ఇండియా లవ్ ప్రాజెక్ట్: సమాజం నిషేధించిన ప్రేమ కథలను చెప్తున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
- రచయిత, గీత పాండే
- హోదా, బీబీసీ న్యూస్
భారతదేశంలో మతాంతర, కులాంతర వివాహాల పట్ల వివక్ష కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రూపొందించిన 'ఇండియా లవ్ ప్రాజెక్ట్' అనే అకౌంట్ కుల, మత, జాతి, లింగ పరమైన సంకెళ్లను తెంచుకుని ఆనందంగా జీవిస్తున్న కొన్ని బంధాలను పరిచయం చేస్తోంది.
భారతదేశంలో చాలా సంప్రదాయ కుటుంబాలలో కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించరు. అయితే, ఇటీవల కాలంలో అలాంటి బంధాల పట్ల మరీ విపరీతమైన విభజిత వాతావరణం కనిపిస్తోంది. ఈ ధోరణి ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య జరిగే వివాహాల పట్ల మరీ ఎక్కువగా ప్రకటితమవుతోంది.
గత నెలలో ప్రముఖ నగల బ్రాండ్ తనిష్క్ ప్రకటనకు సోషల్ మీడియాలో రైట్ వింగ్ నుంచి ఎదురయిన ప్రతిస్పందన మూలంగా సంస్థ ఆ ప్రకటననే ఉపసంహరించాల్సిన పరిస్థితిని చూస్తే ఈ ధోరణి ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో అర్ధమవుతుంది.
తనిష్క్ వారి ఏకత్వం సిరీస్ లో భాగంగా రూపొందించిన ఈ ప్రకటనలో ఒక ముస్లిం అత్తగారు హిందూ కోడలికి సీమంతం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రచారం చేయడమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశం కాగా దానికి స్పందన మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యక్తమయింది.
భారతీయ సమాజంలో దాగి ఉన్న బీటలను అది బహిరంగంగా చూపించింది.
ఈ ప్రకటన లవ్ జిహాద్ ని పెంచి పోషిస్తోందంటూ కొన్ని అతివాద హిందూ వర్గాలు ఆరోపించాయి. మత మార్పిడి చేసే ఉద్దేశ్యంతోనే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లోబరుచుకుని వివాహం చేసుకోవడాన్ని లవ్ జిహాద్ గా పేర్కొంటారు.
సోషల్ మీడియాలో చోటు చేసుకున్నట్రోలింగ్ తో ఆ బ్రాండ్ ని నిషేధించాలని కూడా చాలా మంది పిలుపునిచ్చారు.
తమ సంస్థ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రకటనను ఉపసంహరిస్తున్నామని కంపెనీ ప్రకటన చేసింది.

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
ఈ ప్రకటన పై వివాదం సమసిన రెండు వారాల తరువాత సమర్ హలంకార్ , ప్రియా రమణి అనే జర్నలిస్ట్ దంపతులు మరో రచయత, నీలోఫర్ వెంకట్రామన్ తో కలిసి ఇంస్టాగ్రామ్ లో 'ఇండియా లవ్ ప్రాజెక్ట్' అనే అకౌంట్ ప్రారంభించారు. విభజిత, ద్వేష పూరిత కాలంలో ఆనందంగా జీవిస్తున్న కులాంతర, మతాంతర వివాహ బంధాలను వెలుగులోకి తెచ్చి వాటిలో దాగిన మధురిమను తెలియచేయడమే ఈ పేజీ ఉద్దేశ్యం.
"ఈ ప్రాజెక్టు గురించి గత సంవత్సర కాలంగా ఆలోచిస్తున్నప్పటికీ , తనిష్క్ వివాదం తరువాత దీనిని సత్వరమే మొదలు పెట్టాలనిపించినట్లు హలంకార్ చెప్పారు.
"ప్రేమ, మతాంతర వివాహాల పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారం మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది" అని ఆయన అన్నారు.
"వివాహం చేసుకోవడానికి ఏవో తెలియని రహస్య ఉద్దేశ్యాలు ఉంటాయని, ప్రేమను ఆయుధంగా చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి పెళ్ళి చేసుకోవడానికి ప్రేమ కంటే వేరే ఉద్దేశ్యం ఏముంటుందో మాకు అర్ధం కావడం లేదు" అని ఆయన అన్నారు.
