రోహింజ్యాలను బలవంతంగా మారుమూల భసాన్ చార్ దీవికి తరలిస్తున్న బంగ్లాదేశ్.. మానవ హక్కుల సంస్థల్లో ఆందోళన

భసాన్ చార్ దీవికి రోహింజ్యాలను తరలిస్తున్న బంగ్లాదేశ్ నేవీ షిప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భసాన్ చార్ దీవికి రోహింజ్యాలను తరలిస్తున్న బంగ్లాదేశ్ నేవీ షిప్
    • రచయిత, అక్బర్ హుసేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్‌లోని వేలాది రోహింజ్యా శరణార్థులను అధికారులు బలవంతంగా ఒక మారుమూల దీవికి తరలించడం ప్రారంభించారు. అక్కడ వారి భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు శుక్రవారం 1600 మంది శరణార్థులను బంగాళాఖాతంలో ముంపు ముప్పు పొంచి ఉన్న భసాన్ చార్ దీవి వైపు తీసుకెళ్లినట్లు రాయిటర్స్ చెప్పింది.

బంగ్లాదేశ్ మాత్రం అక్కడికి వెళ్లేందుకు అంగీకరించినవారినే తాము తరలించామని చెబుతోంది.

కానీ, అక్టోబర్‌లో బీబీసీతో మాట్లాడిన బంగ్లాదేశ్‌లోని రోహింజ్యా శరణార్థులు తాము ఆ దీవికి వెళ్లాలనుకోవడం లేదన్నారు.

శుక్రవారం చాలా మందిని బలవంతంగా ఆ దీవికి తరలించడంపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అక్కడికి తీసుకెళ్లే జాబితాలో ఉన్న 12 కుటుంబాలతో తాము మాట్లాడామని, వారిలో ఎవరూ అక్కడకు స్వచ్ఛందంగా వెళ్లడం లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పింది.

రోహింజ్యాల పునరావాసం గురించి తమకు 'పరిమిత సమాచారం' అందిందని, తరలింపు గురించి చెప్పలేదని ఐక్యరాజ్యసమితి కూడా తెలిపింది.

మరోవైపు "ప్రభుత్వం బలవంతంగా ఎవరినీ భసాన్ చార్ దీవికి తీసుకెళ్లడం లేదు. మేం అదే మాటపై ఉంటామ"ని గురువారం రాత్రి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ చెప్పారు.

భసాన్ చార్ దీవిలో నిర్మించిన భవనాలు
ఫొటో క్యాప్షన్, భసాన్ చార్ దీవిలో నిర్మించిన భవనాలు

స్వచ్ఛందమా, బలవంతమా?

మూడేళ్ల క్రితం మయన్మార్‌లో సైనిక అణచివేత చర్యలు మొదలవడంతో రోహింజ్యాలు ఆ దేశం నుంచి పారిపోయారు. ఆ సమయంలో పది వేల మందికి పైగా చనిపోగా, 7 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

అప్పటి నుంచి లక్షలమంది రోహింజ్యాలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో కిక్కిరిసిన కాక్స్ బజార్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో భసాన్ చార్ దీవికి మొట్టమొదట బలవంతంగా తరలించిన 300 మంది శరణార్థుల్లో తన పిల్లలు కూడా ఉన్నారని, బంగ్లాదేశ్‌లోకి వెళ్లాలని సముద్రంలో ఎన్నో నెలలు వేచిచూసిన వారిని కూడా అక్కడకే తరలించారని అక్టోబర్‌లో బీబీసీతో మాట్లాడిన 55 ఏళ్ల రషీదా ఖతూన్ చెప్పారు.

అక్టోబర్లో బీబీసీ ప్రతినిధులు ఆ దీవిలో పర్యటించినపుడు, అప్పటికే అక్కడ ఉంటున్న శరణార్థులను కలవడానికి అధికారులు అనుమతించలేదు.

గురువారం రాయిటర్స్ తో ఫోన్లో మాట్లాడిన ఒక యువకుడు తనను కాక్స్ బజార్ నుంచి ఒక బస్సులో ఎక్కించి, బలవంతంగా దీవికి తరలించారని చెప్పాడు.

"మూడు రోజుల క్రితం నా కుటుంబం పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు నాకు తెలీగానే, నేను బ్లాక్ నుంచి పారిపోయా. కానీ నిన్న నన్ను పట్టుకుని ఇక్కడకు తీసుకొచ్చారు" అన్నాడు.

స్వచ్ఛందంగా వచ్చినవారే కోసమే దీవిలో పునరావాసం ఏర్పాటు చేశామని శరణార్థులను అక్కడకు తరలించిన బంగ్లాదేశ్ అధికారి మహమ్మద్ షంసూద్ దోజా బీబీసీకి చెప్పారు.

"వాళ్లు అక్కడికి సంతోషంగా వెళ్లారు. ఎవరూ బలవంతం చేయలేదు. అక్కడ వారికి సుఖంగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటూ అక్కడ ఎలాంటి విపత్తులూ రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది" అన్నారు.

వేలాది మంది రోహింజ్యాలు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ తరలివచ్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేలాది మంది రోహింజ్యాలు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ తరలివచ్చారు

మూడేళ్ల నుంచీ నిర్మాణాలు

బంగ్లాదేశ్ అధికారులు ఈ దీవిలో 350 మిలియన్ డాలర్ల వ్యయంతో మూడేళ్ల నుంచీ నిర్మాణాలు చేపడుతున్నారు. లక్షమందికి పైగా శరణార్థులను ఇక్కడికి తరలించి బంగ్లాదేశ్‌లో ఉన్న శిబిరాల్లో ఉద్రిక్తతలు తగ్గించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే ఆ దీవిలో ఉంటున్న 306 మంది రోహింజ్యాల పరిస్థితిపై ఈ ఏడాది మొదట్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక దారుణమైన నివేదిక ఇచ్చింది.

"వారు ఇరుగ్గా, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఆహారం, ఆరోగ్య సదుపాయాలు పరిమితంగా ఉన్నాయి. శరణార్థులు తమ కుటుంబాలతో మాట్లాడ్డానికి అక్కడ పోన్లు కూడా లేవు. వాటికి తోడు నావికా దళ సిబ్బంది , స్థానిక కార్మికులు అక్కడ ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కేసులు కూడా వెలుగుచూశాయ"ని అందులో తెలిపింది.

కానీ, నావికా దళ అధికారులు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

"మా అతిథులను మేం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. వారికి తగిన ఆహారం, సౌకర్యాలు అందిస్తున్నామ"ని నావీ ప్రతినిధి కమడోర్ అబ్దుల్లా అల్ మమమ్ చౌధురి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)