కరోనావైరస్: తిరుమలలో 80 దాటిన కోవిడ్ కేసులు.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన, టీటీడీ జోక్యంతో వెంటనే ఉపసంహరణ

ఫొటో సోర్స్, TTD
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిచ్చింది. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలకు వస్తున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది.
అయినప్పటికీ తిరుమలలో పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి.
ఒక్క తిరుమలలోనే ఇప్పటికి 80 మందికిపైగా పాజిటివ్‌గా తేలారు. దిగువన తిరుపతిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం, వారిలో టీటీడీ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో కలవరం మొదలయ్యింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఉద్యోగుల భద్రతకు ఢోకా లేకుండా పరీక్షలు పెంచి, రోగనిరోధక శక్తికి అవసరమైన ఆహారం కూడా అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన.. విరమణ
కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, మండలాల్లో పలు వార్డులు, గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46కు పైగా కంటైన్మెంట్ జోన్లను నిర్ణయించారు.
ఇందులో తిరుమల కూడా ఉంది.
అయితే, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే తప్ప ప్రజలు నివసించే ప్రదేశం కాదని, కరోనాపాజిటివ్ వచ్చిన వారంతా తిరుపతిలో నివాసం ఉండేవారే తప్ప తిరుమలలో ఉండేవారు కాదని.. అలాంటప్పుడు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ఎలా ప్రకటిస్తారని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకవేళ కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలనుకున్నా కనీసం రెండు రోజుల ముందు తమకు సమాచారం ఇవ్వాలని తెలిపింది.
కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని టీటీడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనల నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ల జాబితా నుంచి తప్పిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
దీంతో తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదని, ఒకవేళ ఉదయం నుంచి కంటైన్మెంట్ జోన్ అని టీవీల్లో చెబితే.. దానిని విరమించుకోవాలని టీటీడీ అధికారులు మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు.

ఈ నెలలో దర్శనాలకు ఎంత మంది వచ్చారు?
మార్చి 20 నాడు తిరుమలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చరిత్రలోనే తొలిసారిగా సుదీర్ఘకాలం పాటు తిరుమల ఆలయానికి యాత్రికులు దూరమయ్యారు. అన్ లాక్ నేపథ్యంలో నిబంధనలు సడలించడంతో జూన్ 8నుంచి మళ్ళీ దర్శనాలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటివరకూ నెల రోజుల పాటు సాగిన దర్శనాలలో సుమారుగా 2.5 లక్షల మంది ఆలయానికి తరలివచ్చారు. మొదట కేవలం రోజుకి 6వేల మందికి మాత్రమే అనుమతినిచ్చిన టీటీడీ క్రమంగా ఆ సంఖ్యను పెంచింది. ప్రస్తుతం రోజుకి 12వేల మందికి అవకాశం ఉంది.
దర్శన వేళలను కూడా మొదట ఉదయం 6 నుంచి సాయంత్రం 6గం.ల వరకూ ఉండగా తర్వాత దానిని రాత్రి 8గంటల వరకూ పొడిగించారు. ప్రస్తుతం దానిని రాత్రి 10గంటల వరకూ అవకాశం ఇస్తున్నారు.
అయినప్పటికీ గత మూడు రోజుల లెక్కలు గమనిస్తే సగటున 10వేల మంది సుమారుగా దర్శనాలకు వస్తున్నారు. ఈ నెలలో అత్యధికంగా జూలై 1 నాడు 12,183 మంది దర్శనాలు చేసుకున్నారు. అత్యల్పంగా జూన్ 12న 6,015 మంది మాత్రమే దర్శనాలు చేసుకున్నారు. ఇక లాక్‌డౌన్ కి ముందు మార్చి 19న 42,084 మంది దర్శనాలకు రావడం విశేషం.
