వెల్లడించారు.
ఆ గదివైపు ఎవరైనా వెళుతుంటే అతను భయపడేవాడని, లోపల ఉన్నా కూడా ఎప్పుడూ తాళం వేసుకుని పడుకునే వాడని పోలీసులు వెల్లడించారు.
''రెహమాన్ తల్లిదండ్రులు రాత్రి పూట నిద్రపోయాక ఆమె కాలకృత్యాలు, స్నానంలాంటి కార్యక్రమాలు చేసేవారు. వాళ్లది మూడు బెడ్రూమ్‌ల తరహాలో ఉండే చిన్న ఇల్లు. ఎవరూ లేనప్పుడు వాళ్లిద్దరు బయట కూర్చునే వారు''అని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ వెల్లడించారు.
''ఇన్నాళ్లు రెహమాన్ తల్లిదండ్రులు కూడా ఆమెను గుర్తించలేక పోయారంటే అదొక మిస్టరీలా అనిపిస్తోంది'' అన్నారు పోలీస్ అధికారులు. ఈ ఏడాది మార్చి నుంచి రెహమాన్ కనిపించకుండా పోయారని వారు తెలిపారు.
''రెహమాన్‌కు ఒక పెయింటింగ్ పని దొరికింది. రెండు నెలలపాటు ఆయన రోజూ పనికి వెళ్లారు. సరిపడినంత డబ్బు చేతికి రాగానే, సజితను తీసుకుని వెళ్లిపోయారు'' అని అధికారులు వెల్లడించారు.
వేరు కాపురం పెట్టాలని రెహమాన్ అనుకున్నారు. అలా ఎందుకు అనుకున్నారో చెప్పడానికి మాత్రం రెహమాన్ ఇష్ట పడలేదని పోలీసులు తెలిపారు.
పదేళ్లకు పైగా సజిత రహస్యంగా ఎలా జీవించారు అన్న విషయం కూడా రెహమానే పోలీసులకు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గదిలో ఎందుకు ఉంచాల్సి వచ్చింది?
వేర్వేరు మతస్తులు కావడం వల్ల పెధ్దలు పెళ్లికి అంగీకరించరేమోనని ఇద్దరూ భయంతోనే రెహమాన్ సజితను రహస్యంగా తన ఇంట్లో దాచి పెట్టి ఉంటారని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారం బయటపడిన తర్వాత కేస్ నమోదు చేసిన పోలీసులు, వారిని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టారు. వారిద్దరి కథ విన్న తర్వాత కోర్టు వారిని విడుదల చేసింది.
తమ ప్రేమ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడటానికి ఆ జంట నిరాకరించింది.
ఇవి కూడా చదవండి:
- స్వలింగ సంపర్కుల గురించి మనకు తెలియని చరిత్ర
- అపర కుబేరులు.. సంపాదనలోనే కాదు ట్యాక్సులు ఎగ్గొట్టడంలోనూ ముందున్నారట
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు
- ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్‌లో జరిగిన పర్యావరణ ఘోరమిది.
- సెంట్రల్ విస్టా ప్రాజెక్టు: ప్రధానమంత్రి కొత్త ఇంటిపై వివాదం ఏమిటి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








