ఉద్దమ్ సింగ్ జనరల్‌ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?

వీపీ హన్స్‌రాణి, ఉజగర్ సింగ్‌

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, 1939లో ఉజగర్ సింగ్‌, వీపీ హన్స్‌రాణిలు పంజాబ్ నుంచి బ్రిటన్ వెళ్లారు
    • రచయిత, వెనెస్సా పియర్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండవ ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుని, తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బ్రిటన్ కామన్‌వెల్త్‌ వైపు మొగ్గు చూపింది.

కార్మికుల కొరత నేపథ్యంలో బ్రిటన్‌లో ఉద్యోగాల్లో చేరిన అనేక మంది వలసవాదులు జాతి వివక్షను ఎదుర్కొన్నారు.

యుద్ధానికి కేవలం కొంతకాలం ముందు బ్రిటన్‌కు వచ్చిన ఇద్దరు స్నేహితులు.. ఆధునిక బ్రిటన్ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

పంజాబ్‌లోని రూర్క కలాన్ అనే చిన్న గ్రామానికి చెందిన వీపీ హన్స్‌రాణి, ఉజగర్ సింగ్‌లు 20 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ బ్రిటన్‌లో అడుగుపెట్టారు.

భారత్‌లో స్వాతంత్ర్య పోరాటానికి సహకరించడమే కాదు.. బ్రిటన్‌లోని ఆసియా ప్రజల మెరుగైన జీవితానికి పునాదులు వేయడంలో కూడా వాళ్లు ఎంతో కృషి చేశారని 'ద 1928 ఇన్‌స్టిట్యూట్‌'కు చెందిన డాక్టర్ నికిత వేద్ చెప్పారు.

భారత స్వాతంత్ర్య పోరాటంతో ప్రేరణ పొందిన వీళ్లిద్దరూ.. యుద్ధం ప్రారంభంకాగానే కోవెంట్రీలో ఇండియన్ వర్కర్స్ అసోషియేషన్ - IWAను ఏర్పాటు చేశారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ చరిత్రలో చీకటి రోజు

ఆరు రోజులు కష్టపడి పని చేస్తే 250 రూపాయలు..

దేశవ్యాప్తంగా ఉన్న శాఖలకు ఇది స్పూర్తినిచ్చింది. వలస కార్మికుల సామాజిక, సంక్షేమ సమస్యలను సవాలు చేసింది.

మాల్కం ఎక్స్ 1965లో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌ను సందర్శించడంతో ఈ సంస్థ పేరు అందరికీ సుపరిచితమైంది.

కానీ మెరుగైన జీవితం కావాలంటే మాటలు కాదు.. చేతల్లో చూపించాల్సిందేనని చాలాకాలం క్రితమే వీపీ హన్స్‌రాణి, ఉజగర్ సింగ్‌లకు అర్థమైంది.

లండన్‌లోని ఇండియన్ వర్కర్ల కమ్యూనిటీలో ఉన్న వీళ్లిద్దరూ 1939లో వెస్ట్ మిడ్‌ల్యాండ్‌కు వెళ్లారు. బర్మింగ్‌హామ్‌లోని ఒక మెటల్ వర్క్స్‌లో వాళ్లకు పని దొరికింది.

"అది చాలా కష్టమైన పని. వేడిగా ఉండేది. చెమటోడ్చాల్సి వచ్చేది. పని పరిస్థితులు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవు. ఆరు రోజులు కష్టపడి పని చేస్తే 250 రూపాయలు వచ్చేవి" అంటూ ఆనాటి పరిస్థితుల గురించి హన్స్‌రాణి గతంలో చెప్పారు.

"మనం కోవెంట్రీకి వెళ్లి ఏదైనా మంచి పని, మంచి జీతం, ఉండేందుకు ఒక చోటు చూసుకుందాం" అని ఉజగర్ సింగ్‌ తనకు సలహా ఇచ్చారని హన్స్‌రాణి చెప్పారు.

Pedlar's certificate

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, వీపీ హన్స్‌రాణి.. ఇంటింటికీ తిరిగి బట్టలు, ఇతర వస్తువులు విక్రయించారు

‘హింసాత్మక గ్రూప్ కాదు’

కొన్ని రోజుల తర్వాత చిరు వ్యాపారిగా పనిచేసేందుకు హన్స్‌రాణి సర్టిఫికేట్ సంపాదించారు.

