బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?

సజ్జనార్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జనవరి 24వ తేదీ... రాత్రి 10.40 గంటలు. శంషాబాద్ విమానాశ్రయం.

ఇమ్మిగ్రేషన్ దగ్గర విదేశాలకు వెళ్లాలనుకునే వారి పత్రాలు చెక్ చేస్తున్నారు. అధికారులు ఒక్కొక్కరినీ క్లియర్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చిన సంజీబ్ దత్తా, రాము దాస్, మొండల్ సందీప్‌లు ఇమ్మిగ్రేషన్ దగ్గరకు వచ్చారు. కాసేపట్లో వారు దుబాయ్ విమానం ఎక్కాల్సి ఉంది.

విచారణ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. వీరి పత్రాల్లో తిరకాసు ఉందనిపించింది. భాష కూడా తేడాగా వినిపించింది. దీంతో వారు లోతుగా విచారించారు. ఈ ముగ్గురూ భారతీయులు కాదు, బంగ్లా దేశీయులని తేలింది.

తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి వాటిని ఉపయోగించుకుని వారు భారత పాస్ పోర్టులు తీసుకున్నారు. ఆ మర్నాడు అంటే, జనవరి 25 మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ముగ్గురిపైనా, ఇమ్మిగ్రేషన్ అధికారులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమీర్‌కి బంగ్లాదేశ్‌లో చాలా పరిచయాలున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందినవారిని అక్కడి నుంచి అక్రమంగా, అధికారులకు దొరకకుండా భారత్‌కు ఎలా రావాలో బాగా గైడ్ చేస్తాడు. అలా వచ్చిన వారికి భారతదేశంలో ఆధార్ కార్డులు ఇప్పిస్తాడు. ఇలా అతను ఎందరో బంగ్లాదేశీయులకు భారతీయ గుర్తింపు పత్రాలు ఇప్పించాడు.

అలా 2013లో అక్రమంగా దేశం దాటి వచ్చిన పరిమళ్ అనే వ్యక్తి ముందుగా బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఒక పాన్ కార్డు తీసుకున్నాడు. మెల్లిగా నిజామాబాద్ జిల్లా బోధన్ చేరాడు. కొంత కాలానికి అన్ని పత్రాలూ సంపాదించి, తరువాత, పాస్ పోర్టు కూడా సంపాదించాడు. అదే పద్ధతిలో పూనాలో పనిచేస్తోన్న తన సోదరుడు గోపాల్ (బంగ్లాదేశీ)కి కూడా పాస్ పోర్టు ఇప్పించాడు. తరువాత ఇదే పనిగా పెట్టుకున్నాడు.

నదియా జిల్లాకే చెందిన సమీర్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఒక ఆయుర్వేద క్లినిక్ పెట్టాడు. మెల్లిగా ఆ సమీర్ దగ్గరకు పరిమళ్ వచ్చాడు. వీరిద్దరూ కలసి ఈ పాస్ పోర్టుల వ్యాపారం మొదలుపెట్టారు.

దొంగ పాస్‌పోర్టుల దందా

ఎలా సంపాదిస్తారు?

ముందుగా వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వస్తారు. ఆ తరువాత బెంగాల్ లేదా తెలంగాణలో ఆధార్ కార్డు పొందుతారు. వాటిని ఉపయోగించి పాస్ పోర్టు తీసుకుంటారు.

పాస్‌పోర్టు వెరిఫికేషన్ దగ్గర పోలీసులను మేనేజ్ చేస్తారు. పాస్ పోర్టు రాగానే, వీసా సంపాదించి విదేశాలకు వెళ్లిపోతారు. పైన చెప్పిన పరిమళ్ అనే అతను 2013లో భారత్ రాగా, 2013లో పాస్ పోర్టు తీసుకున్నాడు.

ఇందులో చాలా చేతులున్నాయి. ముందుగా బంగ్లా నుంచి భారత్ రావడానికి సమీర్ సహకరిస్తాడు. ఆ తరువాత పత్రాల తయారీ పరిమళ్ చూస్తాడు. కొన్ని బెంగాల్ లో తీసుకుంటారు. కొన్ని తెలంగాణలో తీసుకుంటారు. బెంగాల్ లో తీసుకున్నవాటికి తరువాత తెలంగాణలో ఎడ్రస్ చేంజ్ చేస్తారు.

బోధన్ లో మీ సేవ సెంటర్ నడిపే మతీన్ మహమ్మద్ తప్పుడు ఆధార్ తయారు చేసిస్తాడు. వాటి ద్వారా పాస్ పోర్టు తీసుకుంటారు. పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం ఒకే అడ్రస్, ఒకే నంబర్ ఇస్తారు. అయినా తేడా రాకుండా, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అధికారులు మల్లేశ్, అనిల్‌లు సహకరిస్తారు. తరువాత షహనాజ్, సద్దాం హుస్సేన్.. ఈ ఇద్దరూ కలసి ఫ్లైట్ టికెట్లు అరేంజ్ చేస్తారు. ఇరాక్ లో ఉన్న సమీర్ కొడుకు మనోజ్ వీసా విషయంలో సహకరిస్తాడు.

పాస్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో పోలీసులు మొత్తం 72 మంది అక్రమంగా పాస్ పోర్టులు తీసుకున్నారని తేల్చగా, వాటికి సంబంధించిన ఆధార్ కార్డుల్లో 60 బెంగాల్ నుంచి, 12 తెలంగాణ నుంచి తీసుకున్నవి ఉన్నాయి. పోలీసు సిబ్బంది మల్లేశ్ 42 పాస్ పోర్టులు, అనిల్ 30 పాస్ పోర్టులు రికమండ్ చేశారు.

