సద్దాం హుస్సేన్: 'నా భర్తను మా నాన్నే చంపించారు' అని ఆయన కూతురు ఎందుకు చెప్పారు, దానికి ముందు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పెద్ద కూతురు రగద్ హుస్సేన్‌కు స్కూల్లో చదువుతున్నప్పుడే పెళ్లయిపోయింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. పెళ్లి సమయంలో ఇరాక్, ఇరాన్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది.
1996 ఫిబ్రవరిలో 25 ఏళ్ల వయసులో రగద్ తన కుటుంబ సభ్యులు ఒత్తిడితో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకులు పొందిన రెండు రోజుల తర్వాత ఆమె మాజీ భర్త హత్యకు గురయ్యారు.
రగద్ పెళ్లి సద్దామ్ హుస్సేన్ సవతి సోదరుడు హుస్సేన్ కెమాల్ అల్ మజీద్‌తో జరిగింది. హుస్సేన్ కెమాల్ అప్పటికి సద్దామ్ హుస్సేన్ సెక్యూరిటీ విభాగంలో పని చేసేవారు.
సద్దాం రెండో కూతురు రానా సద్దామ్ హుస్సేన్ పెళ్లి కెమాల్ సోదరుడు సద్దామ్ కెమాల్ అల్ మజీద్‌తో జరిగింది.
సద్దాం ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు, విడాకులు వారి భర్తల హత్యకు గురికావడం ఒక విషాదకరమైన కథ.
2018 తర్వాత రగద్ సద్దామ్ హుస్సేన్ పేరును అప్పటి ఇరాక్ ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో పెట్టింది.
రగద్ సద్దామ్ హుస్సేన్ అల్-అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారు. మీ పెళ్లి కోసం తండ్రి సద్దాం హుస్సేన్ మీద ఒత్తిడి తెచ్చారా, లేక ఆయనే మీ పెళ్లి చేశారా అని రగద్‌ను అడిగారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నా ఇష్టంతోనే పెళ్లి: రగద్ హుస్సేన్
మా నాన్న తన ఐదుగురు పిల్లల్లో ఎవరిమీదా పెళ్లి గురించి ఒత్తిడి తీసుకురాలేదు. ఆయన కూతుళ్లలో ముందుగా ఎవరూ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఆయనే ఏం చేద్దామని మమ్మల్ని అడిగారు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
"నేనప్పుడు టీనేజీలో ఉన్నాను. వేసవిలో ఓ మధ్యాహ్నం. మా నాన్న తలుపు తట్టి గదిలోకి వచ్చారు. నేను కునుకు తీస్తున్నా. ఆయన ప్రేమగా తట్టి లేపారు. ఆయన బెడ్ మీద నా పక్కనే కూర్చున్నారు. ఎలా ఉన్నావు అని అడిగారు. నువ్వు ఒకరితో ప్రేమలో పడ్డావు కదా అన్నారు. అతడి పేరు కూడా చెప్పారు" అని రగద్ చెప్పారు.
‘పెళ్లి కుటుంబంలో వారితోనే జరుగుతుంది కదా, అందుకే ఆ పరిస్థితి అసహజంగా అనిపించలేదు’ అని రగద్ చెప్పారు.
ఈ సంబంధం ఒప్పుకోడానికి, లేదా తిరస్కరించడానికి నీకు స్వేచ్ఛ ఉంది...అని మా నాన్న అన్నారు. ఆయన నాతో అదంతా చెబుతున్నప్పుడు నేను సిగ్గుపడ్డాను. దాంతో ఆయన, "చూడమ్మా, నువ్వు నీ నిర్ణయాన్ని మీ అమ్మతో చెప్పొచ్చు’’ అని అన్నారు. మా నాన్న సెక్యూరిటీ దళంలో హుసేన్ కెమాల్ అల్-మజీద్ పని చేసేవాడు. అందుకే ఆయన రోజూ నాకు కనిపించేవారు. అంగరక్షకులను నాన్న లంచ్‌కు పిలిచేవారు. అందులో ఆయన కూడా ఉండేవారు." అని అన్నారు.
"మేమిద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాం. మా అమ్మకు ఆ విషయం తెలుసు. అప్పటికి నేను చిన్నపిల్లను. కానీ ప్రేమ త్వరలోనే పెళ్లిగా మారింది. నేనప్పుడు స్కూల్లో చదివేదాన్ని. పెళ్లి తర్వాత కూడా నేను చదువు కొనసాగించాను. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాను. నా భర్తకు నేను చదువుకోవడం ఇష్టం లేదు. ఆయన అసూయ వల్ల అలా అనేవారేమో. ఇరాక్‌లో ఇప్పుడు భద్రత గురించి పెద్ద సమస్య లేదు. అందుకే స్కూల్ స్కూలుకు వెళ్లద్దని గట్టిగా చెప్పడానికి కారణం కూడా కనిపించలేదు. అయితే నా భర్త ప్రేమ, గౌరవం రెండూ ఇచ్చేవారు. ఆయన మా అమ్మనాన్నలను కూడా గౌరవించేవారు." అన్నారు రగద్.

ఫొటో సోర్స్, Getty Images
భర్త, తండ్రి మధ్య గొడవ
రగద్ తన భర్త హుస్సేన్ కెమాల్, తండ్రి సద్దాం హుస్సేన్ మధ్య వచ్చిన విభేదాల గురించి కూడా చెప్పారు.