ఇంటింటికి తిరిగి బట్టలు, ఇతర వస్తువులను ఆయన విక్రయించారు.

ఆ రోజుల్లో 2 పౌండ్ల, 10 షిల్లింగ్స్ (ప్రస్తుతం దాదాపు 210 రూపాయలు)తో టైలు, హ్యాండ్ కర్చీఫ్‌లు, రేజర్ బ్లేడ్లు, షార్టులు, ఒక టేబుల్ క్లాత్ ఎలా కొన్నారో ఆయన గతంలో వివరించారు.

ఆ నగరంపై జర్మనీ దాడి చేసి, బాంబులు వేసినప్పుడు.. వాటి నుంచి తాను, తన స్నేహితుడు ఎలా తప్పించుకున్నారో కూడా ఆయన చెప్పారు.

జర్మనీ ఆకస్మిక దాడి చేసిన రోజు రాత్రి కోవెంట్రీకి బయటున్న ఒక పొలంలో వాళ్లు తలదాచుకున్నారు.

ఇక తిరిగి ఇండియాకు వస్తే.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం ఊపందుకుంటోంది. గాంధీజీ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింస పద్ధతుల్లో ఉద్యమిస్తున్నారు.

కానీ యుద్ధం రావడంతో స్వాతంత్ర్యం దిశగా జరిగే ప్రయత్నాలకు ఆటంకం కలిగింది.

1939లో క్రిస్మస్ రోజున కోవెంట్రీ శివారులోని ఒక ఇంట్లో భావ సారూప్యత కలిగిన వలసవాదులు సమావేశమయ్యారు. వారిలో హన్స్‌రాణి, సింగ్ కూడా ఉన్నారు.

భారత స్వాతంత్ర్య పోరాటం గురించి బ్రిటన్‌లో చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు వాళ్లు అక్కడ సమావేశం అయ్యారు.

భారత్‌లో ఏం జరుగుతోందో బ్రిటన్‌లో ఉన్న ఇండియన్స్‌కు అవగాహన కల్పించడమే కాదు.. పూర్తిస్థాయి స్వాతంత్ర్యం దిశగా ప్రయత్నాలు చేయడం లక్ష్యంగా ఈ సంస్థ ఆవిర్భవించిందని హన్స్‌రాణి మనుమడు అరుణ్ వేద్ చెప్పారు.

వాళ్లది హింసాత్మక గ్రూప్ కాదు. నిరసనలు, ఇతర సంస్థలతో చర్చలు, కూటముల ఏర్పాటు చేసుకోవడంపై అది ఎక్కువగా దృష్టిపెట్టిందని అరుణ్ వేద్ వివరించారు.

ఆజాద్ హింద్

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లోని భారత వలస కార్మికుల్లో చైతన్యం నింపడం కోసం ఐడబ్ల్యూఏ 'ఆజాద్ హింద్ బులెటిన్' నడిపించింది

జర్మనీతో పోరాటం సరే.. మరి బ్రిటన్ సంగతేంటి?

ఆ సంస్థలో సింగ్ కోశాధికారి బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఇండియాలో చదువుకున్న హన్స్‌రాణి.. నెల వారిగా వెలువడే సంస్థ న్యూస్ బులెటిన్ 'ఆజాద్ హింద్‌' ప్రచురణ బాధ్యతలు చూసేవారు.

అది ఎడ్యుకేషన్‌కు సంబంధించిందని అరుణ్ వేద్ అన్నారు. కానీ భారత్‌లో బ్రిటీష్ పాలకుల వంచనను కూడా అందులో ఎలుగెత్తి చాటారు.

"మనం నాజీలతో పోరాడుతున్నాం. జర్మనీ సామ్రాజ్యవాదంతో మరోసారి తలపడుతున్నాం. కానీ బ్రిటన్‌కు కూడా సొంత సామ్రాజ్యం ఉంది. భారతీయులు, ఆఫ్రికన్లు, కరేబియన్ ప్రజలను బ్రిటన్ పాలకులు చిన్నచూపు చూసేవాళ్లు" అని అరుణ్ వేద్ వివరించారు.

