మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు.. రాజీనామా చేయనున్న టోక్యో ఒలింపిక్స్ కమిటీ చీఫ్

ఫొటో సోర్స్, EPA
మహిళల గురించి "అనుచిత" వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు రావడంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి రాజీనామా చేయనున్నారు. 83 ఏళ్ల మోరీ జపాన్ మాజీ ప్రధానమంత్రి కూడా.
మహిళలు అతిగా మాట్లాడుతుంటారని, మహిళా బోర్డు డైరెక్టర్లతో సమావేశాలు పెడితే "చాలా ఎక్కువ సమయం పడుతుంది" అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మొదట ఆయన క్షమాపణలు చెప్పారు, కానీ రాజీనామా చేయనని అన్నారు.
పదవి నుంచి వైదొలగాల్సిందేనంటూ ఆయనపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం కమిటీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అదే రోజు ఆయన తన పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టయోటా సహా ఒలింపిక్స్‌కు స్పాన్సర్ చేస్తున్న ప్రధాన సంస్థలన్నీ మోరీ వ్యాఖ్యలను తప్పుబట్టాయి.
ఆయన వ్యాఖ్యలకు నిరసనగా దాదాపు 400 మంది వాలంటీర్లు తాము ఒలింపిక్స్‌లో పాల్గొనబోమంటూ దరఖాస్తులను వెనక్కి తీసుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, EPA
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ బోర్డులో ప్రస్తుతం 24 మంది సభ్యులు ఉండగా, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
బోర్డు సభ్యుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 40 శాతం పెంచాలని 2019లో నిర్ణయించారు.
అయితే, బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్యను పెంచితే, సమావేశాల్లో వారు మాట్లాడే సమయాన్ని కుదించాలని, వారు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారని మోరీ వ్యాఖ్యానించారు.
తాను ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంట్లో తన కుటుంబ సభ్యులు కూడా చివాట్లు పెట్టారని జపాన్ వార్తా పత్రిక మైనిచితో మోరీ చెప్పారు.
"గత రాత్రి నా భార్య తిట్టింది. మహిళల గురించి అలా ఎందుకు మాట్లాడావు? ఇంతకు ముందు కూడా ఇలాగే చేశావు, నీ వల్ల నేను బాధపడాల్సి వస్తోందని అన్నది. ఈ ఉదయం, మా అమ్మాయి, మనవరాలు కూడా నన్ను తిట్టారు" అని మోరీ చెప్పినట్టు ఆ పత్రిక రాసింది.
2000 ఏప్రిల్ నుంచి 2001 ఏప్రిల్ వరకు జపాన్ ప్రధానిగా పనిచేసిన మోరీ, అప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









