అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు

ఫొటో సోర్స్, BCCI
- రచయిత, కాల్ సజాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంగ్లండ్ సిరీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లలోకి అరంగేట్రం చేసిన భారత క్రికెటర్ అక్షర్ పటేల్ తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు ఏ భారత స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ సాధించలేని ఘనతను అక్షర్ సాధించాడు.
ఫిబ్రవరి 13న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో బరిలోకి దిగిన అక్షర్.. ఈ సిరీస్‌లో 10.59 రన్ల సగటుతో మొత్తంగా 27 వికెట్లు తీశాడు.
కేవలం 27ఏళ్లకే భారత క్రికెట్‌లో సంచలన స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు.
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కెరియర్ తొలినాళ్లలో అక్షర్ స్పిన్ బౌలింగ్ వేసేవాడు కాదు.
గుజరాత్‌లోని ఆణంద్ జిల్లాలో జన్మించిన అక్షర్‌కు చిన్నప్పటి నుంచీ క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉండేది.
15ఏళ్ల వయసుకే లెఫ్ట్‌హ్యాండ్ ఫాస్ట్ బౌలర్‌గా, మంచి బ్యాట్స్‌మన్‌గా అక్షర్ ప్రతిభ చూపేవాడు. దీంతో క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని తండ్రి అతడికి సూచించారు.
మూడేళ్ల తర్వాత, రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అక్షర్ కనబరిచిన ప్రతిభతో అతడికి గుజరాత్ క్రికెట్‌లో చోటు పదిలంగా ఉంటుందని స్పష్టమైంది. దిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో అక్షర్ 55 రన్లకు ఆరు వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, BCCI
ఐపీఎల్‌లోనూ చోటు
సోషల్ మీడియాలోనూ అక్షర్ చాలా క్రియాశీలంగా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏడున్నర లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అక్షర్ తన పేరును ''Akshar''గా రాస్తుంటారు. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి.
స్కూల్‌లో చేరేటప్పుడు ప్రిన్సిపల్ అతడి పేరును తప్పుగా రాశారని కొందరు చెబుతుంటే, అతడు పుట్టినప్పుడు ఆసుపత్రిలో నర్సు అతడి పేరును తప్పుగా నమోదు చేశారని మరికొందరు చెబుతుంటారు.
ఈ కథలను పక్కన పెడితే, 2013లో 19ఏళ్లకే అక్షర్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకుంది.
అయితే, ముంబయి ఇండియన్స్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కక పోయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం అతడికి దక్కింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్ దిగ్గజాలైన సచిన్ తెందూల్కర్, హర్‌భజన్ సింగ్, ఆస్ట్రేలియాకు చెందిన రిక్కీ పాంటింగ్‌లు ఆ జట్టులో ఉండేవారు.
ఐపీఎల్‌లో భాగస్వామ్యం కావడంతో అక్షర్ పటేల్‌కు మంచి అనుభవం వచ్చిందని టెస్ట్ మ్యాచ్‌ల నిపుణుడు, మాజీ క్రికెటర్ అభిషేక్ ఝుంఝున్‌వాలా చెప్పారు.
''అలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో భాగస్వామ్యం అయితే, క్రికెటర్లు, కోచింగ్ స్టాఫ్ నుంచి నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అక్షర్‌కు కూడా అదొక మంచి అనుభూతిని ఇచ్చి ఉండొచ్చు''అని అభిషేక్ అన్నారు.
ఆ తర్వాతి సీజన్‌లో అక్షర్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. దీంతో అతడికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ సీజన్‌లో అక్షర్ 17 వికెట్లు తీశాడు.
ఆ సమయంలో అక్షర్‌పై జాతీయ స్థాయి క్రికెట్ సెలక్టర్ల దృష్టి పడింది. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే సీరిస్‌లో ఆడే అవకాశం అతడికి దక్కింది.
ఆ తర్వాత టీ20లోనూ అతడ్ని ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, MICHAEL BRADLEY
టెస్ట్ క్రికెట్‌లో ప్రతిభ...
కింగ్స్ లెవన్ పంజాబ్‌తో అక్షర్ ఐదు సీజన్లు ఆడాడు. వీటిలో మొత్తంగా 61 వికెట్లు తీశాడు.
2018లో అక్షర్‌ను దిల్లీ టీమ్ తీసుకుంది. ఏడేళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్‌లో అతడు 38 వన్ డే మ్యాచ్‌లు, 11 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో రవీంద్ర జడేజా గాయాల పాలై తప్పుకోవడంతో అక్షర్‌కు బంగారం లాంటి అవకాశం దక్కింది.
చెన్నైలో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన అక్షర్.. ఏడు వికెట్లు తీశాడు. అంతేకాదు, రెండో ఇన్నింగ్స్‌లో 60 రన్లకే ఐదు వికెట్లు తీశాడు.
అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో అక్షర్ మరింత మెరుగైన ప్రదర్శనను కనబరిచాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్లకు ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 42 రన్లకు ఐదు వికెట్లు తీశాడు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 68 రన్లకు నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 48 రన్లకు ఐదు వికెట్లు తీశాడు.
అక్షర్ ఈ స్థాయిలో ఆడతాడని ఎవరూ ఊహించలేదని అభిషేక్ వివరించారు.
''దేశీయ క్రికెట్‌లో అక్షర్ మొదట్నుంచీ మంచి ప్రదర్శనే కనబరిచాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో ఈ స్థాయి ప్రదర్శనను బహుశా ఎవరూ ఊహించి ఉండరు''అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ టెస్టు సిరీస్‌లో ఆర్ అశ్విన్, అక్షర్‌ల ద్వయం ఇంగ్లండ్ టీమ్‌కు ముచ్చెమటలు పట్టించింది. స్పిన్ బౌలింగ్‌లో వీరి ప్రదర్శనను ''మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్''గా ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్షర్ బౌలింగ్ ఎందుకంత ప్రమాదకరం?