"ప్రజలు తమ కథలను వినిపించడానికి ఇండియా లవ్ ప్రాజెక్టు ద్వారా మేము వేదికను ఇస్తున్నాం" అని చెప్పారు.
వెంకట్రామన్ ఆమె పార్శి తల్లి బఖ్తవర్ మాస్టర్ గురించి చేసిన తొలి పోస్టుతో ఈ ప్రాజెక్టు అక్టోబరు 28న ప్రారంభం అయింది. ఆ తరువాత నుంచి ప్రతి రోజూ ఒక కొత్త కథ ప్రచురితమవుతోంది.
దీనికి వచ్చిన ప్రతిస్పందన తమను ఉక్కిరి బిక్కిరి చేసిందని హలంకార్ అన్నారు. "మేమిప్పుడు వీటిని తట్టుకోవడానికి కష్టపడుతున్నాం. ప్రతి రోజు నా కథ చెబుతాను, మా తల్లి తండ్రుల కథ చెబుతాను, లేదా మా తాతల కథ చెబుతామంటూ చాలా మంది మాకు సందేశాలు పంపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మతాంతర, కులాంతర వివాహాలేమి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కావని, ఇవి ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్నాయనే విషయం తేట తెల్లమవుతోంది" అని ఆయన అన్నారు.
"కానీ, వాటి గురించి బయటకు మాట్లాడవలసిన సమయం అయితే వచ్చింది" అని ఆయన అన్నారు.
"ద్వేషాన్ని కూడా కృత్రిమంగా సృష్టిస్తున్న తరుణంలో ఈ ప్రేమ గాథలు ఎంత దూరం విస్తరించాయో, అవేమీ రాత్రికి రాత్రి పుట్టలేదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
భారతదేశంలో 90 శాతానికి పైగా వివాహాలు పెద్దలు కుదిర్చినవే ఉంటాయి. అందులో చాలా కుటుంబాలు వారి కులం, మతం దాటి సంబంధాలను చూడటం చాలా తక్కువగా ఉంటుంది.
ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అంచనాల ప్రకారం దేశంలో కేవలం 5 శాతం మాత్రమే కులాంతర, వివాహాలు జరుగుతాయి. మతాంతర వివాహాలు జరగడం చాలా అరుదుగా కనిపిస్తుంది. వీటి శాతం కేవలం 2. 2 మాత్రమే.
కొన్ని సార్లు తమ వర్గం దాటి బయట వివాహాలు చేసుకుంటే హత్యలకు గురయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
హిందూ జాతీయ పార్టీ అధికారంలో ఉండటంతో దేశంలో సంప్రదాయ వాదానికి మద్దతు పెరగడంతో పాటు మతపరమైన విభజనలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
మతాంతర వివాహాలు ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిలు వివాహం చేసుకుంటే వాటిని అపకారం తలపెట్టే ఉద్దేశ్యంతోనే చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
లవ్ జిహాద్" అనే పదాన్ని చట్టం నిర్వచించలేదని అలాంటి కేసులను ఏ ప్రభుత్వ సంస్థా రిపోర్ట్ చేయలేదని ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంట్ కి చెప్పింది. ఇటీవల కాలంలో ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చట్టాన్ని తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కనీసం 4 బి జె పి పాలిత ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి.
ఇలాంటి ద్వేష పూరిత కథనాలను ప్రేమపూరిత వ్యక్తిగత కథల ద్వారా సవాలు చేయాలని ఇండియా లవ్ ప్రాజెక్టు చూస్తోంది.
ఈ కథల్లో బోలెడంత మమత ఉంటోందని ఇవి చదువుతున్న పాఠకులు అంటున్నారు.
కాస్త మమకారం, కాస్త హాస్యం కలగలిపి 150 పదాల్లో రాసే ఈ కథల్లో మనుషులు గీసిన సరిహద్దులను ప్రేమ గుర్తించదని నమ్మిన జంటల కథలు ఉంటాయి.

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
హిందూ బ్రాహ్మణ కులానికి చెందిన రూప ఒక ముస్లిం అబ్బాయి రాజి అబ్ధిని వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆమె తల్లి ఎలా ప్రతిస్పందించారో రాశారు.
ఆమె తల్లి వెంటనే, "నీకు అతను మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పి ఇంట్లోనుంచి తరిమేస్తారు" అని రాశారు. ఇస్లాంలో ఉండే విడాకుల పద్దతి పట్ల ఆమె తల్లికి చాలా భయం ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశంలో చట్టవిరుద్ధం.
