అశ్విన్ రామన్: రోజంతా కూర్చుని ఫుట్‌బాల్ చూడడానికే ఈ 17 ఏళ్ల కుర్రాడికి జీతం ఇస్తున్నారు

ఫొటో సోర్స్, Ashwin Raman/Getty Images
- రచయిత, మనీష్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్‌బీట్ రిపోర్టర్
ఎవరైనా 17 ఏళ్ల వయసులో ఏం చేస్తారు? ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఇంజినీరింగ్ చదవాలా, ఆర్ట్స్ చదవాలా అని ఆలోచిస్తుంటారు.
కానీ, అశ్విన్ రామన్ ఇందుకు భిన్నంగా బ్రిటన్‌లోని స్కాటిష్ ఫుట్‌బాల్ క్లబ్ ‘డూండీ యునైటెడ్’లో ఫుట్‌బాల్ స్కౌట్‌గా, విశ్లేషకుడిగా ఉద్యోగంలో చేరారు. తన కలలు సాకారమయ్యాయని అశ్విన్ అంటున్నారు.
ఫుట్‌బాల్ స్కౌట్ అంటే మ్యాచ్‌లన్నీ చూస్తూ ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఏం తప్పులు చేసారు.. ఇలాంటివన్నీ విశ్లేషించాలి.
అశ్విన్ తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నారు.
రేడియో 1 న్యూస్‌బీట్‌తో మాట్లాడుతూ.."ఇది కలా, నిజమా తెలియట్లేదు. నన్ను నేను గిల్లుకుని చూసుకుంటున్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆయన అన్నారు.
2019 నుంచీ అశ్విన్ ఈ క్లబ్‌లో ఉన్నారు. ఈ రెండేళ్లల్లో స్కాటిష్ ప్రీమియర్‌షిప్‌లో ఈ క్లబ్‌కు ప్రమోషన్ కూడా వచ్చింది.. ఇప్పుడు ఈ క్లబ్ ఆరోస్థానంలో ఉంది.
అయితే, అశ్విన్‌ది అందరిలాగ పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగం కాదు.
కరోనా సమయంలో చాలామంది వర్క్ ఫ్రం హోంకే పరిమితమైపోతున్నారు. ఆఫీసు నుంచి కొంచెం దూరంగా ఉంటూ పని చేయడం అలవాటవుతోంది.
అయితే, అశ్విన్ ఆఫీస్‌నుంచీ చాలా దూరంగా ఉంటూ పని చేస్తున్నారు. తన స్వస్థలం బెంగళూరులో ఉంటూ స్కాటిష్ క్లబ్‌కు పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Ashwin Raman
ఫుట్‌బాల్‌కు సంబంధించిన అనేక పుస్తకాలు చదువుతూ ఉండడం వలన అశ్విన్‌కు అందులో ఆసక్తి పెరిగింది. బ్లాగు రాయడం మొదలుపెట్టారు.
"నా 13వ ఏడు పుట్టినరోజు నాడు నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు అవన్నీ చూస్తే... నేను ఇంత దారుణంగా రాశానా అనిపిస్తుంది" అంటూ అశ్విన్ నవ్వేశారు.
అప్పటినుంచీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ, వాటి విశ్లేషణలు రాయడం అశ్విన్‌కు అత్యంత ఇష్టమైన ప్రక్రియగా మారిపోయింది. తన విశ్లేషణలకు ట్విట్టర్‌లో చాలామంది అభిమానులే ఉన్నారు.
ఆ క్రమంలో 2019లో అశ్విన్‌కు ఒక సందేశం వచ్చింది.
"డుండీ యునైటెడ్ క్లబ్‌లో చీఫ్ స్కౌట్ అయిన స్టీవ్ గ్రీవ్ నాకు మెసేజ్ చేశారు. మా క్లబ్‌లో జాయిన్ అవుతారా అని అడిగారు. నా విశ్లేషణలు ఒక ఫుట్‌బాల్ క్లబ్‌కు ఉపయోగపడనున్నాయని తెలియగానే చాలా ఆనందంగా అనిపించింది" అని అశ్విన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ashwin Raman
వీడియోలు, డాటా విశ్లేషణ
రోజంతా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని వందలకొద్దీ వీడియోలు చూస్తూ, డేటాను విశ్లేషించడం అందరికీ సరదా కాకపోవచ్చు. కానీ, అశ్విన్‌కు అది చాలా ఇష్టమైన విషయం.
