కరోనావైరస్‌పై ఈ ఆదివాసీ తెగ ఎలా విజయం సాధించింది?

ఫొటో సోర్స్, Aikax association
బ్రెజిల్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆదివాసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
కుయికురో అనే ఓ ఆదివాసీ వర్గం మాత్రం ప్రభుత్వ సాయం కోసం వేచిచూడకుండా, కోవిడ్‌ను తమకు తాముగా జయించింది.
ఔషధాల కోసం కుయికురో వర్గం వాళ్లు ముందుగానే విరాళాలు సేకరించుకున్నారు. తమ గ్రామాల్లో లాక్‌డౌన్ విధించుకున్నారు. పూర్వం తట్టు వ్యాధి తమకు నేర్పించిన పాఠాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు.
అధికారిక సమాచారం ప్రకారం బ్రెజిల్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు ఐదు లక్షల మంది ప్రజల్లో... 45 వేల మంది కరోనావైరస్ బారినపడ్డారు. 620 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చని బ్రెజిల్ జాతీయ ఆదివాసీ సంఘం అంటోంది.
బ్రెజిల్‌లో కోవిడ్ బారినపడి దాదాపు 2.95 లక్షల మంది చనిపోయారు. దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో లాక్‌డౌన్‌ను వ్యతిరేకించారు. వ్యాక్సీన్ల ప్రభావాన్ని కూడా కొట్టిపారేశారు. అశాస్త్రీయ చికిత్స పద్ధతులను మాత్రం సమర్థించారు.
ఇక ఎగువ షింగు బేసిన్‌లోని ఎనిమిది గ్రామాల్లో కుయికురో వర్గం వాళ్లు ఉంటున్నారు. వీరి జనాభా దాదాపు 900. వీరిలో ఇప్పటివరకూ దాదాపు 160 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఎవరూ చనిపోలేదు. అందరూ వ్యాక్సీన్ వేసుకున్నారు.
కోవిడ్ మహమ్మారిని తాము సమర్థంగా ఎలా ఎదుర్కొన్నది కుయికురో వర్గం నాయకుడు యనమా కుయికురో బీబీసీ ప్రతినిధి పబ్లో ఉచోవాకు వివరించారు. యనమా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...


ఫొటో సోర్స్, Aikax association
మా గ్రామాల్లో ప్రధాన గ్రామమైన ఇపాట్సేలో నేను ఉంటున్నా. ఈ ఊరి జనాభా 390. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. గత ఏడాది బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నేను వార్తల్లో చూశా. నా సోదరుడు, ఇపాట్సే గ్రామ నాయకుడైన అఫుకాకా కుయికురోతో ఈ విషయం గురించి మాట్లాడా. ఆయన కూడా ఈ వార్తలను చూస్తూ ఉన్నారు.
వైరస్ బారినపడి చాలా మంది చనిపోతుంటే, మేం ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకున్నాం. వైరస్ ఇక్కడివరకూ రాకముందే మా వర్గంవారితో పలు మార్లు సమావేశాలు నిర్వహించాం. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలి? మనకు ఎవరు సాయం చేయగలరు? లాంటి అంశాలపై చర్చించాం.
పూర్వం తట్టు వ్యాధి ఎలా ప్రబలింది? ఎగువ షింగులో ఎంత మందిని బలి తీసుకుంది?... ఇవన్నీ మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పేవారు. ఈ కొత్త వైరస్ గురించి విన్నాక... మా పెద్దలకు అదే మహమ్మారి గుర్తుకువచ్చింది.

ఫొటో సోర్స్, Aikax association
‘మాకు మేం సంఘటితం కావాలి. లాక్‌డౌన్ విధించుకోవాలి’ అని అనుకున్నాం. ప్రభుత్వాన్ని సాయం కోరినా, అది అంత త్వరగా రాదని తెలుసు.
రోగులను విడిగా ఉంచేందుకు ఓ గృహం కట్టాం. కుయికురో సంఘం నాయకులు, నేను వివిధ విశ్వవిద్యాలయాలను, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాం. అమెజాన్ హోప్స్ కలెక్టివ్ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.26 లక్షల విరాళాలు సేకరించాం. ఆక్సీజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఓ డాక్టర్‌ను, నర్సును కూడా మా కోసం నియమించుకున్నాం.
ప్రభుత్వం కోవిడ్ కిట్‌లను (నిర్ధారణ కాని ఔషధాలను) పంచింది. వాటికి శాస్త్రీయత లేకపోవడంతో మేం తీసుకోలేదు. ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా మాకు మేం నిబంధనలను రూపొందించుకున్నాం.

