కోవిడ్ వ్యాక్సీన్: ఇండియాలో ఇంతవరకు ఎంతమందికి కరోనా టీకా వేశారు?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమంలో భాగంగా 2 కోట్ల మందికిపైగా భారతీయులు ఇప్పటికే కనీసం ఒక డోస్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నారు.
కరోనావైరస్ మహమ్మారి విజృంభణ మొదలైనప్పటికీ భారత్‌లో 1.1 కోట్లకుపైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటు 1,57,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైంది భారత్‌లోనే.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు తగ్గినప్పటికీ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ పెరుగుతున్నట్లు ఆయా రాష్ట్రాల గణాంకాలు చెబుతున్నాయి.
పంపిణీ ఎలా సాగుతోంది?
భారత్‌లో కరోనావైరస్ టీకా పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైంది.
మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట‌్ లైన్ సిబ్బందికి మాత్రమే వ్యాక్సీన్ వేశారు.
భారత్‌లో మొట్టమొదటి టీకా వేయించుకున్న అవకాశం ఓ పారిశుద్ధ్య కార్మికుడికి దక్కింది.
మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటినవారికి.. అలాగే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి టీకా వేయడం ప్రారంభించారు.
టీకా వేయించుకోవడమనేది పూర్తిగా స్వచ్ఛందం. ఎవరినీ బలవంతం చేయరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేస్తున్నారు.
అదే ప్రయివేట్ ఆసుపత్రులలో అయితే రూ. 250 చెల్లించి టీకా వేయించుకోవచ్చు.

భారత్‌లోని ఔషధ నియంత్రణ మండలి రెండు రకాల టీకాలకు పచ్చజెండా ఊపింది. అందులో ఒకటి ఆస్ట్రాజెనకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ కాగా రెండోది భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్.
పలు ఇతర వ్యాక్సీను వివిధ ప్రయోగ దశలలో ఉన్నాయి.
భారత్ వ్యాక్సీన్ల తయారీకి ప్రధాన కేంద్రం. ప్రపంచ అవసరాలలో 60 శాతం వ్యాక్సీన్లు భారత్‌లోనే తయారవుతాయి.
టీకాలు తయారుచేసే సంస్థలు భారత్‌లో ఆరుకిపైగా ఉన్నాయి.
భారత ప్రధాని 70 ఏళ్ల నరేంద్ర మోదీ మార్చి 1న వ్యాక్సీన్ తీసుకున్నారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్ టీకాను ఆయన వేయించుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇంతవరకు ఎంతమందికి టీకా వేశారు?
మార్చి 10 వరకు ఉన్న లెక్కల ప్రకారం 2 కోట్ల మందికి పైగా భారతీయ జనాభా కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారు.
జులై చివరి నాటికి కనీసం 25 కోట్ల మందికి 50 కోట్ల డోసుల టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే టీకా పంపిణీ వేగం పెంచకపోతే అనుకున్న ప్రకారం జులై చివరినాటికి లక్ష్యం చేరుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి 10 లక్షల జనాభాలో టీకా వేయించుకున్నవారి సంఖ్యను కొలమానంగా తీసుకుంటే కేరళలో టీకా వేయించుకుంటున్నవారి సగటు ఎక్కువగా ఉంది.
మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేరళలో టీకా కోసం డిమాండ్ అధికంగా ఉంది.

ఇప్పటివరకు టీకా వేయించుకున్న 2 కోట్ల మందిలో సగానికిపైగా పురుషులే.
దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రం పురుషుల కంటే మహిళలు ఎక్కువగా టీకా తీసుకున్నారు.
అయితే, పేదలు టీకా పొందలేకపోతున్నారని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
చాలామంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియకపోవడంతో పేదలు టీకాను పొందలేకపోతున్నారు.

వ్యాక్సీన్ ఖర్చు ఎవరు భరిస్తున్నారు?
వ్యాక్సీన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లు పైగా ఖర్చు చేస్తోంది.
కేంద్రం స్వయంగా లక్షల డోసుల వ్యాక్సీన్ కొనుగోలు చేయడంతో పాటు వ్యాక్సీన్ కొనుగోలు కోసం రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది.
సైడ్ ఎఫెక్ట్స్..
కాగా వ్యాక్సీన్ వేయించుకున్న కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి వరకు ఉన్న గణాంకాల ప్రకారం వ్యాక్సీన్ తీసుకున్న తరువాత 8,483 మందిలో సమస్యలు ఏర్పడ్డాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వద్ద ఫిబ్రవరి 26 వరకు ఉన్న లెక్కల ప్రకారం వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది ఆసుపత్రి పాలయ్యారు.
అయితే, వీరి మృతికి వ్యాక్సీన్ కారణం కాదని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సంకల్ప్ ఆర్ట్ విలేజ్: సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్త కళలతో ఓ గ్రామాన్ని సృష్టించిన యువతి
- రివెంజ్ పోర్న్: నమ్మి ఫొటోలు పంపించారు, అవమానాలు భరించారు
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- ‘నేను లెస్బియన్‌ని అని చెబుతున్నా బలవంతంగా అబ్బాయితో పెళ్లి చేసేశారు’
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ‘వందల సిజేరియన్లు చేసిన నేనే ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’
- ప్రసవం తరువాత కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు ఎందుకు
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








