ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’

కొమరవోలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీలో నేతలందరూ మహిళలే. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులన్నింటికీ ఆ ఊరి ఓటర్లు మహిళలనే ఎన్నుకున్నారు.

అలా అని ఇవన్నీ ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు కాదు. చాలా వాటికి పోలింగ్ జరిగింది. పది వార్డులకు గాను ఆరు వార్డుల నుంచి పురుషులు బరిలోకి దిగారు. గ్రామస్థులు మాత్రం అన్ని పదవులకూ మహిళలనే ఎన్నుకున్నారు.

‘పొలం నుంచి వచ్చాను... పోటీ చేయమన్నారు’

కోమరవోలు పంచాయితీ విశాఖజిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అయితే ఇది నర్సీపట్నానికి సమీపంలో ఉంటుంది.

ఇక్కడి మొత్తం జనాభా 2,100. పురుషులు 1104 మహిళలు 996. మొత్తం ఓటర్లు 1804. అంటే గ్రామంలో పురుషుల సంఖ్యే అధికం. అయినప్పటీకి పంచాయితీ ఎన్నికల్లో మహిళలే ఇక్కడ అందరూ విజయం సాధించారు.

‘‘పొలం పని తప్ప...మరోకటి తెలియని నేను ఈ ఆడోళ్ల పంచాయితీ జట్టులో నేను మెంబరుగా ఉండటం ఆనందంగా ఉంది’’ అని ఆరో వార్డు నుంచి గెలుపొందిన సత్యవతి చెప్పారు. సత్యవతిపై రెండు వేర్వేరు పార్టీల మద్దతుతో ఇద్దరు పురుషులు పోటీ చేసినా వారు ఓటమి పాలయ్యారు.

"పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మా పంచాయితీకి రిజర్వేషన్ జనరల్ వచ్చింది. ‘ఊర్లో ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారు?’ అనే చర్చ మొదలైంది. మా మాజీ సర్పంచ్ గొర్లె చిట్టెమ్మనాయుడు భార్య సర్పంచ్ గా పోటీ చేస్తున్నారని తెలిసింది. నామినేషన్‌కి ఒక రోజు గడువు ఉందనగా మా ఇంటికి మా ఊరి ఆడవాళ్లు కొందరు వచ్చారు. అప్పుడే నేను పొలం పని నుంచి ఇంటికి వచ్చాను. ఆరో వార్డుకి వార్డు మెంబరుగా నువ్వు పోటీ చేయాలని నన్ను అడిగారు. నాకు అర్థం కాలేదు. మేమంతా వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నాం. మీ వార్డు ఒక్కటే మిగిలింది. మీ వార్డు నుంచి నువ్వు పోటీ చేస్తే అంతా మహిళలమే పోటీలో ఉంటాం అని చెప్పారు. ప్రచారానికి వచ్చి... ఊర్లో తెలిసినోళ్లం కదా అని చమత్కారం ఆడుతున్నారని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది మహిళలంతా ఒక జట్టుగా ఏర్పడి పోటీ చేస్తున్నారని. నేను కూడా ఒప్పుకున్నా. ఏ రోజు రాజకీయాల కోసం ఆలోచించలేదు. కానీ అందరితో పాటు పోటీ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు గెలిచి వార్డు మెంబరయ్యాను. మా ఊరోళ్లు అందరూ ఆడోళ్లపై పెట్టుకున్న నమ్మకానికి దణ్ణం పెడుతున్నా" అని సత్యవతి బీబీసీతో అన్నారు.

కొమరవోలు

‘ఏ ఇంట్లో పేరంటం?’

ఎన్నికకు ముందు సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసుకున్నారు. అయినా నామినేషన్లు చివరకు వచ్చేసరికి ఎవరైనా పోటీకి నిలబడతారేమోనని గ్రామంలో చర్చలు జరిగేవి.

వార్డు మెంబర్ల విషయంలో మాత్రం దాదాపు అన్ని వార్డులకు పోటీలో నిలబడేందుకు వైకాపా, టీడీపీ, జనసేన మద్ధతుదారులు సిద్దమయ్యారు. దాంతో పోటీ తప్పదని భావించిన వారందరూ గ్రామంలో ప్రచారం మొదలు పెట్టారు.