ఫొటో సోర్స్, Aikax association
గ్రామం దాటి వెళ్లొద్దని చెబుతున్నానని, మాస్క్‌లు పెట్టుకోమంటున్నానని, చేతులు కడుక్కోవాలని అంటున్నానని మా వర్గం వాళ్లు కొంత మంది నాపై అప్పుడు కోపంతో ఉన్నారు. నేను అబద్ధాలు చెబుతున్నానని వాళ్లు అనుకున్నారు.
కానీ, వైరస్ మాదాకా వచ్చాక విషయం వారికి అర్థమైంది.
కలాపాలో వర్గం వాళ్లకు మొదటగా వైరస్ సోకింది. కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతం బయట ఉన్న ఆసుపత్రులకు రోగులను తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. ఆసుపత్రులు సరిగ్గా చూసుకోవడం లేదని, తమకు సరైన ఆహారం ఇవ్వడం లేదని రోగులు తమ వాళ్లకు ఆడియో సందేశాలు పెట్టేవారు. కొందరికి మా ఆసుపత్రిలో చికిత్స అందించాం. అయితే, ఎవరికీ ఆక్సీజన్ పెట్టాల్సిన అవసరం రాలేదు.

ఫొటో సోర్స్, Aikax association
జూన్-జులైలో మరో మున్సిపాలిటీ నుంచి వచ్చిన వారి ద్వారా కోవిడ్ మా గ్రామంలోకి ప్రవేశించింది. మా డాక్టర్ ర్యాపిడ్ పరీక్ష చేసి, పాజిటివ్ కేసు గుర్తించారు. ఆ కుటుంబం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. మా గ్రామంలో దాదాపు 160 మంది కోవిడ్ బారినపడ్డారు. అందరూ ఐసోలేషన్‌కు వెళ్లారు. మేం అప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాం. సమీప పట్టణాల నుంచి ఆహార పదార్థాలు సమకూర్చుకున్నాం. రోగులకు చికిత్స అందించే వైద్య బృందం... వారికి వాటిని అందజేసేది.
మరోసారి విరాళాల సేకరణ చేపడితే, రూ.5 లక్షలు వచ్చాయి. చేపలను పట్టే సామగ్రి, కొన్ని రకాల ఆహార పదార్థాలు, మా బోటు కోసం, జనరేటర్ కోసం ఇంధనం తెప్పించుకున్నాం. వాటన్నింటినీ శానిటైజ్ చేశాకే, తీసుకున్నాం.
వ్యాక్సీనేషన ప్రక్రియలో ఆదివాసీలు, ఆరోగ్య నిపుణులు, కిలోంబోలాల (బానిసలుగా ఉన్నవారి వారసత్వ వర్గాల)కు ప్రాధాన్యత ఇస్తామని ఆరోగ్య మంత్రిత్వశాఖ మాకు చెప్పింది. విమానంలో, కారులో, బోటులో ఇలా రకరకాలుగా వ్యాక్సీన్లు ఇక్కడికి వచ్చాయి.

ఫొటో సోర్స్, Aikax association
వ్యాక్సీన్ రావడంతో చాలా ప్రాణాలను కాపాడినట్లైంది. వ్యాక్సీన్లు తీసుకోకూడదని ప్రచారం చేస్తూ ఆదివాసీలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొంత మంది ఆదివాసీలు ఆ మాటలను నమ్మారు కూడా.
కానీ, నేను ఆఫుకాకా వాటిని నమ్మలేదు. మా వర్గం వారితో ఈ విషయమై చాలా మాట్లాడం. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించాం.
మాకు ఇప్పటికే వ్యాక్సీన్ (సినోవాక్) తొలి డోసు ఇచ్చారు. షింగులోని మిగతా వాళ్లకు స్ఫూర్తి కలిగిలే మా ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టాం. అందరూ వ్యాక్సీన్ వేయించుకున్నారు.
వ్యాక్సీన్ వేసుకుంటున్నప్పుడు, నాకు మా నాన్న చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. చరిత్ర, సంస్కృతి ఇచ్చిన జ్ఞానం ఉన్న మా పెద్దల్లో చాలా మందిని తట్టు వ్యాధి బలితీసుకుంది. కానీ, వ్యాక్సీన్ వచ్చాక మరణాలు లేవు.
వ్యాక్సీన్లు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గతంలో మనం చూసిన మహమ్మారుల భయం లేకుండా ఈరోజున మన పిల్లలు ఎదుగుతున్నారు.
మా పోరాటం ఇంకా ముగియలేదు. మా రాష్ట్రం మాటో గ్రోసోలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఐసీయూ పడకలకు కొరత ఉంది. వైరస్ కొత్త వేరియంట్ కారణంగా చాలా మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
నాకు చాలా ఆందోళనగా ఉంది. మళ్లీ మనం ఎలా సంఘటితం కాగలం? ఇక్కడ ఓ చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేయడమే కష్టమైన పని అని నాకు తెలుసు. కానీ బయట ఆసుపత్రుల్లో చాలా మంది చనిపోతున్నారు.
గత ఏడాది, ఈ ఏడాది మా ఊరిలో వాళ్లకు కరోనా సోకితే... మేం ఆ వైరస్‌పై ఇక్కడే విజయం సాధించాం.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








