వైజాగ్ స్టీల్ ప్లాంట్: ‘ఆర్ కార్డులు పట్టుకుని ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం... మా నెత్తిన బాంబు వేశారు’

‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో జరిగిన పోరాట ఫలితంగా 1971, జనవరి 20న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన జరిగింది. 1977లో కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కి రూ.1000 కోట్లు మంజూరు చేయడంతో ప్లాంట్ పనులు చురుగ్గా మొదలయ్యాయి.
రష్యా సహకారంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం సాగింది. అప్పటివరకు SAIL (స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా)లో భాగంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18న రాష్ట్రీయ ఇస్ఫాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)గా ఆవిర్భవించింది.
అందుకే ఫిబ్రవరి 18వ తేదీని ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.
20 ఏళ్లకు ఉత్పత్తి... మరో 30 ఏళ్లకు ప్రైవేటీకరణ!
నిధుల కొరతతో మెల్లగా పనులు పూర్తి చేసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిన దాదాపు 20 ఏళ్లకు 1990లో ఉత్పత్తి ప్రారంభించింది. మరో రెండేళ్లకు పూర్తి స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేస్తూ... ఇప్పుడు 7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరింది.
ఇక ఉత్పత్తి ప్రారంభించిన 30 ఏళ్ల తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది.
"32 మంది ప్రాణ త్యాగాల ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ నేడు ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందంటే దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. 17 వేల మంది శాశ్వత ఉద్యోగులతో.. లక్షకు పైగా పరోక్షంగా ఆధారపడిన వారితో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందరికో అన్నం పెడుతోంది. ఎన్నో ఏళ్ళు లాభాలు అందించిన స్టీల్ ప్లాంట్‌ను.. ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయడం అన్యాయం. ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మాకు, మా తర్వాత తరాల వారికి ఉద్యోగాలు వస్తాయని వేలాది ఎకరాలను ఇచ్చి... నేడు నిర్వాసితులుగా మారిన మా రైతుల పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారు?" అని స్టీల్ ప్లాంట్ నిర్వాసిత గ్రామవాసి వి. కొండబాబు బీబీసీతో అన్నారు.

‘భూమి తీసుకుని, బిచ్చగాళ్లుగా మార్చారు’
విశాఖ అంటే అందరికి గుర్తొచ్చేది స్టీల్ ప్లాంటే. అలాగే స్టీల్ ప్లాంట్ అంటే అందరు మాట్లాడుకునేది ఆర్ కార్డుల కోసమే. ఆర్ కార్డు అంటే రీహాబిలిటేషన్ కార్డు. ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు స్టీల్ ప్లాంట్ వీటిని ఇచ్చింది.
అప్పట్లో 16,500 మందికి ఈ కార్డులను ఇస్తే...దఫదఫాలుగా వీరిలో 8,500 మందికి ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,000 మంది ప్లాంట్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
"మా మామగారు 3 ఎకరాల పొలం ప్లాంట్ కోసం ఇచ్చారు. అప్పట్లో అయనకి ఆర్ కార్డు ఇచ్చారు. ఆయన చనిపోతే అది నా భర్తకు బదిలీ చేశారు. ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆయనా చనిపోయారు. ఇప్పుడు ఆ కార్డు మా అబ్బాయి పేరున మార్చారు. అది జరిగి పదేళ్లు అయిపోయింది. నా కొడుక్కి ఉద్యోగం లేదు. రేపోమాపో వస్తుందని ఎదురు చూస్తుంటే...ఇప్పుడు ప్రైవేటీకరణ అని మా నెత్తిన బాంబు పేల్చారు. మేం ఎలా బతికేది? పొలం ఉంటే దర్జాగా బతికేవాళ్లం. ఉద్యోగాల పేరుతో అది తీసుకున్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండంటూ మేమే తిరిగి ప్లాంట్ వాళ్లని అడుక్కుంటున్నాం. మా భూములు తీసుకుని మమ్మల్ని బిచ్చగాళ్లని చేసేశారు" అని నిర్వాసితురాలు, పెదగంట్యాడ నివాసి ఆదిలక్ష్మీ బీబీసీతో చెప్పారు.
‘అప్పుడు 1100...ఇప్పుడు 8 కోట్లు...’
స్టీల్ ప్లాంట్ రాకతో విశాఖ రూపురేఖలు మారిపోయాయి. స్టీల్ ప్లాంట్ పరిసరాలను అనుకుని ఉన్న నిర్వాసిత గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గం తలసరి ఆదాయం ప్రకారం రాష్ట్రంలోనే ధనిక నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది.
"64 గ్రామాల రైతులం భూములు ఇచ్చి... నేడు నిర్వాసితులుగా మారాం. స్టీల్ ప్లాంట్ వల్ల కొందరికి ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం. కానీ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని మాటిచ్చి, ఆర్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం... వాటిని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడమే తప్పా... ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. 50 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిర్వాసిత కుటుంబాలకు చెందిన వారిగా... మేం ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. ఒక వేళ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసుకోవాలనుకుంటే మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి. మా పెద్దలు అప్పట్లో ఎకరం 1,100 రూపాయలకు ఇచ్చారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనైనా ఎకరం రూ.8 కోట్లకు తక్కువ లేదు" అని చెప్పారు వడ్డపూడికి చెందిన నిర్వాసితురాలు రాజేశ్వరి.

