ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా

ఫొటో సోర్స్, AFP
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
2020 జులైలో అస్సాం పోలీసులకు ఒక అనుమానాస్పద ఫేస్‌బుక్ పేజ్ గురించి ఫిర్యాదు వచ్చింది. ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి పోలీసులకు ఆ సమాచారం అందింది.
ఆ ఫేస్‌బుక్ పేజిలో పిల్లల వీడియోలు, పోస్టులు ఉన్నాయని.. ఈ పేజ్ పిల్లల లైంగిక వేధింపుల వీడియోలు లేదా CSAM(చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్)ను ప్రోత్సహిస్తుండవచ్చని ఆ స్వచ్ఛంద సంస్థ తమ ట్విటర్ పేజిలో అఫ్రమత్తం చేసింది. ఈ కేసు దర్యాప్తును అస్సాం సీఐడీ చేపట్టింది.
అదే క్రమంలో గువాహటికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో 28 ఏళ్ల యువకుడిని పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద వదిలేశారు. అతడు ఆ ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
నిందితుడి మొబైల్లో కూడా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు లభించాయి. కానీ అతడు ఆ ఆరోపణలను తోసిపుచ్చాడు.
CSAM పోస్ట్ చేయడం, ప్రసారం చేయడం, అలాంటి వాటిని తమ దగ్గర ఉంచుకోవడం భారత్‌లో చట్టవిరుద్ధం.

కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.
"నేను పిల్లల లైంగిక వేధింపుల వీడియోలు ఎప్పుడూ డౌన్లోడ్ చేయలేదు. వాటిని ఎప్పుడూ షేర్ చేయలేదు, అవి నా దగ్గర లేవు" అని ఆయన చెప్పారు.
కానీ, ఆ యువకుడు ఆ ఫేస్‌బుక్ పేజి ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేశారని.. యాప్స్ ఉపయోగించి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ ఇతరలకు పంపించడానికి ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆ ఫేస్‌బుక్ పేజిలో ఒక టెలిగ్రామ్ యాప్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే, అది ఒక టెలిగ్రామ్ చానల్‌లోకి తీసుకెళ్తుంది.
రష్యా నుంచి బహిష్కరణకు గురైన పావెల్ డురాఫ్ రూపొందించిన సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌కు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ప్రధానంగా మెసేజులు పంపించడానికి ఉపయోగించే ఈ యాప్‌లో చానల్స్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీని ద్వారా జనం తాము చెప్పాలనుకున్నది, పంపాలనుకున్నది ఎంతమందికైనా చేరవేయొచ్చు.
ఈ యాప్‌తోపాటూ, ఇతర యాప్స్ ద్వారా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ షేర్ అవుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ యువకుడు కూడా టెలిగ్రామ్ చానల్ ద్వారా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. కానీ అది జరిగేలోపే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ డబ్బు ఇతడి వరకూ ఎలా చేరుతుంది అనేది తమకు ఇంకా స్పష్టంగా తెలియడం లేదని పోలీసులు చెప్పారు.
"ఆ వీడియోలు చూసిన తర్వాత, కొన్ని రాత్రుళ్లు నాకు సరిగా నిద్ర పట్టలేదు" అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అస్సాం సీఐడీ అడిషనల్ ఎస్పీ గీతాంజలి డోలే చెప్పారు.
ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో ఉన్న ఫేస్‌బుక్ పేజీకి సంబంధించిన కేసు కోర్టులో ఉంది.

చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ పెరుగుతోంది
ఒక రిపోర్ట్ ప్రకారం కరోనా మహమ్మారికి ముందు 2018లో ప్రతి రోజూ 109 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యేవారు.
భారత్‌లో కరోనా మహమ్మారి సమయంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ ఆన్‌లైన్ డిమాండ్, వ్యాప్తి పెరిగినట్లు తేలిందని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, పోలీసులు చెబుతున్నారు.
"మహమ్మారి సమయంలో ఇది 200 నుంచి 300 శాతం పెరిగింది" అని భారత సైబర్ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తున్న కేరళ స్టేట్ పోలీస్ సైబర్ డోమ్ చీఫ్ మనోజ్ అబ్రహాం అన్నారు.
కేరళ సైబర్ డోమ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌కు సంబంధించిన వివరాలు సేకరించడంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుంది.
ఆన్ లైన్‌లో భారత్‌లో తయారవుతున్న చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ వీడియోల వ్యాప్తి పెరిగిందని మనోజ్ అబ్రహామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"మహమ్మారి సమయంలో మేం చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కి సంబంధించిన స్థానిక కంటెంట్ పరిశీలించాం. అందులో మలయాళ మనోరమ కాలండర్ లాంటివి.. కేరళలో కానీ, భారత్‌లో ఇంకెక్కడైనా కానీ తీసిన వీడియోలు అని గుర్తు పట్టేలా ఎన్నో వస్తువులు కనిపించాయి" అని మనోజ్ అబ్రహాం చెప్పారు.
అంటే, పిల్లల లైంగిక వేధింపుల వీడియోలు కేరళలో లేదా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. వీటిలో చాలా వీడియోలను ఇంట్లోనే చిత్రీకరిస్తున్నారన్న అనుమానాలున్నాయి.
"ఆ వీడియోలను ఇళ్లలో తీసినట్లు మేం గుర్తించాం. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయికి దగ్గరగా ఉంటున్న వారే ఇలాంటి వీడియోలు, కంటెంట్ రూపొందిస్తూ ఉండొచ్చు" అంటారు అబ్రహాం.
"నిజానికి కోవిడ్ వల్ల చిన్నారులకు అందే పోలీసు సాయంపైనా ప్రభావం పడింది. కోవిడ్ సమయంలో పోలీసు శాంతిభద్రతల విధుల్లో చాలా బిజీగా ఉండిపోయారు. చాలా మంది పోలీసులు కూడా కోవిడ్ బారిన పడ్డారు" అని పిల్లల హక్కుల కార్యకర్త మిగుల్ దాస్ క్విహా అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి
రాకపోకలపై నిషేధం, ఆన్‌లైన్ ఉపయోగించే పిల్లల సంఖ్య పెరగడం వల్ల, పీడోఫైల్స్ ఆన్‌లైన్ సెక్సువల్ గ్రూమింగ్ కూడా పెరగవచ్చు అని 2020 ఏప్రిల్లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు హెచ్చరించారు.
దానితోపాటూ కరోనా కాలం వల్ల చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ లైవ్ స్ట్రీమింగ్ పెరగవచ్చని, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ ఉత్పత్తి, పంపిణీ పెరగడానికి కారణంక వచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ గ్రూమింగ్ అంటే సోషల్ మీడియా ద్వారా పిల్లలతో స్నేహం చేయడం, తర్వాత వారితో ఒక భావోద్వేగ బంధం ఏర్పరుచుకోవడం, తర్వాత కెమెరా ముందు లైంగిక కార్యకలాపాలు చేసేలా వారిని ఆశపెట్టడం.
2020లో అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిసింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సైబర్ టిప్‌లైన్‌కు దాదాపు రెండు కోట్ల ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌కు సంబంధించిన ఒక రిపోర్ట్ లభించింది. వాటిలో సీసామ్ సంబంధిత కంటెంట్ కూడా ఉంది.
ఆ రిపోర్ట్ ప్రకారం అలాంటి కంటెంట్‌లో 2019తో పోలిస్తే 28 శాతం పెరుగుదల కనిపించింది. భారత్ ఈ జాబితాలో అన్నిటికంటే పైన ఉంది. ఈ పెరుగుదలకు కారణాలు వెతకడం పెద్ద కష్టం కాదు. సుదీర్ఘ కాలంగా ఇళ్లలోనే ఉంటుండడం వల్ల పిల్లలు ఆన్‌లైన్లో ఉండడం పెరిగింది.
దీనితోపాటూ ఆన్‌లైన్‌లో పీడోఫైల్స్(పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ ఉన్నవారు) సంఖ్య కూడా పెరిగిందని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, అధికారులు చెబుతున్నారు.

