కేరళ వరదలు: ఎందుకీ పరిస్థితి?

ఫొటో సోర్స్, AFP
వందేళ్లలో కనీవినీ ఎరుగని వరదల్లో కేరళ చిక్కుకుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. జూన్‌లో వర్షాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా దేశంలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.
బాధితుల్ని రక్షించేందుకు వందలాది సహాయక బృందాలతో పాటు డజన్ల కొద్దీ బోట్లు, హెలికాప్టర్లను కేరళకు తరలించారు.
ఇంకా చాలామంది ప్రజలు ఇళ్లలో, భవనాలపైన చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన, పెను గాలుల ముప్పు కనిపిస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చనే భయం నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోదీ వరద ప్రభావిత ప్రాంతాల మీదుగా హెలికాప్టర్‌లో పర్యటించారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అధికారులతో సమీక్షించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత నష్టం?
రాష్ట్రంలో గత వందేళ్లలో సంభవించిన అత్యంత భారీ వరదలు ఇవేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. 2వేలకు పైగా అత్యవసర సహాయక శిబిరాల్లో దాదాపు 2.14లక్షల మంది ఉంటున్నారని ఆయన ట్వీట్ చేశారు.
చుట్టుపక్కల రోడ్లన్నీ జలదిగ్బంధం కావడంతో కేవలం ఒక్క గ్రామంలోనే 10వేల మంది నీటిలో చిక్కుకుపోయారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది.
విద్యుత్ సదుపాయం, ఆహారానికి దూరమైన చాలామంది సోషల్ మీడియా ద్వారా సాయాన్ని కోరుతున్నారు.

నిద్ర లేచి బయటకు వచ్చి చూసేసరికి వీధిలో మెడ దాకా నీళ్లు వచ్చేశాయని కృష్ణ జయన్ అనే మహిళ చెప్పారు. వీధిలోవాళ్లు పెద్ద పెద్ద తాళ్లను ఏర్పాటు చేశారని, వాటి సాయంతో రోడ్డు దాటి బస్సెక్కి గ్రామం నుంచి బయటపడినట్లు ఆమె వివరించారు.
వరదల్లో చిక్కుకున్న మరో గర్భిణిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో రక్షించారు. ఆ కాసేపటికే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చారు.
కేరళ వాణిజ్య రాజధాని కోచీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని రైలు మార్గాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

ఫొటో సోర్స్, Reuters
క్షేత్ర స్థాయి పరిస్థితి
ఉత్తర కేరళలోని కుజిప్పురం గ్రామాన్ని బీబీసీ ప్రతినిధి యోగిత లిమాయే సందర్శించారు. సమీపంలోని నదీ జలాలు ఉప్పొంగడంతో ఆ గ్రామం పూర్తిగా నీటి మునిగింది. కేవలం ఇంటి పైకప్పులు, చెట్ల పైభాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆ గ్రామంలోని ప్రజలను రెండు వారాల కిందటే ఖాళీ చేయించారు. కానీ తమ ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు కొందరు గ్రామస్థులు తిరిగి అక్కడికి చేరుకున్నారు. కొందరు ఈదితే తప్ప ఇళ్లకు చేరుకోలేకపోయారు. ఇంకొందరు వీలైనన్ని వస్తువులను తమతో తెచ్చుకున్నారు.
రాష్ట్రంలో వరదలే ఎక్కువ మంది ప్రాణాలు తీసినా, భారీ వర్షాల వల్ల కూడా విపత్తులు సంభవించాయి. మళప్పురంలో ఓ ఇంటిపై మట్టిపెళ్లలు కూలడంతో తొమ్మిది మంది చనిపోయారు. కేరళలో ఎక్కువ భాగం కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా అంత సులువు కాదు.

అధికారులు ఏం చేస్తున్నారు?
మొత్తం 38 హెలికాప్టర్లు, 20 విమానాల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మంచి నీటితో నిండిన ప్రత్యేక రైలును సైతం రాష్ట్రానికి పంపారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ వరద ప్రభావిత ప్రాంతాల మీదుగా పర్యటించడంతో పాటు కోచీలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
వరద కారణంగా ఇప్పటికే కోచీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వరద ఉద్ధృతి తగ్గాక నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపడతామని కేరళ విపత్తు నిర్వహణ విభాగానికి చెందిన అధికారి అనిల్ వాసుదేవన్ చెప్పారు.
పరిస్థితి ఎందుకింత తీవ్రంగా మారింది?
కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవించాయి. సాధారణంగా ఏటా కేరళలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంటుంది. కానీ ఈసారి సాధారణ స్థాయి కంటే 37శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అడవుల నరికివేతను నివారించలేకపోవడం, ముఖ్యంగా పర్యావరణపరంగా సున్నితమైన పర్వత ప్రాంతాలను సంరక్షించడంలోని వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పొరుగు రాష్ట్రాల వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. కొద్ది రోజుల ముందు ఓ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయమై తమిళనాడు ముఖ్యమంత్రికి, విజయన్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.
కేరళ నుంచి 41 నదులు అరేబియా మహా సముద్రంలో కలుస్తాయి. వాటిపైన ఉన్న 80 డ్యామ్‌ల గేట్లను ఎత్తేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
- Bఇమ్రాన్ ఖాన్: నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు
- అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- అభిప్రాయం: 'ధర్మరాజుకూ మంచిచెడ్డలు ఉంటాయి'
- ఈయన ప్రపంచంలోనే అత్యంత పేద మాజీ అధ్యక్షుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