"సర్పంచ్‌గా మహిళ ఏకగ్రీవం కావడంతో...రాజకీయ కుటుంబ నేపథ్యం, అనుభవం లేకపోయినా అంతా మహిళలే పోటీ చేస్తే బాగుంటుందని మేం అనుకున్నాం. ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. నేను బీఎడ్ చేశాను. నాకు రాజకీయాల పట్ల అవగాహన, ఆసక్తి ఉన్నాయి. దాంతో అంతా మహిళలే ఒక గ్రామపంచాతీని లీడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అయితే పోటీలో మిగతావారు కూడా ఉండటంతో సాధ్యపడుతుందా అని అనుకున్నాం. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అని బరిలోకి దిగాం’’ అని అని వార్డు మెంబరుగా గెలిచిన సామిరెడ్డి సత్య బీబీసీతో చెప్పారు.

‘‘మేమంతా ప్రచారానికి వెళ్తుంటే చాలా మంది పేరంటానికి వెళ్తున్నామని అనుకునేవాళ్లు. కొందరు నేరుగా మమ్మల్నే ‘ఏ ఇంట్లో పేరంటం?’ అని అడిగేవారు. కొందరైతే మేమంతా కలిసి గుంపుగా వెళ్లడం చూసి నవ్వుకునేవారు. ఇప్పటివరకూ మా పంచాయితీకి 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల కిందట ఒకసారి పోతల గీతమ్మ అనే మహిళ సర్పంచ్‌గా చేశారు. అలాగే ముగ్గురు, నలుగురు వార్డు మెంబర్లుగా చేశారు. అంతే కానీ మొత్తం మహిళలే ఎన్నికవడం మక్కూడా ఆశ్చర్యంగా ఉంది. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రతి ఇంటికీ వెళ్లి... అంతా మహిళలమే పోటీ చేస్తున్నాం. గెలిపిస్తే ఊరిలోని మిగతా మహిళలంతా కలిసి చర్చించుకుని గ్రామ సమస్యల పరిష్కరించుకోవచ్చు. అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అంటూ ప్రచారం చేసేవాళ్లం" అని ఆమె వివరించారు.

కొమరవోలు

అక్షరం తెలియని కూలీ...

కోమరవోలు పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచి... గెలిచిన మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కొందరికి రాజకీయ నేపథ్యం ఉంటే...మరికొందరు అసలు రాజకీయమంటే అర్థమే తెలియని వారు కూడా ఉన్నారు.

పీజీలు చేసినవారు ఇద్దరు ఉంటే...అసలు బడి ముఖం చూడని వారు ముగ్గురున్నారు. అయితే వారు కూడా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. పంచాయితీ ఆఫీసు రిజిస్టర్‌లో ఆ సంతకాలే పెడుతూ సంబరపడ్డారు.

"మేమంతా కలిసి 11 మందిమండీ. అందులో నలుగురు ఏకగ్రీవంగా గెలిచారు. మిగతావాళ్లం పోటీలో నిలబడ్డాం. అయితే నేను పెద్దగా చదువుకోలేదు. నాతో పాటు మరో నలుగురు కూడా పొలం పనులు చేసుకునేవాళ్లమే. ఉదయాన్నే లేవడం పొలం పనులకి పోవడం ఇదే మా పని. అయితే మన ఉర్లోని కొందరు చదువుకున్న ఆడోళ్లు, సర్పంచు గారు కలిసి అంతా మహిళలమే నిలబడాదామని అనుకుంటున్నాం. మీరు కూడా బరిలో ఉండండి అని అడిగారు. మేమేం చదువుకోలేదు. మాకేటి రాజకీయం తెలుస్తుందని అడిగాం. రాజకీయమంటే మన ఊరిని బాగుచేసుకోవడమే అని చెప్పారు’’ అన్నారు ఏడో వార్డు నుంచి గెలుపొందిన సీతారామమ్మ.

‘‘చదువుకున్నోళ్లు తోడు ఉన్నారనే ధైర్యంతో...వాళ్లే మమ్మల్ని నడిపిస్తారన్న నమ్మకంతో...మేం బరిలో దిగాం. మాపై పోటీగా మగాళ్లు నిలబడ్డారు. అయినా అందరం ఆడోళ్లమే గెలిచాం. ఊరోళ్లు మా మీద ఇంత నమ్మకంతో గెలిపిస్తారని మాత్రం అనుకోలేదు. మా ఊరిని ఇంకా అభివృద్ధి చేసి...మాకు ఓటేసినోళ్లు తప్పు చేయలేదని నిరూపిస్తాం" అని ఆమె అన్నారు.

