ఏలూరులో అదుపులోకి రాని అంతుచిక్కని వ్యాధి.. ప్రజల్లో కొనసాగుతున్న భయాందోళనలు

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనా లాక్‌డౌన్‌కి ముందు 45 ఏళ్ల ఎం శ్రీధర్ విజయవాడలో ఓ చిన్న మెకానిక్‌గా జీవనం సాగించేవారు. అయితే అక్కడ ఉపాధి దెబ్బతినడంతో భార్య సొంతూరు ఏలూరుకి మకాం మార్చారు. కొన్ని నెలలుగా ఏలూరు నగరం పరిధిలోని విద్యానగర్‌లో ఆయన కుటుబం నివాసం ఉంటోంది. తమ వీధిలోని ఓ కూడలిలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ పోషణ సాగిస్తున్నారు. ఇద్దరు బిడ్డల్లో కుమార్తె ఇంటర్మీడియట్, కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. గతంలో చిన్న చిన్న సమస్యలే తప్ప, ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు లేని ఆయన ఈనెల 6న హఠాత్తుగా కుప్పకూలారు.

టిఫిన్ సెంటర్ కావడంతో ఉదయాన్ని దానికి అవసరమైన అన్ని సామాన్లు సర్దుకుంటుండగా ఉదయం 5.40 గంటల సమయంలో ఆయన హఠాత్తుగా కిందపడిపోవడం, నోటి నుంచి నురగ కూడా రావడంతో సమీప బంధువులంతా కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వారు ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించి ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో చివరకు ఉదయం 6.45 గంటల సమయానికి ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడే ఆయనకు వరుసగా మూడు సార్లు ఫిట్స్ రావడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

మూడు రోజులుగా ఏలూరు నగరంలో అలజడి రేపిన ఈ అంతుచిక్కని వ్యాధితో శ్రీధర్ ఒక్కరే మరణించారని అధికారులు ధృవీకరించారు. అయితే ఒక్క శ్రీధర్ మాత్రమే కాదు.. గతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఇంటి వద్దే ఉంటున్న చింతాడ రామానాయుడు అనే 68ఏళ్ల వృద్ధుడు, ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల శ్రీలక్ష్మి సహా అనేక మంది ఇలాంటి సమస్యలతోనే ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 7వ తేదీ సాయంత్రం 4గంటల సమయానికి 428 మందిలో ఇలాంటి సమస్యలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. వారిలో కొందరి పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మున్సిపల్ వాటరే కారణమా?

ఫిట్స్ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న వారి జాబితాలో గతం నుంచి ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు, అలాంటి ఆనవాళ్లు లేని వారు కూడా ఉన్నారు. చిన్నప్పుడు ఫిట్స్ ఎదుర్కొన్న వారు మొత్తం బాధితుల్లో 10 శాతం మంది మాత్రమే ఉన్నట్టు ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గీత బీబీసీకి తెలిపారు. ఈ తరహా బాధితులు తొలుత ఏలూరు వన్ టౌన్ పరిధిలోని దక్షిణ వీధిలో కనిపించారు. ఆ తర్వాత సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు బాధితులు నమోదయ్యారు. తాజాగా ఏలూరు రూరల్ పరిధిలోనూ, సమీప దెందులూరు మండలంలో కూడా బాధితులు నమోదుకావడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వారందరికీ చికిత్స అందిస్తున్నారు.

ఏలూరు నగరంలో పరిధిలో 327 మంది, రూరల్ లో 60 మంది కాగా మిగిలిన వారంతా దెందులూరు మండల పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన వారున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఒక్క ప్రాంతంలో ఇలాంటి సమస్య ఉత్పన్నం కావడంతో తాగునీటి సరఫరా లోపాలున్నాయనే అనుమనాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో రావడంతో అసలు కారణాలు అంతబట్టకుండా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పైగా మినరల్ వాటర్ తాగుతున్న వారిలో కూడా సమస్యలు రావడంతో మునిసిపల్ వాటర్ కారణమనే వాదనలో వాస్తవం లేదని అధికారులు భావిస్తున్నారు.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

పలు పరీక్షలు చేసినా అంతా నార్మల్ గానే..