గత ఏడాది జూలై 7 నాడు 93,647 మంది తిరుమల దర్శనాలకు వస్తే ఈ ఏడాది జూలై 7న వారి సంఖ్య 10,498 మంది మాత్రమే కావడం గమనార్హం.

ఫొటో సోర్స్, TTD
యాత్రికుల సంఖ్య తగ్గినా తొలగని ఆందోళన
తిరుమలలో సహజంగా కనిపించే యాత్రికుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో తరలివస్తున్న వారి సంఖ్యకు పొంతన లేదు. అయినప్పటికీ భయాందోళన మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే అందరికీ మాస్కులు తప్పనిసరి చేశారు. అలిపిరి, శ్రీవారి పాదాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
కోవిడ్ 19 పరీక్షల కోసం కొందరి శాంపిళ్లను కూడా సేకరిస్తున్నారు. వాహనాలను, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 10సంవత్సరాల లోపు వారిని, 60ఏళ్ల పైబడిన వృద్ధులను నియంత్రిస్తున్నారు. ఇక క్యూ లైన్లలో కూడా పలు మార్పులు చేసి భౌతికదూరం పాటించేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. అన్నప్రసాదం, కళ్యాణ కట్టలో దానికి అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
అయినప్పటికీ కరోనా భయం అందరినీ వెంటాడుతోంది. ముఖ్యంగా సిబ్బంది కలవరపడుతున్నారు. ఇప్పటికే తిరుమలలో 80కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో టీటీడీ విజిలెన్స్ అధికారితో పాటుగా అర్చకులు, మంగళ వాయిద్యకారులు, భద్రతా సిబ్బంది, వంటశాల సిబ్బది కూడా ఉన్నారు. తిరుమల స్థానికులు కూడా కొందరు వైరస్ బారిన పడ్డారు.
పాజిటివ్ కేసులతో అప్రమత్తమయిన యంత్రాంగం
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో టీటీడీ అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలను అలిపిరి వద్ద నిర్వహిస్తున్నారు. అయితే అవి లక్ష్యానికి తగ్గట్టుగా జరగడం లేదని, అందులో యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వేగవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలు ఆదేశాలు జారీ చేశారు.
"టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు పెంచాలి. ముమ్మరంగా చేయాలి. అవసరం ఉన్న వారికి, అనుమానితులకు పరీక్షలు చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రూనాట్ మిషన్లను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించాం. ఇక ఉద్యోగుల భద్రత ముఖ్యం. వారికి సమస్యలు రాకుండా చూడడానికి ఉద్యోగుల క్యాంటీన్ లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని నిర్ణయించాం. ఉద్యోగుల భద్రతపై తగిన శ్రద్ధ పెడుతున్నాం. ఇళ్లకు వెళ్లిన సిబ్బంది వివరాలు కూడా సేకరిస్తున్నాం. వారి ఆరోగ్య పరస్థితిపై ఆరా తీస్తున్నాం" అంటూ ఈవో తెలిపారు.

ఫొటో సోర్స్, TTD
‘ఆ ప్రాంతాల నుంచి దర్శనాలకు రావద్దు’
తిరుమలలో దర్శనాల కోసం వస్తున్న వారందరికీ తగిన పరిస్థితులు కల్పించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ "ఉద్యోగులకు తగిన జాగ్రత్తలు సూచించాము. తిరుపతిలో కరోనా వైరస్ ప్రభావం ఉంది. దాని కారణంగా కొందరు సిబ్బందికి పాజిటివ్ గా నమోదయ్యింది. దాంతో తిరుమలలో కొందరు ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉద్యోగుల భద్రతకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాము. ఖర్చుకు వెనకాడకుండా సిబ్బంది పరీక్షలు, రోగనిరోధక శక్తి పెంచే ఆహారం వంటివి అందించేలా చర్యలు తీసుకున్నాం. భక్తుల, సిబ్బంది భద్రతే మాకు ప్రధానం. దానికి అనుగుణంగానే నెలాఖరు వరకూ భక్తుల సంఖ్య పెంచకూడదని నిర్ణయించాం. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులను క్వారంటైన్‌కు పంపి తగిన వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వారికి వారి నివాస ప్రాంతాల్లోని పరిస్థితులు, కుటుంబ సభ్యుల ప్రయాణాల కారణంగానే కరోనా వ్యాధి వచ్చిందని భావిస్తున్నాం. భక్తులందరూ ముందుగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని దర్శనానికి రావాలి. దేశంలోని రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న భక్తులు దయచేసి దర్శనానికి రాకూడదు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, TTD
టీటీడీ నిర్ణయంపై సిబ్బంది ఆందోళన
తిరుమల కొండలపై విధులకు వచ్చే ఉద్యోగులు అక్కడే ఉండాలనే నిబంధన పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత వెంకటేష్ బీబీసీతో మాట్లాడారు.