కొమరవోలు

‘పదవుల కోసం కాదు... పని చేసి చూపించాలి’

సాధారణంగా పంచాయితీ ఎన్నికల్లో మహిళలు గెలిచినా... వారి స్థానంలో వారి భర్తో, అన్నో, తండ్రో కూర్చుని అధికారం చలాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితే ఉంటుందా అన్న అంశం గురించి ప్రస్తుత సర్పంచ్ రమణమ్మ, అలాగే ఆమె భర్త మాజీ సర్పంచ్ చిట్టెంనాయుడుతో బీబీసీ మాట్లాడింది.

"ఆడవాళ్లుని ముందుకి పెట్టి... వెనుక ఉండి నడిపించాలని అనుకుంటే...ఇప్పటీకే మూడు సార్లు నేను సర్పంచ్‌గా చేశాను. మళ్లీ చేయగలను. పైగా సర్పంచ్ పదవికి మహిళ రిజర్వేషన్ కూడా రాలేదు. జనరల్ వచ్చింది. అయినా ఆడవాళ్లను నిలబెట్టి వాళ్లను గెలిపించాలని అనుకున్నాను. మాది రాజకీయ కుటుంబమే. రాజకీయాలు కొత్తకాదు. అందుకే రాజకీయాల్లో మహిళలకు ఉన్న ప్రాధాన్యత తెలుసు. వాళ్ల ఆలోచనా విధానం బాగుంటుంది. ఇంటిని బాగుచేసినట్లే ఊరిని బాగుచేయగలరు. అందుకే మహిళలకి మద్దతు ఇచ్చాం. వాళ్లు పదవుల కోసం కాదు... ప్రజల కోసం పని చేసి చూపించాలి" అని మాజీ సర్పంచ్ చిట్టెంనాయుడు చెప్పారు.

"మా ఇంట్లో రాజకీయ చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇక మా ఊరి రాజకీయాలు, ఇతర విషయాలు అన్నీ నాకు తెలుసు. అందుకే ఈ సారి నేను సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతానని చెప్పాను. నా భర్త సరే అన్నారు. పోటీలో ఎవరైనా వస్తారని అనుకున్నాను. నామినేషన్ చివరి రోజు వరకూ ఒకటో, రెండో పేర్లు వినిపించినా... మా కుటుంబంపై ఉన్న గౌరవం కొద్ది వారు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవం చేసేందుకు సహకరించారు. నేను సర్పంచ్ అవ్వడం పెద్ద విషయం కాదు. కానీ మిగతా వార్డు మెంబర్లతంతా మహళలే ఎన్నికవ్వడం... ఈ ఊరు మహిళలకు ఇచ్చిన గౌరవనికి నిదర్శనం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మా పెద్దల సలహాలు తీసుకుంటూనే మహిళలుగా మేమేంటో నిరూపిస్తాం" అని కొమరవోలు సర్పంచ్ రమణమ్మ అన్నారు.

కొమరవోలు

అభినందనల వెల్లువ

కొమరవోలు పంచాయితీ ఎన్నికల్లో అంతా మహిళలే ఎన్నికవ్వడం చుట్టూ పక్కల పెద్ద చర్చనీయాంశమైంది. ఏకగ్రీవంగా కాకుండా పోటీలో నిలిచి మరీ అంతా మహిళలే గెలువడం బేష్ అంటున్నారు.

ప్రతీ వార్డు నుంచి మహిళ అభ్యర్థి ఉండటం...వారు కూడా గ్రామంలో మంచిపేరు తెచ్చుకున్నవారే కావడంతో వారికే ఓటేశాం అని కొమరవోలు నివాసి ఈశ్వరనాయుడు చెప్పారు. కచ్చితంగా గతంలో కంటే రానున్న ఐదేళ్లలో మా ఊరు ఎక్కువ అభివృద్ధి చెందుతుందని గ్రామస్థుల్లో చాలా మంది అంటున్నారు.

కొమరవోలు పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల‌ను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్లా ఉమాశంకర్ అభినందించారు. ఇది మహిళలు సాధించిన విజయమని...ఊరంతా మహిళలకే పట్టం కట్టడం చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తామని చెప్పారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)