‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, EPA

రోహింజ్యా ముస్లింలపై మారణహోమాన్ని ఆపేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది.

17 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ప్యానెల్ గురువారం ఏకగ్రీవంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

2017లో మయన్మార్ సైనిక చర్య చేపట్టిన సమయంలో వేల మంది రోహింజ్యాలు ప్రాణాలు కోల్పోయారు. 7 లక్షలకుపైగా మంది పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

ఈ మారణహోమం మళ్లీ కొనసాగొచ్చని ఐరాస విచారణకర్తలు హెచ్చరించారు.

Presentational grey line
News image
Presentational grey line

అయితే, మయన్మార్ ఈ మారణహోమానికి పాల్పడిందన్న ఆరోపణలను ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ గత నెలలో ఐసీజే విచారణకు హాజరై ఖండించారు.

తమ దేశంపై తప్పుడు కేసు పెట్టారని చెబుతూ ఆమె తన వాదన వినిపించారు.

ఆఫ్రికా దేశమైన గాంబియా ఈ కేసును ఐసీజే దృష్టికి తీసుకొచ్చింది.

ఐసీజేలో మూడు రోజులపాటు రోహింజ్యాల మారణహోమంపై విచారణ జరిగింది.

ఐసీజే

ఫొటో సోర్స్, Reuters

రఖైన్ రాష్ట్రంలో ఉగ్రవాద ముప్పు నివారణ లక్ష్యంగా సైన్యం చర్య తీసుకుందని మయన్మార్ మొదటి నుంచి చెబుతోంది. సూచీ కూడా అదే వైఖరికి కట్టుబడ్డారు.

ఒకప్పుడు ప్రపంచమంతా ప్రజాస్వామ్య ప్రతీకగా కొనియాడిన సూచీ 2016 ఏప్రిల్‌లో మయన్మార్‌కు స్టేట్ కౌన్సిలరయ్యారు. రాజ్యాంగపరంగా సైన్యంపై ఆమెకు నియంత్రణ ఉండదు. కానీ, మారణహోమం ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.

కాగా, ఒకప్పుడు ఎన్నో ఏళ్లపాటు తనను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యాన్నే ఇప్పుడు సూచీ వెనకేసుకొస్తున్నారు.

రఖైన్ నుంచి వెళ్లిపోయిన మయన్మార్ ప్రజలను స్వదేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని ఐజేసీలో చెప్పిన ఆమె.. ఈ సంక్షోభాన్ని మరింత రగిల్చేలా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టును ఆమె కోరారు.

2017 సెప్టెంబరు 7న రోహింజ్యాలు నివసించే ఒక గ్రామాన్ని తగుల బెట్టారు. అంతకు ముందే హింసాత్మక ఘటనలను అడ్డుకున్నట్లు సూచీ చెప్పారు

అసలేమిటీ వివాదం

2017 వరకు, దాదాపు 10 లక్షల మంది రోహింజ్యాలు మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో నివసించేవారు.

అయితే, మయన్మార్ ప్రభుత్వం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి, పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించింది.

రోహింజ్యాలు ఎన్నో ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2017లో మిలటరీ ప్రభుత్వం రఖైన్ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది.

ఐసీజే పత్రాల ప్రకారం, అక్టోబర్ 2016 నుంచి ఆగస్టు 2017 వరకు రోహింజ్యాలను పూర్తిగా, ఒక క్రమపద్ధతి ప్రకారం తుడిచిపెట్టే చర్యలకు సైన్యం పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.

హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలతో రోహింజ్యాలను సామూహికంగా విధ్వంసం చేశారని మయన్మార్ సైన్యంపై ఆరోపణలు వచ్చాయి.

సూచీ

ఐక్యరాజ్య సమితి నిజనిర్ధరణ సంస్థ ఇలా వచ్చిన అనేక ఆరోపణలను ధ్రువీకరించింది. ఆగస్టులో వెలువడిన ఒక నివేదిక, ''మహిళలు, బాలికలు, బాలురు, పురుషులు, ట్రాన్స్ జెండర్లపై సైన్యం అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడింది'' అని ఆరోపించింది.

మేలో 10 మంది రోహింజ్యాలను చంపినందుకు జైలు శిక్ష పడిన ఏడుగురు మయన్మార్ సైనికులు ఇటీవల విడుదలయ్యారు.

అయితే, రోహింజ్యా ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని తమ సైన్యం దాడులు చేసిందని మయన్మార్ గతంలో స్పష్టం చేసింది.

ఐసీజే

ఫొటో సోర్స్, Getty Images

మయన్మార్ పై ఎవరు ఆరోపణలు చేస్తున్నారు?

ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే). దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌లో ఉంది. ఇందులోని సభ్య దేశాలు కేసు వేయవచ్చు. రోహింజ్యా మారణహోమంపై మయన్మార్ పై ఆఫ్రికాలోని ముస్లిం దేశం గాంబియా కేసు వేసింది.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఐవోసీ)లోని 57 సభ్య దేశాలు, అంతర్జాతీయ న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపాయి.

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆంగ్ సాన్ సూచీ పాత్ర ఏమిటి?

వాస్తవానికి, ఈ కేసు పెట్టింది సూచీ మీద కాదు, మయన్మార్ మీద. అలాగే, ఐసీజే వ్యక్తులను శిక్షించదు.

అయితే, రోహింజ్యా మారణహోమం విషయంలో సూచీపై ఆరోపణలు చేయడానికి కారణం ఆమె 2016 ఏప్రిల్ నుంచి దేశానికి వాస్తవ పరిపాలకురాలిగా ఉండటం. సైన్యంపై అదుపు లేకపోయినప్పటికీ మిలటరీ చర్యల్లో సూచీకి భాగం ఉందని ఐక్యరాజ్యసమితి పరిశోధన బృందం ఆరోపణలు చేసింది.

రోహింగ్యా శరణార్థుల కదలికలపై పరిమితులు విధించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు రోహింజ్యాల పరిస్థితి ఏంటి?

మిలటరీ ఆపరేషన్ ప్రారంభంకాగానే, మయన్మార్ నుంచి వేలాదిమంది రోహింజ్యాలు పారిపోయారు.

సెప్టెంబర్ 30 వరకు ఉన్న వివరాలను గమనిస్తే, బంగ్లాదేశ్‌లోని వివిధ క్యాంపుల్లో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఉన్నారు.

దాదాపు 80 శాతం మంది రోహింజ్యాలు 2017 ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలోనే ఇక్కడికి వచ్చారు. ఇకపై తమ దేశంలోకి రోహింజ్యాలను అనుమతించేది లేదని మార్చిలో బంగ్లాదేశ్ ప్రకటించింది.

తమ దేశంలో ఉన్న రోహింజ్యాలు మయన్మార్‌కు స్వచ్ఛందంగా వెళ్లేందుకు వీలుగా ఆగస్టులో బంగ్లాదేశ్ ఒక పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఒక్క రోహింజ్యా కూడా బంగ్లాను విడిచివెళ్లలేదు.

తమ దేశంలో ఉన్న పది లక్షల మంది రోహింజ్యాలను బంగాళాఖాతంలోని భాషన్ దీవుల్లోకి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, స్వచ్ఛంద సంస్థలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి.

గతంలో రోహింజ్యాలు నివాసమున్న గ్రామాల్లో మయన్మార్ సైన్యం శిబిరాలను నిర్మిస్తోందని బీబీసీ ప్రతినిధి జోనాథన్ హెడ్ సెప్టెంబర్‌లో నివేదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)