ఈ 72 మందిలో పోలీసులకు ముగ్గురు దొరకగా, 19 మంది దేశం విడచిపోయారు. ఇంకా 49 మందిని పట్టుకోవాలి. వారి కోసం లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చారు. ఈ 72 మంది ఆధార్, పాస్ పోర్టులు రద్దు చేయమని పోలీసులు లేఖలు రాశారు.

అలాగే బెంగాల్ అధికారులకు కూడా లేఖలు రాశారు. వీరిలో ఒకరి దగ్గర బంగ్లాదేశ్ పాస్ పోర్టు కూడా ఉండటం విశేషం.

ఒక మొబైల్ నంబర్ నుంచి 15, రెండో నంబర్ నుంచి 13, మూడో నంబర్ నుంచి 10, నాలుగో నంబర్ నుంచి 5, ఐదో నంబర్ నుంచి 3 పాస్ పోర్టులు తీసుకున్నారు. ఇక బోధన్‌లో ఏడు అడ్రస్‌ల నుంచి 72 పాస్ పోర్టులు తీసుకోగా, వాటిలో 37 ఒకే ఇంటి నుంచి, 20 మరో ఇంటి నుంచి, మిగతా 15 మరో ఐదు అడ్రస్‌ల నుంచి తీసుకున్నారు.

వీరిపై ఐపీసీ 420, 468, 471 తో పాటూ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద కేసులు నమోదయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రోహింజ్యా రాజకీయం

బోధన్ కేంద్రంగా రోహింజ్యాలకు పాస్ పోర్టులు ఇస్తున్నారని ఆరోపిస్తోంది బీజేపీ.

'రోహింజ్యాలకు ప్రేమతో.. మీ టిఆర్ఎస్’ అంటూ పోస్టు పెట్టారు నిజామాబాద్ ఎంపీ అరవింద్.

బోధన్‌లో రోహింజ్యాలకు అక్రమ పాస్ పోర్టులు ఇస్తున్నారని... టీఆర్ఎస్ నేతలు, కొందరు పోలీసుల ప్రమేయంతో అవి వస్తున్నాయని అరవింద్ ఆ పోస్టులో ఆరోపించారు. బోధన్‌లోనే 72 మందికి వచ్చాయంటే, హైదరాబాద్‌లో ఇంకెంత మందికి వచ్చి ఉంటాయోనని అన్నారు.

టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలతో రోహింజ్యాలకు తెలంగాణ అడ్డాగా మారుతోందనీ, పాస్ పోర్టుల్లోనూ కక్కుర్తి పడి దేశ భద్రతకు టీఆర్ఎస్ ప్రమాదకరంగా మారిందని విమర్శించారు అరవింద్.

అయితే ఈ 72 మందిలో ఒక్కరూ రోహింజ్యాలు లేరని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ అక్రమ పాస్ పోర్టులు తీసుకున్న వారంతా బంగ్లాదేశ్ వారు కాగా, వారికి సహకరించిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.

అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కూడా అరవింద్ మాటలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విదేశీయులు దేశంలోకి వస్తున్నారని, దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని సవాల్ విసిరారు.

బోధన్ లో రోహింజ్యాలు లేరన్న షకీల్, మతాల మధ్య చిచ్చు పెట్టడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు. బోధన్‌లో రోహింజ్యలున్నట్టు నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తానన్న ఆయన, ఇది కేంద్ర నిఘా వైఫల్యం అని విమర్శించారు.

గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జయ శంకర్ ఇప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నారని, ఆయనకు పాస్ పోర్టులు ఎలా ఇవ్వాలో తెలియదా అని ప్రశ్నించారు షకీల్.

పోలీసులు

కేసులో నిందితులు:

  • నితాయ్ దాస్ అలియాస్ సంజిబ్ దత్తా, 20 ఏళ్లు, బోధన్ లో బంగారం షాపులో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ లోని కోమిల్లా జిల్లా దుర్గాపూర్ గ్రామం
  • మహమ్మద్ రానా మియా అలియాస్ సందీప్ మొండల్, 20 ఏళ్లు, బోధన్ లో డ్రైవర్, బంగ్లాదేశ్ లోని మగురా జిల్లా నగోషా గ్రామం
  • మహమ్మద్ హసీబుర్ రహ్మాన్ అలియాస్ రాము దాస్, 20 ఏళ్లు, బోధన్ లో ఉంటున్నాడు, సొంతం బంగ్లాదేశ్ లోని మగురా జిల్లా నగోషా గ్రామం
  • సమీర్, పశ్చిమ బెంగాల్
  • పరిమల్ బైన్ అలియాస్ శివం అలియాస్ శోవన్, 31 ఏళ్ళు, పాస్ పోర్ట్ ఏజెంట్, బోధన్ లో నివాసం, సొంతూరు బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని గోల్ గ్రామ్ గ్రామం
  • షహ్నాజ్ పైల్ అలియాస్ సబుజ్, 34 ఏళ్లు, బెంగాల్ నదియా జిల్లా ఫతేపూర్ గ్రామం
  • మతీన్ అహ్మద్ మీర్జా, 26 ఏళ్లు, మీసేవ సెంటర్ బోధన్
  • మనోజ్, సమీర్ కొడుకు, బెంగాల్, ప్రస్తుతం ఇరాక్ లో ఉన్నాడు.
  • సద్దాం హుస్సేన్, ముంబై నివాస్, ఫ్లైట్ టికెట్ ఏజెంట్
  • పి మల్లేశ్, ఎస్సై
  • అనిల్ కుమార్ ఎఎస్సై

వీరిలో సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ లు పరారీలో ఉండగా, మిగతా వారిని పోలీసులు పట్టుకున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)