గోవా: జీవవైవిధ్యానానికి ఆలవాలమైన మొల్లెం ప్రాంతానికి వచ్చిన ముప్పేమిటి? స్థానికుల ఆందోళనలు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
సముద్రం, బీచ్‌లు, టూరిస్టులతో కళకళలాడే గోవాలో కేంద్రం ఆమోదించిన మూడు కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ స్థానికులు గత కొద్ది వారాలుగా నిరసనలు చేపడుతున్నారు.
ఈ ప్రాజెక్టుల వలన ఇక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుందని, ఈ ప్రాంతం మొత్తం బొగ్గు కేంద్రంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నట్లు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డియెల్ డిసౌజా తెలిపారు.
గోవాలోని క్వెరిం బీచ్‌లో ఓ సాయంత్రం షికారు చేస్తున్న క్లాడ్ అల్వరెస్‌కు ఇసుకలో ఒక బొగ్గు ముక్క దొరికింది. ఇది, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ (ఎంపీటీ) నుంచి ఇక్కడకు చేరిందని స్థానిక ఉద్యమకారుడు అల్వరెస్ చెబుతున్నారు.
"ఈ బొగ్గు చాలా తేలికగా ఉంది. ఇది సముద్రంలో తేలుతూ ఏ బీచ్ ఒడ్డుకైనా చేరుకోగలదు. మరో బీచ్‌లో ఈ బొగ్గు ముక్క మీ కాలికి తగిలినా ఆశ్చర్యం లేదు" అని అల్వరెస్ అంటున్నారు.
గోవాలో ఉన్న ఏకైక ఓడరేవు ఎంపీటీ నిరసన ప్రదర్శనలతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ పోర్ట్‌లో సుమారు 90 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి అవుతోంది. చుట్టుపక్కల రాష్ట్రాలకు అవసరమైన బొగ్గును ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు.
2030 కల్లా ఐదు కోట్ల టన్నులకు పైగా బొగ్గును దిగుమతి చేసుకోవడమే ఎంపీటీ లక్ష్యమని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇలా దిగుమతి చేసుకున్న బొగ్గును గోవా మీదుగా ఇతర రాష్ట్రాలలోని అదానీ గ్రూపు, జేఎస్‌డబ్ల్యూగ్రూప్, వేదాంత లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రకటించిన మూడు కొత్త ప్రాజెక్టులు.. హైవే విస్తరణ, రైల్వే లైన్ విస్తరిస్తూ రెండు ట్రాకులు వెయ్యడం, ట్రాన్స్మిషన్ పవర్ లైన్ ఏర్పాటు.. బొగ్గు రవాణాను సులభతరం చెయ్యడం కోసమే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
గోవా ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఈ ప్రాజెక్టులకు, బొగ్గు సరఫరాకు ఏమీ సంబంధం లేదని అంటోంది. కొత్త పవర్ లైన్ రాష్ట్రానికి ఎంతో అవసరమైన విద్యుత్‌ను అందిస్తుందని, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుకూలంగా హైవే విస్తరణను చేపట్టారని, డబుల్ ట్రాక్ రైల్వే లైన్ వలన ఎక్కువ ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు నడపడానికి వీలుంటుందని తెలిపింది.
అయితే, ఈ మూడు ప్రాజెక్టులు కూడా దక్షిణ గోవాలో ఉన్న ఒక ముఖ్యమైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సమస్యలు కలిగిస్తాయని, దానివల్ల హిమాలయాలకన్నా పురాతనమైన ఈ అడవులకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర పర్యటక రంగం కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోవాలోని సుందరమైన వనాలు, మెరిసే బీచులు లక్షల కొద్దీ దేశ విదేశాల పర్యటకులను ఆకర్షిస్తాయి. ఇలాంటి ప్రాజెక్టుల వలన టూరిజం దెబ్బతింటుందేమోనని పర్యటక రంగ సంస్థలు ఆందోళన పడుతున్నాయి.

ఫొటో సోర్స్, CHEVON RODRIGUES
జీవ వైవిధ్యానికి ముప్పు
మొల్లెం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం భారతదేశ పశ్చిమ కనుమల్లో 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జీవవైవిధ్యానికి ఆలంబనగా ఉంది.
యునెస్కో ఈ ప్రాంతాన్ని జీవవైవిధ్యపు ‘హాటెస్ట్ హాట్‌స్పాట్’గా గుర్తించింది.
ఇక్కడ 12వ శతాబ్దానికి చెందిన ఒక హిందూ దేవాలయం ఉంది. పచ్చని అడవులు, జలపాతాలు ఉన్నాయి. పర్యటకులను విశేషంగా ఆకర్షించే దూద్‌సాగర్ కూడా ఇక్కడే ఉంది.
ఈ ప్రాంతం ప్రత్యేకమైన 128 రకాల మొక్కలకు, వివిధ రకాల పక్షులు, సీతాకోకచిలుకలు, సరీసృపాలు, చిరుతలు, బెంగాల్ పులులు, పాంగొలిన్స్‌లతో పాటు అనేక రకల వన్యమృగాలకు నిలయం.
ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్వే ట్రాక్ విస్తరణ ప్రాంతంలో ఒక ప్రత్యేక జాతికి చెందిన తూనీగలకు కనుగొన్నారని, ఈ జాతి తూనీగలు గోవాలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేవని రికార్డులు తెలుపుతున్నాయి.