ఐడబ్ల్యూఏ, ఇండియన్ లీగ్‌ వంటి గ్రూపులు బ్రిటన్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేశాయి. నిరంతర ప్రయత్నంతో తోటి ప్రయాణికుల మధ్య సంఘీభావాన్ని సృష్టించాయని ఆయన చెప్పారు.

VP Hansrani

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, ఇంటింటికీ తిరిగి వస్తువులు అమ్ముతున్న వీపీ హన్స్‌రాణి

వామపక్ష, ప్రగతిశీల రాజకీయాలు

ఈ తొలితరం మార్గదర్శకులకు సంబంధించిన రహస్య కథలను 'ద 1928 ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌' వెలుగులోకి తీసుకొచ్చింది.

బ్రిటిష్ ఇండియన్ల గురించి పరిశోధన చేసి, వారి సేవలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

దీన్ని గతంలో ఇండియా లీగ్‌గా పిలిచేవాళ్లు. కానీ ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి పని చేయడం మొదలుపెట్టిన తర్వాత దీని పేరు మార్చారు.

ఇంగ్లండ్‌లోని ఈ గ్రూప్‌లో 'ఒకరకమైన రాడికల్ పాలిటిక్స్' ఉన్నాయని డాక్టర్ పిప్పా విర్డీ నాతో చెప్పారు. ఆ సమయంలో పంజాబ్‌లో కొనసాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతో వాళ్లు ప్రేరణ పొందారని వివరించారు.

ఈయన 'కమింగ్ టు కోవెంట్రీ: స్టోరీస్ ఫ్రమ్ ద సౌత్ ఏషియన్ పయనీర్స్' అనే పుస్తకం రాశారు. అలాగే ఈ రిసెర్చ్ ప్రాజెక్టులో పాల్గొన్నారు.

ఈ గ్రూపులో వామపక్ష, ప్రగతిశీల రాజకీయాలు ఉన్నాయి. అవి విస్తృత ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. యుద్ధానికి ముందు ఐడబ్ల్యూఏపై అవి తీవ్ర ప్రభావం చూపించాయని ఆయన అన్నారు.

1942లో ఐడబ్ల్యూఏ మే డే పరేడ్

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, 1942లో కోవెంట్రీలో జరిగిన మే డే పరేడ్‌లో పాల్గొన్న హన్స్‌రాణి

డయ్యర్‌ను కాల్చి చంపిన ఉద్దమ్ సింగ్

ఒక హత్యతో బ్రిటిష్ నిఘా వర్గాల కన్ను ఈ బృందంపై పడింది. ఈ గ్రూప్ నాయకులపై నిఘా పెట్టారు.

1940 మార్చి 13న లండన్‌లోని కాక్స్‌టన్ హాల్‌లో జనరల్ మైఖేల్ ఓ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ కాల్చి చంపారు.

బ్రిటిష్ హయాంలో మైఖేల్ ఓ డయ్యర్‌ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేశారు. 1919 నాటి జలియన్‌ వాలాబాగ్ మారణకాండకు అతనే కారణం. ఈ ఘటనలో వందలాది మంది భారతీయులను బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు.

జలియన్ వాలా బాగ్‌ మరణహోమానికి ప్రతీకారంగా ఉద్దమ్ సింగ్ డయ్యర్‌ను చంపేసి, లొంగిపోయారు.

అయితే, ఆ తర్వాత డయ్యర్‌ను చంపినందుకు ఆయన్ను ఉరి తీశారు.

గతంలో కోవెంట్రీలో జరిగిన ఐడబ్లూఏ సమావేశాలకు ఉద్దమ్ సింగ్ హాజరయ్యారు.

India Office security file

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, ఐడబ్ల్యూఏ నాయకులపై బ్రిటన్ నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి

జనరల్ డయ్యర్ హత్య తర్వాత..