"అయితే, మా తల్లి తండ్రులు రాజిని కలిసిన తరువాత అతని వ్యక్తిత్వం తెలుసుకున్నాక అతని మీద అభిప్రాయాన్ని మార్చుకున్నారు". అని ఆమె రాశారు.
ఆమె తల్లితండ్రులు వారి వివాహ బంధాన్ని పెద్ద మనసుతో అంగీకరించారని చెప్పారు.
రూప, రాజికి వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఇంట్లోనే ఈద్, దీపావళి కూడా జరుపుకుంటారు.
"మా ఇంట్లో పెరుగన్నం, మటన్ బిరియానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా మతానికి ఇవ్వం అని సల్మా అనే ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్న టి ఎం వీరరాఘవ్ అనే జర్నలిస్ట్ అన్నారు.
"నేను శాకాహారిని. నా భార్యకి మాంసం అంటే ఇష్టం. మా అబ్బాయి అయినేష్ అన్ని రకాలు తింటాడు. ఇంట్లో వండే వంటలకు అనుగుణంగా తన మతం మారిపోతూ ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
వినీత శర్మ అనే హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్న తన్వీర్ ఐజాజ్ వాళ్ళ అమ్మాయి కుహు గురించి పోస్టు రాశారు. అది హిందూ పేరా, ముస్లిం పేరా అని, ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక ఏ కులాన్ని పాటిస్తుందో చెప్పమని చాలా మంది వారిని ప్రశ్నించారు.
"మా మతాంతర వివాహం లౌకికవాదానికి ఆదర్శంగా ప్రజల తప్పుడు అంచనాలకు ఒక సమాధానం చెబుతుందని అనుకుంటున్నాను" అని ఆయన రాశారు.
"మా బంధం పట్ల చాలా మంది మౌనంగానే ఉండిపోయారు. కొంత మంది మాది ప్రేమ అని, లవ్ జిహాద్ కాదని చెప్పడానికి చాలా నిరాశ చెందారు" అని ఆయన రాశారు.
ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కేవలం మతాంతర , కులాంతర వివాహాలే కాకుండా ఇతర కథలు కూడా ఉన్నాయి.
కేరళలో కాథలిక్ మతానికి చెందిన మరియా మంజిల్ ఉత్తరాదిలో జైన కుటుంబానికి చెందిన సదీప్ జైన్ ని వివాహం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, INDIA LOVE PROJECT
వాళ్ళ 22 సంవత్సరాల వివాహ బంధంలో వారెదుర్కొన్న ఎన్నో సవాళ్ళను ఆమె రాశారు. కానీ, ఆయనను వివాహం చేసుకుని తాను సరైన పనినే చేశానని ఆమె రాసారు.
"ప్రేమ నుంచి దూరంగా ఎలా పారిపోగలం" అని ఆమె అంటారు. "నేనతని దయతో కూడిన హృదయం, సున్నితమైన ప్రవర్తన, మేధో అనుకూలత, నా పట్ల చూపించే ప్రేమను చూస్తాను. ఆయన వేరే దేముణ్ణి ప్రార్ధించి, వేరే భాష మాట్లాడతారు కాబట్టి ఆయనను ఎలా వదులుకుంటాను" అని రాశారు.
ఇలాంటి కథలే ప్రపంచం గురించి, దేశం గురించి మంచి భావనలు కలుగ చేస్తాయని హలంకార్ అంటారు.
"ఇవి భారతదేశంలో నిజాయితీ మేళవించిన అందమైన కథలు. ప్రేమలో ప్రజలు విభిన్న మార్గాలు పాటిస్తారు. ఇవే భారతదేశం ఏమిటో గుర్తు చేస్తాయి".
ఇవి కూడా చదవండి:
- వర్చువల్ రియాలిటీకి ఆగ్మెంటెడ్ రియాలిటీకి తేడా ఏంటంటే...
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- తిరుమలలో 80 దాటిన కరోనావైరస్ కేసులు.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన, వెంటనే విరమణ
- క్యాబినెట్ మీటింగ్‌లో అస్వస్థతకు గురై ప్రధాన మంత్రి మృతి
- ‘కరోనావైరస్ చిన్న జలుబు మాత్రమే.. అందరం ఏదో ఒకరోజు చనిపోయేవాళ్లమే’
- నేపాల్ రాజకీయ సంక్షోభం: చైనా రాయబారి నేపాల్ నేతలతో ఎందుకు మాట్లాడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