బాధితుల నుంచి శాంపిళ్లు సేకరించి వివిధ పరీక్షలు నిర్వహించారు. వాటి వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు వెల్లడించారు. 22 ప్రాంతాల నుంచి తాగునీటి శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేశారు. ఆ రిపోర్టున్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని తేలినట్టు ఆయన ప్రకటించారు. తాగునీటిలో ఎటువంటి సమస్యలు లేవని ఆయన నిర్ధారించారు. అంతేగాకుండా 52 మందికి రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయన్నారు. 35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షంగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చిందని వివరించారు. 45 మంది సీటీ స్కాన్‌ చేయగా అవి కూడా నార్మల్‌గానే ఉన్నాయన్నారు.

ఇక పాల సరఫరాలో కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో 9 చోట్ల వివిధ డెయిరీలకు చెందిన పాల నమూనాలను సేకరించగా, అవికూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇక ప్రస్తుతం బ్లడ్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణ కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించినట్టు ఆయన తెలిపారు. వాటి ఫలితాలు 24 గంటల్లో వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీసీఎంబీతో పాటుగా ఢిల్లీ ఎయిమ్స్ కి కూడా కొన్ని నమూనాలు పంపించారు. వాటి రిపోర్టుల ఆధారంగా అసలు కారణాలపై అంచనాలకు రాగలుగుతామని వైద్య, ఆరోగ్య శాఖ ఆశిస్తోంది.

రంగంలోకి కేంద్ర బృందాలు..

ఒక్కసారిగా ఎదురయిన సమస్య, వేగంగా విస్తరించడం, కారణాలు అంతుబట్టకుండా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఉన్నత స్థాయి వైద్యాధికారుల బృందాలను ఏలూరుకి పంపిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ కి చెందిన 7గురు నిపుణులతో కూడిన బృందం ఏలూరులో పర్యటించింది. పలువురు బాధితులు, వారి బంధువులతో మాట్లాడారు. బాధితుల నివాసాలు, పరిసరాలు కూడా పరిశీలించారు. వారికి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.

వారితో పాటుగా ఉన్నత స్థాయి వైద్య పరిశీలకుల బృందాన్ని ఏలూరుకు అత్యవసరంగా పంపించింది రేపు సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని వారిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) ఆదేశించింది. ఈ బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ డియోష్టవర్, డాక్టర్ సంకేత్ కులకర్ణి తదితరులున్నారు.

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ వైద్యుల బృందం, ఏలూరు ఐఎంఏ ప్రతినిధులు కూడా వైద్య సహాయం అందించడంలోనూ, కారణాల అన్వేషణలోనూ పాలుపంచుకుంటున్నారు.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

‘‘పరిస్థితి అదుపులోకి వస్తోంది..’’

కొత్తగా ఇలాంటి సమస్యలతో బాధితులుగా ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య సోమవారం కూడా భారీగా ఉంది. ఆస్పత్రికి ప్రతీ 10 నిమిషాలకు ఒక అంబులెన్స్ గానీ, ప్రైవేటు వాహనంలో గానీ బాధితులను తరలిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వారిలో కొందరు ఏదో పనిచేస్తుండగా హఠాత్తుగా కిందపడిపోవడంతో తలకు గాయాలయిన వారు కూడా ఉండడం విశేషం. అయితే ఈ పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వస్తోందని, రేపటికి సాధారణ స్థితికి రావచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీత అంచనా వేస్తున్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో కొంత ఆందోళన ఉంది. దానిని తగ్గించేందుకు ఇంటింటి సర్వేలు చేస్తున్నాం. పలువురికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాం. ఏలూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో అనేక చోట్ల హెల్త్ క్యాంపులు పెట్టాం. దాంతో సమస్య ఉన్న వారిని వెంటనే గుర్తించే అవకాశం వస్తుంది. మరణాలు నమోదు కాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటి వరకూ ఒక్కరు తప్ప ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. కాబట్టి ఈ పరిస్థితి సోమవారం సాయంత్రానికి తగ్గుముఖం పడుతుంది. మంగళవారం నాటికి సాధారణ స్థితికి రావచ్చని అంచనా వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ బృందాలు వస్తున్నాయి. ఇప్పటికే పంపించిన శాంపిళ్ల రిపోర్టులు వస్తే సమస్యను గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.

