కరోనావైరస్: ఇండియాలో వ్యాక్సీన్ తయారీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్డంకులు సృష్టిస్తున్నారా

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాల్టీ చెక్ బృందం
    • హోదా, బీబీసీ

కరోనావైరస్ వ్యాక్సీన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, వ్యాక్సీన్ ఎగుమతుల విషయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో భారత్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

భారత్‌లోని అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటన్‌కు అందించాల్సిన వ్యాక్సీన్ డోసులు ఆలస్యం కావొచ్చని స్పష్టం చేసింది.

నేపాల్‌కు సరఫరా చేయాల్సిన డోసుల్లోనూ పెద్ద వాటాను ప్రస్తుతానికి నిలుపుదల చేసింది.

ఎందుకు ఈ పరిస్థితి?

నోవావాక్స్, అస్ట్రాజెనెకా వ్యాక్సీన్లను తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ముడి పదార్థాల కొరత గురించి ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యాక్సీన్ల తయారీకి అవసరమైన ప్రత్యేకమైన బ్యాగులు, ఫిల్టర్ల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించడం సమస్యకు కారణమవుతోందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదార్ పూనావాలా వ్యాఖ్యానించారు.

కణాలను పెంచేందుకు ఉపయోగించే పదార్థం, సింగిల్ యూజ్ ట్యూబులు, ప్రత్యేకమైన రసాయనాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం కష్టంగా మారిందని కూడా ఎస్ఐఐ తెలిపింది.

వ్యాక్సీన్ తయారీకి, అంతర్జాతీయంగా వాటిని సరఫరా చేసేందుకు ఆటంకాలు కలగకుండా జోక్యం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.

జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వ్యాక్సీన్‌ను తయారు చేస్తున్న ‘బయోలాజికల్ ఈ’ అనే మరో భారత సంస్థ కూడా వ్యాక్సీన్ ఉత్పత్తిని ప్రభావితం చేసేలా కొన్ని రకాల కొరతలు ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

అనుకున్న సమయం ప్రకారం ముడి వస్తువులను తమకు అందించే విషయంలో అమెరికా సంస్థలు వేగంగా పనిచేయడం లేదని బయోలాజికల్ ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహిమా దాట్ల చెప్పారు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, AFP

అమెరికా ఎందుకు అడ్డుకుంటోంది?

వ్యాక్సీన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల కొరత ఏర్పడే అవకాశాలున్నాయేమో గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో దేశీయ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు అధ్యక్షుడికి అధికారాలు కల్పించే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (డీపీఏ)ను ఆయన ప్రయోగించారు.

ఈ చట్టం ప్రకారం దేశీయంగా తయారీ పెంచేందుకు వ్యాక్సీన్ తయారీకి అవసరమయ్యే పదార్థాల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు. గత ఏడాది డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా ఈ చట్టం ద్వారా పీపీఈ సామగ్రి ఎగుమతులపై ఆంక్షలు విధించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.

ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం వల్ల అంతర్జాతీయంగా వ్యాక్సీన్ తయారీ దెబ్బతినొచ్చని హెచ్చరించాయి.

కొన్ని వస్తువులకు ప్రత్యామ్నాయాలను మరో చోటు నుంచి తెప్పించుకోవడానికి ఏడాది వరకూ సమయం పట్టొచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి.

‘‘డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నా... మిగతా రంగాల్లో లాగా ఈ రంగంలో కొత్త సరఫరాదారులు దాన్ని అందుకోలేరు. కొత్త సరఫరాదారులు విశ్వసనీయత పొందడం కూడా చాలా కష్టం’’ అని బ్రిటన్‌లోని జాన్ మూర్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణురాలు డాక్టర్ సారా షిఫ్లింగ్ అన్నారు.

అయితే, అమెరికా కూడా కొరతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకుందని ఆమె అభిప్రాయపడ్డారు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్పత్తిపై ప్రభావం

ప్రస్తుతానికి భారత్‌లో రెండు కరోనా వ్యాక్సీన్లకు ఆమోదం లభించింది. ఒకటి ఆక్స్‌ఫర్ట్-ఆస్ట్రాజెనెకా (కోవీషీల్డ్ అని భారత్‌లో పిలుస్తున్నారు)... మరోటి కోవాక్సీన్.