డయ్యర్ హత్య తర్వాత ఈ గ్రూపు గురించి ఎలా రాశారో ఇండియా ఆఫీస్‌ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఇది 'ఉగ్రవాద స్వభావం కలిగిన గ్రూప్ కాదు' అని రిపోర్టులు వచ్చాయి. కానీ హింసాత్మక పద్ధతులకు మద్దతు తెలిపేవాళ్లు ఈ గ్రూపులో చాలామందే ఉన్నారని కూడా చెప్పాయి. ఇతరులు కూడా అలాంటి పద్ధతులు పాటించాలని వాళ్లు ప్రోత్సహించారని ఇండియా ఆఫీస్‌ రికార్డులు చెబుతున్నాయి.

'ఆజాద్ హింద్‌'ను ఇది 'ఒక ఆక్షేపణీయమైన ఉర్దూ బులెటిన్‌'గా అభివర్ణించింది. తన కథనాల్లోని ముక్కుసూటితనం కారణంగా 'ఆజాద్ హింద్‌' భారతీయుల్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని పేర్కొంది.

నిఘా వర్గాల కన్ను తనపై ఉందని హన్స్‌రాణికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు అని ఆయన మనువడు వేద్ చెప్పారు. బ్రిటిష్ లైబ్రరీలో తన తాతకు సంబంధించిన ఫైళ్లను ఆయన కనిపెట్టారు.

నిఘా వర్గాలకు హన్స్‌రాణి టార్గెట్ అయి ఉంటారని వేద్ అనుమానం వ్యక్తం చేశారు.

ఆయన చదువుకున్నారు. అందుకే ప్రసంగాలను ఎక్కువగా ఆయనే రాసేవారు. న్యూస్‌పేపర్‌ను ఎడిట్ చేసి, కార్మికులను ఆర్గనైజ్ చేసేవారు అని అరుణ్ వేద్ వివరించారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు

బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్-1948

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ దేశం రెండుగా విడిపోయింది. దాంతో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇది ఉద్రిక్తతలకు, సమాజంలో విభజనకు దారి తీసింది.

సుమారు కోటి 20 లక్షల మంది శరణార్థులుగా మారారు. మత కలహాల్లో వేలాది మంది చనిపోయారు.

యుద్ధం తర్వాత బ్రిటన్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. దాంతో వీసా లేకుండానే బ్రిటన్‌లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, ఉద్యోగం చేయడానికి కామన్‌వెల్త్ దేశాల ప్రజలకు అవకాశం కల్పిస్తూ బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్-1948 తీసుకొచ్చారు.

కొత్త కార్మికుల రాక, భారత్‌ స్వాతంత్ర్యం లభించడంతో ఇక ఐడబ్ల్యూఏ తన దృష్టిని బ్రిటన్‌లోని వలస కార్మికుల సమస్యలపైకి మళ్లించింది.

ఐడబ్ల్యూఏ కమిటీ

ఫొటో సోర్స్, The 1928 Institute

ఫొటో క్యాప్షన్, 1945లో ఐడబ్ల్యూఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు

వివక్షపై పోరాటం..

వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సంస్థ శాఖలు విస్తరించాయి. వాల్వర్‌హంప్టన్, లండన్‌లోని సౌతాల్‌లో కూడా శాఖలు ఏర్పాటయ్యాయి.

భారత అధ్యక్షుడి సలహా మేరకు స్థానిక సంస్థలన్నీ కలిసి 'ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ గ్రేట్ బ్రిటన్‌'గా ఏర్పడ్డాయని ప్రస్తుత అధ్యక్షుడు అవతార్ సింగ్ చెప్పారు.

1958లో బర్మింగ్‌హామ్‌లో ఐడబ్ల్యూఏ శాఖను ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఆ రోజుల్లో జాతి వివక్ష చాలా దారుణంగా ఉండేదని ఆయన చెప్పారు. చివరికి స్థానిక పబ్బుల్లోకి కూడా రానిచ్చేవారు కాదని అన్నారు. పబ్బులు 'కలర్ బార్ల'ను నిర్వహించేవని చెప్పారు. ఉపాధి, నివాసం విషయంలోనూ ఇలాంటి వివక్ష చూపించారని వెల్లడించారు.

పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలోకి నల్లజాతీయులు, ఆసియా ప్రజలు వెళ్లకుండా తరచూ అడ్డుకునేవారని, వాళ్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు యజమానులు నిరాకరించేవారని ఆయన తెలిపారు.

