కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్నాక శరీరం 'అయస్కాంతం'లా మారిపోయిందన్న వ్యక్తి.. టీకాకు దీనికి సంబంధం లేదన్న నిపుణులు

మహారాష్ట్రకు చెందిన అరవింత్ సోనార్ తాను వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత శరీరం అయస్కాంతంలా ఇనుము, స్టీల్ వస్తువులను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ARVIND SONAR

ఫొటో క్యాప్షన్, ఒంటికి అతుక్కున్న స్టీల్ వస్తువులతో అరవింద్ సోనార్
    • రచయిత, ప్రవీణ్ ఠాక్రే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

కరోనా వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత కొంతమందికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. కొంతమంది చేతులు నొప్పి పెడుతున్నాయని, గాఢంగా నిద్ర వస్తోందని అంటున్నారు. మరి కొంతమంది తమకు ఏ రకమైన ప్రభావాలు కనిపించడం లేదని చెప్తున్నారు.

అయితే, నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక విచిత్రమైన విషయం చెప్పారు. వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత తన శరీరం అయస్కాంతంలా మారిపోయిందని అరవింద్ సోనార్ అంటున్నారు.

ఇనుప వస్తువులు, నాణేలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది శరవేగంగా వైరల్ అయ్యింది.

"ఓరోజు మా అబ్బాయితో మాట్లాడుతుంటే వ్యాక్సీన్ వేయించుకున్న వారిలో కొంతమందికి స్టీల్ వస్తువులు శరీరానికి అతుక్కుంటున్నాయని చెప్పాడు. ఇదేదో తమాషాగా ఉందనిపించి నేను కూడా ప్రయత్నించా. స్టీల్ వస్తువులు నా శరీరానికీ అతుక్కుంటున్నాయి. నా శరీరం అయస్కాంతంలా వాటిని ఆకర్షిస్తోంది" అని అరవింద్ వివరించారు.

ఓ పది రోజుల క్రితం అరవింద్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్నారు. తరువాత, ఆయనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదు.

వ్యాక్సీన్ కారణంగా ఒంటికి అయస్కాంత గుణం రావడం అసంభవమని వైద్య నిపుణులు అన్నారు.
ఫొటో క్యాప్షన్, అరవింద్ సోనార్ మాటలను వైద్యనిపుణులు ఖండించారు.

నిపుణులు ఏమంటున్నారు?

అరవింద్ సోనార్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు మార్చి 9న, రెండో డోసు జూన్ 2న వేయించుకున్నారు. పదేళ్ల క్రితం అరవింద్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. రెండేళ్ల నుంచీ డయాబెటిస్ చికిత్స తీసుకుంటున్నారు. తన శరీరానికి ఇనుము, ఉక్కు వస్తువులు అతుక్కోవడం గురించి అరవింద్ తన డాక్టర్‌కు చెప్పారు.

మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే 'అంధ్‌ శ్రద్ధా నిర్మూలన్ సమితి'కి చెందిన డాక్టర్ హామిద్ ధబోల్కర్ ఇలా ఎందుకు జరుగుతుందో వివరించారు.

"భౌతిక శాస్త్రం ప్రకారం శరీరానికి నాణేలు, గిన్నెలు అతుక్కోవడం సాధ్యమే. శరీరంపై ఎక్కువ తేమ ఉన్నా, లేదా అంటుకున్నచోట వాక్యూం కేవిటీ ఉన్నా ఇది సాధ్యపడుతుంది. వ్యాక్సీన్‌కు, దీనికి ఏం సంబంధం లేదు. ఇందులో ఎలాంటి నిజం లేదని మా సంస్థలో పని చేస్తున్నవారు చాలాసార్లు చెప్పారు" అని ఆయన అన్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ సరైన మార్గమని, ఇలాంటి అసత్య ప్రచారాలను నిలువరించాలని ధబోల్కర్ అభిప్రాయపడ్డారు. జేజే మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ తాత్యారావే లహానే కూడా అరవింద్ సోనార్ వాదనలను ఖండించారు.

"ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి కోవిడ్ టీకాలు వేశారు. వ్యాక్సీన్ వలన శరీరం అయస్కాంతంగా మారదు" అని ఆయన స్పష్టం చేశారు.

అరవింత్ సోనార్ శరీరానికి ఎందుకు వస్తువులు అతుక్కుంటున్నాయో తేల్చాలని వైద్య నిపుణులు నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Tushar Kulkarni

ఫొటో క్యాప్షన్, నిపుణులు శరీరానికి వస్తువులు అతుక్కోవడానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

'ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం'

వ్యాక్సీన్ వేయించుకున్న వ్యక్తి శరీరం అయస్కాంతంలా మారిందన్న ప్రచారంపై మీడియా ద్వారా తనకు సమాచారం అందిందని నాసిక్ జిల్లా మెడికల్ ఆఫీసర్ అశోక్ తోరత్ చెప్పారు.

"దీనిపై దర్యాప్తు చేయడానికి మా బృందాన్ని పంపుతున్నాం. మా నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం. తర్వాత ప్రభుత్వ సూచనలను అనుసరించి ఈ విషయాన్ని పరిశీలిస్తాం" అని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వలన ఇలాంటివేవీ జరగవని తోరత్ అన్నారు.

"ఇంతవరకూ నా వైద్య వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అరవింద్ సోనార్ శరీరంలో ఈ మార్పుకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇది పరిశోధించాల్సిన అంశం" అని ఆయన అన్నారు.

శరీరానికి లోహాలు అతుక్కోవడంపై మెటలర్జిస్టులు కూడా అధ్యయనం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సమీర్ చంద్రారాతే అన్నారు.

"కోవిడ్ వ్యాక్సీన్ వల్ల జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయిగానీ శరీరం అయస్కాంతంలా మారదు. ఇలాంటి వదంతులు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అడ్దంకులుగా నిలుస్తాయి. ఆయన శరీరానికి ఇనుప, స్టీల్ వస్తువులు ఎందుకు అతుక్కుంటున్నాయో భౌతిక శాస్త్రవేత్తలు, మెటలర్జిస్టులు పరిశోధించి చెప్పాలి" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)