కోవిడ్-19: మౌత్‌వాష్‌తో 30 సెకన్లలోనే కరోనావైరస్ హతం

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌ను కేవలం 30 సెకన్లలోనే మౌత్‌వాష్‌లు హతమార్చగలవని తాజా అధ్యయనంలో తేలింది.

కోవిడ్-19పై మనకు అందుబాటులో ఉండే మౌత్‌వాష్‌లు పనిచేయగలవని తమ పరిశోధనలో సంకేతాలు అందినట్లు కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

వేల్స్‌లోని యూనివర్సిటీ ఆసుపత్రిలో మౌత్‌వాష్‌లపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్న నేపథ్యంలో తాజా ఫలితాలు వెల్లడయ్యాయి.

ప్రజల రోజువారీ జీవన విధానంలో మౌత్‌వాష్‌లు ప్రధాన పాత్ర పోషించేందుకు తమ అధ్యయనం బాటలు పరుస్తోందని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ నిక్ క్లేడన్ తెలిపారు.

లాలాజలంలోని వైరస్‌ను మౌత్‌వాష్‌లు చంపగలవని పరిశోధన చెబుతున్నప్పటికీ.. కోవిడ్-19పై చికిత్సలో వీటిని వాడలేం. ఎందుకంటే శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లోకి దీన్ని పంపించడం కుదరదు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

''కార్డిఫ్ యూనివర్సిటీ చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్‌లోనూ సీపీఎస్ ఆధారిత మౌత్‌వాష్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని తేలితే.. చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరంతోపాటు మౌత్‌వాష్‌లు ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోతాయి''ని క్లేడన్ వ్యాఖ్యానించారు.

సెటీపైరీడినియమ్ క్లోరైడ్ (సీపీసీ) ఆధారిత మౌత్‌వాష్ (0.07 శాతం)ను ల్యాబ్‌లో వైరస్‌పై ప్రయోగించినప్పుడు.. వైరస్ తుడిచిపెట్టుకుపోతున్నట్లు తేలిందని యూనివర్సిటీ తెలిపింది.

శరీరంలో వైరస్ స్థాయిలను తగ్గించడంలో సీపీసీ ఆధారిత మౌత్‌వాష్‌లు పనిచేయగలవని ఇటీవల పేర్కొన్న ఓ అధ్యయనానికి కార్డిఫ్ యూనివర్సిటీ ఫలితాలు మద్దతు పలుకుతున్నాయి.

''పంటి చిగుళ్ల వ్యాధుల కోసం తయారుచేసిన కొన్ని మౌత్‌వాష్‌లు సార్స్-కోవ్-2 వైరస్‌ను నిర్వీర్యం చేయగలవని చెబుతున్న అధ్యయనాలకు మా పరిశోధన మద్దతు పలుకుతోంది. నోటిలోని భాగాలను తలపించే ట్యూబ్‌లో వైరస్‌ను ఉంచి మౌత్‌వాష్‌ను మేం ప్రయోగించాం''అని పరిశోధనకు నేతృత్వం వహించిన రిచర్డ్ స్టాంటన్ వివరించారు.

''ఈ పరిశోధన ఫలితాలను ఇంకా ఎక్కడా ప్రచురించలేదు. సాధారణ పరిశోధనల్లో భాగంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు వీటిని ప్రచురణ కోసం ఒక జర్నల్‌కు పంపిస్తాం. అప్పుడు మిగతా శాస్త్రవేత్తలు ధ్రువీకరణ కోసం పరిశోధనలు చేపట్టొచ్చు''అని ఆయన చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

''వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సూచిస్తున్న విధానాలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి''అని ఆయన వివరించారు.

కోవిడ్-19 రోగుల లాలాజలంలోని వైరస్ స్థాయిలను మౌత్‌వాష్‌లు తగ్గించగలవా? అనే అంశంపై కార్డిఫ్ వర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. దీని ఫలితాలు వచ్చే ఏడాది ప్రారంభంలో వస్తాయి.

ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. వ్యక్తుల మధ్య వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇది సహకరిస్తుందా? అనే అంశంలో క్లినికల్ ట్రయల్స్ తర్వాత కూడా స్పష్టత రాకపోవచ్చని కార్డిఫ్ ప్రొఫెసర్ డేవిడ్ థామస్ వ్యాఖ్యానించారు.

''ల్యాబ్‌లో ఈ మౌత్‌వాష్‌లు చాలా సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ.. రోగులపై ప్రయోగించినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయా? లేదా అన్నది ముందుగా మనం తెలుసుకోవాలి. అందుకే మేం క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నాం''అని ఆయన వివరించారు.

''ఒకసారి మౌత్‌వాష్ ఉపయోగిస్తే.. ఫలితం ఎంతసేపటి వరకు ఉంటుంది?లాంటి అంశాలు కూడా క్లినికల్ ట్రయల్స్‌లో తెలుస్తాయి. ల్యాబ్‌లో వస్తున్న ఫలితాలు రోగులపైనా వస్తాయా? అనేది మనం తెలుసుకోవాలి''అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)