చిరపుంజి: బ్రిటిషర్లకు పిచ్చెక్కించి, వందేళ్లకు ముందే ‘విముక్తి’ పొందిన భారతీయ పట్టణం

సోహ్రా జలపాతాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సోహ్రా జలపాతాలు
    • రచయిత, తృష్ణ మహంతి
    • హోదా, బీబీసీ ట్రావెల్

ఉదయం ఆరు గంటలు అవుతోంది. 11 సంవత్సరాల అల్ఫాన్‌కు నిద్రమత్తు ఇంకా వదల్లేదు. కళ్లు నలుపుకుంటూనే బకెట్ పట్టుకుని కొండ దిగాడు.

అల్ఫాన్‌ మాదిరిగానే అక్కడున్న చాలా మంది పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ముందు ఒక పని కచ్చితంగా చేయాలి. కొండ కిందకు నడుచుకుంటూ వెళ్లి వాటర్ ట్యాంక్ నుంచి ఇంటికి కావల్సిన నీటిని తీసుకుని రావాలి.

అంతకు మూడు రోజుల క్రితమే, వర్షానికి వాళ్ల ఇంట్లోకి కాళ్ల మడమల వరకు నీళ్లు వచ్చాయి. ఇంట్లోని సామాన్లు తడిచిపోయాయి. ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు పంపేందుకు ఇంటిల్లిపాదీ అష్టకష్టాలు పడ్డారు.

మేఘాలయలో ఉన్న సోహ్రా పట్టణానికి చిరపుంజీ అనే పేరు కూడా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రాంతాల్లో ఒకటిగా సోహ్రాకు పేరుంది. ఇక్కడ కురిసే వర్షపాతం బ్రిటిష్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయికి తీసుకెళ్లింది. స్థానిక ఖాసీ తెగల్లో చైతన్యాన్ని పెంచి, అక్కడ పర్యటక రంగం అభివృద్ధి జరిగేందుకు దోహదపడింది. కానీ ఇన్నేళ్ల పాటు రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన ఈ ప్రాంతం క్రమంగా ఎండిపోతోంది.

"ఇక్కడ మే 28 నుంచి వర్షం కురుస్తూనే ఉంది’’ అంటూ డేవిడ్ స్కాట్ 1827 జూన్ 10న నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ గవర్నర్ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సోహ్రా పట్టణంలో కురిసే వర్షాల గురించి జరిగిన తొలి ప్రస్తావనల్లో ఇదొకటి.

భార‌త్‌లోని వేడిని తట్టుకోలేని బ్రిటిష్ పాలకులు ఆ రోజుల్లో చల్లని ప్రాంతాల కోసం వెతుకుతూ ఉండేవారు. శీతల ప్రదేశాల్లో నివసిస్తే అనారోగ్యాలు రావని, జబ్బులు నయమవుతాయని బ్రిటిష్ వారు నమ్మేవారు. దాంతో చల్లని వాతావరణంతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉండే ప్రాంతాల కోసం వారు వెతుకుతూ ఉండేవారు. అందుకే డేవిడ్ స్కాట్ సోహ్రా గిరిజన గ్రామానికి వెళ్లారు.

1832లో బ్రిటిష్ ఏజెంట్ టీసీ రాబర్ట్సన్ రాసిన వివరాల ప్రకారం ఈ ప్రాంతం ఖాసీ జాతి తెగలకు నివాసంగా ఉండేది.

వీరు బ్రిటిష్ పాలకులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. సోహ్రాలో వాతావరణం చల్లగా ఉండేది.

1831లో స్కాట్ సూచన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం సోహ్రాలో హిల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. దాన్ని ఈశాన్య రాష్ట్రాల హెడ్ క్వార్టర్‌గా వాడుకుంది.

కానీ ఆ ప్రశాంతమైన చల్లని వాతావరణం ఒక్కసారిగా అనుకోని మలుపు తిప్పుతుందని వారు ఊహించలేదు.

ప్రతి సంవత్సరం మే నుంచి సెప్టెంబరు మధ్యలో రుతుపవనాల కారణంగా మేఘాలయను వర్షాలు ముంచెత్తుతాయి.

సోహ్రాలో దట్టంగా అలుముకున్న మబ్బులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సోహ్రాలో అలుముకున్న మబ్బులు

వర్షాకాలం మొదలుకావడంతోనే ఇక్కడుండే సున్నపు రాయి కొండలు లెక్కలేనన్ని జలపాతాల ప్రవాహంతో కొత్త అందాలు సంతరించుకుంటాయి. వీటిలో భారతదేశంలోనే ఎత్తైన జలపాతాలు కూడా కొన్ని ఉన్నాయి.

దట్టమైన మంచు, పొగ మంచుతో నిండిపోయి ఒక్కొక్కసారి ఈ జలపాతాల చుట్టూ సాలెగూడు దారాలను తలపించేలా సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనస్సులు ఏర్పడుతాయి.

స్థానిక ఖాసీ పురాణాల్లో యక్షిణీలు, భారీ సర్పాల ప్రస్తావన ఉంది.