ఆ రోజుల్లో ఎలాంటి చట్టం లేదు. దాంతో ఎవరైనా జాత్యహంకారాన్ని ప్రదర్శించొచ్చు అని అవతార్ సింగ్ చెప్పారు.

ఈ వివక్షకు వ్యతిరేకంగా ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడం ప్రారంభించింది.

ట్రేడ్ యూనియన్‌ ఉద్యమానికి అండగా నిలిచింది. దాంతో పాటు వివక్షపై పోరాటానికి కట్టుబడింది.

వీడియో క్యాప్షన్, ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?

మాల్కం ఎక్స్.. 'అమెరికాలో కన్నా ఇక్కడే పరిస్థితి దారణంగా ఉంది'

ఐడబ్ల్యూఏ ఆహ్వానంతో అమెరికా రాజకీయ ఉద్యమకారుడు మాల్కం ఎక్స్.. 1965లో స్మెత్‌విక్‌ను సందర్శించారు.

దాంతో తమ ప్రచారానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని అవతార్ సింగ్ చెప్పారు.

కొందరు దీన్ని జాత్యాహంకార ఉద్రిక్తతలకు కేంద్రంగా భావించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను కొని, వాటిని కేవలం తెల్లజాతీయులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని మార్షల్ స్ట్రీట్‌లోని కొందరు ప్రజలు స్థానిక కౌన్సిల్‌ను డిమాండ్ చేశారు.

'నల్లజాతీయులతో చెడుగా ప్రవర్తిస్తున్నారన్న నివేదికలతో కలత చెందాను. అందుకే స్మెత్‌విక్‌లో పర్యటిస్తున్నాను' అని మాల్కం ఎక్స్ ఆనాడు జర్నలిస్టులతో అన్నారు.

ఆయన, ఒక పబ్బుకు వెళ్లి చూడాలని అనుకున్నారు. అందుకే నల్ల జాతీయులను లోపలికి రానివ్వని ఒక బార్‌కు ఆయన్ను తీసుకెళ్లానని అవతార్ సింగ్ చెప్పారు.

ఆ వీధిలో ఉండే ఒక నల్లజాతీయుడితో మాల్కం ఎక్స్ మాట్లాడారు. కేవలం తెల్లజాతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఉన్న పోస్టర్లను ఆయన చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన షాకయ్యారు.

'అమెరికాలో కన్నా ఇక్కడే పరిస్థితి దారణంగా ఉంది' అని ఆయన అన్నారు.

తొమ్మిది రోజుల తర్వాత న్యూయార్క్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాల్కం ఎక్స్‌ను చంపేశారు.

గ్లాస్ విండో

ఫొటో సోర్స్, Stephen Cartwright

బర్మింగ్‌హామ్‌లో ఉద్దమ్ సింగ్ సంక్షేమ కేంద్రం

1970ల్లో దక్షిణాసియాకు చెందిన పురుషులతో పాటు మహిళలను కూడా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దాంతో వాళ్లు కూడా ఐడబ్ల్యూఏలో సభ్యులయ్యారు. మెరుగైన సౌకర్యాల కోసం పోరాడారు.

1974లో లీసెస్టర్ ఇంపీరియల్ టైప్ రైటర్స్ పరిశ్రమలో దాదాపు మూడు నెలల పాటు సమ్మె జరిగింది. ఐడబ్ల్యూఏ మద్దతుతో ఆసియాకు చెందిన వందలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీనికి స్థానిక ట్రాన్స్‌పోర్ట్, జనరల్ వర్కర్స్ యూనియన్ మద్దతు ఇవ్వలేదు.

ఎన్నికల తర్వాత 1964లో హరోల్డ్ విల్సన్ లేబర్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాతేడాది 'రేస్ రిలేషన్స్ యాక్ట్'ను తీసుకొచ్చారు.

మార్పు తీసుకురావడంలో ఐడబ్ల్యూఏ చేసిన ప్రచారం, కృషే కారణమని అవతార్ సింగ్ చెప్పారు.

60ల్లో, 70ల్లో ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా 80ల్లో, 90ల్లో, ఇప్పటికీ కూడా కీలక పాత్ర పోషిస్తూనే ఉందని ఆయన వివరించారు.