"టీటీడీ బోర్డ్ నిర్ణయం సమీక్షించాలి. 14 రోజుల పాటు కొండపైనే ఉండాలంటే కుటుంబాల పరిస్థితి ఏమిటి. ఎవరికైనా ఆరోగ్యం. ఇతర అత్యవసరాల సమయంలో భరోసా ఏమిటీ..కుటుంబాలకు అవసరం అయినప్పుడు తాము దూరంగా ఉంటే సమస్యలు వస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి వెళ్లి రావాలని చెప్పడం సరికాదు. దానిని మార్పు చేయాలి. ఇప్పటికే కరోనా కేసుల ఆందోళన అందరిలో ఉంది. సిబ్బంది కూడా అప్రమత్తంగానే ఉన్నారు. అయినప్పటికీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఉద్యోగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. అంతకుమించి సిబ్బందిపై ఒత్తిడి చేసే యత్నం ఉపసంహరించుకోవాలి"అని వెంకటేష్ కోరారు.
ఆలయంలో అదనపు జాగ్రత్తలు
తాజా పరిస్థితులతో కళ్యాణకట్ట, అన్నప్రసాదం, హుండీ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కళ్యాణ కట్ట వద్ద క్షౌరవృత్తిదారులకు ప్రత్యేక ప్లాస్టిక్ తెరలు ఏర్పాటు చేశారు. అన్నప్రసాదంలో అందరూ చేతి గ్లౌజులు ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీవారి ఆలయం వద్ద ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వ్యాధి కారక క్రిముల నుండి ఎలాంటి హాని కలుగకుండా నిర్మూలించేందుకు ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఆలయంలోనికి ప్రవేశించే రెండు మార్గాలలోనూ ఏర్పాటు చేశారు. ఇందులోని హైడ్రాక్సిల్ ఫ్రి ర్యాడికల్ ఐయాన్ స్ప్రెయింగ్ చేయడం వలన వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఇవికూడాచదవండి:
- ఇస్లామాబాద్హిందూఆలయనిర్మాణానికిలైన్క్లియర్
- ‘బహుమతులతోబురిడీ.. అమ్మాయిలనుఎరవేసిబ్లాక్మెయిలింగ్.. ఇదీచైనాఎత్తుగడ’
- అమెరికాఆధిపత్యంపోతుందా? చైనాసూపర్పవర్అవుతుందా? కరోనావైరస్తోతెరవెనుకజరుగుతున్నయుద్ధాలేమిటి?
- అమెరికా - చైనావాణిజ్యయుద్ధంలోగెలుపుఎవరిది?
- అమెరికా-చైనావాణిజ్యయుద్ధం: ఆర్థికవ్యవస్థలోకిమరింతనగదునుచొప్పిస్తున్నచైనా
- చైనాతో 1962లోజరిగినయుద్ధంలోభారత్కుఅమెరికాఅండలేకుంటేఏమయ్యేది?
(బీబీసీతెలుగునుఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోఫాలోఅవ్వండి. యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి.)