‘‘డిశ్ఛార్జ్ అవుతున్న వారిని పర్యవేక్షణలో ఉంచాలి..’’

428 మంది బాధితుల్లో 220 మందిని డిశ్ఛార్జ్ చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఏలూరులో పర్యటించి సమీక్ష నిర్వహించారు. తొలుత ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. పలువురు బాధితులు, వారి బంధువులతో మాట్లాడారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కువ మంది త్వరగా కోలుకుంటూ డిశ్చార్జ్ అవుతున్న నేపథ్యంలో వారు పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అందుకు అవసరమైన పౌష్టికాహారం, మందులు ఇతర అవసరాలను సరఫరా చేయాలని సూచించారు.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం - చంద్రబాబు నాయుడు ఆరోపణ

ఏలూరులో ఆరోగ్య సమస్యలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘క్షేత్రస్థాయికి వెళితే, పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వం సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా ఉందా, కలుషితంగా ఉందా, పరిశుభ్రత ఉందా లేదా అనేది చూడాలి. అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకొచ్చిందో మాకు తెలియదని వితండవాదన చేయడం సరికాదు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి. రాష్ట్రంలో ఎన్నడూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏలూరు సంఘటనలను పరిశీలిస్తే, తాగునీరు, పారిశుధ్యం తదితర పౌర సదుపాయాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందనేది స్పష్టంగా తెలుస్తోంది. తాగేనీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, పరీక్షలు చేయాల్సివుంది. పరిసరాలు పరిశ్రుభ్రంగా ఉంచడం, డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం, మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు లీక్ అయి కలిసి పోకుండా చూడటం, ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ లను శుభ్రపర్చడం, క్లోరినేషన్, బ్లీచింగ్ చేయించడం అన్నీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ గాలికి వదిలేశారు. ప్రజారోగ్యం పట్ల వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం దీనినిబట్టే అర్థమవుతోంది'' అంటూ విమర్శలు చేశారు.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

నగరంలో అపారిశుద్యం, పందుల సమస్య

నగరంలో మూడు రోజులుగా వందలాది మంది అనారోగ్యాల బారిన పడుతున్నప్పటికీ శానిటేషన్ నిర్వహణ సజావుగా లేదని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా పందుల సమస్య తీవ్రంగా ఉందని ఏలూరుకి చెందిన ఎం నాగేంద్ర బీబీసీతో అన్నారు. నగరంలో పలుచోట్ల పందులు తిరుగుతున్నాయి. గతంలో స్వైన్ ఫ్లూ వంటి సమస్యలు ఎదురయిన నేపథ్యంలో పందులను నియంత్రించాల్సి ఉన్నప్పటికీ అది జరగడం లేదు. మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు అటు వైపు శ్రద్ధ పెట్టడం లేదు. ప్రస్తుతం సమస్య ఎదురయిన తర్వాతనయినా దృష్టి పెట్టి పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని పలువురు అభిప్రాయపడ్డారు.

మూడు రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్న తరుణంంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నప్పటికీ కారణాలు మాత్రం ఇప్పటి వరకూ అంతుబట్టకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరులో హఠాత్తుగా ఎదురయిన సమస్యకు కారణాలు తెలిసే వరకూ పరిష్కారం కూడా కష్టంగానే కనిపిస్తోంది. దాంతో సీసీఎంబీ, ఢిల్లీకి పంపించిన శాంపిళ్ల రిపోర్టుల కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)