గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?

ఫొటో సోర్స్, Biswa Ranjan Mishra
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన బిబేకానంద (వివేకానంద) బిశ్వాల్‌ను ఒడిశా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు 22ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు బిశ్వాల్.
1999లో జరిగిన అత్యాచారం కేసులో ఆయన ప్రధాన నిందితుడు. పుణెలో రహస్య జీవితం గడుపుతున్న బిశ్వాల్, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, కుదరలేదు.
“మమ్మల్ని చూసి పారిపోవాలని చూశాడు. కానీ దొరకగానే, నన్నిక్కడి నుంచి తీసుకెళ్లండి, అన్ని విషయాలు చెబుతాను అన్నాడు” అని భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి బీబీసీతో అన్నారు.
29 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన బృందంలో బిశ్వాల్ ఒకరు కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన ప్రదీప్ కుమార్ సాహు, ధీరేంద్ర మొహంతిలకు ఇప్పటికే న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సాహు గత ఏడాది జైలులోనే మరణించారు.

ఫొటో సోర్స్, Orissa police
సంచలనంగా మారిన కేసు
1999లో బాధితురాలు తన జర్నలిస్టు స్నేహితురాలితో కలిసి ఓ కారులో కటక్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వెంబడించారు.
ఆ ముగ్గురు వ్యక్తులు బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని బెదిరించి అజ్జాత ప్రాంతానికి తీసుకెళ్లారని కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. అక్కడ బాధితురాలిపై నాలుగు గంటలకుపైగా నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని ఆమెను, ఆమె స్నేహితురాలని బెదిరించారు. వారిని తీవ్రంగా హింసించి వారి దగ్గరున్న విలువైన వస్తువులను లాక్కెళ్లారు.
ఒడిశాలో అప్పట్లో ఈ గ్యాంగ్‌రేప్ ఘటన సంచలనం సృష్టించింది. బాధితురాలు అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ సహా, కొందరు ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో దీనిపై విస్తృత చర్చ జరిగింది.
ఘటనకు 18 నెలల ముందు తనపై అత్యాచారయత్నం జరిగిందంటూ ఓ అధికారిపై కేసు పెట్టానని, ఆ అధికారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
ఆ కేసును తాను వెనక్కి తీసుకునేలా బెదిరించేందుకు సదరు అధికారి తనపై సామూహిక అత్యాచారం చేయించారని, ఇందులో ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందని బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని నాటి ఒడిశా ముఖ్యమంత్రి ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. అయితే ఆ తర్వాత నెల రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఈ కేసును డీల్ చేయడంలో జేబీ పట్నాయక్ విఫలమయ్యారని, అందుకే రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏడాదికి బాధితురాలిపై అత్యాచార యత్నం చేసిన అధికారిపై నేరం రుజువై ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ఈ గ్యాంగ్‌రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిగింది. వివేకానంద బిశ్వాల్ ఈ నేరంలో ప్రధాన సూత్రధారి అని, ఆయనే బాధితురాలిపై అత్యాచారానికి, తీవ్ర హింసకు పాల్పడ్డారని తేల్చింది. అయితే అప్పటికే బిశ్వాల్ ఎవరికీ కనిపించకుండా పోయారు. దాదాపు 22 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Biswa Ranjan Mishra
‘ఆపరేషన్ సైలెంట్ వైపర్’
భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి గత నవంబర్‌లో చౌద్వార్ జైలును సందర్శించినప్పుడు, సందర్భవశాన ఆయన గ్యాంగ్ రేప్ కేస్ నిందితుడితో మాట్లాడారు.
“ఈ కేసులో ఇంకొక నిందితుడు ఇంకా దొరకలేదని తెలిసింది. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చి కేస్ ఫైల్ తెప్పించాను. అంతా చూశాక ఇదొక దారుణమైన ఘటన అనిపించింది. అతన్ని కచ్చితంగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాను” అని సారంగి బీబీసీతో అన్నారు.
ఈ కేసును మళ్లీ తెరిచిన ఆయన, నిందితుడిని పట్టుకునేందుకు ‘ఆపరేషన్ సైలెంట్ వైపర్’ను ప్రారంభించారు.
“వైపర్ (ఒకరకమైన పాము) తనను ఎవరూ గుర్తు పట్టకుండా పరిసరాలలో కలిసిపోతుంది. 22 ఏళ్లుగా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని పట్టుకునే ఆపరేషన్‌కు ఇది సరైన పేరు అని నేను భావించాను.” అని సారంగి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా వల వేశారు?
“నిందితుడు అతడేనని ఫిబ్రవరి 19న మాకు స్పష్టత వచ్చింది. స్పష్టత వచ్చిన రెండు గంటల్లో మా ఆఫీసర్లు ముగ్గురు పుణెలో వాలిపోయారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరుసటి రోజు అతని ఇంటి మీద దాడి చేసి పట్టుకున్నాం” అని సుధాంశు వివరించారు.
నిందితుడికి సంబంధించిన సమాచారం సేకరించడానికి 3 నెలలు పట్టిందని సుధాంశు వెల్లడించారు. “విచారణ మొదలైన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతను తన కుటుంబం, భార్యా పిల్లలతో టచ్‌లో ఉన్నారు. ఆయన పేరు మీద ఉన్న భూమిని అమ్మడానికి నిందితుడి కుటుంబం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అతని పూర్తి వివరాలు దొరికాయి” అని సుధాంశు వివరించారు.
మంచి ధర రావడంతో ఈ భూమిని అమ్మాలని వివేకానంద కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈలోగా వివేకానంద కుటుంబ ఆర్ధిక స్థితిగతుల మీద పోలీసులు దృష్టి సారించారు.