"భర్తను పోగొట్టుకున్నది నేనొక్కదాన్నే కాదు. అప్పుడు ఇరాక్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు తమ ఇంట్లో వారిని కోల్పోయారు. వారిలో భర్తలు, తండ్రులు, కొడుకులు కూడా ఉన్నారు. నా భర్త 1995 ఆగస్టులో జోర్డాన్ వెళ్లారు. ఆయన వెళ్తున్నప్పడు నాతో మాట్లాడారు. ఆయన ఇక్కడ ఉంటే రక్తపాతం జరుగుతుందేమోనని నాకు అనిపించింది. అది కూడా కుటుంబం మధ్యే జరుగుతుంది. అందుకే ఇరాక్ వదిలి వెళ్లాలన్న ఆయన నిర్ణయాన్ని సమర్థించాను. సద్దామ్ హుస్సేన్ కూతురు కావడంతో నేను ఇంకో దేశానికి వెళ్లడమనేది అంత సులభం కాదు. అయితే జోర్డాన్‌లో మాకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. నేను దేశం బయట ఉన్నానని నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిని బహిరంగం చేసేదాకా అది ఎందుకనేది నాకప్పుడు తెలీదు." అని రగద్ వివరించారు.
జోర్డాన్ వెళ్లిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన ఏం చెబుతారు అనేది నాకప్పుడు తెలీదు అని రగద్ చెప్పారు.
ఆ ప్రెస్ కాన్ఫరెన్సులో హుస్సేన్ కెమాల్, మా నాన్న సద్దాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. తను జోర్డాన్ రావడం వల్ల సద్దాం పీఠం కదిలిపోతుందని ఆయన అన్నారు. అధికార మార్పిడికి సిద్ధంగా ఉండాలని కెమాల్ ఇరాక్ సైనికులతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జోర్డాన్‌లో ఆశ్రయం
హుస్సేన్ కెమాల్ అల్ మజీద్, ఆయన సోదరుడు సద్దామ్ కెమాల్ అల్ మజీద్ 1995 ఆగస్టు రెండోవారంలో ఇరాక్ వదిలి జోర్డాన్ వచ్చేశారు. ఇద్దరితో వారి భార్యలు రగద్, రానా కూడా ఉన్నారు.
సోదరులు ఇద్దరూ ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌కు చాలా నమ్మకస్తులుగా, సైన్యంలో మొత్తం పనులు చూసేవారు. ఇరాక్ ఆయుధ కార్యక్రమం వెనుక వీరే ఉన్నారని చెబుతారు. అలా వీరితో ఇరాక్ సైన్యంలోని 15 మంది అధికారులు కూడా ఉన్నారు. జోర్డాన్ వచ్చాక అక్కడి కింగ్ హుస్సేన్ వారికి ఆశ్రయం ఇచ్చారు. అది సద్దాం హుస్సేన్‌కు చాలా కోపం తెప్పించింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, కింగ్ హుస్సేన్ నిర్ణయాన్ని స్వాగతించారు.
సద్దాం హుస్సేన్, హుస్సేన్ కెమాల్ మధ్య విభేదాలకు కారణం ఏంటి?
"నా భర్త పలుకుబడి పెరుగుతూ వచ్చింది. మా నాన్న తర్వాత ఇరాక్‌లో నంబర్ 2 హోదా వచ్చింది. ఆయనకు ప్రముఖ పాత్ర ఉండేది. సద్దాం కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కారణం. ఆయనకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండేది. ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే సాహసం ఉండేది. నాతో పెళ్లికి ముందు నుంచే ఆయన ఆ విషయంలో చాలా ముందు ఉండేవారు. మా పెళ్లి అయినప్పుడు, హుస్సేన్ కెమాల్ స్పెషల్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా ఉండేవారు. ఇరాన్‌తో యుద్ధం జరిగినప్పుడు, అందులో పాల్గొన్న సైన్యానికి కూడా హుస్సేన్ ఇన్‌ఛార్జిగా పని చేశారు. అదే సైన్యం సద్దాం భద్రత బాధ్యతలు కూడా చూసుకునేది. ఆయనపై మొత్తం దేశ భద్రతా బాధ్యతలు ఉండేవి." అని గుర్తు చేసుకున్నారు రగద్.

ఫొటో సోర్స్, Getty Images
హుస్సేన్ కెమాల్ నుంచి విడాకుల గురించి రగద్ హుస్సేన్ వివరించారు. " నెల రోజుల్లోనే అంటే 1996 ఫిబ్రవరిలో నేను విడాకులపై నిర్ణయం తీసుకున్నాను. దీని గురించి నాన్నతో మాట్లాడాను. ఆయన చాలా బాధపడ్డారు. మా ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు నడిచాయి." అని రగద్ హుస్సేన్ తెలిపారు.
జోర్డాన్ నుండి తిరిగి వచ్చిన మూడు రోజుల తరువాత హుస్సేన్ కెమాల్ అల్-మజీద్, అతని సోదరుడు సద్దాం కెమాల్ అల్-మజీద్‌లు హత్యకు గురయ్యారు.
తన భర్తను హత్య చేయాలనే నిర్ణయం తన కుటుంబమే తీసుకుందని రగద్ హుస్సేన్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన భర్త హత్యలో తన సోదరుడు ఉదయ్ సద్దాం హుస్సేన్ పాత్ర కూడా ఉందని రగద్ అంగీకరించారు.
"నా భర్త హత్యకు గురయినప్పుడు నాకు 25 సంవత్సరాలు." అని రగద్ తెలిపారు. 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసిన తరువాత ఆమె జోర్డాన్ వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