ఉద్దమ్ సింగ్ గౌరవార్థం 1978లో బర్మింగ్‌హామ్ హ్యాండ్‌వర్త్‌లోని సోహో రోడ్‌లో ఒక సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని వ్యవస్థాపక ట్రస్టీల్లో అవతార్ సింగ్ కూడా ఒకరు.

'ఆధునిక బ్రిటన్ ముఖచిత్రాన్ని ఐడబ్ల్యూఏ మార్చేసింది' అని ఈ బృందం చరిత్రపై పరిశోధన చేసిన డాక్టర్ తల్విందర్ గిల్ చెప్పారు.

కోవెంట్రీలో ఊపిరి పోసుకున్న ఈ సంస్థ.. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడటంలో ముందుందని ఆయన చెప్పారు.

ఇంపీరియల్ టైప్ రైటర్స్ ఫ్యాక్టరీలో సమ్మె

ఫొటో సోర్స్, University of Leicester

ఫొటో క్యాప్షన్, యూనియన్ మద్దతు లేకున్నా ఈ బృందం దాదాపు మూడు నెలల పాటు సమ్మె కొనసాగించింది

‘పూర్వీకుల త్యాగాల ఫలితమే ఈ తరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు’

పంజాబ్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు తొలినాళ్లలో కోవెంట్రీలో ఐడబ్ల్యూఏకు మార్గదర్శకులుగా నిలిచారు. ఈ ఉద్యమానికి వాళ్లు కట్టుబడి ఉన్నారు. వాళ్లు క్రమంగా ఇండియా లీగ్ నాయకులుగా ఎదిగారు.

ఈ గ్రూప్ ఐడబ్ల్యూఏతో సన్నిహితంగా పనిచేసింది. కానీ దాని నాయకత్వం, సభ్యులు మెట్రోపాలిటన్‌ ఉన్నతవర్గానికి చెందిన వారని డాక్టర్ నికిత వేద్ చెప్పారు.

దీన్ని 1928లో కృష్ణా మీనన్ స్థాపించారు. బెర్ట్రాండ్ రస్సెల్, అన్యూరిన్ బీవన్, హెచ్‌జీ వెల్స్ వంటి వామపక్ష ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.

హన్స్‌రాణి, ఉజగర్ సింగ్‌లు పంజాబ్‌లోని ఒక మారుమూల గ్రామంలో తమకు ఉన్నదంతా అమ్ముకుని, సాహసోపేత యాత్ర చేసి బ్రిటన్ చేరుకున్నారని 'ద 1928 ఇన్‌స్టిట్యూట్‌'కు చెందిన డాక్టర్ నికిత వేద్ చెప్పారు.

వాళ్లు తక్కువగానే చదువుకున్నప్పటికీ బ్రిటన్‌కు చెందిన సాహిత్యవేత్తలు, ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారని డాక్టర్ నికిత వేద్ చెప్పారు.

ఉజగర్ సింగ్‌ మనుమరాలు బారోనెస్ సందిప్ వర్మ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యురాలైందని, యూఎన్ వుమెన్ గ్రూప్‌కు అధ్యక్షురాలిగా చేశారని నికిత వేద్ చెప్పారు.

వందలాది భారతీయ కుటుంబాలు బ్రిటన్‌లో స్థిరపడేందుకు హన్స్‌రాణి, ఉజగర్ సింగ్‌లు సాయం చేశారని అన్నారు.

'పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితంగానే ఇప్పుడు ఈ తరం స్వేచ్ఛ, హక్కులను అనుభవిస్తోంది. మనమంతా వాళ్లకు రుణపడి ఉండాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు' అని నికిత వేద్ అన్నారు.

సర్దార్ ఉదమ్ సింగ్ సినిమాలో వికీ కౌశల్

ఫొటో సోర్స్, facebook/VickyKaushalOfficial

ఫొటో క్యాప్షన్, ఉద్దమ్ సింగ్‌ జీవిత చరిత్రపై 2020లో సర్దార్ ఉద్దమ్ పేరుతో ఒక చిత్రం విడుదలైంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది
వీడియో క్యాప్షన్, బ్రిటన్: పద్నాలుగేళ్ల పాటు ఆహారంపై రేషన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)