మత మార్పిడి: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేందుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు హరియాణా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలులోనున్న ఇదే తరహా చట్టంపై హరియాణా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
నికితా తోమర్ హత్యపై హరియాణా అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు.
‘‘నికితా తోమర్ కేసును లవ్ జిహాద్ కోణంలోనూ విచారణ చేపట్టాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు సూచించాం. ఇటీవల కాలంలో బలవంతపు మత మార్పిడికి సంబంధించి చాలా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని మేం చాలా సీనియస్‌గా తీసుకుంటున్నాం’’అని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో ఆయన చెప్పారు.
అక్టోబరు నెలలో హరియాణాలోని బల్లభ్‌గఢ్‌కు చెందిన కాలేజీ విద్యార్థిని నికితా తోమర్‌ను తౌసిఫ్ కాల్చిచంపాడు. తౌసిఫ్ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ఈ కేసు నేపథ్యంలో.. మత మార్పిళ్లను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని అనిల్ విజ్ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోని చట్టాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.
గత ఏడాది హమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన మత స్వేచ్ఛ చట్టం-2019 సవరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, UNIVERAL IMAGES GROUP VIA GETTY
చట్టం ఏం చెబుతోంది?
హిమాచల్ ప్రదేశ్‌లో మత మార్పిళ్లకు సంబంధించిన చట్టంపై సీనియర్ జర్నలిస్టు అశ్వినీ శర్మ బీబీసీతో మాట్లాడారు. ‘‘కొండ ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయన్న వార్తల నడుమ 2006లో వీరభద్ర సింగ్ ప్రభుత్వం మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది’’అని ఆయన చెప్పారు.
‘‘అయితే, ఈ చట్టంపై కొన్ని క్రైస్తవ మిషనరీలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశాయి. హైకోర్టులో కూడా సవాల్ చేశాయి. 13ఏళ్ల తర్వాత దీనికి తాజాగా సవరణ తీసుకొచ్చారు. చట్టాన్ని మరింత కఠినంగా మార్చారు’’అని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/GETTY
మూడు నుంచి ఏడేళ్లకు పెంపు
చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేవారికి విధించే శిక్షను.. ఇక్కడి ముఖ్యమంత్రి జయ్ రామ్ ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నుంచి ఏడేళ్లకు పెంచింది. ఈ చట్టానికి గతేడాది ఆమోదం లభించింది. అన్ని పార్టీలు ఈ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
మత స్వేచ్ఛ చట్టం-2019లో ఎనిమిది కొత్త నిబంధనలు తీసుకొచ్చారని శర్మ వివరించారు. కేవలం మత మార్పిడే లక్ష్యంగా పెళ్లిని చేసినట్లయితే, ఆ పెళ్లి చెల్లదని నిబంధన కూడా వీటిలో ఉంది.
‘‘పెళ్లికి ముందు లేదా తర్వాత ఒక వ్యక్తి మతం మారినా లేకపోతే పెళ్లికి ముందు లేదా తర్వాత భాగస్వామి మతం మారేలా చేసినా.. ఆ పెళ్లి చెల్లదు’’అని చట్టంలో పేర్కొన్నారు.
చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం. ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా లేదా ఒత్తిడితో లేదా ప్రలోభపెట్టి లేదా మాయ మాటలు చెప్పి, లేదా కుట్ర పూరితంగా మతమార్పిడికి పాల్పడటం నేరం.
ఒకవేళ షెడ్యూలు కులూలు, షెడ్యూలు తెగలకు చెందిన వారిని, మహిళలను మత మార్పిడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
ఇలాంటి మత మార్పిళ్లు నిజంగా జరుగుతున్నాయా లేదో తెలుసుకోవాల్సిన అవసరముందని సీనియర్ అడ్వొకేట్ విరాగ్ గుప్తా వ్యాఖ్యానించారు. ‘‘ఒకవేళ జరిగితే, ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి గురించి వదంతులు చాలా ఎక్కువగా వస్తుంటాయి’’అని ఆయన అన్నారు.
‘‘సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చేలా కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. వీటి కింద కేసులు నమోదు చేస్తే బెయిలు కూడా తీసుకోవడం కుదరదు’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NurPhoto/Getty images
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..
ఒడిశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో ఈ మతమార్పిడి వ్యతిరేక చట్టాలు.. ఒక్కోలా ఉన్నాయని విరాగ్ చెప్పారు. ‘‘చాలా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ల ద్వారా ఇస్లాంలోకి మారుస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వీటినే లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు’’అని ఆయన వివరించారు.
‘‘మత మార్పిడికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ అనే కొత్త కోణం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య వివాహాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇదొక రాజకీయ అంశంగా మారిపోతోంది. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఈ విషయం గురించి కావాలనే చర్చ తీసుకొస్తున్నారు’’అని సీనియర్ పాత్రికేయుడు నీరజా చౌధరి వ్యాఖ్యానించారు.
‘‘పశ్చిమ బెంగాల్, బిహార్, అసోంలలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో 2022లో ఎన్నికలు జరగనున్నాయి. మత మార్పిళ్లు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల నడుమ అణచివేత పెరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛపై దాడులు జరుగుతాయి’’అని చౌధరి చెప్పారు.
‘‘అయితే, ఇలాంటి వ్యాఖ్యలతో హిందూ ఓటర్లను ఏకం చేయాలని భావిస్తున్నారు. కానీ అలా జరగదు. ఎందుకంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుంటాయి. ముఖ్యంగా తమ పిల్లలను మత మార్పిళ్లు చేస్తారేమోనని పెద్దలు భయపడుతుంటారు. అదే సమయంలో తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉండదేమోనని యువత భావిస్తారు. ఇలా రెండు కోణాల్లోనూ ఆలోచించే వారుంటారు’’అని ఆయన వివరించారు.
అదే సమయంలో మత మార్పిడికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలాంటి చట్టాలు అమలులో ఉండాలని విరాగ్ గుప్తా వివరించారు. ‘‘లేకపోతే రాష్ట్రాల మధ్య తేడాలు వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఇలాంటి చట్టాలు దేశం మొత్తం ఒకేలా ఉండాలి. కేంద్రం ఒక చట్టం తీసుకురాకపోతే.. రాష్ట్రాలు తమకు నచ్చిన విధంగా చట్టాలు తీసుకొస్తాయి. దీంతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








