కరోనావైరస్: టోక్యో ఒలింపిక్స్ 2021లోనే... తేదీలు ఖరారు

ఒలింపిక్స్ వాయిదా

ఫొటో సోర్స్, reuters

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్ వాయిదా

కరోనావైరస్ కారణంగా ఒలింపిక్స్ ఏడాది వాయిదా వేస్తూ కొత్త తేదీలు ప్రకటించారు. 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశమైన నిర్ణయం తీసుకుంది.

అయితే, వీటిని 2021లో నిర్వహించనున్నప్పటికీ ‘టోక్యో ఒలింపిక్స్-2020’గానే పిలుస్తారు.

పారా ఒలింపిక్ క్రీడలు 2020 ఆగస్టు 25 నుంచి నిర్వహించాల్సి ఉండగా వాటిని 2021 ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 వరకు నిర్వహించబోతున్నారు.

ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ.. ‘‘టోక్యో 2020 నిర్వాహక కమిటీ, టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈ సవాల్‌ను మేం ఎదుర్కొంటాం’ అన్నారు.

‘‘మానవజాతి ప్రస్తుతం ఒక చీకటి సొరంగంలో చిక్కుకుపోయింది. ఈ టోక్యో 2020 ఒలింపిక్స్ ఆ సొరంగం చివరన కాంతిరేఖగా మారి వెలుగునిస్తాయి’’ అన్నారు థామస్.

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు.. ఈ క్రీడాపోటీల నిర్వహణలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో, కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధ లక్ష్యంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే మిగతా క్రీడా పోటీల తేదీలనూ దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త తేదీలను నిర్ణయించారు.

కొత్త తేదీలు ప్రకటిస్తున్న టోక్యో 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ(మధ్యలో ఉన్నవ్యక్తి)

ఫొటో సోర్స్, gettyimages

ఫొటో క్యాప్షన్, కొత్త తేదీలు ప్రకటిస్తున్న టోక్యో 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ(మధ్యలో ఉన్నవ్యక్తి)

మిగతా టోర్నీలతో ఇబ్బంది లేకుండా..

పురుషుల ఫుట్ బాల్ యూరోపియన్ చాంపియన్‌షిప్ 2021 వేసవిలో ఉండడంతో వాటి తరువాతే ఒలింపిక్స్ ఉండేలా తేదీలు నిర్ణయించారు.

ఇక ఒలింపిక్స్ వాయిదాతో ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ కూడా వాయిదా వేస్తున్నారు.

ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2021 ఆగస్టు 6, 15 తేదీల మధ్య జరగాల్సి ఉండగా దాన్నిప్పుడు 2022కి వాయిదా వేశారు.

ఒకవేళ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌ను సరిగ్గా ఏడాది వాయిదా వేస్తే అప్పుడా క్రీడల తేదీలు, కామన్‌వెల్త్ క్రీడల సమయంలో జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.

కామన్‌వెల్త్ క్రీడలు 2022 జులై 27, ఆగస్టు 7 మధ్య జరగాల్సి ఉంది.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కొత్త తేదీలకు పాత టికెట్లు చెల్లుతాయి

కాగా ఒలింపిక్స్ కొత్త తేదీల విషయంలో తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ‘వరల్డ్ అథ్లెటిక్స్’ ప్రకటించింది.

ఒరెగాన్‌లోని ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నామని.. 2022లో నిర్వహించబోయే కొత్త తేదీలు ప్రకటించే ముందు కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్, యూరోపియన్ చాంపియన్‌షిప్‌ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

మరోవైపు ఒలింపిక్స్ క్రీడలను చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసినవారు ఆందోళన చెందనవసరం లేదని.. కొత్త తేదీలకు అవి చెల్లుబాటవుతాయని నిర్వాహకులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

ఎవరైనా రీఫండ్ కోరుకుంటే అది కూడా సాధ్యమేనని చెప్పారు.

కాగా కొత్త తేదీలను తాను ప్రతిపాదించగా థామస్ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలతో మాట్లాడి వాటిని ఖాయం చేశారని టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ చెప్పారు.

ఒలింపిక్స్ లోగోలు

ఫొటో సోర్స్, tokyo2020

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్ లోగోలు

124 ఏళ్లలో ఇదే తొలిసారి

ఒలింపిక్ క్రీడల 124 ఏళ్ల ఆధునిక చరిత్రలో ఇలా ఆలస్యం కావడం ఇదే తొలిసారి.

1916లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఏకంగా రద్దయ్యాయి.

అలాగే 1940, 1944ల్లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ పూర్తిగగా రద్దయ్యాయి.

1980లో మాస్కోలో జరగాల్సిన ఒలింపిక్స్, 1984లో లాస్ ఏంజెలిస్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌పై ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం పడింది.

కానీ, ఇలా ఏడాది వాయిదా పడడం ఇదే తొలిసారి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)