జనవరి ప్రారంభం నుంచి ఎస్ఐఐ కోవీషీల్డ్ 13 కోట్ల డోసులను భారత్‌తోపాటు వివిధ దేశాలకు అందించింది.

దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను చేరుకునేందుకు భారత ఫార్మా సంస్థలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

గత జనవరిలో తాము నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఉన్నట్లు ఎస్ఐఐ తెలిపింది.

మార్చి వరకూ పది కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో ఉన్నట్లు అప్పుడు ఆ సంస్థ చెప్పింది.

అయితే, ఇప్పటికీ ఆ సంస్థ ఆరు, ఏడు కోట్ల డోసుల సామర్థ్యంతోనే పని చేస్తోంది.

ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్ నిల్వలు ఎంతవరకూ ఉన్నాయి? తమ ఉత్పత్తుల్లో ఎంతవరకూ దేశీయంగా వినియోగం అవుతున్నాయి? అనే విషయాలను ఎస్ఐఐ వెల్లడించలేదు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, AFP

దేశీయ అవసరాలు తీరుతున్నాయా?

భారత్ గత జనవరి 16న కరోనా వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటివరకూ 3.7 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇచ్చారు.

ఏడు నెలల్లో 60 కోట్ల డోసులు ప్రజలకు ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే నెలకు 8.5 కోట్ల వ్యాక్సీన్లు వేయాలి.

ప్రస్తుతానికి ఎస్ఐఐకి భారత ప్రభుత్వానికి 10 కోట్ల డోసులు అందించాలన్న ఒప్పందం ఉంది. మరో సంస్థ భారత్ బయోటెక్ కూడా భారత ప్రభుత్వానికి 10 కోట్ల డోసులు అందించాల్సి ఉంది.

రష్యాలోని గామాలెయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో స్పూత్నిక్ వ్యాక్సీన్ 20 కోట్ల డోసుల కోసం భారత్ లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకుంది. ఈ డోసులను భారత్‌లోని సంస్థలు తయారు చేస్తాయి. భారత్‌లో వాడకంతోపాటు విదేశాలకూ వీటిని ఎగుమతి చేస్తారు.

దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంగీకారంతో తమ సంస్థకు కోవీషీల్డ్‌పై ఆమోదం వచ్చినట్లు ఎస్ఐఐ చీఫ్ ఆదార్ పూనావాలా గత జనవరిలో సంకేతాలు ఇచ్చారు.

అయితే, కోవీషీల్డ్ కోసం తాము చేసుకున్న ఒప్పందం అమలవుతుందా అని బంగ్లాదేశ్ వివరణ కోరినప్పుడు... ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలూ లేవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, AFP

భారత్ వ్యాక్సీన్లు ఎవరెవరికి చేరుతాయి?

అల్ప, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సీన్ అందాలన్న లక్ష్యంతో ఐరాస చేపట్టిన కోవాక్స్ కార్యక్రమం కోసం కూడా ఎస్ఐఐ వ్యాక్సీన్లు అందించాల్సి ఉంది.

కోవాక్స్‌కు ఆస్ట్రాజెనకా లేదా నోవావాక్స్ వ్యాక్సీన్లలో ఒకదాన్ని 20 కోట్ల డోసులు సరఫరా చేసేందుకు గత సెప్టెంబర్‌లో ఎస్ఐఐ అంగీకారం తెలిపింది.

ఐరాస సమాచారం ప్రకారం ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 90 కోట్ల డోసులకు, నోవావాక్స్ 14.5 కోట్ల డోసులకు ఎస్ఐఐ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.

ఇక భారత ప్రభుత్వం కొన్ని దేశాలకు, ముఖ్యంగా దక్షిణాసియాలో తమ పొరుగు దేశాలకు వ్యాక్సీన్లను దానం చేసింది.

ఐరాస సమాచారం ప్రకారం ఇప్పటివరకూ చైనా కన్నా ఎక్కువగా భారత్‌యే 80 లక్షల డోసులను ఇలా దానం చేసింది. చైనా 73 లక్షల డోసులను ఇలా ఇతర దేశాలకు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)