కరోనా వైరస్ భయంతో వుహాన్‌లో బస్సులు, రైళ్లు, విమానాలు బంద్.. నగరం వీడొద్దని ప్రజలకు చైనా సలహా

వుహాన్లో యాంగ్టే నది వద్ద ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తున్న భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ 22న వుహాన్లో యాంగ్టే నది వద్ద ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తున్న భద్రతా సిబ్బంది

చైనాలో కొత్త రకం వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ముందు జాగ్రత్తగా వుహాన్ నగరంలో ప్రజా రవాణాను నిలిపివేయాలని పాలనా యంత్రాంగం నిర్ణయించింది.

గురువారం నుంచి వుహాన్‌ నుంచి విమానాలను, ప్రయాణికుల రైళ్లను, బస్సులను తాత్కాలికంగా ఆపేశారు. సబ్‌వే, ఫెర్రీ సర్వీసులనూ నిలిపేశారు.

కోటీ పది లక్షల మంది జనాభా ఉన్న వుహాన్ నగరంలోనే డిసెంబరులో వైరస్ వెలుగు చూసింది. ఇది కరోనా వైరస్‌లో కొత్త రకం.

వుహాన్‌లో నివసిస్తున్న ప్రజలు నగరాన్ని దాటి వెళ్లొద్దని అధికార యంత్రాంగం సలహా ఇచ్చింది. సందర్శకులను నగరానికి రావొద్దని చెప్పింది.

ప్రస్తుతం చైనా కొత్త సంవత్సర ప్రారంభం సెలవుల సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణాలు చేస్తున్నారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో రెండో నగరానికి రాకపోకలు నిలిపివేత

గురువారం నుంచి హ్వాంగాంగ్‌ నగరానికి కూడా రాకపోకలను నిలిపివేశారు.

రైలు, బస్సు సర్వీసులను నిలిపివేశారు. ప్రజలెవరూ ఇంటిలోంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

సినిమా హాళ్లు, కేఫ్‌లను కూడా మూసివేయనున్నారు. దీంతో ప్రజా జీవనం స్తంభించే అవకాశం కనిపిస్తోంది.

కరోనా వైరస్ వ్యాపించకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు.

హ్వాంగాంగ్‌లో సుమారు ఏడు మిలియన్ల జనాభా ఉంది.

వుహాన్‌కి ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హ్వాంగాంగ్‌లో సోమవారం నాటికి 12 కేసులు నమోదైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

మృతులు 17 మంది

ఇప్పటివరకు చైనాలో 500 మందికి పైగా ప్రజలకు ఈ వైరస్ సోకినట్లు అధికారికంగా నిర్ధరణ అయ్యింది. 17 మంది బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు మరణాలన్నీ హుబేయీ రాష్ట్రంలోనే సంభవించాయి. వుహాన్ ఈ రాష్ట్రానికి రాజధాని.

ఈ వైరస్‌ను '2019-ఎన్‌కోవ్' అని వ్యవహరిస్తున్నారు.

బాధితుల నుంచి ఇది క్రమంగా కుటుంబ సభ్యులకు, ఆరోగ్యసేవల సిబ్బందికి సంక్రమిస్తోంది.

Presentational grey line
News image
Presentational grey line

బ్రిటన్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని 'ఎంఆర్‌సీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ అనాలసిస్' శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం వుహాన్‌లో ఈ వైరస్ వల్ల నాలుగు వేల మందికి పైగా ప్రజలు అనారోగ్యం పాలైనట్లు అంచనా.

వైరస్ సోకితే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వస్తుంది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీనివల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి రావొచ్చు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

వుహాన్‌లో బయటపడ్డ ఈ వైరస్ చైనాలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఇతర దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

ఇది మనుషుల నుంచి మనుషులకు సంక్రమించగలదని చైనా అధికారులు ప్రకటించారు.

కరోనావైరస్‌లు.. ఒక విస్తృత కుటుంబానికి చెందిన వైరస్‌లు. వీటిలో కేవలం ఆరే ఇంతకుముందు మనుషులకు సోకాయి. ఈ కొత్త వైరస్‌తో ఈ సంఖ్య ఏడుకు చేరింది.

2000ల దశకం మొదట్లో కరోనావైరస్ వల్ల తలెత్తిన 'సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్)'‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మందిని బలి తీసుకుంది.

వుహాన్‌లో హాన్(నీలి రంగు), యాంగ్టే నదుల కలయిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వుహాన్‌లో హాన్(నీలి రంగు), యాంగ్టే నదుల కలయిక. ఈ నగర జనాభా కోటీ పది లక్షలు.

వ్యాప్తిని అడ్డుకోవడానికే ఈ చర్య: కమాండ్ సెంటర్

వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకే ప్రజారవాణాను నిలిపివేసినట్లు దీనిని కట్టడి చేయడానికి వుహాన్‌లో ఏర్పాటైన ప్రత్యేక కమాండ్ కేంద్రం ప్రకటించింది.

వుహాన్‌లో ప్రజలు ఎక్కడా గుంపులుగా ఉండొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.

భారీస్థాయి కార్యక్రమాలు చేపట్టవద్దని నగరంలోని పర్యాటక కేంద్రాలు, హోటళ్ల నిర్వాహకులకు సూచించారని చైనా ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. గ్రంథాలయాలు, పురావస్తు ప్రదర్శనశాలలు, థియేటర్లలో సందర్శన, ఇతర కార్యక్రమాలను నిలిపివేశారని చెప్పింది.

వుహాన్‌లోని గ్వియువాన్ ఆలయంలో చైనా కొత్త సంవత్సర ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాన్ని రద్దు చేశారు. నిరుడు ఇందులో ఏడు లక్షల మంది పాల్గొన్నారు.

"వుహాన్‌ దారులు మూసుకుపోయాయి" అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ వీబోలో ప్రముఖంగా కనిపిస్తోంది.

ప్రజారవాణాను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించాక బాధతో కన్నీళ్లు వచ్చినంత అయిందని ఒక యూజర్ చెప్పారు.

వుహాన్ నుంచి ప్రధాన రైలు మార్గాలు
ఫొటో క్యాప్షన్, వుహాన్ నుంచి బీజింగ్, షాంఘై, ఇతర ప్రధాన ప్రాంతాలకు రైలు మార్గాలు

ఇవి చాలా బలమైన చర్యలు: డబ్ల్యూహెచ్‌వో

ప్రజారవాణా నిలిపివేత, ఇతర చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ జెబ్రీయెసస్ స్పందిస్తూ- ఇవి చాలా బలమైన చర్యలని వ్యాఖ్యానించారు. చైనాలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి, ఇది ఇతర దేశాలకు వ్యాపించడాన్ని పరిమితం చేయడానికి ఈ చర్యలు తోడ్పడతాయని చెప్పారు.

వైరస్ నివారణ, నియంత్రణలో తమ దేశం ప్రస్తుతం అత్యంత కీలకమైన దశలో ఉందని చైనా అధికారులు వ్యాఖ్యానించారు.

చట్టవిరుద్ధ లావాదేవీలు జరిగే ఓ మార్కెట్ నుంచి ఈ వైరస్ విస్తరించినట్లు చైనా అధికారులు చెప్పారు. ఈ మార్కెట్‌ను మూసేశారు.

వీడియో క్యాప్షన్, చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)