ప్రమాదకర స్థితిలో పిల్లలు
ఆగస్టు ప్రారంభంలో ముంబయిలోని ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సిద్దార్థ్ పిళ్లై దగ్గరకు ఒక 16 ఏళ్ల కుర్రాడు ఒక సమస్యతో వచ్చాడు.
తన పదేళ్ల చెల్లెలిని ఎవరో మొదట ఒక గేమింగ్ యాప్ ద్వారా, తర్వాత ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా గ్రూమింగ్ చేశారని అతడికి మొబైల్ చాట్ ద్వారా తెలిసింది.
"ఇలాంటి కేసులు మొదట హాయ్, హలోతో ప్రారంభమవుతాయి. తర్వాత మాటలు, మెచ్చుకోవడం లాంటివి ఉంటాయి. అంటే 'ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటా' అని చెప్పడం లాంటివి చేస్తారు. మెల్ల మెల్లగా ఆ సంభాషణ అసలు విషయం దగ్గరికి వస్తాయి" అని ఆరంభ్ స్వచ్ఛంద సంస్థకు చెందిన సిద్దార్థ్ పిళ్లై చెప్పారు.
"ఇది ఒక క్లాసిక్ గ్రూమింగ్ స్ట్రాటజీ. అక్కడ గ్రూమ్ చేసే వ్యక్తి పిల్లల సున్నితత్వాన్ని తగ్గించడానికి, లేదా తొలగించడానికి ప్రయత్నిస్తాడు" అని అతడు చెప్పాడు.
2019 డిసెంబర్, 2020 జూన్ మధ్య ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ సంస్థ ఒక రీసెర్చ్ చేసింది. అందులో
భారత్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ ఉపయోగించేవారిలో 90 శాతం పురుషులు, ఒక శాతం మహిళలు ఉన్నారని, మిగతావారిని గుర్తించడం సాధ్యం కాలేదని వెల్లడించింది.
వీరిలో ఎక్కువ మంది స్కూల్ సెక్స్ వీడియోలు, లేదా టీన్ సెక్స్ లాంటి కంటెంట్ మీద ఆసక్తి చూపిస్తున్నారని, చాలా మంది తమ లొకేషన్ దాచడానికి, చట్టాల నుంచి తప్పించుకోడానికి తమ భద్రత కోసం వీపీఎన్ ఉపయోగిస్తున్నారని తేలింది.

నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఇలాంటి చాలా వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, వీపీఎన్, ఫైల్ షేరింగ్ అప్లికేషన్ లాంటి వాటిల్లో షేర్ చేస్తారు.
"వీటిలో చాలా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ 'డార్క్ వెబ్'లోని క్లోజ్డ్ చాట్ రూమ్స్‌లో కూడా షేర్ అవుతుంది. అక్కడ క్రయవిక్రయాల కోసం బిట్ కాయిన్ ఉపయోగిస్తుంటారు" అని అధికారులు చెబుతున్నారు.
'డార్క్ వెబ్' అంటే ఎన్నో చట్టవిరుద్ధమైన వ్యాపారాలను నడిపే ఇంటర్నెట్‌లోని ఒక కార్నర్.
మనం ఉపయోగించే ఇంటర్నెట్ వెబ్ ప్రపంచంలో ఒక చిన్న భాగమే. దీనిని 'సర్ఫేస్' అంటారు. దీని కింద దాగిన ఇంటర్నెట్‌ను 'డీప్ వెబ్' అంటారు. డీప్ వెబ్‌లో సాధారణ సెర్చ్ ఇంజన్‌లో వెతకలేని పేజీలు వస్తాయి. అంటే యూజర్ డేటాబేస్, స్టేజింగ్ స్థాయికి సంబంధించిన వెబ్‌సైట్, పేమెంట్ గేట్‌వే లాంటివి వస్తాయి.
ఈ డీప్ వెబ్‌లో డార్క్ వెబ్ అనేది ఒక కార్నర్. ఇక్కడ గుర్తు తెలియని కొన్ని వేల వెబ్‌సైట్లు ఎన్నో బ్లాక్ మార్కెట్లు నడిపిస్తుంటాయి.
ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారంలో విక్రయించేవారికి, వాటిని కొనేవారి వివరాలు తెలీవు. అలాగే కొనుగోలు చేసేవారికి అమ్మే వాళ్లు ఎవరో తెలీదు.
"ఈ కంటెంట్ షేర్ చేసేవారు, మేసేజింగ్ యాప్స్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్‌ను షేర్ చేసేవారి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇదంతా ఒక వ్యవస్థీకృత ముఠా లాంటివి చేసే పనులు కాదు" అని అధికారులు చెబుతున్నారు.
అంటే, "ఒక గ్యాంగ్ రావడం, పిల్లలను మభ్యపెట్టి కిడ్నాప్ చేయడం, వారితో ఇలాంటి ఘోరాలు చేయడం లాంటివి ఉండవు" అంటారు మనోజ్ అబ్రహామ్.
కేరళ పోలీస్ స్పెషల్ వింగ్ 'కౌంటర్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ సెంటర్'లో ఉపయోగించే 'ఐకాకాప్స్'(ICACCOPS) అనే సాఫ్ట్‌వేర్ అధికారులు అనుమానిత దోషుల ఐపీ అడ్రస్‌లు వెతికి పట్టుకోడానికి సాయం చేస్తోంది.

