ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, షాబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ హిందీ కోసం
''వరద ప్రవాహం దాటికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయి. దీనిబట్టి వరద ఎంత ఉద్ధృతితో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు''.
ఉత్తరాఖండ్‌లో నందాదేవి గ్లేసియర్ (హిమనీనదం)లో మంచు చరియలు విరిగిపడటంతో సంభవించిన జల ప్రళయంలో చిక్కుకున్న వారికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ ఈ విషయం చెప్పారు.
సిక్స్ సిగ్మా స్టార్ హెల్త్‌కేర్ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో అయిన భరద్వాజ్.. ఆదివారం తన బృందంతో వరద ప్రభావిత చమోలీకి చేరుకున్నారు.
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు చమోలీలోని రేణీ ప్రాంతానికి ప్రదీప్ బృందం చేరుకునేటప్పటికీ పరిస్థితులు భయానకంగా అనిపించాయి.

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC
''నేను మా వైద్య బృందంతో కలిసి రేణీ గ్రామానికి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చాను. అప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ దళాలు బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎటుచూసినా పెద్దపెద్ద రాళ్లు, బురద, నీరే కనిపించాయి. ఒక్కసారిగా కేదార్‌నాథ్ విపత్తు కళ్లముందు మరోసారి కనబడింది''అని ఆయన చెప్పారు.
''11 మృతదేహాలు బురదలో కూరుకుపోవడాన్ని చూశాను. బయటకు తీస్తున్న చాలా మృతదేహాలకు ఒంటిపై బట్టలు కూడా లేవు. బహుశా నీటి వేగం వల్లే బట్టలన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చు. ఈ మృతదేహాలను గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకవేళ వీరి దగ్గర ఎలాంటి ఐడీ కార్డులూ లేకపోతే పరిస్థితి మరింత జటిలం అవుతుంది. డీఎన్‌ఏ పరీక్షల అవసరం రావొచ్చు''అని వివరించారు.
చమోలీలో పగటిపూటే ఈ జల ప్రళయం సంభవించింది. ఒక్కసారిగా వరద నీరు ప్రచండ వేగంతో ఉప్పొంగుతూ రావడాన్ని వందల మంది చూశారు. నీళ్ల శబ్దంతోపాటు బండరాళ్లు ఒకదానితో మరొకటి కొట్టుకోవడంతో వచ్చే శబ్దాలతో వాతావరణం భయానకంగా మారింది.
వరద ప్రవాహానికి సమీపంలోని దాదాపు 17 గ్రామాలపై వరద ప్రభావం పడిందని డాక్టర్ ప్రదీప్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
జగ్‌జూ, తపోవన్, మలారీ, తోలమ్ తదితర గ్రామాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది.
''ఈ భయానక దృశ్యాలను 17 గ్రామాల ప్రజలు కళ్లారా చూశారు. వారిలో చాలా మంది భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దృశ్యాలను దగ్గర నుంచి చూసిన చాలా మందికి మానసిక వైద్యం అవసరం అవుతుంది''అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు.
''ముంపునకు గురైన ప్రాంతం నుంచి ఓ మహిళను గ్రామస్థులు మా దగ్గరకు తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోతోంది. ఘటనకు ముందు ఆమె చక్కగా మాట్లాడేదని గ్రామస్థులు చెబుతున్నారు. చాలా మందిలో బీపీ పెరిగింది. మొత్తం అందరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నాం''అని ఆయన అన్నారు.
ప్రస్తుతం నదీ ప్రవాహం మొత్తం కనిపించే ప్రాంతాల్లో కూర్చొని కొంతమంది గ్రామవాసులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సహాయక చర్యలు చేపడుతున్నవారికి ఏమైనా అవసరం ఉంటే వెంటనే మిగతావారిని అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు విడతల వారీగా గ్రామస్థులంతా నదీ ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా చిన్న తేడా కనిపించినా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
శిబిరాలు.. కౌన్సెలింగ్
''భయానకమైన దృశ్యాలను దగ్గర నుంచి చూసిన చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా వరదకు సమీపంలో ఎక్కువ ప్రభావితమైన ఇలాంటి ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం''అని ప్రదీప్ చెప్పారు.
''సోమవారం కూడా పరిసర ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటుచేస్తాం. ఆందోళన, కుంగుబాటు తదితర మానసిక సమస్యల నుంచి బయటపడేందుకూ చికిత్స అందిస్తాం''.
''వరద ప్రభావంతో గాయపడిన 11 మందికి ఆదివారం చికిత్స అందించాం. గాయాలపాలైన వారికి వెంటనే చికిత్స మొదలుపెడుతున్నాం''.
''భయానక పరిస్థితుల్లో ఆందోళనకు గురైన గ్రామస్థులందరికీ మానసిక చికిత్స అవసరం అవుతుంది''అని ప్రదీప్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- చమోలీ గ్లేసియర్: ఉత్తరాఖండ్‌లో ఈ 'ప్రళయం' ఎందుకొచ్చింది, నిపుణులు ఏమంటున్నారు
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









