సింగపూర్: పని మనిషిని హింసించి, అన్నం పెట్టకుండా చంపేశానంటూ నేరం అంగీకరించిన పోలీస్ అధికారి భార్య

వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తమ ఇంట్లో పనిచేసే అమ్మాయికి అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చి, దారుణంగా హింసించి, చివరకు చంపిన నేరాన్ని సింగపూర్ పోలీసు అధికారి భార్య గాయత్రి మురుగాయన్ కోర్టులో అంగీకరించారు.

24 ఏళ్ల యువతి పియాంగ్ గై డాన్ మియన్మార్‌ దేశస్థురాలు. బతుకుదెరువు కోసం ఆమె సింగపూర్‌ వెళ్లారు. 2015లో గాయత్రి ఇంట్లో పనికి కుదిరారు.

ఆ తర్వాత ఏడాదికే 2016లో ఆ యువతి శవమై కనిపించారు. గాయత్రి మురుగాయన్, ఆమె తల్లి కలిసి కొన్ని గంటలపాటు చిత్రహింసలు పెట్టి, తీవ్రంగా గాయపరచడంతో పియాంగ్ మరణించారు. చనిపోయే సమయానికి ఆమె కేవలం 24 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.

గాయత్రి మురుగాయన్ అత్యంత దుర్మార్గంగా, అమానవీయంగా ప్రవర్తించారని ప్రాసిక్యూటర్లు అన్నారు.

ఇటీవలి కాలంలో ధనిక దేశమైన సింగపూర్‌లో పని మనుషులపై జరుగుతున్న హింసాత్మక దాడుల కేసుల్లో ఇదొకటి.

పియాంగ్ గై డాన్‌ని హత్య చేయడంతో పాటు, మరో 28 నేరాలకు పాల్పడినట్లు 40 ఏళ్ల గాయత్రి సింగపూర్ కోర్టులో అంగీకరించారు.

ఆసియాలోని పొరుగు దేశాల నుంచి వచ్చే పని మనుషులను యజమానులు చూసే వైఖరి పట్ల మానవ హక్కుల కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఆ ఇంట్లో పనికి కుదిరిన ఆరంభం నుంచే పియాంగ్‌పై గాయత్రి వేధింపులు మొదలయ్యాయని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

పియాంగ్ పని నెమ్మదిగా చేస్తారని, పరిశుభ్రత పాటించరని, ఆహారం చాలా ఎక్కువ తింటారని అంటూ గాయత్రి నిత్యం వేధిస్తూ ఉండేవారని కోర్టు విచారణలో పేర్కొన్నట్లు స్థానిక పత్రికలు రాశాయి.

పియాంగ్ మరణానికి నెల ముందు రికార్డైన సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఆమెను చిత్ర హింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. అలా ప్రతి రోజూ జరుగుతూ ఉండేదని అంటున్నారు.

"ఒకరోజు బాగా వేడెక్కిన ఇస్త్రీ పెట్టెతో కూడా ఆమెకు వాతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెను "చింపిరి గుడ్డలు చుట్టిన బొమ్మలా విసిరేస్తానని" కూడా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పియాంగ్‌కి చాలాసార్లు నీళ్లలో ముంచిన రొట్టె, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన ఆహారం లేదా కొంచెం అన్నం పెడుతూ ఉండేవారని కోర్టు విచారణలో తెలిసింది. ఆమె 14 నెలల్లో 15 కిలోల బరువును కోల్పోయారు.

గాయత్రి మురుగాయన్, ఆమె తల్లితో కలిసి తీవ్రంగా హింసించడంతో 2016 జులైలో పియాంగ్ మరణించారు. ఆమె మెదడుకి తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో, ఊపిరాడక చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

పని మనిషి

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత క్రూరంగా ప్రవర్తించిన గాయత్రికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని కోరారు. కానీ, ఆ సమయంలో ఆమె మానసిక ఒత్తిడికి, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిస్ ఆర్డర్‌తో బాధపడుతూ ఉండటం వలన శిక్షను తగ్గించాలని ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభ్యర్ధించారు.

ఆమె భర్త కెల్విన్ చెల్వమ్‌తో పాటు ఆమె తల్లిపై కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆయనను 2016లోనే పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు స్థానిక పత్రికలు రాశాయి.

పియాంగ్ అనేక సార్లు డాక్టర్ల దగ్గరకు వెళ్లినప్పటికీ ఆమె పరిస్థితిని ఎవరూ గమనించలేదని సింగపూర్ మానవ వనరుల శాఖ మంత్రి జోసెఫీన్ టియో అన్నారు.

ఒకసారి పియాంగ్ ఒంటిపై గాయాలను డాక్టర్ చూసినప్పటికీ ఆమె కింద పడ్డారని మురుగాయన్ చెప్పినట్లు తెలిసింది.

ఈ కేసు తీవ్రంగా కలచివేసిందని, విదేశాల నుంచి వచ్చి పనిచేసే వారికి రక్షణ కల్పించేందుకు ఇటీవలి కాలంలో దేశంలో అనేక రకాల భద్రతా చర్యలను అమలు చేసినట్లు సింగపూర్ మంత్రి టియో చెప్పారు.

డాక్టర్లు వైద్య పరీక్షలను పరిశీలించే విధానాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆమె చెప్పారు.

ఎవరైనా వేధింపులకు గురవుతున్నట్లు డాక్టర్లు గుర్తిస్తే, వెంటనే పోలీసులకు తెలియచేయాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆమె అన్నారు.

సింగపూర్‌లో విదేశాల నుంచి వచ్చి పని చేస్తున్న పని మనుషులు సుమారు 2,50,000 మంది ఉంటారు. ముఖ్యంగా వీరు ఇండోనేసియా, మియన్మార్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వస్తారు.

వేధింపుల కేసులు ఇక్కడ కొత్తేమీ కాదు. 2017లో ఫిలిప్పీన్స్‌కి చెందిన ఒక పని మనిషిని ఆకలితో మాడ్చిన నేరానికి ఒక జంటకు జైలు శిక్ష పడింది. 2019లో మియన్మార్‌కు చెందిన మహిళను వేధింపులకు గురి చేసినందుకు మరొకరికి జైలు శిక్ష పడింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)