'ఐకాకాప్స్' అంటే ఇంటర్నెట్ క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్ అండ్ చైల్డ్ ఆన్ లైన్ ప్రొటెక్టివ్ సర్వీసెస్.
ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత గత రెండేళ్ల నుంచి ఇప్పటివరకూ దాదాపు 1500 సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించామని, 350 మందిని అరెస్ట్ చేశామని ఒక అధికారి చెప్పారు.
"ఒక తండ్రిగా ఇది చాలా బాధాకరమైన విషయం. మన పిల్లలకు ఇలా జరగాలని మనం కోరుకోం. మేం సీసామ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ పరిశీలిస్తున్నపుడు, మాకు మా పిల్లలు కూడా గుర్తుకొస్తారు" అంటారు ఆ అధికారి.
"ఆ కంటెంట్‌లో ఉన్న బాధిత పిల్లలను గుర్తించి కాపాడడమే మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే, మా దాడుల సమయంలో స్థానిక పిల్లలపై కూడా వేధింపులు జరుగుతున్నట్లు మాకు తెలిసింది" అన్నారు.
దేశంలోనే అభివృద్ధి చేసిన మరో సాఫ్ట్‌వేర్ 'గ్రాప్‌నెల్'ను కూడా ఇదే పనిలో ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఒక హాకథాన్ ద్వారా అభివృద్ధి చేశారు.
ఈ సాఫ్ట్‌వేర్ 'డార్క్ వెబ్'లో ఒక సెర్చ్ ఇంజన్ లాంటిది. అంటే దీన్లో కీవర్డ్స్ టైప్ చేయడం ద్వారా సీసామ్ కంటెంట్ ఉన్న సైట్ల లింకులు లభిస్తాయి. పోలీసులు తర్వాత వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటారు.

ముందున్న దారేంటి
సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్(CSAM), పీడొఫీలియా భారత్‌లో అత్యంత సున్నితమైన విషయం.
పుణెలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేఈఎం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లకు చెందిన ఒక టీమ్ పీడోఫీలియా గురించి అవగాహన కల్పించి, దానిని ఒక మానసిక అనారోగ్యంగా చూడాలని చెప్పే దిశగా ఐదేళ్లకు పైగా పనిచేస్తోంది.
దీని గురించి వివరించడానికి అది సినిమా థియేటర్లలో, ప్రజా రవాణాలో కూడా ప్రచారం నిర్వహించింది.
"లాక్‌డౌన్‌లో ఒక వ్యక్తి చుట్టూ ఒంటరితనం, అనిశ్చితి కమ్మేసినప్పుడు, వారు దాన్నుంచి బయటపడడానికి సెక్సువాలిటీని ఆశ్రయిస్తారు. ముఖ్యంగా ఆ సమయంలో తన చుట్టూ వేరే ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం లేనప్పుడు వారు అలా చేస్తారు" అని ఈ ప్రాజెక్ట్‌లో మనోచికిత్సా విభాగం చీఫ్ డాక్టర్ వాసుదేవ పారాలికర్ చెప్పారు.
"అలాంటి పరిస్థితుల్లో ఒక పీడోఫైల్‌కు కూడా పిల్లల పట్ల లైంగిక కోరికలు పెరగవచ్చు. అయితే, అంత మాత్రాన కోవిడ్ కాలంలో వారు ఎక్కువ సీసామ్ కంటెంట్ చూస్తున్నారని మేం చెప్పడం లేదు" అన్నారు.
"లాక్‌డౌన్ మెల్లమెల్లగా ముగుస్తోంది. కానీ పిల్లల ఆన్‌లైన్ ప్రపంచంలో ఇంకా అలాగే ఉన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్లో ఏం చేస్తున్నారో నిఘా పెట్టాలి. పిల్లలకు ఇంటర్నెట్‌లో ఏది సురక్షితం, ఏది కాదు అనేది నేర్పించాలి. అంతే కాదు, తల్లిదండ్రులు తమ పిల్లల చుట్టూ ఎవరున్నారు అనేది కూడా నిశితంగా గమనిస్తుండాలి" అంటారు మనోజ్ అబ్రహాం.
ఇవి కూడా చదవండి:
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- IPLలో కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