వివేకానంద భార్యకు, పిల్లలకు ఉద్యోగం లేదు. కానీ వారి ఎకౌంట్‌లోకి నిత్యం డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉన్నాయి. జలంధర్ స్వెయిన్ అనే పేరుతో వారి ఖాతలోకి డబ్బు జమ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
వివేకానంద అరెస్టు అయిన తర్వాత కూడా ఆయన భార్య గీతాంజలి తన భర్తతో 22 ఏళ్లుగా మాట్లాడలేదని పోలీసులకు చెప్పారు. “గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. తర్వాత ఎప్పుడూ ఇంటికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు” అని ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
తనకు వివేకానంద నుంచి డబ్బు ఎకౌంట్‌లోకి వస్తుందన్న మాటలను కొట్టిపారేసిన గీతాంజలి, జలంధర్ స్వెయిన్ ఎవరో, ఎందుకు ఆమె కుటుంబానికి డబ్బు పంపిస్తున్నారో మాత్రం చెప్పలేకపోయారని పోలీసులు వివరించారు.
ఎక్కడ దాక్కున్నారు?
“ఇండియా చాలా పెద్దదేశం. ఎక్కడైనా దాక్కోవచ్చు. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్‌లను కూడా వివేకానంద సంపాదించారు.” అని అన్నారు సుధాంశు.
2007 నుంచి వివేకానంద పుణెలోని ఆంబీవ్యాలీ టౌన్‌షిప్ కార్మికులతో కలిసి ఉంటున్నారు. ఈ ప్రాంతం ఆయన సొంత ఊరుకు 1740 కిలోమీటర్ల దూరంలో ఉంది.
“ ప్లంబర్‌గా మారి ఆయన పూర్తి కొత్త అవతారమెత్తారు. ఆంబీవ్యాలీలో ఉండే 14000మంది కార్మికుల్లో ఆయన ఒకరు. వైపర్ స్నేక్‌లాగా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు.” అని సుధాంశు వివరించారు.
ఆధార్ కార్డులో ఆయన తన పేరును జలంధర్ స్వెయిన్ అని రాయించుకున్నారు. తండ్రి పేరు పూర్ణానంద బిస్వాల్‌కాగా, ఆధార్‌లో మాత్రం పి.స్వాయిన్ అని రాయించారు. అయితే తన ఊరి పేరును మాత్రం కరెక్టుగా రాయించారు. పోలీసులు తనిఖీలో జలంధర్ స్వెయిన్ అనే పేరున్నవారెవరూ ఆ ఊళ్లో లేరని తేలింది.
తనపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను వివేకానంద ఖండించారని సుధాంశు సారంగి తెలిపారు. “ అతని గురించి, అతని కుటుంబం గురించి అన్ని ఆధారాలు సేకరించాం. ఇప్పుడాయనను సీబీఐకి అప్పగించాం” అన్నారు సుధాంశు.
1999 అత్యాచారం కేసు నిందితుడిని భువనేశ్వర్ కోర్టుకు తీసుకువస్తున్నారని తెలియడంతో టీవీ ఛానళ్లు ఆయన వీడియో సంపాదించడానికి పరుగులు తీశాయి. అయితే ముఖానికి మాస్క్ వేసి ఉండటంలో వారికి అతని వీడియో చిక్కలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడేం జరుగుతుంది?
వివేకానంద నుంచి అనేక విషయాలను రాబట్టాల్సి ఉందని సుధాంశు సారంగి అన్నారు. సొంతూరు నుంచి ఎలా తప్పించుకున్నారు, 2007కు ముందు ఎక్కడున్నారు, అన్ని సంవత్సరాలు రహస్యంగా ఎలా గడిపారు, ఉద్యోగం ఎలా వచ్చింది, ఎవరు సాయం చేశారు లాంటి విషయాలన్నీ బైటికి రావాల్సి ఉందని సారంగి వెల్లడించారు.
ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. నిందితుడి వెనక కొందరు పెద్దలు ఉన్నారన్న బాధితురాలి ఆరోపణలకు సమాధానం దొరుకుతుందా లేదా అన్నది కీలకంగా మారింది.
ఇప్పటికే నేరం జరిగి 22 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఈ కేసును మళ్లీ తెరిచారు. మళ్లీ మొదటి నుంచి విచారించాలి. ఈ విచారణ ఎన్నాళ్లు పడుతుంది, చివరకు అతనికి శిక్ష పడుతుందా లేదా అన్నది అనుమానం.
“ శిక్షపడి తీరుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఆయన తన శేష జీవితాన్ని జైలులో గడపాలి. జైలు నుంచి అతని శవమే వెళ్లాలి” అన్నారు సుధాంశు.
నిందితుడిని పట్టుకోవడంపట్ల బాధితురాలు హర్షం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేశారంటూ సుధాంశు సారంగికి ఆమె కృతజ్జతలు తెలిపారు. వివేకానందకు మరణ శిక్ష విధించాలని బాధితురాలు అన్నారు.
“అతన్ని అరెస్టు చేస్తారని నేను ఊహించలేదు. నాకిప్పుడు చాలా రిలీఫ్‌గా ఉంది” అని బాధితురాలు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- సింగపూర్: పని మనిషిని హింసించి, అన్నం పెట్టకుండా చంపేశానంటూ నేరం అంగీకరించిన పోలీస్ అధికారి భార్య
- #MeToo: భారత మీడియాలో వెలుగు చూస్తున్న లైంగిక వేధింపులు
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలిపి కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








