పాకిస్తాన్‌లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులు

కరోనావైరస్ రెండోసారి విజృంభిస్తుండటంతో పాకిస్తాన్ సతమతం అవుతోంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ రెండోసారి విజృంభిస్తుండటంతో పాకిస్తాన్ సతమతం అవుతోంది

పాకిస్తాన్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు.

పెషావర్‌లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

భయాందోళనలతో సహాయం కోసం అర్థించామని రోగుల బంధువులు తెలిపారు.

సరైన సమయానికి ఆక్సిజన్ డెలివరీ కాకపోవడంతో దాదాపు 200 మంది రోగులకు కొన్ని గంటలపాటూ తగినంత ఆక్సిజన్ అందించలేకపోయారు.

ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీ సమయానికి సిలిండర్లు అందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆస్పత్రి అధికారులు ఆరోపిస్తున్నారు.

అయితే, ఆస్పత్రి సిబ్బందిలో కొందరిని విధులనుంచీ తొలగించారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో కరోనా వైరస్ కేసులు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ 4,00,000లకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,000 మరణాలు సంభవించాయి.

ఆస్పత్రికి అందాల్సిన రోజువారీ ఆక్సిజన్ సిలిండర్లు శనివారం సాయంత్రానికి కూడా అందకపోయేసరికి సమస్య ప్రారంభమయ్యిందని స్థానిక మీడియా రిపోర్టులు చెబుతునాయి. బ్యాకప్ కోసం పెట్టుకున్న 300 సిలిండర్లను ఉపయోగించి వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించారు.

"రోగులను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించాం. వారి ప్రాణాలను నిలబెట్టమని ఆస్పత్రి సిబ్బందిని శతవిధాలా వేడుకున్నాం" అని మురీద్ అలీ బీబీసీకి తెలిపారు. అలీ తల్లి కోవిడ్ చికిత్సకోసం అదే ఆస్పత్రిలో చేరారు.

కాసేపటి తరువాత కొంతమంది రోగులను ఎమర్జెన్సీ గదికి షిఫ్ట్ చేసారని, అక్కడ ఆక్సిజన్ సరఫరా కొంత మెరుగ్గా ఉందని అలీ వివరించారు.కానీ అక్కడ కూడా ఆక్సిజన్ సరఫరా నిండుకునే పరిస్థితి వచ్చింది. పలువురు రోగులు మరణించారు. అనేకమంది పరిస్థితి విషమంగా మారింది.

ఇక గత్యంతరం లేక... రోగుల బంధువులనే ఆక్సిజన్ సిలిడర్లు కొని తెచ్చుకోమని ఆస్పత్రి సిబ్బంది కోరారు. కానీ కొందరు మాత్రమే కొనుక్కోగలిగారని అలీ తెలిపారు.

కరోనా వార్డ్‌లో ఐదుగురు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒకరు మృతి చెందారని ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.

ఆక్సిజన్ బాటిళ్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆక్సిజన్ సరఫరాపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి

ఎట్టకేలకు ఆదివారం స్థానిక సమయం 4.00 గంటలకు ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రికి చేరాయి.

సమయానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించకపోవడం "నేరపూరిత నిర్లక్ష్యమని" ఆస్పత్రి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ ‌వద్ద విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఆ సమయంలో అక్కడ లేరని విచారణలో తేలింది. అంతే కాకుండా, సైట్లో ఆక్సిజన్ ట్యాంక్‌ను రోజు పాక్షికంగానే నింపుతున్నారని కూడా తెలిసింది.

ఇప్పటికే ఆస్పత్రి డైరెక్టర్‌ను, పలువురు సిబ్బంది సస్పెండ్ చేసారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)