''లైన్, లెంత్.. ఈ రెండు అతడి అస్త్రాలు. ప్రతిసారీ సరైన లెంత్‌లో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్‌లను అతడు ముప్పు తిప్పలు పెడుతుంటాడు''అని అభిషేక్ వివరించారు.
2012 వరకు భారత దేశీయ క్రికెట్‌లో ఆడిన అభిషేక్.. అక్షర్ ''ఆర్మ్ బాల్'' నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.
''అతడు చాలా వేగంగా బౌలింగ్ చేస్తుంటాడు. అతడి వేగం గంటకు వంద కి.మీ.ల వరకు ఉంటుంది. ఒకసారి స్పిన్ వేస్తే, మరోసారి స్ట్రెయిట్ వేస్తాడు.. దీంతో బ్యాట్స్‌మన్‌లకు ఆడటం కష్టం అవుతుంది''అని అభిషేక్ వివరించారు.
''నా కెరియర్ ప్రారంభంలో నేనొక ఫాస్ట్ బౌలర్‌ను. ఆ అనుభవం ఇప్పటికీ నాకు తోడ్పడుతుంది''అని మూడో టెస్టు తర్వాత అక్షర్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ పాటలతో...
ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో అక్షర్ కనబరిచిన ప్రదర్శనతో అతడు ఈ ఏడాది ఇంగ్లండ్ టూర్‌లోనూ ఉంటాడని అర్థమవుతోంది. ఇంగ్లండ్‌లో అతడు ఎలా ఆడతాడో చూడాలి. 2018లోనూ ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం అక్షర్‌కు దక్కింది. అయితే అక్కడ అతడు అంతగా ప్రతిభ కనబరచలేకపోయాడు.
ఆనాడు డర్హమ్ కౌంటీ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చింది. అప్పుడే ఐర్లాండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ బ్యారీ మెకార్తీతో అతడికి మంచి స్నేహం కుదిరింది.
''మా ఇద్దరి నేపథ్యాలు వేరు. కానీ మేం మంచి స్నేహితులం. నేను ఐర్లండ్‌కు ఆడేవాణ్ని. కానీ నన్ను మా దేశంలో ఎవరూ గుర్తుపట్టరు. కానీ అక్షర్ పటేల్, ఇండియా తరఫున ఆడుతూ.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు''అని బ్యారీ వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో అక్షర్ సోషల్ మీడియాలో చాలా క్రియాశీలంగా ఉంటున్నారు. అతడి పెంపుడు శునకానికి కూడా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. అయితే కౌంటీ క్రికెట్ సమయంలో అక్షర్ చాలా మౌనంగా ఉండేవాడని బ్యారీ తెలిపారు.
''మేం మనసులతో మాట్లాడుకుంటాం. ఒకసారి మేం గ్లేమోర్గాన్‌కు బస్సులో కలిసి వెళ్లాం. అప్పుడు బస్సులో అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. అయితే, తిరిగి వచ్చేటప్పుడు అంతా మారిపోయింది. కొందరు బీర్ తాగారు. అక్షర్ మాత్రం ఏమీ తాగలేదు. కానీ, చాలా సరదాగా గడిపాడు. కొన్ని బాలీవుడ్ పాటలు వినిపించాడు. డ్యాన్స్ చేసి చూపించాడు''అని బ్యారీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
టెస్టులపై అప్పట్లో ఆసక్తి లేదు..
ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లలో అక్షర్ కనబరిచిన ప్రతిభ చూసి తనకు ఆశ్చర్యం ఏమీ అనిపించడంలేదని బ్యారీ అన్నారు. ''ఒకసారి మేం ఇంగ్లండ్, ఇండియా టెస్టు మ్యాచ్‌ను చూస్తున్నాం. వెంటనే నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇలానే అడతావని అన్నాను. దానికి అక్షర్ స్పందించాడు. 'లేదు, టెస్టు క్రికెట్ గురించి నాకు అంత అవగాహన లేదు. ఆ ఫార్మాటే వేరు'అని అన్నాడు''అని బ్యారీ చెప్పారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అక్షర్ బ్యాటింగ్ సగటు 33.54గా ఉంది. వీటిలో 14 అర్థ శతకాలు, ఒక సెంచరీ ఉంది.
డర్హమ్‌లో ఆడేటప్పుడు అక్షర్ అంత మంచి ప్రదర్శన కనబరచలేకపోయాడు. వార్విక్‌షైర్‌పై 54 రన్లకు ఏడు వికెట్లు తీశాడు. గ్లేమోర్గన్‌పై 95 రన్లు తీసి.. నాట్ అవుట్‌గా నిలిచాడు.
''గ్లేమోర్గన్‌పై ఇన్నింగ్స్ సమయంలో తను ఒక ఆల్ రౌండర్‌గా మారగలనని చూపించాడు. అప్పుడే టెస్టు క్రికెట్‌లోనూ ఇతడు బాగా ఆడగలడని అనిపించింది''అని బ్యారీ చెప్పారు.
''వార్విక్‌షైర్‌పై మ్యాచ్‌లోనూ అక్షర్ తిరుగులేని బౌలింగ్ వేశాడు. అయితే, అక్కడి మైదానం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా లేదు. అక్షర్‌కు తనలోని నైపుణ్యాల గురించి మంచి అవగాహన ఉంది''అని బ్యారీ వివరించారు.

ఇవి కూడా చదవండి:
- Ind Vs Eng రెండో టెస్ట్: 317 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








