కరోనావైరస్: భారత్‌లో టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యూహం ఫలించిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రుతి మెనన్
- హోదా, బీబీసీ రియాల్టీ చెక్
కరోనావైరస్ ప్రభావానికి తీవ్రంగా గురైన రాష్ట్రాలు టెస్టుల నిర్వహణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వైరస్‌ను ఎదుర్కోవడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ముమ్మరం చేయాలని గతంలో అన్నారు.
సెప్టెంబర్ రెండోవారం నుంచి భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, టెస్టుల విషయంలో అనుసరిస్తున్న విధానాలు కరోనాపై యుద్ధానికి ఆటంకంగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
అసలు ఇండియాలో టెస్టులు ఎలా జరుగుతున్నాయి?
పీసీఆర్ టెస్టు అనేది ఇండియాలో బాగా వినియోగంలో ఉన్న కోవిడ్ పరీక్షా విధానం. దేశవ్యాప్తంగా ఇదే ప్రామాణికమైన టెస్టుగా భావిస్తున్నారు.
కానీ, చాలా రాష్ట్రాలలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం టెస్టుల్లో 60% మాత్రమే పీసీఆర్ టెస్టులు. మిగతావన్నీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు (ర్యాట్)లే. వీటిలో వేగంగా ఫలితాలు వచ్చినా, ప్రామాణికత అంతంత మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ర్యాట్ టెస్టుల్లో తప్పుడు నెగెటివ్ రిపోర్టులతో దాదాపు 50 శాతం కేసులు మిస్సవుతున్నట్లు తేలింది. వీటివల్ల వైరస్ బారినపడిన వారిని గుర్తించడం కష్టం. అయితే, ఇవి హాట్ స్పాట్ లలో బాగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు.
‘‘ర్యాట్ టెస్టులు, పీసీఆర్ టెస్టులను కలిపి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది’’ అని హరియాణాలోని అశోకా యూనివర్సిటీలో అంటువ్యాధుల విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ అన్నారు.
అయితే, ర్యాట్ టెస్టులు చేస్తున్నది ఒక్క భారతదేశమే కాదు. వైరస్ సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న అనేక యూరోపియన్ దేశాలు ఈ టెస్టులనే ఆశ్రయిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా టెస్టులు ఒకే రకంగా జరుగుతున్నాయా?
అలా చెప్పే పరిస్థితి లేదు. దేశంలోని మొత్తం కేసుల్లో 17శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దాని తర్వాతి స్థానంలో తక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలాంటి రాష్ట్రాలున్నాయి.
కానీ ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు చూపించాయి. ఇక్కడ టెస్టు ఫలితాలను బట్టి చెప్పగలిగేది ఏంటంటే, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో 50% కన్నా తక్కువ కేసులను మాత్రమే పీసీఆర్ టెస్టుల ద్వారా తేల్చగలిగారు. అంటే, చాలా కేసులు దొరక్కుండా పోయి ఉంటాయి.
మహారాష్ట్రలో దాదాపు 60 శాతం టెస్టులు పీసీఆర్ టెస్టులే. తమిళనాడులో కూడా ఎక్కువగా పీసీఆర్ టెస్టుల మీదే ఆధారపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రాలలో కొన్నిప్రాంతాల్లోనే ఎక్కువ టెస్టులు
వివిధ రాష్ట్రాలలో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా టెస్టులు జరిగినట్లు తేలింది. ఉదాహరణకు నవంబర్ 30 నాటికి ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన కేసుల్లో 13% ఒక్క లఖ్‌నవూకు చెందినవే.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టెస్టులతో పోలిస్తే ఈ నగరంలో 6% టెస్టులు మాత్రమే జరిగాయి. ఆ తరువాత స్థానం యూపీలోని కాన్పూర్ నగరానిది. అయితే, ఇక్కడ జరిగిన పరీక్షలు 3 % లోపే ఉన్నాయి.
బిహార్ లో జిల్లాల వారీగా వచ్చిన డేటాను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ లో కనిపించిన ధోరణే ఇక్కడ కూడా కనిపిస్తుంది.
బిహా ర్రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 18% కేసులు ఒక్క పట్నాలోనే నమోదు అయ్యాయి. అయితే, అక్కడ జరిగిన టెస్టులు రాష్ట్రం మొత్తంలో జరిగిన టెస్టుల్లో 3% మాత్రమే.
మిగతా ప్రాంతాలలో పట్నాకన్నా ఎక్కువ టెస్టులు జరగ్గా, పాజిటివ్ రిపోర్టులు మాత్రం తక్కువగా వచ్చాయి. ‘‘ఎక్కువ కేసులున్నచోట తక్కువ టెస్టులు, తక్కువ కేసులున్నచోట ఎక్కువ టెస్టులు జరిపినప్పుడు తక్కువ పాజిటివ్ రిపోర్టులే వస్తాయి’’ అని కేరళకు చెందిన పబ్లిక్ హెల్త్ పాలసీ విశ్లేషకులు డాక్టర్ రిజో జాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భిన్నమైన నిఘా వ్యవస్థలు
80% పాజిటివ్ కేసులలో కాంటాక్ట్ ట్రేసింగ్ ను 72 గంటల్లో పూర్తి చేయాలని నేషనల్ కోవిడ్-19 నిబంధనలు సూచిస్తున్నాయి. కానీ, తక్కువ కాంటాక్ట్ ట్రేసింగ్, తక్కువ టెస్టింగ్ వల్ల దేశంలో కోవిడ్ విపరీతంగా పెరగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది.
కాంటాక్ట్ ట్రేసింగ్ మీద రాష్ట్రాల నుంచి కచ్చితమైన సమాచారం అందలేదు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగా పని చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
అందుకు భిన్నంగా సెప్టెంబర్ నుంచి కర్ణాటక రాష్ట్రం ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ లో బాగా వెనకబడి ఉన్నట్లు తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో తెలంగాణ రాష్ట్రం దగ్గర ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా బాగానే ఉన్నా సెప్టెంబర్ నుంచి ఓవరాల్ టెస్టులతోపాటు ఇది కూడా తగ్గుముఖం పడుతూ వస్తోంది.
అదే కేరళ విషయానికి వస్తే మే 4 నుంచి నమోదైన వాటిలో 95%కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగినట్లు తేలింది.
కానీ, వీటిలో ఏవి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెప్పినట్లు 80% కేసులను 72 గంటల్లో గుర్తించినట్లు సమాచారం లేదు. చాలా రాష్ట్రాలు ఈ సమాచారాన్ని వెల్లడి చేయలేదు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








