డేవిడ్ వార్నర్: IPLలో SRH కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించాడు

ఫొటో సోర్స్, GARETH COPLEY-ICC
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియా మొదటిసారిగా టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుపొందింది. ఈ టోర్నీలో 298 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' పురస్కారాన్ని అందుకున్నాడు.
పేలవ ప్రదర్శనను కారణంగా చూపిస్తూ ఒక నెల క్రితమే డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు నుంచి తప్పించింది. కానీ అంతలోనే ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించి వార్నర్ తన సత్తా చాటుకున్నాడు.
విధ్వంసకర ఓపెనర్‌గా వార్నర్ గురించి ప్రపంచం అంతటికీ తెలుసు. టీ20లతో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన వార్నర్, ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లోనూ తన మార్కును చూపెట్టాడు. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటే వార్నర్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని టాప్ బౌలర్లలందరూ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తారు.
దూకుడుగా ఆడుతూ తక్కువ బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేయగల సామర్థ్యం వార్నర్ సొంతం. ఈ సామర్థ్యం కేవలం ఆస్ట్రేలియా జట్టుకు మాత్రమే కాదు, అతను సభ్యుడిగా ఉన్న ఇతర టీ20 జట్లకు కూడా వరంగా మారింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా వార్నర్ విశేషంగా రాణించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
వార్నర్ సారథ్యంలో, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు కూడా వార్నరే. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్‌కు, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
ఈ సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వార్నర్ కెప్టెన్సీ చేశాడు. భారత్‌లో జరిగిన తొలి దశ పోటీల్లో వార్నర్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఆడింది. కానీ గతంలోలాగా ఈసారి వార్నర్ ప్రభావం చూపలేకపోయాడు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో వార్నర్ 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేశాడు. ఇదేమీ మరీ అంత పేలవ ప్రదర్శనేం కాదు. కానీ జట్టును గెలిపించే ప్రదర్శన చేయలేకపోయాడు.
రాజస్థాన్‌తో మ్యాచ్ నుంచి హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్‌ను తప్పిస్తున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. కేన్ విలియమ్సన్‌ను అతని స్థానంలో కెప్టెన్‌గా నియమించారు. ఆ తర్వాత తుది జట్టులోనూ వార్నర్‌కు చోటు దక్కలేదు.
దురదృష్టవశాత్తు, బయోబబుల్‌లో కరోనా కేసులు రావడం వల్ల ఐపీఎల్‌ను వాయిదా వేశారు. యూఏఈలో రెండో దశ ఐపీఎల్ ప్రారంభమయ్యాక సన్‌రైజర్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో వార్నర్ ఉన్నాడు. ఆ మ్యాచ్‌ల్లో వరుసగా 0, 2 పరుగులు చేయడంతో వార్నర్‌ను జట్టు నుంచి తప్పించారు. మిగతా మ్యాచ్‌లకు వార్నర్ స్థానంలో జేసన్ రాయ్‌ని ఆడించారు.
కొన్ని మ్యాచ్‌ల పాటు వార్నర్ వాటర్ బాటిళ్లు, ఎనర్జీ డ్రింకులు అందిస్తూ కనిపించాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లకు కూడా వార్నర్‌కు జట్టులో స్థానం లభించలేదు. ఇక హోటల్‌రూమ్‌లోనే కూర్చొని వార్నర్ మ్యాచ్‌లు చూశాడు. అయితే టోర్నీ చివరి దశకు వచ్చేసరికి వార్నర్ మళ్లీ మైదానంలో కూర్చొని హైదరాబాద్ జట్టును ప్రోత్సహిస్తూ కనిపించాడు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROU
వార్నర్‌ను ఆడించకపోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు నుంచి తప్పించాక కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న వార్నర్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో వార్నర్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ సీజన్‌లో పేలవంగా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
''జట్టుకు కెప్టెన్‌గా ఎవరుండాలో, జట్టులో ఎవరు ఆడాలో అనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. కానీ వార్నర్ లాంటి ఒక గొప్ప క్రికెటర్‌ను ఇలా చేయడం సరైనది కాదు'' అని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
సోషల్ మీడియాలో అభిమానులకు కృతజ్ఞత తెలిపిన వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సపోర్ట్ చేయాలని కోరారు.
''టీమ్ నుంచి నన్నెందుకు తప్పించారో నాకు అర్థం కాలేదు. టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ, కోచ్ ట్రెవర్ బేలిస్, సలహాదారులు వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ, నేను టీమ్‌లో ఎందుకు లేనో అనే సంగతి నాకు అర్థం అయ్యేలా చెప్పి ఉంటే బావుండేది'' అని వార్నర్ వ్యాఖ్యానించాడు.
మనీశ్ పాండే విషయంలో వార్నర్ వ్యాఖ్యలకు ఇది ప్రతీకారమా?
ఈ సీజన్ ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ మనీశ్ పాండేను తప్పించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మనీశ్ పాండేను తప్పించడం పట్ల వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు.
''మనీశ్ అనుభవమున్న క్రికెటర్. అతను నిలకడగా పరుగులు చేస్తున్నాడు. మనీశ్‌ను జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంది. కానీ మనీశ్‌ను పక్కన పెట్టాలనేది కఠినమైన నిర్ణయం. సెలక్షన్ కమిటీ నిర్ణయాలను అంగీకరించడం మాత్రమే మేం చేయగలం'' అని వార్నర్ అన్నాడు.

