నేపాల్ రాజకీయ సంక్షోభం: చైనా రాయబారి నేపాల్ నేతలతో ఎందుకు మాట్లాడుతున్నారు?

ఫొటో సోర్స్, HOU YANQI/TWITTER
నేపాల్ అధ్యక్షుడు వీడీ భండారి, ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రత్యర్థి మాధవ్ కుమార్‌లతో నేపాల్‌లోని చైనా రాయబారి హావ్ యాంకీ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ ప్రధాన మంత్రి ఝాలా నాథ్ ఖనాల్‌ను కూడా హావ్ మంగళవారం ఉదయం కలిసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో చైనా రాయబారి జోక్యం చేసుకుంటున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఓలితో భారత్ విభేదాలు, భారత్-నేపాల్ సరిహద్దు వివాదాల నడుమ ఈ జోక్యాన్ని భారత ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది.
గత శుక్రవారం నుంచి చైనా రాయబారి.. ఐదుగురు అగ్ర నాయకులను కలిసినట్లు అధికారిక వర్గాలు బీబీసీకి తెలిపాయి. మాధవ్‌తో సమావేశం మినహా.. మరే ఇతర సమావేశానికి సంబంధించి ఇటు నేపాల్ నాయకులు గానీ, అటు చైనా రాయబారి కార్యాలయం గానీ ప్రకటనలు విడుదల చేయలేదు.
మాధవ్‌తో చైనా రాయబారి సమావేశమైతే అయ్యారని చెప్పగలను కానీ.. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదని సీపీఎన్-యూఎంఎల్ విదేశీ విభాగం ఉపాధ్యక్షుడు బిష్ణు రిజల్.. బీబీసీ నేపాలీస్ సర్వీస్‌తో చెప్పారు.
సమావేశాలు, చర్చల నడుమ.. సోమవారం జరగాల్సిన అధికారిక కమ్యూనిస్టు పార్టీ ముఖ్య సమావేశం రద్దయింది. ఓలి రాజీనామా ప్రక్రియ దీనిలో ఓ కొలిక్కి వస్తుందని వార్తలు వచ్చాయి. అధినాయకత్వంలో మార్పుతోపాటు పార్టీ చీలిపోతుందనీ వార్తలు వచ్చాయి.
సీపీఎన్ నేతలతో చైనా రాయబారి ఇలా కలవడం ఇదేమీ తొలిసారి కాదు. మే నెలలోనూ ప్రధాని ఓలిపై వ్యతిరేకత పెరిగినప్పుడు ఇలాంటి సమావేశాలు జరిగాయి. దీనికి సంబంధించి చాలా చర్చ కూడా నడిచింది.
"రాజకీయ సంక్షోభం నడుమ సీపీఎన్ నాయకులు, చైనా రాయబారి సమావేశం కావడం చాలా ఊహాగానాలకు తావిస్తోంది. అయితే దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోకూడదు" అని త్రిభువన్ యూనివర్సిటీ అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధిపతి కేసీ ఖడ్గా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Etienne Oliveau/Getty Images
పెరుగుతున్న చైనా ప్రభావం
2006లో భారత్ సాయంతో అధికారంలోకి వచ్చిన నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీలోని కొన్ని వర్గాల్లో ప్రస్తుతం చైనా ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్‌పై నేపాల్ ప్రజల్లో అభిప్రాయాలు మారడమే దీనికి కారణమని సీనియర్ పాత్రికేయుడు యుబ్‌రాజ్ ఘిమిరే వ్యాఖ్యానించారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలపై వివాదం అనంతరం తమ ప్రభుత్వాన్ని భారత్ సాయంతో కొందరు కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని ఓలి పార్లమెంటులో ఆరోపించారు. ప్రధాని ఆధారాలు చూపించాలని లేదా రాజీనామా చేయాలనే అప్పుడు తన సొంత పార్టీలోని నాయకులే డిమాండ్ చేశారు.
కాట్‌మాండూలోని హోటళ్లలో భారత గూఢచారుల కోసం సోదాలు చేపట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి.
"పరిస్థితి ఏమిటి? సీపీఎన్ చీలిపోతే భారత్‌దే బాధ్యత. పార్టీ పటిష్ఠంగా ఉందంటే చైనాకే క్రెడిట్ దక్కుతుంది"అని రచయిత, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కనక్ మణి దీక్షిత్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
విదేశాల ఆదేశాల అనుసారంగా నేపాల్ రాజకీయాలు నడుస్తున్నాయన్న వార్తలను సీపీఎన్ అధికార ప్రతినిధి ఖాజీ శ్రేష్ఠ తోసిపుచ్చారు. "నేపాల్ ఒక సార్వభౌమ దేశం. మా నిర్ణయాలు మేం తీసుకోగలం. అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం. మాకు ఇష్టం లేదు కూడా"
అయితే, చైనా రాయబారి సమావేశం గురించి ప్రస్తావించగా, నా ట్వీట్ ఓ వ్యక్తిని ఉద్దేశించి చేసినది కాదని వివరణ ఇచ్చారు.
"తనను పదవి నుంచి తప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. ఇప్పుడేమో సీపీఎన్ పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు చైనా రాయబారి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నేనైతే అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోగలమని, వేరే జోక్యం అవసరంలేదని అంటాను"అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, నేపాల్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని తోసిపుచ్చలేమని పాత్రికేయుడు యుబ్‌రాజ్ ఘిమిరే వ్యాఖ్యానించారు. భారత్ అనుసరించిన విధానాలే దీనికి కారణమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, RSS
"తమ అంతర్గత భద్రతకు మావోయిస్టులు పెద్ద ముప్పుగా భావిస్తున్న ప్రభుత్వమే... పక్క దేశంలోని మావోయిస్టు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని అనుకుంటోంది. సముద్రంతో సంబంధం లేకుండా అన్ని వైపులా వేరే దేశాలే ఉన్న ఒక చిన్న దేశానికి దిగ్బంధం విధిస్తే.. ప్రజల్లో అభిప్రాయం మారకుండా ఎలా ఉంటుంది? ఈ పరిణామాలకు రాజకీయ నాయకులు దూరంగా ఎలా ఉండగలరు?"అని యుబ్‌రాజ్ ప్రశ్నించారు.
సరిహద్దు వివాదాలతో నేపాల్‌లో భారత్ వ్యతిరేక భావజాలం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గత కొన్ని సంవత్సరాల్లో నేపాల్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. నేపాల్‌తో బంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఆసియాలో తన ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకోవాలని చైనా భావిస్తోంది.
ప్రస్తుతం నేపాల్‌లో చైనా ఏం చేస్తుందో.. అదే పనిని భారత్ ఎప్పుడో చేసిందని యుబ్‌రాజ్ వ్యాఖ్యానించారు. అయితే నేపాలీలు మాత్రం రెండు దేశాల జోక్యం అవసరంలేదని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామాబాద్ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








