కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?

జోష్

ఫొటో సోర్స్, JOSH

    • రచయిత, లోరా జోన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''అవసరానికి మించి కొని, ఈ సమస్యకు నేను కూడా ఒక కారణం అవ్వాలని అనుకోలేదు. అందుకే 18 బ్రిటీష్ పౌండ్లు (దాదాపు రూ. 1600) పెట్టి, 30 రోల్స్‌కు ఆర్డర్ ఇచ్చాను. మా అమ్మకు అవి మూడు నెలల పాటు అవి సరిపోతాయని భావించా'' అని బ్రిటన్‌లోని నాటింగ్‌‌హామ్‌లో ఉండే 25 ఏళ్ల జోష్ అన్నారు.

బ్రిటన్‌లో టాయిలెట్ పేపర్ కోసం వేచి చూస్తున్న చాలా మందిలో జోష్ కూడా ఒకరు.

జోష్ తల్లి దివ్యాంగురాలు, క్యాన్సర్ రోగి. ఆమె బాగోగులను జోష్ చూసుకుంటున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితం కావాలని అందరికీ ప్రభుత్వాలు సూచించడంతో, మూడు నెలల పాటు ఆమెకు ఏ లోటూ రాకుండా వస్తువులన్నీ సమకూర్చుకోవాలని జోష్ భావించారు.

కానీ, జోష్ ఆర్డర్ చేసిన టాయిలెట్ పేపర్ రోల్స్ ఇంటికి రాలేదు. హెర్మ్స్ కొరియర్ సర్వీస్ ద్వారా తన ఆర్డర్ డెలివరీకి వస్తున్నట్లు పోర్టల్‌లో కొన్ని రోజులపాటు కనిపించిందని, చివరికి దాన్ని తొలగించారని జోష్ అన్నారు. తన ఆర్డర్‌ను ఎవరో దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నానని ఆయన చెప్పారు.

సంస్థ తనకు పూర్తి డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పిందని, కానీ ఈ పరిణామాలన్నీ తనకు చికాకు తెప్పించాయని జోష్ అంటున్నారు.

''భయంతో కొనుగోళ్లు చేయడం ఆ తరహా కొనుగోళ్లను ఇంకా పెంచుతుంది. మా అమ్మ లాంటి వాళ్లకు తగినన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి'' అని ఆయన అన్నారు.

తాము పార్సిళ్లను తెరిచి చూడమని, వాటిలో ఏముందో తమకు సమాచారం ఉండదని హెర్మ్స్ బీబీసీతో వివరించింది.

లూలూ అనే మరో యువతికి కూడా జోష్ లాంటి అనుభవమే ఎదురైంది. ఆమె తల్లి నర్సుగా పనిచేస్తున్నారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
టాయిలెట్ పేపర్

ఫొటో సోర్స్, Getty Images

'హూ గివ్స్ ఏ క్రాప్' అనే ఆస్ట్రేలియాకు చెందిన కారుణ్య సంస్థ దగ్గర ఆమె టాయిలెట్ రోల్స్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆరు నెలల క్రితం ఆమె సబ్‌స్క్రిప్షన్ తీసుకుంది.

తమకు రావాల్సిన 48 టాయిలెట్ రోల్స్‌ను ఎవరో ఎత్తుకువెళ్లారని లూలూ అంటున్నారు.

'హూ గివ్స్ ఏ క్రాప్' తమ లాభాల్లో సగాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు వినియోగిస్తుంది.

''డెలివరీలు చోరీకి గురవుతుండొచ్చన్న అనుమానాలు స్వల్పంగా పెరిగాయి. సమస్య మరీ తీవ్రంగానైతే లేదు. చాలా సార్లు ఇంకా పూర్తి కాని డెలివరీలను పోయినట్లు భావించి, వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు'' అని ఆ సంస్థ తెలిపింది.

టాయిలెట్ రోల్స్ పార్సిళ్లు కనిపించకుండా పోతున్నాయని వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు పెరుగుతున్నట్లు అవాంట్ గ్రేడ్ బ్రాండ్స్ అనే విక్రయ సంస్థ కూడా వ్యాఖ్యానించింది.

కరోనావైరస్ వ్యాప్తి వల్ల రిటెయిల్ వ్యాపారాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పింది.

ఈబే లెటర్

విపరీతంగా పెరిగిన అమ్మకాలు

బంబూ అనే సంస్థ వెదురుతో తయారు చేసిన టాయిలెట్ పేపర్ రోల్స్‌ను అమ్ముతుంది. ఏడు నెలల క్రితమే ఆ సంస్థ ఈ వ్యాపారం మొదలుపెట్టింది.

మార్చి ఆరంభం నుంచి తమ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫే పాటింగర్ చెప్పారు

గత నెలతో పోలిస్తే తమ అమ్మకాలు 325 శాతం పెరిగాయని ఆమె బీబీసీతో చెప్పారు. తమ స్టాక్ మొత్తం అమ్ముడైందని, ఇంకా ఉండుంటే మరింత వృద్ధి సాధించేవాళ్లమని ఆమె అన్నారు.

వెదురుతో చేసిన టాయిలెట్ పేపర్లనే అమ్మే అమెరికన్ సంస్థ నెం.2 కూడా ఈ నెలలో ఇప్పటికే అమెజాన్ వెబ్‌సైట్‌లో తమ అమ్మకాలు 5వేల శాతం పెరిగినట్లు తెలిపింది. తమ స్టాక్ కూడా పూర్తిగా అమ్ముడైందని పేర్కొంది.

ఫిబ్రవరిలో సగటున రోజూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే మార్చి ఆరంభంలో రోజువారీ అమ్మకాలు ఐదు రెట్లు ఎక్కువగా జరిగాయని 'హూ గివ్స్ ఏ క్రాప్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైమన్ గ్రిఫిత్స్ చెప్పారు.

టాయిలెట్ పేపర్

ఫొటో సోర్స్, BUMBOO

ఒకరిని చూసి మరొకరు

టాయిలెట్‌లో పేపర్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో ఇలా జనాలు ఇబ్బడి ముబ్బడి కొనుగోళ్లకు దిగుతున్నారు.

మళ్లీ బయటకు వెళ్లే పరిస్థితి ఉండదేమోనని కొందరు నిత్యావసరాలను ఎక్కువగా కొనిపెట్టుకుంటున్నారు. అయితే, అవసరానికి మించి కొందరు ఇబ్బడిముబ్బడి కొనుగోళ్లు చేయడం ప్రారంభిస్తే, మిగతావారు కూడా ఆందోళన పెరిగి ఎక్కువ కొనుగోలు చేయడం మొదలుపెడతారు. ఇదొక విష వలయంలా మారుతుంది'' అని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ‌కి చెందిన సైకాలజిస్ట్ కేథరిన్ జాన్సర్ బోయెడ్ అభిప్రాయపడ్డారు.

''ముందే పెద్ద మొత్తంలో కొనేసి పెట్టుకుంటే జనాలకు నిశ్చింతగా అనిపించవచ్చు. కానీ, ఇలాంటి సమయంలో సమాజం గురించి కూడా ఆలోచించడం ముఖ్యం. ఆందోళన చెందకండి. మళ్లీ దుకాణాల్లో టాయిలెట్ రోల్స్ అరలు నిండుతాయి. మాకు కొంచెం సమయం ఇవ్వండి'' అని బ్రిటన్‌లోని అతిపెద్ద టాయిలెట్ పేపర్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్సిటీకి చెందిన టోనీ రిచర్డ్స్ అన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)