రైతుల నిరసన: అన్నదాతల ఆందోళనలకు కమలా హారిస్ మద్దతిచ్చారా? - బీబీసీ రియాలిటీ చెక్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రుతి మీనన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసినదే.
అయితే ఈ నిరసనల గురించి తప్పుదారి పట్టించే సమాచారం ఆల్‌లైన్‌లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైతులకు మద్దతుగా, వ్యతిరేకంగా.. ప్రైవేటు వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.
అలాంటి కొన్ని వార్తలను బీబీసీ పరిశీలించి, నిజానిజాలు నిగ్గుతేల్చే ప్రయత్నం చేసింది.

రైతులకు మద్దతిస్తూ కమలా హారిస్ బహిరంగ ప్రకటన చెయ్యలేదు
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. భారత్‌లో రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్నారంటూ ఒక వార్త ఫేస్‌బుక్‌లో షేర్ అవుతోంది.
అందులో ఆవిడ తన సొంత ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసినట్లుగా కనిపిస్తోంది... "నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న రైతులను అణిచివేయడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విచారకరం. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లు వాడే బదులు, రైతులతో చర్చలు జరిపితే మేలు" అని కమలా హారిస్ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది.
అయితే, ఇది నిజమైన ట్వీట్ కాదని, ‘ఫేక్ న్యూస్’ అని ఫేస్‌బుక్ ఆ పోస్ట్‌కు ఒక హెచ్చరికను జత చేసింది.
ఇండియా - జమైకా సంతతికి చెందిన అమెరికా మహిళ కమలా హారిస్ రైతుల నిరసనల గురించి ఏ విధమైన వ్యాఖ్యలూ చెయ్యలేదు. తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ నుంచి గానీ, అధికారిక అకౌంట్ నుంచి గానీ ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు.
ఈ పోస్ట్ గురించి కమలా హారిస్ మీడియా టీమ్‌ను విచారించగా.. "అవును, ఇది ఫేక్ న్యూస్" అని జవాబిచ్చారు.
జాక్ హారిస్ అనే పేరు గల కెనడా దేశ మంత్రి (ఎంపీ), భారత రైతులకు మద్దతు తెలుపుతూ నవంబర్ 27వ తేదీన ఒక ట్వీట్ చేసారు. అందులో ఉన్న విషయం, కమలా హారిస్ ట్వీట్ అంటూ చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లో విషయం ఒకటే. జాక్ హారిస్ పోస్ట్ చేసిన ట్వీట్, కమలా హారిస్ పేరు మీద తప్పుగా ప్రచారమవుతోంది.
ఇటీవలే, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. కొత్త వ్యవసాయ సవరణ చట్టాలపై భారతదేశంలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు పలుకుతూ, రైతుల పట్ల భారత ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు.
“శాంతియుత నిరసనలకు కెనడా మద్దతు పలుకుంది” అని చెప్పారు ట్రూడో.
అయితే, ట్రూడో వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిజమైన సమాచారం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించింది.

వేరే వివాదానికి సంబంధించిన పాత చిత్రం
కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆర్టికల్ 370 సవరణ’కు వ్యతిరేకంగా సిక్కులు ర్యాలీ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఒక ట్విటర్ పోస్ట్.. ప్రస్తుత రైతుల నిరసనకు సంబంధించినదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది.
దీని మాతృకను 3,000 మంది రీ-ట్వీట్ చేసారు. 11,000 కన్నా ఎక్కువ లైకులు వచ్చాయి.
బీజేపీ సోషల్ మీడియా ఉమెన్స్ సెల్ అధ్యక్షురాలు ప్రీతి గాంధీ కూడా ఈ ట్వీట్‌ను షేర్ చేశారు.
రైతుల నిరసనలను స్వలాభాల కోసం.. కశ్మీర్ వివాదం, పంజాబ్‌లోని సిక్కుల స్వాతంత్ర్యం మొదలైన అజెండాలకు వాడుకుంటున్నారంటూ ఆవిడ పోస్టు కింద పలువురు కామెంట్లు పెట్టారు.
అయితే, ఈ ఫొటో ఇప్పటిది కాదని.. 2019 ఆగస్టులో, శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన ఫొటో అని బీబీసీ బయటపెట్టింది. ఎస్ఏడీ, పంజాబ్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ.
గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఎస్ఏడీతో సహా పలు రాజకీయ పార్టీలు ఆ చర్యను ఖండించాయి.
కాబట్టి, ఈ చిత్రం ప్రస్తుత రైతుల నిరసనలకు సంబంధించినది కాదు.

పాత ఫొటోలను.. కొత్తగా...
బీజేపీ నేతలు మాత్రమే కాకుండా ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇతర సీనియర్ నాయకులు కూడా పాత చిత్రాలను షేర్ చేస్తూ, అవి ‘ఇప్పటివే’ అని ట్విటర్‌లో ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో, 2018 అక్టోబర్‌లో జరిగిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కూడా పోలీసులు వాటర్ క్యానన్లు ఉపయోగిస్తూ, బ్యారికేడ్లతో నిరసనకారులను చెదరగొడుతున్న దృశ్యం కనిపిస్తోంది.
ఒక పోస్ట్‌లో ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. "ప్రభుత్వం రైతులను ఉగ్రవాదుల్లాగ చూస్తోంది” అని రాశారు.
ఈ ఫొటోల్లో కూడా వాటర్ క్యానన్‌లు, బ్యారికేడ్లు కనిపిస్తున్నా అవి రెండేళ్ల కిందట తీసినవి. పైగే వేరే స్థలంలో తీసిన చిత్రాలు.
ఆన్‌లైన్‌లో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ చేసి పరిశీలిస్తే.. ఇది 2018లో ఉత్తరప్రదేశ్ రైతులు చేసిన ఆందోళనలకు సంబంధించిన ఫొటో అని తెలిసింది.
అప్పట్లో, ప్రభుత్వం రుణ మాఫీలు చేయాలంటూ యూపీ రైతులు దిల్లీకి నడిచి వచ్చారు. వీరిని యూపీ-దిల్లీ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. ఇది దిల్లీకి తూర్పు దిక్కున ఉంది.
ప్రస్తుతం పంజాబ్, హరియాణా రైతులు దిల్లీకి ఉత్తరం దిక్కున ఉన్న సరిహద్దుల వద్ద ఆందోళనలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: వ్యాక్సీన్‌తో మన డీఎన్ఏ దెబ్బతింటుందా - బీబీసీ రియాలిటీ చెక్
- వీడియో,మ్యాంగో డ్రెస్: ఆహార వృథాపై అవగాహన కోసం మామడి పళ్లతో డ్రెస్ చేసిన టీనేజర్
- పొడుగు పెరగడానికి కాళ్లకు సర్జరీలు: చాలా సమస్యలున్నా పెరుగుతున్న ఆపరేషన్లు.. ఎత్తు పెరగడం మీద ఎందుకంత మోజు?
- ఉత్తర భారతదేశంలో వరి ఎక్కువగా సాగు చేయటమే.. పంట వ్యర్థాల దగ్ధం సమస్యలకు కారణమా?
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