"నా విశ్లేషణలు ఒక ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. అందుకే నాకు జీతం ఇస్తున్నారు. మా క్లబ్ కోసం కొత్త ఆటగాళ్లను వెతకడం నా పని. క్లబ్‌కు ఎలాంటి ఆటగాళ్లు కావాలో చెబుతారు. డేటాబేస్ అంతా పరిశీలించి ఎవరు బాగా ఆడుతున్నారో చూసి, వాళ్ల పేర్లను సూచిస్తాను. వాళ్లల్లో ఎవరినైనా మా క్లబ్ ఎంపిక చేసుకుంటే, వాళ్లతో అగ్రిమెంట్ చేసుకునేముందు, నేను వాళ్లు ఆడిన మ్యాచ్‌లన్నీ చూసి, వాళ్ల ఆటను విశ్లేషించి, ఆ ప్లేయర్‌తో అగ్రిమెంట్ చేసుకోవచ్చో, లేదో చెబుతాను. గంటల తరబడి సమయం వెచ్చిస్తూ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ, విశ్లేషించడమే నా పని. ఇదే నాకిష్టం” అని అశ్విన్ అంటున్నారు.
"అదే కాకుండా, మా క్లబ్ ఆటగాళ్ల ఆటతీరును కూడా నేను విశ్లేషిస్తాను. మిగతా క్లబ్ ప్లేయర్స్‌తో పోల్చి చూసి మా ప్లేయర్స్ ఎక్కడ మెరుగుపరుచుకోవచ్చో, ఏం తప్పులు చేస్తున్నారో విశ్లేషించి చెబుతాను. మా క్లబ్ అంచనాలను అందుకుంటున్నారో లేదో పరిశీలిస్తాను" అని అశ్విన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ashwin Raman
దినచర్య తారుమారైపోతూ ఉంటుంది
బ్రిటన్, ఇండియా కాలమానాల్లో వ్యత్యాసం ఉంటుంది. అశ్విన్ యూరోపియన్ ఫుట్బాల్ చూడాలంటే బ్రిటన్ టైంలోనే చూడాలి. అంటే రాత్రుళ్లు నిద్రపోకుండా చాలాసేపు మేల్కొని ఉండాల్సి వస్తుంది.
కానీ, తన ఉద్యోగంలో పని సరళంగా ఉంటుందని, తనకు సౌకర్యంగా ఉన్న సమయంలోనే పని చేసుకోవచ్చని అశ్విన్ చెప్పారు.
ఈ ఉద్యోగం చేస్తూనే అశ్విన్ తన చదువు కొనసాగిస్తున్నారు.
"ప్రస్తుతం నాకు పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి నేను పని ఎక్కువ చెయ్యట్లేదు" అని అశ్విన్ చెప్పారు.
అయితే, అశ్విన్ ఫుట్‌బాల్ అభిమాని, విశ్లేషకుడు కూడా కావడంతో.. ఆట చూస్తున్నప్పుడు తాను ఒక అభిమానిగా 'అలా కొట్టి ఉంటే బావుండేది, ఇలా కొట్టుంటే బావుండేది' అని అనుకుంటూ ఉంటానని, కానీ, ఒక విశ్లేషకుడిగా చూస్తే అవన్నీ తప్పవుతాయని అశ్విన్ అన్నారు.
అశ్విన్‌కు ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ ఈడెన్ హజార్డ్ అంటే చాలా ఇష్టం.
"నాకు ఫుట్‌బాల్ పిచ్చి ఉన్నా ఆడాల్సి వస్తే నేను చెత్తగానే ఆడతాను. నాకు అంత బాగా ఆడడం రాదు."
"ప్రస్తుతం నేను చేస్తున్న పని నాకు చాలా నచ్చుతోంది. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే" అని ఈ యువ ఫుట్బాల్ స్కౌట్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పీఎఫ్ వడ్డీపై ప్రభుత్వం పన్ను: వీపీఎఫ్ తగ్గించుకోవాలా.. పెంచితే ఎంత నష్టం
- మియన్మార్ సంక్షోభం: ఆ దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- స్టాండప్ కమెడియన్: వేయని జోకులకు జైలు శిక్ష అనుభవించిన మునావర్ ఫారూఖీ
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