అలాగే, పవర్ లైన్ కోసం కేటాయించిన ప్రాంతంలో ఒక ప్రత్యేక జాతి చీమలు ఉన్నాయని, ఇండియాలో రెండు చోట్ల మాత్రమే ఈ రకం చీమలు ఉన్నాయని రికార్డులలో నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉభయచర జీవులు, సరీసృపాలకు సంబంధించిన జంతుశాస్త్ర నిపుణులు, పర్యావరణ పరిరక్షణ అభిలాషులు అయిన నిర్మల్ కులకర్ణి ఈ వన్య సంరక్షణ కేంద్రంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ "బాల్యంలో ఇక్కడికొచ్చినప్పుడే పాముల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగింది" అని తెలిపారు.
అప్పట్లో దీన్ని సంరక్షణ కేంద్రంగా గుర్తించలేదని, ఒక చిన్న సెలయేరు పచ్చని అడవుల్లోకి ప్రవహిస్తూ ఉండేదని చెప్పారు.
"ఆ తరువాత నేను చాలాసార్లు మొల్లెం నేషనల్ పార్క్‌కు వెళ్లాను. ఈ అడవుల్లో ఇంకెక్కడా కనిపించని, భిన్న జాతులకు చెందిన సరీసృపాలు, ఉభయచరజీవులు ఉన్నాయి. ఈ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది" అని కులకర్ణి పేర్కొన్నారు.
నిర్మల్ కులకర్ణిలాంటి వందలాది పర్యావరణ పరిరక్షకులు, శాస్త్రవేత్తలు, ఏక్టివిస్టులు, నగరవాసులు కలిసి.. ఈ మూడు ప్రాజెక్టుల వలన పర్యావరణానికి, జీవవైవిధ్యానికి హాని కలుగుతుందని, వీటిని రద్దు చెయ్యాలని కోరుతూ లేఖ రాసి, సంతకాలు సేకరించి ప్రభుత్వ ప్రతినిధులకు, భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు పంపారు.

ఫొటో సోర్స్, CHEVON RODRIGUES
మెల్లెంను కాపాడుకోవాలి
మార్చ్‌లో కరోనావైరస్ లాక్‌డౌన్ విధించిన రెండు వారాల తరువాత ప్రకాశ్ జావడేకర్ ఒక వీడియో కాంఫరెన్స్ ద్వారా ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
అప్పటి నుంచీ స్థానికులు, ఉద్యమకారులు, పర్యావరణ నిపుణులు ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన తీరును ప్రశ్నిస్తూ, వీటిని పునఃసమీక్షించాలని ప్రచారకులు కోరుతున్నారు.
అయితే, ఇటీవలే గోవాలో పర్యటించిన జావడేకర్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. స్థానికులు లేవనెత్తిన ఆందోళనల గురించి అడిగినప్పుడు "వారు పంపించిన పిటిషన్లను తప్పక పరిశీలిస్తాం" అని మాత్రమే చెప్పారు.
చందోర్ రైల్వే ట్రాక్ వద్ద నిరసనలకు దిగిన వారిలో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరు చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టారంటూ ఆరోపించారు. అయితే, అక్కడ అల్లర్లు ఏమీ జరగలేదని, అన్యాయంగా కేసులు పెట్టారని అక్కడ హాజరైన మిగతా నిరసనకారులు అంటున్నారు.
"కోవిడ్ సమయంలో కూడా మేమంతా కలిసి నిరసనలు చేపట్టాల్సి వచ్చింది. ఈ అంశం గురించి విస్తృత ప్రచారం చెయ్యడంలో విజయం సాధించాం గానీ ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోవట్లేదు" అని షెర్రీ ఫెర్నాండెజ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బొగ్గు రవాణా కోసమే ఈ విస్తరణలను చేపట్టారా?
"బొగ్గు రహిత, కాలుష్య రహిత గోవా మాకు కావాలి" అని ఇటీవలే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
"బొగ్గుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాం. సంవత్సరాల తరబడి రవాణా చేస్తున్న చేస్తున్న బొగ్గు పరిమాణాన్ని తగ్గిస్తూ, చివరికి పూర్తిగా నిలిపివేస్తాం" అన్నారాయన.
అయితే, ఉద్యమకారులు ఈ మాటలను నమ్మడం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా అవసరం లేదని, గత కొన్నేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ పరిమాణం స్వల్పంగానే పెరిగిందని, 2018-19లో కొనుగోలు చేసినదంతా వాడలేదని వీరు చెప్తున్నారు.
అంతే కాకుండా, ఇవన్నీ కొత్త ఓడరేవులను నిర్మించి, వాటి మధ్య కనెక్టివిటీ పెంచడనికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాల్లో భాగమేనని ఆరోపిస్తున్నారు.
"గోవాను బొగ్గు కేంద్రంగా మార్చడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని తేటతెల్లమవుతోంది. ఐదు నెలల క్రితమే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వానికి సమర్పించాం. ఇప్పటివరకూ మా వాదనలను కొట్టిపారవేయగలిగే ఒక్క కారణాన్ని కూడా వారు చూపలేకపోయారు" అని ఉద్యమకారుడు అభిజిత్ ప్రభుదేశాయ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'.. ‘జెయింట్‌కిల్లర్’ చిత్తరంజన్ దాస్ చెప్పిన ఆనాటి సంగతులు
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- అడాల్ఫ్ హిట్లర్ ప్రాణాలు కాపాడేందుకు విషం తినడానికైనా సిద్ధమైన మహిళలు
- టీవీ ప్రకటనల్లో బీజేపీదే అగ్రస్థానం.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, కోల్గేట్ను దాటేసిన కమలనాథులు
- PMS: పీరియడ్స్ రాబోయే ముందు స్త్రీల మానసిక, శారీరక లక్షణాలలో మార్పు వస్తుందా? పీఎంఎస్ అంటే ఏమిటి?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








