టీవీ ప్రకటనల్లో బీజేపీదే అగ్రస్థానం.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌, కోల్గేట్‌ను దాటేసిన కమలనాథులు

మోదీ మాస్క్

ఫొటో సోర్స్, Getty Images

టీవీలో అత్యధిక ప్రకటనలు ఇచ్చిన బ్రాండ్ల తాజా జాబితాలో భారతీయ జనతా పార్టీ తొలి స్థానంలో నిలిచింది. టీవీలో ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ‘బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్’(బార్క్) ఈ డేటాను విడుదల చేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, దేశంలో బీజేపీ ప్రముఖ బ్రాండ్ ప్రకటనదారుగా మారింది. బార్క్ డేటా ప్రకారం 46వ వారానికి, అంటే నవంబర్ 10 - నవంబర్ 16 మధ్య అత్యధిక ప్రకటనలు ఇచ్చిన బ్రాండ్ బీజేపీనే.

జాబితా

ఫొటో సోర్స్, BARCINDIA

ఫొటో క్యాప్షన్, టీవీల్లో టాప్-10 ప్రకటనదారుల జాబితా (ఆధారం: బార్క్)

మొత్తంగా ఆ వారంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రకటనలు టీవీలో 22,099సార్లు కనిపించాయి. ఆ తరువాతి స్థానంలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ప్రకటనలు 12,951 సార్లు కనిపించాయి. అంటే మొదటి రెండు స్థానాల్లో ఉన్న ప్రకటనలకు మధ్య 9వేలకు పైగా అంతరం ఉంది.

టాప్-10 జాబితాలో మరే రాజకీయ పార్టీ ప్రకటన కూడా కనిపించలేదు. గతవారం ఇదే జాబితాలో బీజేపీ రెండో స్థానంలో ఉంది.

‘టీవీ సహజంగానే ఎక్కువమంది ప్రేక్షకులను చేరుతుంది. అందుకే బ్రాండ్లైనా, ఉత్పత్తులైనా, లేక రాజకీయ పార్టీలైనా... టీవీల ద్వారా ప్రకటనలు జారీ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి’ అని బార్క్ ఇండియా సీయీవో పార్థో దాస్ గుప్తా ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికతో చెప్పారు.

సాధారణ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు భారీ సృజనాత్మక మీడియా సంస్థలను తమ ప్రచారానికి ఉపయోగించుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం అవి స్థానిక ఏజెన్సీలనే నియమించుకుంటాయని ప్రకటనల రంగంలోని వ్యక్తులు చెబుతారు. రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికల సమయంలో ప్రచారానికి ఎలాంటి ‘పెద్ద ప్రణాళికలు’ ఉన్నాయో చెప్పడానికి ఈ ప్రకటనలే ఉదాహరణ అని ఓ ప్రచార రంగ నిపుణుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)