ఫొటో సోర్స్, FRANCOIS NEL
హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు, వార్నర్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
ఒక అనుభవమున్న ఆటగాడి ఎంపిక విషయంలో కెప్టెన్‌గా తన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బావుండేందని వార్నర్ భావించాడు.
దీంతో పాండేకు వార్నర్ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమైంది. కానీ అతన్ని తప్పించడం వల్లే వార్నర్‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు విబేధాలు తలెత్తలేదు. వార్నర్ ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం వల్ల ఈ విబేధాలు పుట్టుకొచ్చాయని అందరూ భావిస్తున్నారు.
ప్రపంచకప్‌లో బలంగా పుంజుకున్న వార్నర్
కెప్టెన్సీ కోల్పోవడం, జట్టులో చోటు దక్కకపోవడం, ఫామ్ కోల్పోవడం లాంటి అంశాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వార్నర్ ఉద్వేగపూరిత సందేశాలు చూశాక అతని కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు.
కానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వార్నర్‌పై నమ్మకముంచింది. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ, ప్రపంచకప్ జట్టులోకి వార్నర్‌ను ఎంపిక చేసింది.
టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలుపుకుంటూ వార్నర్ ఈ టోర్నీలో 298 పరుగులతో సత్తా చాటాడు. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్‌లో వార్నర్ సరిగా ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో 15 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో రిథమ్‌ను అందుకున్న వార్నర్ 65 పరుగులతో ఆకట్టుకున్నాడు.
కానీ మళ్లీ ఇంగ్లండ్‌పై కేవలం ఒక పరుగుకే అవుటయ్యాడు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ 18 పరుగులే చేశాడు. కానీ వెస్టిండీస్‌తో మ్యాచ్‌కల్లా వార్నర్ తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులతో చెలరేగాడు.
సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 49 పరుగులు, ఫైనల్లో న్యూజీలాండ్‌పై 53 పరుగులు చేసి ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
వార్నర్ గురించి అడిగినప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ ''వార్నర్ పెద్ద ఆటగాడు. ఒక నెల క్రితం కొందరు అతన్ని తప్పించడంతో నేను ఆశ్చర్యపోయాను. నేను అబద్ధం చెప్పను. వార్నర్‌ను నమ్ముతున్నాను'' అని అన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సలహాదారు, మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రపంచకప్‌లో వార్నర్ ప్రదర్శనను ప్రశంసించారు. ''పెద్ద ప్లేయర్లు భిన్నంగా ఎందుకు ఉంటారో వార్నర్ నిరూపించాడు. అవసరమైన సమయంలో ఆస్ట్రేలియా గొప్పగా ఆడింది. దీన్నుంచి యువ క్రీడాకారులు చాలా నేర్చుకోవాలి'' అని లక్ష్మణ్ అన్నారు.
'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు స్వీకరించిన తర్వాత వార్నర్ మాట్లాడాడు. ''నేను ఎప్పుడూ బాగా ఆడాలనే అనుకుంటా. నేను నా బేసిక్స్‌పై మళ్లీ పనిచేశా. హార్డ్, సింథటిక్ పిచ్‌లపై ప్రాక్టీస్ చేశాను. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సరిగా ఆడలేకపోయా.''
''మా టీమ్‌లో గొప్ప ఆటగాళ్లున్నారు. సహాయక సిబ్బంది సేవల్ని విలువ కట్టలేం. అలాగే నా సొంతదేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఇచ్చిన మద్దతును మర్చిపోలేను. జట్టు విజయానికి పాటుపడేందుకు నేనెప్పుడూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తా'' అని చెప్పుకొచ్చాడు.
వార్నర్ పోరాటానికి ఎప్పుడూ మద్దతుగా నిలిచే అతని భార్య సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఐపీఎల్ సందర్భంగా విచారంగా ఉన్న ఫొటోతో పాటు, 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డుతో ఉన్న వార్నర్ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులు పంచుకుంటున్నారు.
తన కెరీర్ ప్రారంభంలో బ్యాడ్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. భారతీయ హిందీ, తెలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యాడు.

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC
భారతీయ పాటలకు వార్నర్‌తో పాటు అతని భార్య క్యాండిస్, ముగ్గురు పిల్లలు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో అలరిస్తుంటారు. వార్నర్ తరచుగా తన అభిమానులు కోరిన పాటలకు డ్యాన్స్ చేస్తాడు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సెలెబ్రిటీగా మారిపోయాడు.
2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు వేలం జరగనుంది. సన్‌రైజర్స్‌కు వార్నర్‌కు మధ్య సంబంధాలు చెడినందున అతను వచ్చే ఏడాది కొత్త జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా, ఆటగాడిగా హైదరాబాద్ జట్టును పటిష్టం చేయడం, యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడం వార్నర్ వల్లే జరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- బ్రిట్నీ స్పియర్స్: ఈ పాప్ గాయని కన్న తండ్రిపైనే కోర్టులో పోరాడాల్సి వచ్చింది ఎందుకు?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉన్నారు
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
- వ్యాక్సీన్ వేయించుకోని వారికి లాక్డౌన్ - ఇల్లు వదిలి బయటకు రావొద్దన్న ప్రభుత్వం
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













