Ind vs Aus: బాక్సింగ్‌ డే టెస్టుకు ఈ పేరు ఎలా వచ్చింది? క్రికెట్‌తో సంబంధంలేని రోజును అలా ఎందుకు పిలుస్తారు?

బాక్సుల్లో బహుమతులు ఇవ్వడం బాక్సింగ్‌ డే ప్రత్యేకతల్లో ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాక్సుల్లో బహుమతులు ఇవ్వడం బాక్సింగ్‌ డే ప్రత్యేకతల్లో ఒకటి

శనివారం నుంచి ఆస్ట్రేలియాలో బాక్సింగ్‌ డే టెస్ట్‌ ప్రారంభం కానుంది. క్రిస్మస్‌ తరువాతి రోజును ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బాక్సింగ్‌ డే గా జరుపుకుంటారు.

బాక్సింగ్‌ డే అనగానే సహజంగా చాలామందికి బాక్సింగ్‌ ఆట గుర్తుకు వస్తుంది. కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. చాలా దేశాలలో ఈ రోజును సెలవు దినంగా పాటిస్తారు.

అయితే బాక్సింగ్‌ డే కు బ్రిటన్‌ మూలాలున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న దేశాలలో ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు.

పాశ్చాత్య క్రైస్తవ మత క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ పండగ తర్వాత రెండో రోజును బాక్సింగ్‌ డే గా పాటిస్తారు. దీనినే సెయింట్‌ స్టీఫెన్స్‌ డే అని కూడా అంటుంటారు. కాటలోనియా, ఐర్లాండ్‌, స్పెయిన్‌లలో దీనిని ఆ పేరుతో పిలుస్తారు.

ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో ఈ రోజున టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా-భారత్ జట్లు డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి.

రొమేనియా, హంగరీ, పోలాండ్, నెదర్లాండ్స్‌వంటి దేశాలలో డిసెంబర్ 26ను సెకండ్‌ క్రిస్మస్‌ డే గా జరుపుకుంటారు.

బాక్సింగ్‌ డే రోజున షాపులు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాక్సింగ్‌ డే రోజున షాపులు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి

బాక్సింగ్‌ డే పేరు ఎలా వచ్చింది?

ఈ పేరు ఎలా వచ్చిందన్న దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్ డిక్షనరీ.. బాక్సింగ్ డే అంటే క్రిస్మస్‌ తర్వాత రోజు, కానీ అది ఆదివారం కాకూడదు.. అని పేర్కొంది.

ఈ రోజు సెలవు దినం కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్‌ బాక్సులను ఇస్తారు. ఆ బాక్స్‌లు ఇచ్చే సంప్రదాయం నుంచి పుట్టిందే బాక్సింగ్‌ డే.

ఉత్తరాలు, వార్తాపత్రికలునిండిన చిన్న చిన్న బాక్సులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. అయితే ఈ బహుమతులను కేవలం క్రిస్మస్‌ మరుసటి రోజే కాకుండా అన్ని రోజుల్లో ఇస్తుంటారు.

గతంలో భూస్వాములు తమ పొలాల్లో పనిచేసే కూలీలకు ఇలా పెట్టెలో బహుమతులు ఇచ్చేవారు. వీటిలో ఇంటి సామాన్లు, వ్యవసాయ పనిముట్లులాంటివి పెట్టేవారు.

ఏడాదంతా తమ వ్యవసాయ పనులు చేసినందుకు యజమానులు పనివాళ్లకు ఈ విధంగా కృతజ్జతలు తెలుపుకునేవారు.

క్రిస్మస్‌ మరుసటి రోజు కాబట్టి పండగ అలసటను మరిచిపోవడానికి, కుటుంబంతో కొంత సమయం గడపడానికి బాక్సింగ్‌ డే రోజున గ్రామీణ ప్రాంతాలకు వెళతారు. మరికొందరు షాపుల్లో లభించే సేల్‌ ఆఫర్ల కోసం వెళతారు.

నక్కలవేట, ఫుట్‌బాల్‌లాంటి సంప్రదాయ క్రీడలు ఈ రోజు ఎక్కువగా జరుగుతాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నక్కలవేట, ఫుట్‌బాల్‌లాంటి సంప్రదాయ క్రీడలు ఈ రోజు ఎక్కువగా జరుగుతాయి

బాక్సింగ్‌డే రోజున సంప్రదాయ క్రీడలు

క్రీడలపరంగా బాక్సింగ్‌డే ఒక ముఖ్యమైన రోజు. నక్కల వేట కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. ఎర్రటి కోట్లు ధరించి, వేట కుక్కలను తీసుకుని గుర్రాలపై ప్రయాణించే వ్యక్తులు ఈ సంప్రదాయ క్రీడకు చిహ్నంగా కనిపిస్తారు.

ఇప్పుడు నక్కల వేట నిషేధించినా, గుర్రపు స్వారీ, ఫుట్‌బాల్‌ క్రీడలు కొనసాగుతున్నాయి. చాలా దుకాణాలు ఈ రోజున ఆఫ్టర్‌ క్రిస్మస్ ఆఫర్లతో అమ్మకాలు సాగిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్