పచ్చని ఖాసీ కొండలను ఆనుకుని ఉన్న ఈ జలపాతాలు కూడా ఖాసీ పురాణాల్లో చోటు సంపాదించుకున్నాయి.

ఈ కొండలపై తరచూ వర్షం పడుతుంది. ఆ నీరు కిందికి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. కానీ, కొండల పైభాగం మాత్రం పొడిగా ఉంటుంది.

"చిరపుంజి పీఠభూమిని పరిశీలిస్తే ఇక్కడ చాలాచోట్లా గట్టి రాళ్లు బయటపడ్డాయి. వాటి మీద ఒక్క అంగుళం కంటే తక్కువ మట్టి ఉంది. దాంతో నీరు భూమిలోకి ఇంకదు. అది దిగువకు ప్రవహించి వెళ్లిపోతుంది" అని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో హైడ్రో జియాలజిస్ట్ తపన్ చక్రవర్తి చెప్పారు.

"వర్షాలు బాగాపడుతున్నప్పటికీ అక్కడి భూమి నిర్జీవంగా, బంజరు భూమిలా కనిపించడానికి ఉపరితలంపై మట్టి తక్కువగా ఉండటం ఒక కారణమని ఆయన తెలిపారు.

1831లో బ్రిటిష్ వాళ్లు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. వచ్చి రాగానే వారికి వాన స్వాగతం పలికింది. దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. వర్షం లేనప్పుడు కూడా సోహ్రా ఎప్పుడూ మబ్బు పట్టే ఉండేది.

"టేబుళ్లు, కుర్చీలు, బెంచీల లాంటివన్నీ బోల్టులతో బిగించాలి. లేదంటే అవి విరిగిపోతాయి. ఇనుప బోల్టులు వాడకూడదు. వాడితే అవి తుప్పు పట్టి లూజ్ అయిపోతాయి.

పుస్తకాలు చిరిగిపోతాయి. బట్టలు ఎప్పుడూ తేమగానే ఉండి భరించలేని వాసన వస్తూ ఉంటాయి. తేమ వంటింట్లోని ఉప్పును కూడా కరిగించేస్తుంది. మందులు పాడవుతాయి.

ఆహార పదార్ధాలను భద్రపర్చుకోవడం సాధ్యం కాకుండా చేస్తుంది. బియ్యం, పిండి లాంటి వాటిని గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి, వెచ్చగా ఉండే గదిలో భద్రపరుచుకోవాలి" అని ఆ ప్రాంతంలో అప్పట్లో ఉన్న కాథలిక్ మిషనరీలు రిపోర్ట్ చేశాయి.

ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి సోహ్రా నుంచి పరిపాలన సాగించడం కష్టంగా మారింది.

వెలుగు లేక, గదులకే పరిమితమవడంతో, సైనికులు మానసిక ఆందోళనకు గురై మద్యానికి అలవాటు పడేవారు. దాంతో మద్యపానం పెద్ద సమస్యగా మారింది.

కొంత మంది అధికారులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పడంతో అక్కడకు వెళ్లిన మూడేళ్ళలోనే అంటే 1834లో సైనికులను వెనక్కి పిలవాల్సి వచ్చింది.

1864లో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రాన్ని సోహ్రాకు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్లాంగ్‌కు తరలించారు. అది అప్పటి నుంచి బ్రిటిష్ వారు సేద తీరే కేంద్రంగా మారింది.

మేఘాలయ

ఫొటో సోర్స్, Trishna Mohanty

అయితే, స్థానిక ఖాసీ తెగల ప్రజలు మాత్రం ఈ వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటు పడిపోయారు. తుప్పు పట్టకుండా ఉండేందుకు రబ్బర్ చెట్ల వేళ్ళతో బ్రిడ్జిలను నిర్మించారు.

రెండు చివర్లు ఒకదానితో ఒకటి కలిసే వరకు ఆ వేళ్ళను వక్క చెట్ల ఖాళీల మధ్య నుంచి కొన్ని దశాబ్దాల పాటు జాగ్రత్తగా పెరిగేలా చూసేవారు.

ఇక్కడ వీచే గాలులకు గొడుగులు పని చేయవు. దాంతో వెదురుతో, చీపురు గడ్డితో మోకాళ్ల వరకు కప్పి ఉండేలా కవచాలను స్థానికులు అల్లుతారు. అవి తుపాన్లలో కూడా పనికొస్తాయి.

నిరంతరం కురిసే వర్షం చప్పుడు వినపడకుండా సోహ్రాకు దగ్గరలో ఉన్న మాసిన్రం గ్రామస్థులు తమ ఇళ్ల పైకప్పులను గడ్డితో కప్పుతారు.

సోహ్రాలో సగటున 11.43 మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతోంది. 1861లో రికార్డు స్థాయిలో 26.46 మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ వాన నీరు స్టాట్యూ ఆఫ్ లిబర్టీని నడుము లోతు వరకు ముంచేయగలదు. అదే ఏడాది ఒక నెలలో అత్యధికంగా కురిసిన వర్షపాతంగా రికార్డుల్లోకెక్కింది.