ఆర్ కార్డు....
ప్లాంట్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఆర్ కార్డు హోల్డర్స్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం చుట్టూ రోజూ తిరుగుతూ ఉంటారు. 1971లో భూములిచ్చిన కుటుంబాల్లోని మూడో తరం వారసులు ఎనిమిది వేల మంది ప్లాంట్‌లో ఉద్యోగం కోసం ఆర్ కార్డులను ప్రాణం కంటే భద్రంగా చూసుకుంటారు.
మరికొన్ని రోజుల్లో వాటితో ఇక పని ఉండకపోవచ్చునని నిర్వాసితులు అంటున్నారు.
"పాస్ పోర్ట్ ఫోటోపై ఆర్ నెంబర్(ఉదాహరణకు...R NO. 71) అని రాసి అదే నిర్వాసితుడికి గుర్తుగా ఉండేది. ఆ కార్డుపై ఉన్న నెంబరు స్టీల్ ప్లాంట్ రికార్డుల్లో ఉండేది. ఆ నెంబరే మాకు అన్నింటికి ఆధారం. ఆ తర్వాత తరంలో ఆర్ కార్డు రూపం మారింది. పోస్ట్ కార్డు వెనుక పాస్ పోర్ట్ ఫోటో అతికించారు. దాని ముందు భాగంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో నమోదు చేసుకున్న వివరాలుండేవి. మూడో తరమైన మా వరకు వచ్చేసరికి కార్డు ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయ్యిందో వారి ఫోటోలతో లామినేషన్ చేసిన ఆర్ కార్డు వచ్చింది. ఇలా కార్డు అనేక రూపాలు మార్చుకుంది. కానీ మా జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. నిర్వాసితులుగా మా జీవితం ఆర్ కార్డు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసు మధ్యే నలిగిపోయింది. ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. నాకు మరోచోట ఉద్యోగం రాదు. స్టీల్ ప్లాంటే ఉండదు. మా పరిస్థితి చాలా అందోళనకరంగా ఉంది" అని వియ్యపువానిపాలెం వాసి హరి బీబీసీతో తన ఆవేదన చెప్పుకున్నారు.
‘ఐటీఐయే మాకు ఐఐటీ’
స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం కోసం స్థానిక యువత అంతా కూడా టెక్నికల్ కోర్సులు ఎక్కువగా చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివేవాళ్లే నిర్వాసిత గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ యువత పీజీలు, పీహెచ్డీలు చేసినా కూడా ...స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు కోసం ఐటీఐ, డిప్లామో వంటి టెక్నికల్ కోర్సులు తప్పనిసరిగా చేస్తారు.
"ఆర్ కార్డు ఉండి పది పాసైతే ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందని మొదట్లో అనుకునేవాళ్లం. ఆ తరువాత ఐటీఐ వంటి టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్లకే ఉద్యోగాలు వస్తాయని... అవి చేయడం మొదలు పెట్టాం. ఎందుకైనా మంచిదని... ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఇలా రెండు, మూడు విభాగాల్లో ఐటీఐ కోర్సులు చేసేవాళ్లం. ఏ విభాగంలో పోస్టులు పడినా అర్హులం అవుతామని. ఐటీఐ చదివితేనే ఐఐటీతో సమానంగా చెప్పుకుంటాం. ప్లాంట్‌లో అప్పుడప్పుడు ఉద్యోగాలు తీసినా అందులో కూడా ఆర్ కార్డు ఉన్నవారికి ప్రత్యేకంగా కోటా ఇచ్చేవారు కాదు. నిజానికి దీనిపై యూనియన్లు కూడా సరైన పోరాటాలు చేయలేదు. దాంతో నిర్వాసితులకి మొదట్నుంచి అన్యాయమే జరిగింది. నేను ఐటీఐలో ఫిట్టర్ కోర్సు చేసి 10 ఏళ్లు అవుతుంది. ప్రైవేటీకరణ మాట విన్నప్పటీ నుంచి నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఉద్యోగాలు ఇక ఎలాగు రావు, కనీసం మా భూములైనా ఇచ్చేస్తే... స్టీల్ ప్లాంట్‌కి కోటి దండాలు పెట్టి నిత్యం స్టీల్ ప్టాంట్ వ్యవస్థాపక దినాన్ని మేమే ఘనంగా నిర్వహించుకుంటాం" అని అగనంపూడి వాసి రమేష్ చెప్పారు.

పోస్కోకు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆసక్తి లేదు: సీఎం జగన్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు అందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా మద్ధతు కూడా లభిస్తోంది.
టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావు అమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ వచ్చి పల్లా శ్రీనివాసరావుని పరామర్శించారు. అలాగే ప్లాంట్ గేటు వద్ద అందోళనలు చేస్తున్న దీక్ష శిబిరాలను సందర్శించి... వారికి మద్ధతు తెలిపారు.
"స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు వద్దు. అంతా కలిసి పని చేద్దాం. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా రాజీనామాలు చేస్తే...మేం కూడా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. గతంలో ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నం జరిగితే... నేను ఆపాను. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ కూడా ప్రైవేటీకరణను అపాలి" అని చంద్రబాబు మీడియాతో అన్నారు.
శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఆయన్ను స్టీల్ ప్లాంట్ కార్మిక ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కార్మిక సంఘాలతో మాట్లాడారు.
"గతంలో పోస్కోవాళ్లు నన్ను కలిసిన మాట వాస్తవం. అప్పుడు భావనపాడు, కృష్ణపట్నం, కడపలో ప్లాంట్ పెట్టమని చెప్పాను. వాళ్ళు ఇటీవల కృష్ణపట్నం వచ్చి చూసుకుని వెళ్ళారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వాళ్లకి అంత ఆసక్తి కూడా లేనట్లే ఉంది. కృష్ణపట్నంలో వాళ్లు ప్లాంట్ పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఉంది. ఇవేవి తెలియని చంద్రబాబు... పోస్కో పేరు చెప్పి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు" అని సీఎం జగన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:
- ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ సాగిన పోరాటంలో పోలీసు కాల్పులకు 32 మంది మృతి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా సాధించుకున్నారంటే
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









