ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి?

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, AIFF

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

కొన్నేళ్లుగా భారత్‌లో అన్ని క్రీడల్లో లీగ్‌లు పుట్టుకువస్తున్నాయి.

క్రికెట్‌లో ఐపీఎల్ మొదలు హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్... ఇలా దాదాపు ప్రతి క్రీడలోనూ లీగ్‌లు ప్రారంభమయ్యాయి.

భారత క్రీడా రంగంలో ఇప్పుడు వీటిది ముఖ్యపాత్రగా మారింది.

అయితే, మహిళల లీగ్‌లు చాలా తక్కువ. ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లోనైతే కొన్నేళ్ల క్రితం దీన్ని ఊహించుకునే పరిస్థితి కూడా లేదు. కానీ, పరిస్థితులు మారుతూ వచ్చాయి.

Presentational grey line
News image
Presentational grey line

మహిళల ఫుట్‌బాల్‌లో లీగ్ రావడమే కాదు... ఇప్పుడు నాలుగో సీజన్ పూర్తిచేసుకుంది. అదే ఇండియన్ వుమెన్స్ లీగ్.

బెంగళూరులో ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో క్రిఫ్సా క్లబ్ 3-2 తేడాతో గోకులం కేరళపై విజయం సాధించి, తొలిసారి టైటిల్ అందుకుంది. విజేత జట్టులో పరమేశ్వరీ దేవి, కమలా దేవి, సాబిత్రి భండారీ తలో గోల్ చేశారు.

ఇదివరకటి సీజన్లలో సేతు, రైజింగ్ స్టూడెంట్స్ క్లబ్, ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్ జట్లు టైటిల్ విజేతలుగా నిలిచాయి.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, AIFF

ఈసారి లీగ్‌లో మొత్తం 12 జట్లు ఆడాయి. రెండు పూల్స్‌గా విభజించి లీగ్ నిర్వహించారు. మణిపుర్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రెస్టాఫ్ ఇండియా జోన్ జట్లు వీటిలో ఉన్నాయి.

2016-17లో జరిగిన తొలి సీజన్‌లో ఆడిన జట్ల సంఖ్య ఆరే. ఆ తర్వాత ఏడాది విదేశీ క్రీడాకారిణులు కూడా లీగ్‌లో ఆడారు.

గోకులం కేరళ క్లబ్ తరఫున యుగాండాకు చెందిన ఫజీలా ఇక్వాపుత్, రితాహ్ నాబ్బోసా... సేతు ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఇంగ్లాండ్‌కు చెందిన టెన్వీ హైన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన సబీనా ఖాతూన్, కృష్ణారాణీలకు ఆడే అవకాశం లభించింది.

ఈ లీగ్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ మణిపుర్ పోలీస్ స్పోర్ట్స్ క్లబ్‌కు చెందిన నాంగోమ్ బాలాదేవీ. ఆమె 2018-19 సీజన్‌లో 26 గోల్స్ కొట్టారు. నాంగోమ్ భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్ కూడా.

చాలా ఏళ్లపాటు భారత్‌లో మహిళల ఫుట్‌బాల్‌పై చిన్నచూపు కొనసాగిందని ఫుట్‌బాల్ విశ్లేషకుడు నోవి కపాడియా అన్నారు. చివరికి 2016-17లో ఈ లీగ్‌ను భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రారంభించిందని చెప్పారు.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, AIFF

ఈసారి భారత్ అండర్-19 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. అందులో ఆడబోతున్న భారత జట్టుపై కూడా ఇప్పుడు చాలా మంది దృష్టి ఉంది.

మహిళల ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం పెరిగితే మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించే అవకాశం ఉంటుందని నోవీ కపాడియా అన్నారు.

విదేశాల్లో అర్సెనల్, చెల్సీ లాంటి పుట్‌బాల్ క్లబ్స్‌లో మహిళల జట్లు కూడా ఉన్నాయి. భారత్‌లో ఉన్న మోహన్ బాగాన్, ఈస్ట్ బెంగాల్ లాంటి పెద్ద క్లబ్స్‌లో గానీ, ఐఎస్‌ఎల్‌లోని క్లబ్స్‌లో గానీ మహిళల ఫుట్‌బాల్ ఊసే లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో వుమెన్స్ లీగ్ లాంటి లీగ్ ఉండటం చాలా అవసరం.

ఈసారి లీగ్‌లో అన్ని మ్యాచ్‌లూ బెంగళూరులోనే జరిగాయి. ఇలా నిర్వహించడం వల్ల లీగ్ ఆకర్షణేమైనా తగ్గుతుందా?

''మహిళల మ్యాచ్‌లకు టీవీ హక్కులు తీసుకోరు. టికెట్లు కూడా చాలా తక్కువ అమ్ముడవుతాయి. ఒక విధంగా ఇది సర్దుకుపోయే పరిస్థితి. కనీసం మ్యాచ్‌లు జరుగుతున్నాయిగా'' అని నోవి కపాడియా బదులిచ్చారు.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, AIFF

నిజానికి పురుషుల లీగ్‌ స్థాయిలో దీన్ని స్థాపించలేదు. ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు ఉండటం సహజమే.

లీగ్ వల్ల ప్రతిభావంతులు బయటకి వస్తున్నారని కపాడియా అంటున్నారు. ఆశాలతా దేవిని భారత ఫుట్‌బాల్ సమాఖ్య 2018-19కి అత్యుత్తమ మహిళా ఫుట్‌బాలర్‌గా గుర్తించింది. దిల్లీకి చెందిన డాలిమా ఛిబ్బర్, భారత జట్టు గోల్ ‌కీపర్ అదితి చౌహాన్, మణిపుర్‌కు చెందిన ఓబైండో దేవీ కూడా తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు.

బిహార్, ఒడిశాల్లోని గిరిజన ప్రాంతాల నుంచి కూడా మహిళా ఫుట్‌బాలర్లు వస్తున్నారు.

లీగ్‌లో కొందరు స్టార్ ప్లేయర్స్‌కి మంచి వేతనమే అందుతోంది. అయితే, పరిస్థితి ఇంకా చాలా మెరుగుపడాలని విశ్లేషకులు అంటున్నారు. చదువుకుంటూనో.. చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూనో ఆడుతున్నవాళ్లే చాలా మంది ఉంటున్నారు.

ఈ లీగ్ ఆడిన తర్వాత క్రీడాకారిణులకు మణిపుర్ పోలీస్, రైల్వే, ఆదాయపు పన్నుశాఖల్లో ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. డాలిమా ఛిబ్బర్‌కు స్కాలర్‌షిప్ వచ్చింది. కెనడాలో ఓ ప్రొఫెషనల్ లీగ్‌లో కూడా ఆమె ఆడుతున్నారు.

అన్నింటి కన్నా ముఖ్యంగా ఈ లీగ్ వల్ల మహిళా ప్లేయర్స్‌లో మానసిక స్థైర్యం పెరుగుతోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)