1995లో సోహ్రాలో 48 గంటల్లో 2.49 మీటర్ల వర్షపాతం కురిసింది. ఇది కూడా ఒక రికార్డు.

శీతాకాలంలో మాత్రం సోహ్రా విపరీతమైన నీటి కరువును ఎదుర్కొంటుంది. దాంతో స్థానికులు దగ్గరలో ఉండే కమ్యూనిటీ నీటి ట్యాంక్ దగ్గరకు గాని, కొళాయి దగ్గరకు గాని వెళ్లి నీటిని తెచ్చుకోవాలి.

ఈ నీటిని మోసి తెచ్చుకునేందుకు ఇంట్లోనే చేసిన విచిత్రమైన పరికరాలను వాడుతారు.

బట్టలు ఉతుక్కోవడానికి నీటి ప్రవాహం దగ్గరకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, అక్కడికి వెళ్ళడానికి స్థానికులు కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది.

"మా అమ్మ చిన్నప్పుడు నీటిని మోసి తెచ్చేవారు. నేను ఆమె అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. నా పిల్లలు నన్ను అనుసరిస్తున్నారు.

వాళ్లు నాలుగైదు ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఈ పనులు చేయడం మొదలుపెడతారు. వారింకేమి చేయగలరు? ఇక్కడ పిల్లల జీవితంలో ఆటపాటలు పెద్దగా ఉండవు. ఈ నేల మీద పుట్టినందుకు ఇక్కడున్న సమస్యలను పంచుకోవల్సిందే" అని సోహ్రా నివాసి లాకిన్తి చెప్పారు.

మే నుంచి సెప్టెంబరు మధ్య వర్షాకాలంలో మాత్రం ఇంటి పై కప్పుల నుంచి నీరు కారుతూ ఉంటుంది. గదులు నీటితో నిండిపోవడం వింటూనే ఉంటాం. వానాకాలంలో ప్రతిరోజు వర్షంలో తడిచిన వస్తువులను శుభ్రపర్చుకోవడంతోనే చాలా మంది ఖాసీ తెగ ప్రజల జీవితం మొదలవుతుంది.

ఈ పరిస్థితి చూస్తుంటే "ఇంట్లోని వస్తువులను వర్షంలో పాడవకుండా కాపాడుకోవడంలోనే నా సమయమంతా గడిచిపోతోంది" అని 1841లో థామస్ జోన్స్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి.

సోహ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోహ్రా

ఇక్కడ గతం లాగే భవిష్యత్తు కూడా ఆశాజనకంగా కనిపించడం లేదు.

1973 నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది.

గత శతాబ్ద కాలంగా లెక్కిస్తూ వచ్చిన వర్షపాత అంచనాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.

హిందూ మహా సముద్రం ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు, క్షీణిస్తున్న హరితవనాలు, వ్యవసాయ భూముల పెరుగుదల ఈ మార్పులకు కారణం అవుతున్నాయి.

వర్షపాతంలో మార్పులు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రాంతంగా సోహ్రాకు ఉన్న పేరును, ఆ పట్టణానికి దగ్గర్లో ఉన్న మాసిన్రం దక్కించుకుంది.

సోహ్రాలో పర్యటక రంగం అభివృద్ధి చెందడానికి ఇక్కడ వర్షాలే కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ వర్షపాతం తగ్గడం ఈ రంగానికి కష్టాలు తేవచ్చు.

గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాల రాక కూడా ఆలస్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు.

భారత వాతావరణ శాఖ కూడా ఇదే విషయం చెబుతోంది. దాంతో వర్షాధార జలపాతాలు ప్రవహించే సమయం తగ్గిపోతోంది.

"సోహ్రాలో పర్యటక రంగం మనుగడ సాగించాలంటే, జలపాతాలు మాత్రమే కాకుండా అక్కడున్న సంస్కృతి, వెదురు వంతెనలు, సాహస క్రీడల వంటి వాటిపై దృష్టి పెట్టాలి" అని బొటిక్ టూర్ నిర్వాహకుడు జూలీ కాగ్టి చెప్పారు.

రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల మధ్య, సోహ్రాలో జీవితం నిరంతర చెలగాటంలాగే ఉంటుంది. ఒక్క క్షణం ఆశ్చర్యపరుస్తుంది, ఆ మరు క్షణంలోనే అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.

కొన్ని తరాల నుంచి ఖాసీ ప్రజలు ఇక్కడుండే నీటితో ప్రయాణం చేస్తూ, ఇక్కడుండే పరిస్థితుల్లో జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవడాన్ని అతి కష్టంతో నేర్చుకున్నారు.

కానీ ఒక శతాబ్దం ముందే బ్రిటిష్ వారిని ఈ వర్షం అక్కడి నుంచి తరిమేస్తుందని సోహ్రా ప్రజలు ఊహించి ఉండరు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, చుట్టుముడుతున్న సమస్యల మధ్యలో ఖాసీ తెగ ప్రజల తెలివితేటలు వారి భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)