‘అవి వరదలు కాదు, కేరళ నదుల కన్నీళ్లు’

- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘కేరళలో పొంగి పొర్లుతోంది వరదలు కాదు, అవి రాష్ట్రంలోని 44 నదుల కన్నీళ్లు’ అని దేశ వ్యాప్తంగా ‘వాటర్ మేన్’గా పేరున్న రాజేంద్ర సింగ్ అన్నారు. రాజస్థాన్‌కు చెందిన రాజేంద్ర సింగ్‌కు దేశంలోని ఎన్నో నీటి వనరులను పునరుద్ధరించిన అనుభవం ఉంది.
కేరళ వరదల్లో చనిపోయిన వారిపై సంబంధిత అధికారుల కనీస సానుభూతి కూడా కొరవడిందని ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
రాజేంద్ర సింగ్ గతంలో ‘వాటర్ నోబెల్’గా పేరొందిన స్టాక్‌హోం వాటర్ ప్రైజ్‌తో పాటు ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని నదులను పునరుద్ధరించడానికి, అడుగంటుతున్న జల వనరులను సంరక్షించడానికి అనువైన ప్రణాళికలు రూపొందించేందుకు 2015లో కేరళ ప్రభుత్వం ఆయన్ను ఆహ్వానించింది.

‘ప్రభుత్వం మరచిపోయినట్లుంది’
‘అప్పుడు మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో నదులను కాపాడటం, వరదలను నివారించడం లాంటి అనేక అంశాలపై చర్చించాం. కేరళలోని నదుల సంరక్షణ కోసం ఓ బిల్లు ప్రవేశపెట్టాలని, దాని ముసాయిదాను రూపొందించాలని నిర్ణయించారు. దానిపైన నా అభిప్రాయాన్ని అడిగారు. రాష్ట్రంలోని 44నదులను సంరక్షించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను నేను సూచించాను. బహుశా వాటిని వాళ్లు మరచిపోయారేమో’ అని రాజేంద్ర చెప్పారు.
నదుల ప్రవాహానికి అడ్డుపడే అన్ని నిర్మాణాలను తొలగించాలని, ఆక్రమణలను పూర్తిగా నిరోధించాలని రాజేంద్ర సూచించారు.
‘ఒక్కో నది స్వభావం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి అన్ని నదులకూ ఒకే సూత్రం వర్తించదు. 44 నదులపై జరిగిన ఆక్రమణల జాబితాను తయారు చేయాలి. నదులు చుట్టూ పరిరక్షణ జోన్‌లను అభివృద్ధి చేయాలి. నదులను కలుషితం చేసే నిర్మాణాలు, పరిశ్రమలను క్రమంగా తొలగించాలి. ఇసుక దొంగతనాలు, అడవుల నరకివేత లాంటి పనులు కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వాటిని నివారించకపోతే భవిష్యత్తులో ఘోరమైన పరిణామాలు తప్పకపోవచ్చని ఆ రోజే వారికి హెచ్చరించాను’ అంటూ మూడేళ్ల క్రితం కేరళ ప్రభుత్వానికి చేసిన సూచనల గురించి రాజేంద్ర వివరించారు.
కేరళలో ఉన్న నదుల్లో సగం రాజస్థాన్‌లో ఉండుంటే అది దేశంలోనే అత్యంత సంపన్నమైన, ప్రశాంతమైన రాష్ట్రంగా మారేదని రాజేంద్ర అభిప్రాయం.
‘ఎంతో సంపదనిచ్చే నదుల్ని వరదలకు మూల కారణంగా మార్చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కేరళకు వరదలతో పాటు కరవు పరిస్థితులూ తలెత్తుతుంటాయి. నదుల సహజ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన అన్నారు. మరోసారి కేరళ ప్రభుత్వానికి సాయపడేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు.

ప్రజల్ని తరలించడం కష్టం
మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు గురించి కేరళ జల నిర్వహణ విభాగానికి చెందిన అధికారి జేమ్స్ విల్సన్ మాట్లాడుతూ... ‘పాలసీ విషయాల గురించి చర్చించడానికి ఇది సమయం కాదు. రాజేంద్ర సింగ్ ఇక్కడికి వచ్చి బిల్లుపై సలహాలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ చర్చించిన ప్రతి అంశాన్నీ అమలు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి’ అని చెప్పారు.
‘కేరళలో భూభాగం తక్కువ. ఎన్నో తరాలుగా చాలామంది ప్రజలు నదీ తీరాల్లోనే జీవిస్తున్నారు. చాలామంది నదుల పక్కనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్లందరినీ అక్కడి నుంచి తరలించడం అంత సులువు కాదు. వాళ్లు వెంటనే రాజకీయ నాయకుల్ని ఆశ్రయిస్తారు. నిరసనలు మొదలవుతాయి. నదీ తీరాల్లో మతపరమైన నిర్మాణాలూ ఉంటాయి. ఇది చాలా సున్నితమైన అంశం. అందుకే ఆచితూచి అడుగేయాలి’ అని జేమ్స్ అన్నారు.
‘ప్రతి సంవత్సరం కేరళకు వరదలు వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి అవి మరింత తీవ్రంగా ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి విపత్తులను ప్రతిసారీ నివారించలేం. నదులను పునరుద్ధరించాలనే విషయం మాకు అర్థమైంది. పరిస్థితి కొంచెం కుదుటపడ్డాక ఆ దిశగా అడుగేస్తాం’ అని కేరళలో తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి జేమ్స్ వివరించారు.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- 14 ఏళ్లుగా వాజ్‌పేయి ఏకాంతవాసం - ఇంతకూ ఆయనకు ఏమైంది?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- వాజ్‌పేయి: అటల్‌తో పీవీ, కలాం, మోదీ, సోనియా, చంద్రబాబు, జయలలిత, కరుణ
- ఉగ్రవాద వ్యతిరేక తొలి భారతీయ మహిళా దళం
- ఇవి చైనా సృష్టించిన కృత్రిమ దీవులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








