కరోనావైరస్: ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సీన్‌ అందిస్తున్న భారతీయ కంపెనీ

అదార్

ఫొటో సోర్స్, Twitter/adarpoonawalla

    • రచయిత, చియో రాబర్ట్సన్‌
    • హోదా, బీబీసీ బిజినెస్‌ కరస్పాండెంట్

కోవిడ్‌ వ్యాక్సీన్‌ ఉత్పత్తికి చాలా కంపెనీలు ఉరుకులు పరుగులు పెడుతున్న సమయంలో ఓ కంపెనీ మాత్రం తయారీలో అందరికంటే ముందు దూసుకుపోయింది.

సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా గురించి భారతదేశంలో చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ ఇప్పుడది ప్రపంచానికే వ్యాక్సీన్‌ అందిస్తోంది.

సీరం ఇనిస్టిట్యూట్‌ తన పుణె ప్లాంట్‌ నుంచి ఏడాదికి 150 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను తయారు చేయగలదు. ఆస్ట్రాజెనెకా లాంటి ప్రముఖ ఫార్మా కంపెనీల లైసెన్స్‌లపై సీరం ఇనిస్టిట్యూట్‌ కోవిడ్‌ వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

“చాలా వ్యాక్సీన్‌ కంపెనీలకు ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాక ముందే వాటి తయారీకి ఏర్పాట్లు చేసి చాలా రిస్క్‌ తీసుకున్నాం’’ అని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ అదార్‌ పూనావాలా బీబీసీతో అన్నారు.

“అయితే మా అంచనా ఎప్పుడూ తప్పలేదు. గతంలో ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన మలేరియా వ్యాక్సీన్‌ను మేమే తయారు చేశాం. ఆ శాస్త్రవేత్తలపై మాకు నమ్మకం ఉంది” అన్నారాయన.

సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రైవేటు సంస్థ కావడంతో నిర్ణయాలను వేగంగా తీసుకోవడానికి సీఈఓకు, సైంటిస్టులకు వీలు కలిగింది. అయితే నిధుల సేకరణ పెద్ద సవాల్‌గా మారింది.

ఈ వ్యాక్సీన్‌ల కోసం ఆ సంస్థ 260 మిలియన్‌ డాలర్లు (రూ.1900 కోట్లకు పైగా) పెట్టుబడిగా పెట్టింది సీరం. మిగిలిన సొమ్మును బిల్‌గేట్స్‌ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థలు, కొన్నిదేశాల నుంచి అడ్వాన్సుల రూపంలో సేకరించింది.

వివిధ కోవిడ్‌ వ్యాక్సీన్‌ల కోసం సీరం ఇనిస్టిట్యూట్‌ 800 మిలియన్‌ డాలర్ల (రూ.5800 కోట్లకుపైగా) పెట్టుబడిని సమీకరించింది.

వ్యాక్సీన్ తయారీ

డోసుల ఉత్పత్తి

సీరం సంస్థ ఉత్పత్తిని ఎలా ప్రారంభించింది ?

వ్యాక్సీన్‌ కోసం తమకు ఎన్ని సీసాలు కావాలో ఏప్రిల్‌ 2020 నాటికే అంచనా వేశారు పూనావాలా.

“60 కోట్ల డోసుల వ్యాక్సీన్‌కు అవసరమైన సీసాలను సెప్టెంబర్‌ నాటికే మా గోడౌన్‌కు చేర్చాం.” అని పూనావాలా వెల్లడించారు.

“జనవరి నాటికి 7-8 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ తయారీని ఆగస్ట్‌లోనే ప్రారంభించాం. ఇది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. మిగతా కంపెనీలు కూడా ఇలాగే రిస్క్‌ తీసుకుని ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచానికి దాని అవసరం అంతగా ఉంది” అని పూనావాలా వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఔషధ నియంత్రణ కంపెనీల విధానాలలో అనేక లోపాలున్నాయని, దానివల్ల వ్యాక్సీన్‌ తయారీ చాలా ఆలస్యమైందని పూనావాలా విమర్శించారు.

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీలాంటివన్నీ వ్యాక్సీన్‌ క్వాలిటీ తనిఖీలలో కలిసి పని చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

“కనీసం కొత్త వ్యాక్సీన్‌ల కోసమైనా సమయం వృథా కాకుండా వీరంతా ఎందుకు జాగ్రత్తలు తీసుకోరు ? మరోసారి ఇలా చేయాల్సి వస్తే మాత్రం అది చాలా దారుణం” అన్నారు పూనావాలా.

వ్యాక్సీన్ తయారీలో అనేక భారతీయ కంపెనీలు పోటీ పడ్డాయి
ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్ తయారీలో అనేక భారతీయ కంపెనీలు పోటీ పడ్డాయి

కొత్త వేరియంట్‌ వైరస్‌లు

కొత్త వేరియంట్ వైరస్‌ల గురించి ప్రస్తావించగా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు పూనావాలా. “ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సీన్‌ వేసుకున్న వారెవరికీ ఇప్పటిదాకా మళ్లీ ఆసుపత్రికి వెళ్లడం, వెంటిలేటర్‌ వాడాల్సిన పరిస్థితుల్లాంటివి ఏర్పడలేదు” అన్నారాయన.

“వాళ్ల వల్ల ఇతరులకు వైరస్‌ సోకవచ్చు. దీన్ని నివారించలేం. కానీ వ్యాక్సీన్‌ చాలామంది జీవితాన్ని కాపాడింది” అని ఆయన అన్నారు.

ఆగస్టునాటికి భారతదేశంలో 30 కోట్లమందికి టీకాను అందించే కార్యక్రమంలో సీరం ఇనిస్టిట్యూట్‌ కూడా పాలు పంచుకుంటోంది. అయితే అర్హులైన వారిలో 56%మంది మాత్రమే టీకా తీసుకోడానికి ముందుకు వచ్చారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

2020 మే నాటికే రూ.5వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది సీరం ఇనిస్టిట్యూట్
ఫొటో క్యాప్షన్, 2020 మే నాటికే రూ.5వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది సీరం ఇనిస్టిట్యూట్

“వ్యాక్సీన్‌ అంత సేఫ్‌ కాదని నిపుణులు కానివారు, సెలబ్రిటీలు ప్రకటనలు చేయడంతో చాలామంది దాన్ని‌ తీసుకోవడానికి వెనకాడుతున్నారు” అన్నారు పూనావాలా.

“సోషల్ నెట్‌వర్క్‌లలో ఇలాంటి ప్రచారాలు చేసే సెలబ్రిటీలు ఒక్కసారి నిజానిజాలు చదివి, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది” అని పూనావాలా సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)